రాష్ట్రంలో ఏటా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ తగాదాలు, చదువంటే అయిష్టత–భయం, అనారోగ్య సమస్యలు ఇల్లు వదలడానికి పురిగొలుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 8,410 మంది కనిపించకుండా పోగా,ఈ ఏడాది ఇప్పటివరకు 7,509 మంది కనిపించకుండాపోయారు. ఈ ఏడాది మిస్సింగ్ కేసుల్లో 3,382 మంది పిల్లలుండటం సమస్య తీవ్రతను సూచిస్తోంది. వీరిలోనూ 1,008 మంది పిల్లలు అపహరణకు గురికావడం అందరిలోనూ తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. మిస్సింగ్ కేసుల్లో రాజధాని నగరం విజయవాడ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.
సాక్షి, అమరావతి: ఏదో ఒక భయమే వారిని ఇంటి గడప దాటేలా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీరి కుటుంబసభ్యుల్లో కొందరు మాత్రమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలినవారు పరువు పోతుందనే భయం, ఇతర కారణాలతో పోలీసుల దృష్టికి తేవడం లేదు. పోలీసు రికార్డుల ప్రకారం.. ఏటా దాదాపు ఎనిమిది వేల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రేమ వ్యవహారాలు, చదువంటే భయం, కుటుంబ వివాదాలు, అనారోగ్యమే కారణమంటున్నారు.. పోలీసులు. మిస్సింగ్ కేసుల్లో కొన్ని కిడ్నాప్ కేసులూ ఉంటున్నాయి. బలవంతపు వ్యభిచారానికి, బాల కార్మికులుగా, యాచకులుగా మార్చేందుకు నేరగాళ్లు పంజా విసురుతున్నారని చెబుతున్నారు.
గతేడాది 8,410 మంది మిస్సింగ్
గతేడాది 8,410 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 7,509 మంది కనిపించకుండా పోయారు. ఈ ఏడాది కనిపించకుండా పోయినవారిలో 5,044 మంది తిరిగి ఇంటికి చేరారు. మిగిలినవారి ఆచూకీ లేదు. గతేడాది 1,025 మంది పిల్లలు కిడ్నాప్‌కు గురికాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1,008 మంది పిల్లలు కిడ్నాప్ అయ్యారు. కనిపించకుండాపోయినవారు, తిరిగొచ్చినవారిలో ఏకంగా 3,382 మంది పిల్లలు ఉండటం విస్మయపరుస్తోంది.
పోలీసుల కార్యాచరణ ఇలా..: ఇంటి నుంచి వెళ్లిపోవడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలపై యువతీయువకులు, విద్యార్థులకు కాలేజీలు, సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కాలేజీలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, చిన్నారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉండే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు, అనుమానితులపై నిఘా పెంచడం వంటి చర్యలతో మిస్సింగ్ కేసులకు చెక్ పెట్టాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment