పది నిమిషాలకో ‘పిల్ల(డు)’ అదృశ్యం | NCRB Data Shows Child Goes Missing Every 10 Minutes | Sakshi
Sakshi News home page

పది నిమిషాలకో ‘పిల్ల(డు)’ అదృశ్యం

Published Tue, Sep 3 2019 2:15 PM | Last Updated on Tue, Sep 3 2019 6:00 PM

NCRB Data Shows Child Goes Missing Every 10 Minutes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రతి పది నిమిషాలకు ఓ బాలుడు లేదా బాలిక అదృశ్యమవుతున్నారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెబ్‌సైట్‌ వెల్లడిస్తోంది. ఈ లెక్కన గతేడాది దేశంలో 54, 750  మంది పిల్లలు అదృశ్యమయ్యారు. వారిలో సగం మందిని మాత్రమే పోలీసులు కనుగొన్నారు. మిగతా వారు పోలీసులకు దొరకలేదంటే వారంతా గల్లంతైనట్లే! జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ప్రకారం 2016 సంవత్సరంలో 63,407 మంది కిడ్నాప్‌ అయ్యారు. 2016 నుంచి ఏడాదికిపైగా గడిచిన కాలంలో ఏకంగా 1,11,569 మంది పిల్లలు అదృశ్యమయ్యారని, వారిలో దాదాపు సగం మంది పిల్లల ఆచూకీ మాత్రాన్నే పోలీసులు కనుగొనగలిగారని జాతీయ నేరాల రికార్డు బ్యూరో తెలియజేసింది.

ఈ గల్లంతైన వారి పిల్లల్లో వివిధ జాతులు, మతాలు, సంస్కతి , సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. భారత్‌లో 18 ఏళ్లకు లోపు పిల్లలు దాదాపు 40 కోట్ల మంది ఉన్నారని, దేశ జనాభాలో యువత, పిల్లల సంఖ్య 55 శాతం ఉంటుందన్నది మరో అంచనా. ఇలా పిల్లలు అదృశ్యమైన కేసుల్లో చాలా వరకు పోలీసుల వద్దకు రావడం లేదని, కొన్ని వచ్చినా వాటిని పోలీసులు నమోదు చేయడం లేదని తెల్సింది. ప్రతి కేసును నమోదు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
 
పిల్లలు అదృశ్యమయ్యారంటే ఒక్క ఫిర్యాదు అందినా వెంటనే కిడ్నాప్‌ కేసును నమోదు చేయాలని 2013లో సుప్రీం కోర్టే స్వయంగా పోలీసులకు ఆదేశించినా పోలీసులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని పలు ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. తమ పిల్లలు  తప్పి పోయారంటూ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడల్లా ‘ఆ ఇంటి నుంచి పారిపోయి ఉంటారు, నాలుగు రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తారు’ అంటూ చెప్పి పంపించడం పోలీసులకు పరిపాటిగా మారిపోయిందని స్వచ్ఛంద సంస్థలు తెలియజేస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో పిల్లలను ఎత్తుకుపోయే వారొచ్చారంటూ ప్రజలే మూక హత్యలకు పాల్పడుతున్నారు. గత రెండు నెలల కాలంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రలో వందకు పైగా మూక హత్యలు చోటు చేసుకున్నాయి. గత వారం రోజుల్లో, ఒక్క ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే 20 మూక దాడులు జరిగాయి. ప్రత్యక్షంగా వదంతుల కారణంగా మూక దాడులు జరుగుతుంటే పరోక్షంగా కిడ్నాప్‌ కేసుల్లో పోలీసులు స్పందించక పోవడమేనని ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. వ్యభిచారం, వెట్టి చాకిరీల కోసమే దేశంలో పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జస్టిస్‌ వర్మ కమిటీ సిఫార్సుల మేరకు 1956 నాటి మానవ అక్రమ రవాణా చట్టాన్ని సవరించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement