missing cases
-
తెలంగాణలో ఐదేళ్లలో 1,03,496 మంది అదృశ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ‘అదృశ్యం’ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వయోభేదాలు లేకుండా ఇంటినుంచి బయటికి వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకుండా తప్పిపోతుండటం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో కొందరు, ఇంట్లో పెద్దలు మందలించారని ఇంకొందరు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో మరికొందరు కనిపించకుండా పోతున్నారు. ఇలా తప్పిపోతున్న వారి కుటుంబసభ్యులు సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేక.. చివరకు పోలీసుస్టేషన్లలో ‘మిస్సింగ్’కేసులు నమోదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసి కళ్లు కాయలు కాయేలా ఎదురుచూసిన కొందరికి తమ కుటుంబసభ్యుల ఆచూకీ దొరకగా.. మరికొందరికీ ఎదురుచూపులే మిగిలాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మాత్రం దొరకడం లేదు.అదృశ్యం కేసులపై హైకోర్టు తీవ్ర స్పందన అప్పట్లో రాష్ట్రంలో పెరిగిన మిస్సింగ్ కేసులపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. ఏటా తొమ్మిది వరకు మిస్సింగ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. 2019 నుంచి 2020 నవంబర్ వరకు ఆ కేసులు రెట్టింపు అయ్యాయని హైకోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలైంది. అదృశ్యమైన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నట్టు కేసులు నమోదయ్యాయని పిటిషనర్ వివరించారు.చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో వైవాహిక చట్టాల దుర్వినియోగమా? దీనిపై ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో షీ టీమ్, దర్పన్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఆ తర్వాత కూడా 2020 నుంచి 2024 అక్టోబర్ 19 వరకు రాష్ట్రంలో 1,03,496 మంది బాలురు, బాలికలు, పురుషులు, స్త్రీలు తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. 2023లో అత్యధికంగా 23,509 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 20,403 కేసులు నమోదయ్యాయి. అదృశ్యమైన 1,03,496 మందిలో 97,028 మంది ఆచూకీ లభించగా, ఇంకా 6,468 మంది ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియని పరిస్థితి నెలకొంది. ‘అదృశ్యం’కేసుల్లో మహిళలే ఎక్కువ.. తెలంగాణవ్యాప్తంగా ఐదేళ్లలో అదృశ్యమైన 1,03,496 మందిలో మహిళలే 54,744 మంది ఉన్నారు. పురుషులు 34,643 మంది, బాలురు 5,750 మంది కాగా బాలికలు 8,359 మంది. ఇదే సమయంలో ఆచూకీ లభ్యమైన వారి జాబితాలోనూ 52,312 మంది మహిళలు ఉండగా, 31,291 మంది పురుషులు, 5,450 మంది బాలురు, 7,070 మంది బాలికలు ఉన్నారు. ఆచూకీ దొరకని 6,468 మందిలో పురుషులు 3,352 మంది, మహిళలు 2,432 మంది, బాలురు 295 మంది, బాలికలు 389 మంది ఉన్నారు. పరిష్కారం చూపాలి రాష్ట్రంలో ప్రతీరోజు ఎంతోమంది తప్పిపోతున్నారు. కొంతమంది ఆచూకీ పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మా త్రం దొరకడం లేదు. బాలికలు, బాలురు, మహిళలు, పురుషుల ఆచూకీ దొరక్క.. వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారు చాలామంది ఉన్నారు. వారు బతికి ఉన్నారో, లేదో తెలియక క్షణక్షణం బాధ అనుభవిస్తూ ఉంటారు. వారి బాధకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉంది. ఇప్పటికైనా వారి ఎదురుచూపులకు పరిష్కారం చూపాలి. – రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ -
తిరుపతిలో మిస్సింగ్ కేసుల కలకలం.. మరో బాలిక అదృశ్యం
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి నగరంలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి అక్సా క్వీన్ మిస్సింగ్ ఘటన మర్చిపోక ముందే మరో కేసు నమోదైంది. పశ్చిమ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మకుంటకు చెందిన ప్రవల్లికశ్రీ అదృశ్యం కావడంతో తండ్రి సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పదిరోజులుగా కనిపించకపోవడంతో చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.కాగా, ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై గత శనివారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. -
పవన్, అనితలకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితలకు కేంద్రం షాకిచ్చింది. ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులపై వీళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధమని తేల్చింది. ఈ మేరకు లోక్‌సభలో టీడీపీ ఎంపీల ప్రశ్నలతోనే ఆ బండారమంతా బయటపడింది. గతంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో పవన్ కల్యాణ్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, వాళ్లందరినీ గుర్తించి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉందంటూ ప్రకటనలు చేశారు. అందరినీ రెచ్చగొట్టారు. కూటమి అధికారంకి వచ్చాక సైతం పవన్ వాళ్లను వెనక్కి రప్పిస్తానంటూ చెబుతూ వస్తున్నారు. మరోవైపు హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే వంగలపూడి అనిత సైతం అలాంటి విమర్శలే చేస్తూ వచ్చారు. అయితే.. జగన్ ప్రభుత్వంపై ఈ ఇద్దరి ఆరోపణలు అబద్ధమని కేంద్ర హోం శాఖ తేల్చింది. ఏపీలో పిల్లలు, మహిళల మిస్సింగ్ కేసుల పై లోక్ సభలో టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయ, బీకే పార్థసారథిలు ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మొత్తం ఐదేళ్లలో అదృశ్యమైన వాళ్లలో 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉన్నట్టు స్పష్టం చేశారాయన. -
మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు?
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో రోజుకొక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వస్తోంది. మహిళలపై అఘాయిత్యాల తర్వాత ఆ రాష్ట్ర పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మరో అంశం మిస్సింగ్ కేసులు. ఇప్పటికైతే 30 మంది కనిపించడం లేదని కంప్లైట్లు రాగా 6000కు పైగా ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజాగా మరో విద్యార్థిని మిస్సయిన కేసు సంచలనంగా మారింది. మిస్సింగ్ కేసులు.. మణిపూర్ రాష్ట్రంలో మరణాలు, విధ్వంసం తర్వాత మిస్సింగ్ కేసుల సంఖ్య బాగా ఆందోళనకరంగా ఉంది. గడిచిన 3 నెలల్లో మొత్తం 30 మంది మిస్సవ్వగా సుమారు 6000 జీరో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. మే 6న సమరేంద్ర సింగ్(47) అనే జర్నలిస్టుతో పాటు అతని స్నేహితుడు కిరణ్ కుమార్ సింగ్ కూడా అల్లర్ల తర్వాత ఇంటికి రాలేదని వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే వారి డీఎన్ఏ శాంపిల్స్ అయినా ఇప్పిస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని వేడుకుంటున్నారు. ఆరోజు ఏం జరిగిందంటే.. అంతలోనే మరో విద్యార్థిని హిజామ్ లువాంబి (17) స్థానికంగా పరిస్థితి కాస్త మెరుగయ్యిందని భావించి స్నేహితుడితో కలిసి నీట్ క్లాస్ కు వెళ్లిందని అప్పటినుంచి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తలిదండ్రులు. బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. చివరిగా హిజామ్ ఫోన్ క్వాట్కా దగ్గర స్విచాఫ్ చేసినట్లు.. ఆమె స్నేహితుడి ఫోన్ మాత్రం లమదాన్ వద్ద స్విచ్చాఫ్ అయ్యినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారన్నారు. క్వాట్కాకు లమదాన్ కు మధ్య 18 కిలోమీటర్ల దూరముంది. పైగా వేర్వేరు జిల్లాలు. ఫోన్ చేస్తే హిజామ్ ఒకసారి లిఫ్ట్ చేసి భయం భయంగా మాట్లాడిందని.. నంబోల్ లోని ఖూపంలో ఉన్నట్లుగా చెప్పిందని ఆయన అన్నారు. పోలీసులు కూడా వారిద్దరూ నంభోల్ వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో ఉందని చెప్పారు. హిజామ్ స్నేహితుడు హేమంజిత్ తండ్రి మాట్లాడుతూ ఆ ప్రాంతం గురించి పోలీసులకు తెలిసినా కూడా వారు అక్కడికి వెళ్లడానికి భయపడ్డారని చెప్పుకొచ్చారు. హేమంజిత్ ఫోన్ స్విచాఫ్ చేసిన తర్వాత ఇపుడు వేరే నెంబరుతో వాడకంలో ఉందన్నారు. ఇదిలా ఉండగా ఇంఫాల్ ఆసుపత్రులలో సుమారు 44 అనాధ శవాలకు ఆగస్టు 3న సామూహిక అంత్యక్రియలకు నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: ఉడుపి వీడియోలు తమాషా కావచ్చు -
National Crime Records Bureau: మూడేళ్లలో..13.13 లక్షల మంది మహిళలు మిస్సింగ్
న్యూఢిల్లీ: దేశంలో 2019–21 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారని కేంద్రం తెలిపింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి అత్యధికంగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉందని పేర్కొంది. గత వారం పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ ఇందుకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నమోదు చేసిన గణాంకాలను వెల్లడించింది. మూడేళ్ల కాలంలో మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మంది కాగా, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10,61,648 అని వివరించింది. 2019–2021 మధ్య మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,60,180 మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమయినట్లు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు మిస్సయ్యారని తెలిపింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు.. ఒడిశాలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు..ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు కనిపించకుండాపోయారు. 2019–21 మధ్య ఢిల్లీలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు కనిపించకుండాపోయారు. -
నరబలి కేసు: ఆ 26 మంది మహిళల ‘మిస్సింగ్’ వెనుక షఫీ హస్తం?
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన కేరళలోని పతనంతిట్ట జిల్లా నరబలి కేసు దర్యాప్తులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ చేతిలో చాలా మంది బలైపోయినట్లు తెలుస్తోంది. నరబలి కేసు బయటపడిన క్రమంలో కనిపించకుండా పోయిన మహిళల కుటుంబాలు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నాయి. వారు కనిపించకుండా పోవటం వెనక నరబలి నిందితుడు షపీ హస్తం ఉండి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఎలంతూర్ గ్రామంలో ఇద్దరు మహిళలను బలిచ్చిన కేసులో షఫీ, భగవల్ సింగ్, అతడి భార్య లైలాను అక్టోబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కనిపించకుండా పోయిన మహిళల విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అలప్పుజా జిల్లాలో 2013 నుంచి కనిపించకుండా పోయిన బింధు పద్మనాభన్ అనే మహిళ బంధువులు.. కేరళ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. ఆమె మిస్సింగ్‌కు కొద్ది రోజుల ముందు షఫీకి సంబంధించిన ఓ వ్యక్తితో బింధును చూసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై షఫీని ప్రశ్నించామని, ఎలాంటి సమాధానం రాలేదని పోలీసులు తెలిపారు. బింధు పద్మనాభన్‌కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. కందకరపల్లిలో ఒంటరిగా ఉంటున్నారని బంధువులు తెలిపారు. ఆమె కనిపించకుండా పోయినట్లు 2013లో కేసు నమోదైంది. 2017లో మరోమారు ఆమె ఆస్తులను నకిలీ పత్రాలను ఉపయోగించి సీజ్ చేశారని బాధితురాలి సోదరుడు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సంఘటనలో 2014లో అనుమానాస్పద స్థితిలో మరణించిన కే. సరోజిని నివాసం.. ఎలాంతూర్ నిందితులకు కొన్ని కిలోమీటర్ల దూరమే ఉంటుంది. దీంతో ఆమె కేసులో మళ్లీ దర్యాప్తు చేపట్టాలని బంధువులు కోరుతున్నారు. కనిపించకుండా పోయిన మహిళల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులన్నీ తిరిగి దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పతనంతిట్ట జిల్లాలో 12, ఎర్నాకులం జిల్లాలో 14 కేసులు గత ఐదేళ్లలో నమోదైనట్లు సీనియర్ అధికారోకరు తెలిపారు. ఈ 26 మంది మహిళల మిస్సింగ్ వెనుక షఫీ హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: కేరళలో కలకలం రేపుతున్న మహిళల నరబలి.. తల నరికి, నాలుక కోసి.. -
మిస్సింగ్ కేసుల కలకలం...ప్రేమ.. పెడదోవ
ఇటీవలి కాలంలో ‘అదృశ్యం’ కేసులుపెరిగాయి. ఇందులో ఎక్కువ శాతం టీనేజీ అమ్మాయిలతో మహిళలు ఉండటం కలవరం రేపుతోంది. పిల్లలు విద్య పూర్తి చేశాక.. ఉద్యోగం సంపాదించాక.. వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అయితే చదువుకోవాల్సిన సమయంలోనే పిల్లలు ప్రేమలో పడి తొందరపడుతున్నారు. పెద్దలు ఒప్పుకోరని ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిన డబ్బు అయిపోయి.. కష్టాలు చుట్టు ముట్టి.. ఆదరించే వారు లేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులకూ కన్నీళ్లు మిగులుస్తున్నారు. రాయదుర్గం: విద్యార్థి దశలోనే కొందరు అమ్మాయిలు పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రుల గారాబంతో పాటు పర్యవేక్షణ కొరవడటంతో క్రమశిక్షణ తప్పుతున్నారు. కొందరు స్మార్ట్ఫోన్లలో గేమ్స్‌కు బానిసైతే.. మరికొందరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే చదువును పక్కనపెట్టి ప్రేమలో పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలిసినా.. మందలించినా ... తమ స్వేచ్ఛను వారు ఏదో హరిస్తున్నారనుకుని అనాలోచిత నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తున్నారు. చేజేతులా భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో 2020 నుంచి 2022 జూలై 15వ తేదీ వరకు 2,037 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఇందులో బాలికలు, మహిళలు 1,657 మంది ఉన్నారు. చదువు కోసం పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, గ్రామాల్లో కూలీలు, పరిశ్రమల్లో పనులకెళ్లే మహిళలు ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి వెళ్లిపోవడం.. రోజులు గడిచాక చేసిన తప్పు తెలుసుకుని బాధపడటం చేస్తున్నారు. చివరకు పోలీస్ కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకుని ఇంటిబాట పడుతున్నారు. అదృశ్యం కేసుల్లో మచ్చుకు కొన్ని... రాయదుర్గం పట్టణం చన్నవీరస్వామి ఆలయ సమీపంలో నివసిస్తున్న ఓ యువతి షాపింగ్‌కని ఈ ఏడాది ఏప్రిల్ 26న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మే 4న గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ చేయగా.. గుడ్డిగా నమ్మి.. వెళ్లానని.. తన నిర్ణయం సరైంది కాదని తెలుసుకున్నానని చెప్పడంతో తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపించేశారు. రాయదుర్గం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఏప్రిల్ 25న నీళ్లు తేవటానికని బిందె తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. కొళాయి వద్ద బిందె ఉంచి.. ప్రేమికుడితో ఉడాయించింది. కుటుంబ సభ్యులు మూడు రోజులు వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ ఆధారంగా అదే నెల 30న ఎట్టకేలకు ఆ జంటను పోలీసులు అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు కౌన్సిలింగ్ తీరు... ఇంట్లో నుంచి తీసుకెళ్లిన సొమ్ము అయిపోయిన తర్వాత పరిస్థితి ఆలోచించాలి. అసాంఘిక శక్తుల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటి? ఇష్టాయిష్టాలను తల్లిదండ్రులకు తెలియజేస్తే మంచిది. ఇష్టం లేని వివాహాలు, చదువులు, ఆశించిన ర్యాంకు రాదనే కారణాలు సహేతుకం కాదు. ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని బంధువులు, సమాజం చులకనగా చూస్తుంది. మొదట్లో బాగున్నా తర్వాత సంసారాల్లో కలహాలు మొదలవుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. టీనేజీ అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు చేసే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చూడాలి. (చదవండి: అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి) -
Hyderabad: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు
పిల్లలు జాగ్రత్త అని చీటీ రాసి.. బతుకుదెరువు కోసం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి 8 ఏళ్ల కిందట వచ్చిన చాకలి రాజు.. పుప్పాలగూడలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద చిట్టీలు వేయడం, అప్పులు చేయడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి రూ.1.5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి ఒత్తిడి పెరగడంతో ఇటీవల తన స్కూటీని భార్య పనిచేసే గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డుకు ఇచ్చి స్కూటీ డిక్కీలో ‘పిల్లలు జాగ్రత్త’ అని చీటీ రాసి అదృశ్యమయ్యాడు. రెండు ఇళ్లల్లో గొడవపడి.. హైదరాబాద్‌లోని వసంతనగర్‌కు చెందిన పొక్కలపాటి సురేశ్ వర్మ ప్రైవేట్ ఉద్యోగి. నైట్ డ్యూటీ ఉందని చెప్పి గతేడాది డిసెంబర్లో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య వర్మ బావ ప్రసాద్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. తెలిసిన వ్యక్తులు, ప్రాంతాల్లో వెతికే పనిలో ఉండగా.. డిసెంబర్ 24న గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఓ మహిళ ప్రసాద్‌కు ఫోన్ చేసి మీ బామ్మర్ది, నేను ఐదేళ్లుగా కలిసి ఉంటున్నామని, రెండేళ్ల క్రితం వివాహం కూడా చేసుకున్నామని చెప్పింది. శాతవాహన నగర్ కాలనీలో నివాసముంటున్న తనతో గొడవపడి బైక్, ఫోన్ ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపింది. –సాక్షి, హైదరాబాద్ .. ఇలా ఒకరిద్దరు కాదు, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 482 మంది పురుషులు అదృశ్యమయ్యారు. సగటున రోజుకు నలుగురు గాయబ్ అవుతున్నారు. అత్యధికంగా మాదాపూర్ జోన్లో 194 మంది మగాళ్లు తప్పిపోగా.. బాలానగర్ జోన్ పరిధిలో 136 మంది, శంషాబాద్ జోన్లో 152 మంది కనబడకుండా పోయారు. ఈ 3 జోన్లలో కలిపి 332 మందిని గుర్తించారు. గత రెండేళ్లలో 2,943 మంది అదృశ్యమయ్యారు. చెప్పాపెట్టకుండా.. ఇష్టం లేని పెళ్లి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే పురుషులు అదృశ్యమవడానికి ప్రధాన కారణాలని రాచకొండ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ శింగేనవర్ తెలిపారు. అన్సౌండ్ మైండ్ (మానసికంగా దృఢంగా లేనివాళ్లు) తప్పిపోతే.. వాళ్ల ఆచూకీకి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఒత్తిడి, పెట్టుబడుల్లో నష్టం, రుణాల వల్ల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతున్నారని మరో పోలీసు అధికారి తెలిపారు. ‘‘ఇటీవల మాదాపూర్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి అప్పులు చేసి మరీ షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. నష్టం రావడంతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పీఎస్‌లో కేసు నమోదయింది’’ అని ఆయన చెప్పారు. వలస కార్మికుల పరారీ బీహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది వలస కార్మికులు భవన నిర్మాణ పనుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది కాంట్రాక్టర్లకు చెప్పకుండా రాత్రికిరాత్రే పని ప్రదేశాల నుంచి పారిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనిల్ ఓరన్ పుప్పాలగూడలోని అపర్ణ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో లేబర్‌గా చేరాడు. గత నెల 2న నార్సింగి మార్కెట్‌కు వెళ్లి తిరిగి లేబర్ క్యాంప్‌కు రాకపోవడంతో సైట్ ఇంజనీర్ దాసరి ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని ప్రదేశాలలో గొడవలు, అప్పులు, ఒత్తిడితో కార్మికులు పనులను వదిలేసి అదృశ్యమవుతున్నట్లు విచారణలో తేలింది. ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్: అదృశ్యమైన వ్యక్తుల ఫోన్‌ను పోలీసులు ట్రాకింగ్‌లో పెడతారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి వ్యక్తి ఫొటో, చిరునా మాలతో కరపత్రాలను ముద్రించి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తారు. దర్పణ్ యాప్, పోలీసు వెబ్సైట్లలో వ్యక్తి ఫొటో, వివరాలను అప్లోడ్ చేస్తారు. అదృశ్యమైన వ్యక్తికి శత్రువులు, అప్పులు ఇచ్చినవాళ్లు ఉన్నారా ఆరా తీసి వారిపై నిఘా పెడుతుంటారు. ట్రేస్ చేసి పట్టుకుంటున్నాం పురుషులు చిన్న చిన్న గొడవలతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటారు. కొంతకాలం తర్వాత వాళ్లే తిరిగి వస్తుంటారు. మిస్సింగ్ ఫిర్యాదు అందగానే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ట్రేస్ చేసి పట్టుకుంటున్నాం. – స్టీఫెన్ రవీంద్ర పోలీస్ కమిషనర్, సైబరాబాద్ -
విద్యార్థినుల మిస్సింగ్ కేసు..లుక్ అవుట్ నోటీసు జారీ
చంద్రగిరి : హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థినుల ఆచూకీ కోసం చంద్రగిరి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. చంద్రగిరి సమీపంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ, సంప్రదాయ పాఠశాల హాస్టల్లో ఉంటున్న నలుగురు విద్యార్థినులు సోమవారం రాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోయిన సంగతి తెలిసిందే. వీరి కోసం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి ఆదేశాలతో చంద్రగిరి పోలీసులు అన్ని కోణాల్లో దరాప్తును ముమ్మరం చేశారు. విద్యార్థినుల సొంత జిల్లాలైన కడప, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నంకు నాలుగు ప్రత్యేక బృందాలను పంపించినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థినుల ఆచూకీ కోసం లుక్అవుట్ నోటీసు జారీచేసి అన్ని పోలీసు స్టేషన్లకు పంపినట్టు ఆయన వెల్లడించారు. ఆయా జిల్లాల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో కరపత్రాలు సైతం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినుల ఆచూకీ తెలిసిన వారు తిరుపతి వెస్ట్ డీఎస్పీ 9440796747, చంద్రగిరి సీఐ 9440796760 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా కడప జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రణతి ఓ మొబైల్ నుంచి ప్రొద్టుటూరులోని తన స్నేహితురాలికి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా మెస్సేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నట్టు సమాచారం. -
మిస్సింగ్ మిస్టరీ.. వ్యభిచార కూపాల్లోకి మహిళలు!
సాక్షి, పల్నాడు: జిల్లాలో మిస్సింగ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. అంతు చిక్కని మిస్టరీలుగా మిగిలిపోతున్నాయి. మరోవైపు మానవ అక్రమ రవాణా మాఫియా కోరలు చాచింది. ఫలితంగా అమాయక అబలలు, బాలికలు బలైపోతున్నారు. కొందరు మాయమాటలతో మోసం చేసి మహిళలను రాష్ట్రాలు దాటిస్తున్నారు. వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. కొందరు మృగాళ్లు మాటువేసి మృగవాంఛలు తీర్చుకుంటున్నారు. యువతుల నిస్సహాయతనే ఆసరాగా చేసుకుంటున్నారు. అభంశుభం తెలీని బాలికలనూ కర్కశకులు వదలడం లేదు. ఇటీవల కాలంలో వెలుగుచూసిన పలు కేసులను చూసి పోలీసులే కన్నీరు పెట్టారంటే సమాజం ఎంత దిగజారిపోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వెలుగుచూడని గాధలెన్నో పరువు కోసమో.. అవమాన భారమో.. ఏమోకానీ పోలీసు మెట్లెక్కని కేసులెన్నో ఉంటాయని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. మహిళ బయటకు వెళ్లి ఇంటికి రాలేదంటే.. అపహాస్యంగా మాట్లాడే వాళ్లే ఎక్కువ. అందుకే చాలా కుటుంబాలు లోలోన కుమిలిపోయి చుట్టపక్కల వెతికి ఊరుకుంటున్నాయి. వారు ఏమైపోయారోనని కూడా ఆరా తీయడం లేదు. ఇలాంటి కేసులు కోకొల్లలు ఉంటాయని తెలుస్తోంది. పోలీసుల తీరుపైనా విమర్శలు మిస్సింగ్ కేసుల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. చిన్నారులు, యువతులు, మహిళలు తప్పిపోతే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే బాధిత కుటుంబాలకు వింత పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎగతాళిగా మాట్లాడడం బాధిత కుటుంబాలను మరింత కుంగదీస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించకపోవడం, ‘‘బంధువుల, స్నేహితుల నివాసాల్లో అడిగారా..? కొద్ది రోజులు వేచి చూడండి.. అలిగి వెళ్ళి ఉంటారులే..!’’ వంటి సమాధానాలు వస్తుండడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇలాంటి ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అదృశ్యమంటే అలుసే.. ‘ప్రేమ’ వ్యవహారమో, అలకో అని వదిలేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: తమవారు కనిపించకుండా పోయారంటే సంబంధీకుల బాధ వర్ణనాతీతం. నిద్రాహారాలు మాని వెతకడమే కాదు.. కనిపించిన ప్రతి దైవాన్నీ మొక్కుతారు. అలా మిస్సైంది మైనర్లు అయితే పరిస్థితి మరింత ఘోరం. పూర్తి స్థాయిలో ఫలితం ఉండదని తెలిసీ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ మిస్సింగ్ కేసులంటే పోలీసులకు చాలా అలుసుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సీఆర్పీసీ, ఐపీసీలతో సహా ఏ చట్టంలోనూ సెక్షన్ సైతం లేకపోవడంతో మరింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. చాలా కేసులను పెండింగ్ జాబితాలో పడేస్తుంటారు. ‘కీలకం’ అనుకుంటే తప్ప వీటిలో ప్రాథమిక దర్యాప్తు సైతం జరపరు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం గతేడాది రాష్ట్రంలో 3,100 మంది మైనర్లు మిస్సయ్యారు. అంతకు ముందు ఏళ్లల్లో చోటు చేసుకుని కొలిక్కి రాని కేసులు మరో 655 ఉన్నాయి. ఈ 3,755 కేసుల్లో ఇప్పటికీ 777 మంది ఆచూకీ తెలియలేదు. పోలీసు విభాగం ప్రతి ఏడాదీ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కనీసం 2022లో అయినా మైనర్ల మిస్సింగ్ కేసులకు తగు ప్రాధాన్యం ఇస్తుందా? అనేది వేచి చూడాలి. ఎందుకీ నిర్లక్ష్యం? ► గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మిస్సింగ్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ఏటా 2 వేల మందికి పైగా అదృశ్యమవుతున్నారు. వీటిలో సగానికి పైగా ప్రేమవ్యవహారాలకు సంబంధించినవే. అమ్మాయి, అబ్బాయి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతారు. దాంతో ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. కొద్ది రోజులకు వారి విషయం తెలియడంతో కేసు పరిష్కారమవుతుంది. ►‘ప్రేమ’ తర్వాత పరీక్షల సమయంలో మిస్సింగ్ కేసు సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో సగటున రోజుకు 10–15 కేసులు రిజిస్టర్ అవుతుంటాయి. ఇలాంటి వారు కూడా కొన్ని రోజులకు ‘కనిపిస్తుంటారు’. ఈ కేసుల్లోనూ పోలీసులు చేస్తున్న కృషి ఏమాత్రం ఉండట్లేదు. ఎక్కువగా ఇలాంటి కేసులే వస్తుండటంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ►నిజమైన మిస్సింగ్, కిడ్నాప్ కేసులనూ ఇదే కోవకు చేర్చేసి చేతులు దులుపుకొంటున్నారు. యుక్త వయసు బాలబాలికల మిస్సింగ్ కేసులను పోలీసులు పట్టించుకోవట్లేదనే వాదనలు ఎక్కువగా ఉన్నాయి. 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారు మిస్ అయ్యారంటే అది కేవలం ‘ప్రేమ’ వ్యవహారమో, అలకో అని భావిస్తున్నారు. అలాంటి లేదంటూ తల్లిదండ్రులు గొల్లుమంటున్నా పట్టించుకోవట్లేదు. చదవండి: తెలంగాణ: 20 మంది బాధితుల్లో నలుగురికి సీరియస్! సమీక్షల్లోనూ వీరికి విలువ లేదు.. ►రాష్ట్ర డీజీపీ నుంచి జిల్లా ఎస్పీలు, జోనల్ డీసీపీల వరకు అనునిత్యం క్రైమ్ రివ్యూల పేరుతో సమీక్షలు నిర్వహిస్తుంటారు. వీటిలో ప్రధానంగా సొత్తు సంబంధిత కేసులు, సంచలనం సృష్టించిన వాటి పైనే దృష్టి పెడతారు. ఠాణాల వారీగా నమోదైన మిస్సింగ్ కేసులు ఎన్ని, లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడంతో పాటు కాల్ డిటేల్స్ సేకరించడం మినహా మరే ఇతర చర్యలు తీసుకున్నారు? తదితర అంశాల జోలికి ఈ ఉన్నతాధికారులు పొరపాటున కూడా పోవడంలేదు. ►ఏడాదికి రెండుసార్లు మాత్రం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో హడావుడి చేసి, ఫొటోలకు పోజులిచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సీఐడీ అధీనంలోని మహిళ భద్రత విభాగం గతంలో ఇతర రాష్ట్రాల్లోని వ్యభిచార గృహాలపై దాడులు చేసి అక్కడ మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన బాధితులను బయటకు తీసుకువచ్చేది. ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్ర మహిళ భద్రత విభాగం ఏర్పడిగా ఇటీవల కాలంలో ఇలాంటి దాడుల ఊసే లేకుండాపోయింది. నేరగాళ్లకు వరం.. ►వ్యవహార శైలి నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ నిర్లక్ష్యంతో అనేక ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇంట్లోంచి కావాలని బయటకు వచ్చి దిక్కుతోచని వాళ్లు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో సంచరిస్తుంటారు. ఇలాంటి వారిని చేరదీస్తున్న కొన్ని ముఠాలు ఘోరాలకు పాల్పడుతున్నాయి. మాయమాటలతో వల వేసిన, ఎత్తుకుపోయిన ఆడపిల్లలను ఏకంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. ►స్థానిక పోలీసుల రికార్డుల్లో కేవలం మిస్సింగ్ కేసులుగా నమోదైన అనేక వ్యవహారాలు ఆపై టాస్క్‌ఫోర్స్ వంటి స్పెషలైజ్డ్ వింగ్స్ చొరవతో హత్యలుగా తేలిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. సిటీలో నిత్యం లభిస్తున్న అనేక గుర్తుతెలియని శవాలు ఎక్కడో ఒకచోట మిస్సింగ్‌గా ఉంటున్నవే. వీటిపై పోలీసులు చూపుతున్న నిర్లక్ష్యంలో అనేక మంది నేరగాళ్లు స్వేచ్ఛగా బాహ్య ప్రపంచంలో విహరించేస్తున్నారు. ఇవీ మైనర్ల మిస్సింగ్ గణాంకాలు: ►2020కి ముందు అదృశ్యమై ఆచూకీ లేని మైనర్లు: 655 ►2020లో అదృశ్యమైన వారు: 3100 ►2020 ఆచూకీ లభించిన వారు: 2978 ►ఇప్పటికీ ఆచూకీ లేని వాళ్లు: 777 -
Missing Cases: ఒంటరిగా అదృశ్యం.. జంటగా ప్రత్యక్షం
సాక్షి, దౌల్తాబాద్ (హైదరాబాద్): యువతీ యువకులు ఒంటరిగా అదృశ్యమై ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి తిరిగి కొద్ది రోజులకే జంటగా పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఒక వైపు ఇరువురి బంధువులు వారి కోసం వెతుకుతుంటే.. మరో వైపు ప్రేమ వివాహాలు చేసుకున్న వారంతా ఇళ్లకు వెళ్లకుండా కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ నేరుగా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మేము ప్రేమ వివాహం చేసుకున్నామని కుటుంబసభ్యులకు వాట్సాప్ ద్వారా పెళ్లి ఫోటోలు పంపుతున్నారు. ► కొడంగల్ సర్కిల్లోని దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 30 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. వాటిలో 28 కేసులను పోలీసులు పరిష్కరించారు. ► నిత్యం వివిధ కేసుల్లో బిజీగా ఉండే పోలీసులకు ఈ మిస్సింగ్ కేసులు తలనొప్పిగా మారాయి. ► అదృశ్యమైన యువతీయువకులు వివాహం అనంతరం తమకు రక్షణ కావాలని వస్తుండగా వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ► మైనర్ల అదృశ్యం కేసుల విషయానికొస్తే బాలికను తీసుకెళ్లిన వారిపై కిడ్నాప్ కింద కేసు నమోదు చేసి బాలిక అదృశ్యానికి కారణమైన వారిని రిమాండ్‌కు తరలిస్తున్నారు. ► ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ► సెల్ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పరిచయాలు ఏర్పడి అదృశ్యాలకు దారితీస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే కేసు.. ► కొడంగల్ సర్కిల్ పరిధిలో వచ్చే మిస్సింగ్ కేసులపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ► తమ అమ్మాయిని వివాహం చేసుకున్న అబ్బాయితో ముందు జాగ్రత్తగా పత్రం రాయించాలని కొందరు కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు. ► సాధ్యమైనంత వరకు అమ్మాయిలు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలు చేసుకోవాలని తొందర పాటునిర్ణయాలు మంచివి కావని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పిల్లలపై పర్యవేక్షణ అవసరం కొడంగల్ సర్కిల్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 30 కేసులు నమోదు కాగా 28 పరిష్కరించాం. మిగిలిన రెండు కేసులు దౌల్తాబాద్‌లో పెండింగ్ ఉన్నాయి. వాటినికూడా త్వరలో పరిష్కరిస్తాం. అదృశ్యమైన యువతీయువకులను వారిస్నేహితుల ఆ«ధారంగా గుర్తిస్తున్నాం. ఆన్లైన్ తరగతుల అనంతరం పిల్లల ఫోన్లను తల్లిదండ్రులు తరుచూ గమనిస్తూ ఉండాలి. – అప్పయ్య, సీఐ, కొడంగల్ -
నెలలో 28 మంది బాలికలు అదృశ్యం.. దీని వెనుక ఏదో ఉంది
సాక్షి, హైదరారబాద్: ఒకే పోలీసుస్టేషన్ పరిధి నుంచి నెల రోజుల కాలంలో 28 మంది బాలికలు అదృశ్యమయ్యారు. దీని వెనుక ఏదో ఉంది... అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు పోలీసులకు తలనొప్పి తెచ్చి పెట్టింది. ఈ విషయంలో అసలేం జరిగిందంటూ ఆరా తీయగా.. స్లమ్ ఏరియాలు అత్యధికం. హైదరాబాద్ తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట డివిజన్లో ఉన్న సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధి మూడు చదరపు కిలోమీటర్లు ఉంది. ఇందులో మూడు లక్షలకు పైగా జనాభా నివసిస్తుండగా... ప్రతి రోజూ 30 వేల నుంచి 40 వేల మంది వచ్చిపోతుంటారు. ఈ ఠాణా పరిధిలోని వచ్చే ప్రాంతాల్లో అత్యధికం స్లమ్ ఏరియాలు ఉన్నాయి. వీటిలో సింగరేణి కాలనీ, కాజాబాగ్, శంకేశ్వరిబజార్, చింతల్‌ల్లోని కీలకం. ఇక్కడ నివసించే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉన్నారు. ఇదే ఈ ఠాణాకు మిస్సింగ్‌ల సమస్య తెచ్చి పెట్టింది. కొందరు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, కుటుంబ కలహాల కారణంగానూ ఇల్లు వదులుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుల ఆ«ధారంగా మిస్సింగ్ కేసులు నమోదు చేసుకుంటున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇవీ గణాంకాలు... సైదాబాద్ పోలీస్‌స్టేషన్ జనవరి 1 నుంచి జూన్ 30 వరకు మొత్తం 44 మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇందులో మైనర్ అమ్మాయిలకు సంబంధించినవి 9 కాగా... 8 కొలిక్కి వచ్చాయి. వీటిలో ఆరు కేసుల్లో మైనర్లను మేజర్లు వివాహం చేసుకున్నట్లు తేలడంతో పోక్సో చట్టం కింద కేసులు మార్చారు. 18–85 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు తప్పిపోయిన కేసులు 23 నమోదయ్యాయి. వీటిలో 19 కొలిక్కిరాగా.. నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మహిళల్లో 80 ఏళ్ళు పైబడిన ఇద్దరు వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోయారు. పది మంది మేజర్లు ప్రేమ వివాహాలు చేసుకుని తిరిగి వచ్చారు. 18 ఏళ్ళు పైబడిన పురుషులు 12 మంది మిస్సింగ్‌పై కేసులు నమోదయ్యాయి. వీటిలో 11 ట్రేస్ కాగా.. ఒకటి పెండింగ్‌లో ఉంది. ఇతను మానసిక రోగి అందుకే ఆచూకీ దొరకడంలేదు. ప్రతి ఫిర్యాదు కేసుగా నమోదు మిస్సింగ్‌కు సంబంధించి వచ్చినన ప్రతి ఫిర్యాదునూ కేసుగా నమోదు చేస్తున్నాం. వారి ఆచూకీ కోసం అధికారిక సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నాం. స్లమ్స్‌లో మిస్సింగ్స్ ఎక్కువగా జరగడానికి కారణాలు విశ్లేషించాం. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి, వారిలో అవగాహనకు కృషి చేస్తున్నాం. – కస్తూరి శ్రీనివాస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సైదాబాద్ -
హైదరాబాద్‌లో నలుగురు యువతుల అదృశ్యం, కలకలం
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు అదృశ్యమైన ఘటన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆదివారం చోటు చేసుకుంది. నేరేడ్మెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓల్డ్‌సఫిల్‌గూడ(మొఘల్ కాలనీ)కి చెందిన ఠాకూర్ రాజేశ్వరి(29) ఈనెల 24న భర్త డ్యూటీకి వెళ్లిన తరువాత ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వివరించారు. ప్రైవేట్ ఉద్యోగి.. మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానెహ్రూనగర్‌కు చెందిన హరిష అలియాస్ పింకీ(25) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 22వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఈ ఘటనపై ఆమె సోదరుడు మహేష్ ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో స్టాఫ్ నర్స్ అదృశ్యం బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఉదయశ్రీ(22) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన ఉదయశ్రీ గత కొంతకాలంగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ నర్సుల హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 23న ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిన ఉదయశ్రీ తిరిగి రాలేదు. ఇదే విషయాన్ని హాస్టల్ వార్డెన్ భాగ్యలక్ష్మి ఫోన్ ద్వారా ఉదయశ్రీ తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు శనివారం నగరానికి వచ్చి అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో కూతురు కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో.. మల్కాజిగిరి: యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరా నెహ్రూనగర్‌కు చెందిన బాలయ్య భార్య కనకలక్ష్మి, కూతురు అరుణ(20) ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేస్తున్నారు. ఈ నెల 25న కనకలక్ష్మి తన పనిపూర్తి అయిన తర్వాత కూతురు పనిచేసే చోటుకు 9 గంటలకు వెళ్లింది. ఆ ఇంటి యజమాని అప్పటికే అరుణ వెళ్లిపోయింది అని చెప్పారు. ఆమె సెల్‌ఫోన్ పనిచేయకపోవడం, ఇంటికి రాకపోవడంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పారిపోవడంలో కీలకంగా వ్యవహరించిన 19 ఏళ్ల ‘గర్ల్‌ఫ్రెండ్’ -
తెలంగాణలో ఆగని మిస్సింగ్ కేసులు
-
వాటిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాం: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మిస్సింగ్ కేసులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పరిధిలో నమోదవుతున కేసులన్నీ వ్యక్తిగత, మనస్పర్థల వల్లనే ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. మైనర్లు తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే మా టీమ్ రంగంలోకి దిగుతోంది. ప్రతి కేసును మేము ఛాలెంజ్‌గానే తీసుకుంటున్నాము. (కస్టమర్ కేర్ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!) ఇటీవలే డాక్టర్ కేసు, గచ్చిబౌలి కేసు, పూణే అమ్మాయి కేసు వీటన్నింటినీ కూడా మేము స్పెషల్ టీమ్స్‌తో చేధించాం. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. చిన్న చిన్న కారణాలకే పిల్లలు ఇంటి నుంచి అలిగి వెళ్లిపోతున్నారు. భార్యాభర్తల గొడవలు కూడా మరికొన్ని మిస్సింగ్ కేసులకు కారణం. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులపై గౌరవం ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలపై దృష్టి ఉండాలి. అప్పుడే కాస్తయినా ఈ మిస్సింగ్ కేసులను అరికట్టగలం అని సీపీ సజ్జనార్ వివరించారు. -
హైదరాబాద్: యువతుల అదృశ్యం.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వరుస అదృశ్య కేసులు కలవరపెడుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు రోజుల తరబడి అడ్రస్ లేకుండా పోతున్నారు. మిస్సింగ్ అయిన వారంతా మహిళలు, యువతులే కావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వర్గాల సమచారం ప్రకారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ముగ్గురు, కూకట్‌పల్లిలో పరిధిలో ముగ్గురు మహిళలు అదృశ్యమయ్యారు. తాజాగా హైదరాబాద్ నగరం పరిధిలో మరో మూడు అదృశ్య కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాల ప్రకారం.. మందుల షాపుకని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖాజిపురా ప్రాంతానికి చెందిన మహ్మద్ బిన్ మహమూద్ కూతురు సబినా బిన్ మహమూద్ (22) ఈ నెల 28న మందుల దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె సోదరుడు అబుబాకర్ బిన్ మహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే రోజు సాయంత్రం 7.30 గంటలకు ఆమె తనకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నాను.. నా కోసం వెతకవద్దని తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 040–27854793, 9490616488, 8985465178 నంబర్లకు తెలపాలని పోలీసులు సూచించారు. చిన్నారితో సహా తల్లి.. చాంద్రాయణగుట్ట : రెండు నెలల చిన్నారి కూతురుతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ అరవింద్ గౌడ్ తెలిపిన వివరాలు.. ఉప్పుగూడ అంబికానగర్‌కు చెందిన పండరి కుమార్తె శృతి (20) మూడు నెలల క్రితం సదాశివపేటలోని అత్తగారింటి నుంచి అమ్మగారింటికి ప్రసవం కోసం వచ్చింది. ప్రస్తుతం ఆమెకు రెండు నెలల చిన్నారి ఉంది. నెల రోజుల క్రితం శృతి ఉదయం పాపతో కలిసి ఇంటి నుంచి వెళ్లి రాత్రి వచ్చింది. ఎక్కడికి వెళ్లావని తల్లి సుశీల అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఈ నెల 24న మరోసారి ఇంటి నుంచి పాపతో పాటు వెళ్లిపోయిన శృతి ఎంతకి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక స్టేషన్లో గాని సెల్ 9490616500 నంబర్లో గాని తెలపాలని కోరారు. మహిళ అదృశ్యం అమీర్‌పేట : భర్త మృతిచెందడంతో డిప్రెషన్‌కు గురైన ఓ మహిళ కనిపించకుండ పోయిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వివరాల ప్రకారం బోరబండ వినాయక్‌రావునగర్‌లో ఉండే వి.సునీత (45 ) ఆమె భర్త ఆనంద్ ఆరు నెలల క్రితం చనిపోయాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సునీత ఈ నెల 27వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వివిధ చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో కుమార్తె సోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచుకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్లో లేదా 9515874814 ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. -
కానిస్టేబుల్ అదృశ్యం: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మిస్సింగ్ కేసును ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. మే 26 నుంచి కానిస్టేబుల్ వెంకట్రావు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సెలవు మంజూరు కోసం వెంకట్రావు ఢిల్లీ ధౌలాకువాలోని ఆఫీస్‌కు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కానిస్టేబుల్ కనిపించకుండా పోవడంతో అతనిపై అదృశ్యం కేసు నమోదు చేశారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) కాగా వెంకట్రావు అదృశ్యం వెనుక సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవ్‌కుమార్ హస్తం ఉందటూ ఆరోపణలు వస్తున్నాయి. వెంకట్రావు సెలవు కోరడంపై సంజీవ్‌కుమార్‌తో తరచుగా గొడవలు పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐఎస్ఎఫ్, ఉస్మాన్‌పూర్ పోలీసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కానిస్టేబుల్ అదృశ్యంపై సమగ్ర, పారదర్శకత విచారణ కోసం ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు హైకోర్టు కేసును అప్పగించింది. -
తప్పటడుగులు.. బంగారు భవిషత్తు ఛిద్రం
ఏడో తరగతి చదువుతున్న ఆ చిన్నారికి పాఠశాలకు వెళ్లే దారిలో ఓ స్టిక్కరింగ్ షాపు నిర్వాహకుడి(23)తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరైన అతగాడితో కలిసి ఓ రోజు ఇంట్లో చెప్పకుండా పరారైంది. తండ్రి లేకపోవడంతో తల్లి బంధువులు, స్నేహితుల ఇళ్లన్నీ గాలించి చివరకు బందరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీసులు వారిని పట్టుకుని ఆ చిన్నారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లి దగ్గరకు పంపారు. ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న బాలికకు సోషల్ మీడియాలో కాకినాడకు చెందిన ఓ 26 ఏళ్ల యువకునితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వీడియో చాటింగ్ ఆపై వీడియోలు, నగ్న చిత్రాలు పంపే వరకు వెళ్లింది. వీటిని అడ్డం పెట్టుకుని ఆ యువకుడు బ్లాక్మెయిల్ చేయడంతో.. ఇంట్లో దొంగతనం చేసి విలువైన వస్తువులు, డబ్బులు పంపేది. విషయం గ్రహించిన ఆ బాలిక తండ్రి నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. బందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. కుటుంబ, సామాజిక పరిస్థితులు.. కొరవడిన తల్లి దండ్రుల పర్యవేక్షణ.. స్నేహితులు, సినిమాలు, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో ఆకర్షణకు లోనై కొందరు టీనేజర్స్ బంగారు భవిష్యత్‌ను ఛిద్రం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో జిల్లాలో నమోదవుతున్న అదృశ్యం, కిడ్నాప్ కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో గత కొన్నేళ్లుగా బాలికల అదృశ్యం, కిడ్నాప్ కేసులు పెరుగుతున్నాయి. వీటిలో 90 శాతానికి పైగా ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై అదృశ్యమవుతున్నట్టుగా విచారణలో తేలుతున్నాయి. ముఖ్యంగా వారిలో ఎక్కువగా 12–16 మధ్య వయస్సున్న వారే కావడం గమనార్హం. గడిచిన మూడేళ్లుగా ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇదీ కేసుల సరళి.. ►మహిళల మిస్సింగ్, బాలికల కిడ్నాప్ కేసులు గతేడాది 274 కేసులు నమోదైతే.. ఈ ఏడాది సెపె్టంబర్ 20 నాటికి 306 కేసులు నమోదయ్యాయి. ♦ప్రధానంగా కిడ్నాప్ కేసులు గతేడాది 94 నమోదైతే.. ఈ ఏడాది 88 కేసులు రిపోర్టయ్యాయి. ♦ఇక బాలికల అదృశ్యం కేసులు గతేడాది 180 నమోదైతే.. ఈ ఏడాది ఇప్పటికే 218 కేసులు నమోదయ్యాయి. ♦కిడ్నాప్ కేసులు నూజివీడు డివిజన్లో అత్యధికంగా నమోదైతే.. మిస్సింగ్ కేసులు గుడివాడలో రిపోర్టయ్యాయి. ♦కాగా ఈ మొత్తం కేసుల్లో 18–25 ఏళ్లలోపు యువతులు 130 మంది ఉంటే, 15–17 ఏళ్లలోపు వారు ఏకంగా 150 మంది ఉన్నారు. ఇక 15 ఏళ్లలో 25 మంది వరకు ఉన్నారు. 26–60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలు 70 మంది ఉన్నారు. 90 శాతం అవే కేసులు.. బాలికల అదృశ్యం. కిడ్నాప్ కేసుల్లో 90 శాతం ఆకర్షణ పేరుతో ప్రేమ మోజులో పడి ఇంట్లో నుంచి పరారైన ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న తమ పిల్లలపై నిఘా ఉంచాలి. వారి కదలిక లను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. – ఎం.రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ స్మార్ట్ఫోన్ల ప్రభావమే ఎక్కువ టీనేజ్‌లోకి వచ్చే చిన్నారులపై స్మార్ట్ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లాక్డౌన్ వల్ల స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లలకు ప్రత్యేకంగా ఫోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి. 13–18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీ, యువకుల కదిలకలు, పరిచయాలపై నిఘా ఉంచాలి. యాప్‌లకు లాక్పెట్టి ఓపెన్ చేస్తే మీకు అలర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. –డాక్టర్ బి. ప్రభురామ్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ఆస్పత్రి, బందరు -
మద్యం దొరక్క వెళ్లిపోయిన వారే అధికం
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిపై కరోనా పడగ విప్పింది... ఏ రోజుకారోజు పెరుగుతున్న కేసులతో అందరిలోనూ ఆందోళన నెలకొంది... ఎవరికి వారు ఒక రోజు గడిచిందంటే బతుకు జీవుడా అనే భావనలో ఉన్నారు... అయినప్పటికీ కొన్ని రకాలైన నేరగాళ్లు మాత్రం ఆగట్లేదు. ఎవరికి వారు తమ ‘పని’ చేసుకుపోతున్నారు. ప్రధానంగా మిస్సింగ్స్, చీటింగ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక సైబర్ నేరాల విషయానికి వస్తే సాధారణ రోజులతో పోలిస్తే తగ్గినా... కొవిడ్ కేంద్రంగా నమోదయ్యేవి పెరిగాయి. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు సంబం«ధించి లాక్డౌన్ మొదలైన గత నెల 22–ఈ నెల 5 (ఆదివారం) మధ్య నమోదైన గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నమోదైన కేసుల్లో అదృశ్యాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కేసుల వెనుక ఓ మతలబు ఉంది. మత్తు దొరక్క గడపదాటిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ కేసుల సంఖ్యను పెంచింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూతపడ్డాయి. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో పోలీసులకు కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. ఈ మత్తుకు బానిసలు అయిన అనేక మంది అది దొరకని పరిస్థితులు ఉండటంతో అదుపు తప్పుతున్నా రు. కొందరు ఆత్మహత్యలు, ఆ యత్నాలకు తెగబడుతుండగా... మరికొందరు పిచ్చిపిచ్చి గా ప్రవర్తించడం, ఇంట్లో సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోవడం వంటివి జరుగుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో చీటింగ్ కేసులు ఉన్నాయి. అనేక రకాలుగా నమ్మించి ద్రోహం చేయడం, మోసం చేయడం వంటి వాళ్ళు కరో నా ఎఫెక్ట్ నేపథ్యంలోనూ తమ పంథా మార్చలేదు. వీటిలో కొన్ని మాత్రం నకిలీ శానిటైజర్లు, మాస్కుల తయారీకి సంబంధించి నమోదు చేసినవి ఉన్నాయి. పోలీస్టషన్ల మధ్య బారికేడ్లు, నిరంతర తనిఖీల నేపథ్యంలో చోరులకు అటు– ఇటు కదలడం ఇబ్బందికరంగా మారినట్లుంది. ఈ నేపథ్యంలోనే పగటి పూట చోరీలు కేవలం ఒక్కటే నమోదైంది. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ తాళం వేసున్న ఇళ్ళతో వీరికి వెసులుబాటు దొరుకుతోంది. ఫలితంగానే రాత్రి వేళల్లో జరిగే చోరీల సంఖ్య రెండంకెల్లో ఉంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి ఆరు అత్యాచారం కేసులు నమోదు కాగా... ఇవన్నీ సాంకేతికంగా ఆ నేరం కిందికి వచ్చినవి అయి ఉంటాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సరుకుల దుకాణాలు, ఇతర నిత్యావసర విక్రయ కేంద్రాల వద్ద ఘర్షణలు తదితరాలతో సాధారణ దాడి కేసులు నమోదవుతున్నాయి. అయితే మొత్తమ్మీద మూడు కమిషనరేట్ల పరిధిలోనూ నేరాల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. -
పెళ్లి ఇష్టం లేదని యువతి..
బాలానగర్: ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహిదుద్దీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గౌతంనగర్‌కు చెందిన మంజుల (23) శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె సెల్ ఫోన్ సిచ్చాఫ్ చేసి ఉండటంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. ఆమె తల్లి మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ఇష్టం లేదని యువతి.. కేపీహెచ్‌బీకాలనీ: పెళ్లి ఇష్టం లేదని ఓ యువతి అదృశ్యమైన సంఘటన శుక్రవారం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ అదే ప్రాంతంలోని స్వాతి హాస్టల్లో ఉంటున్న రోజకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 4న తన సోదరికి ఫోన్ చేసిన రోజా నిశ్చితార్థం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, తాను మరో వ్యక్తిని ఇష్టపడుతున్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా లభ్యం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇద్దరిని మింగిన క్వారీ గుంత
కలికిరి: సాయంకాలం అలా ఆహ్లాదంగా గడుపుదామని గ్రామం సమీపంలోని క్వారీ గుంత వద్దకు వెళ్లిన ఓ యువతి, బాలిక నీట మునిగిపోయారు. ఈ çఘటన గురువారం సాయంత్రం కలికిరి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పల్లవోలు గ్రామం గడి–గ్యారంపల్లి మార్గంలో పాకాలకు చెందిన టీడీపీ నాయకుడు, కాంట్రాక్టరు విశ్వనాథనాయుడుకు చెందిన మూతబడిన క్వారీ ఉంది. క్వారీ లోపల గుంతల్లో గతంలో కురిసిన వర్షాలకు నీరు చేరింది. అడుగున బండరాయి ఉండడంతో నీరు ఆహ్లాదంగా కనిపిస్తోంది. చుట్టుపక్కల గ్రామస్తులు అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి ఈతకొట్టివాతావరణాన్ని ఆస్వాదించేవారు. ఈ క్రమంలోనే గడికి చెందిన షేక్ ఇస్మాయిల్, రేష్మల ఇంటికి చౌడేపల్లి మండలం పెద్దూరుకు చెందిన నజీర్ సాబ్ భార్య ముంతాజ్, కుమార్తె చష్మా(20), పుంగనూరు కొత్త ఇండ్లుకు చెందిన యువకుడు షాహీద్(18) వచ్చారు. గురువారం షేక్ ఇస్మాయిల్ బంధువైన గడి గ్రామానికే చెందిన సయ్యద్ బాషా ఇంటి నిర్మాణంలో భాగంగా ఇంటి స్లాబ్ పనులు చేపట్టారు. సాయం కాలం స్లాబ్ పని పూర్తయిన తరువాత ఇస్మాయిల్ కుమార్తెలు షబ్రీన్, అఫ్రీన్, వారి ఇంటికి వచ్చిన చౌడేపల్లి మండలం పెద్దూరుకు చెందిన ముంతాజ్, ఆమె కుమార్తె చష్మా, రోహీద్ కలిసి క్వారీ వద్దకు వెళ్లారు. అక్కడ ఐదుగురు కలిసి నీటిలో దిగారు. నీటి లోతు తెలియక పోవడం, వారిలో ఎవరికీ ఈత రాకపోవడంతో కొంత లోతుకెళ్లి ఉక్కిరిబిక్కిరయ్యారు. గమనించిన షాహీద్ ముంతాజ్‌ను ఒడ్డుకు లాగాడు. షబ్రీన్ అప్పటికే గట్టుకు చేరుకుంది. చష్మా(20), అఫ్రీన్(14) నీటిలో మునిగిపోయారు. గట్టున ఉన్న వారు కేకలు వేశారు. సమాచారం గడివాసులకు తెలియచేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరు కుని వెతికినా బాలికల ఆచూకీ లభించలేదు. సుమారు గుంత 40 నుంచి 50 అడుగుల లోతు ఉండడంతో స్థానికులు వారిని వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రామాంజనేయులు రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శుక్రవారం బాలికలను వెలికితీతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
అదృశ్యమైన బాలికల మృతి
ఒడిశా ,జయపురం: నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో ఓ పాడుబడిన నేలబావిలో ఇద్దరు బాలికల మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతులు గొన గ్రామానికి చెందిన ప్రకాష్ పాండే కూతురు లక్ష్మీ పాండే(9), పకనాపర గ్రామానికి చెందిన సియన్ తివారీ కూతురు పంచవతీ తివారీ(8)లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు బాలికలు కొన్నిరోజుల నుంచి కనిపించకపోగా తమ పిల్లలను ఎవరో కిడ్నాప్ చేశారని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాలికల మృతదేహాలు కనిపించడం గమనార్హం. అయితే వారు ప్రమాదవశాత్తు చనిపోయారా..లేకపోతే వారిని ఎవరైనా చంపి ఉంటారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కస్‌కంగ్ గ్రామంలో జరిగే మండెయి జాతరలో ఏటా ఇద్దరు మైనర్ బాలికలను బలి ఇస్తుంటారు. ఈ క్రమంలో వారిని జాతర బలికోసమే కిడ్నాప్ చేసి, చంపిన తర్వాత వారి మృతదేహాలను బావిలో పడేసి ఉంటారని బాధిత తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం బాధిత గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం బాలికల మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని, రిపోర్టు వచ్చాక మృతికి గల కారణాలు తెలియస్తాయని నవరంగపూర్ ఎస్పీ నితిన్ తెలిపారు. -
మాకొద్దీ అమ్మానాన్న!
మక్కువకు చెందిన చెందిన 14 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులు మందలించారని కొద్ది రోజుల క్రితం రైల్లో ముంబై వెళ్లిపోయాడు. అక్కడి పోలీసులు బాలుడిని విచారించి రెండు, మూడు రోజుల్లో స్వస్థలానికి పంపించనున్నారు. విశాఖపట్నానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చేశాడు. చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.. వీరిద్దరే కాదు ఎందరో పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – విజయనగరం ఫోర్ట్: తల్లిదండ్రులు మందలించారని కొందరు.. పట్టణాలు చూద్దామని మరి కొందరు ఇంటి నుంచి పారిపోతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వీరు పోలీసులకో.. చైల్డ్‌లైన్ సభ్యులకో దొరికితే పరవాలేదు. పొరపాటున సంఘ విద్రోహ శక్తులకో దొరికితే అత్యంత ప్రమాదకరం. అయిదేళ్లలో 156 మంది మూడేళ్ల కాలంలో 156 మంది వరకు ఇంటి నుంచి పారిపోయి వచ్చేసారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే. అధికారుల దృష్టికి వచ్చిన వారు.. దృష్టికి రాకుండా ఇంటి నుంచి పారిపోయిన వారు మరి కొందరున్నారు. పిల్లల ఇష్టాలను తెలుసుకోలేకే.. పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. పనులు, ఉద్యోగాల్లో నిమగ్నమై వారి ప్రవర్తనను గమనించలేకపోతున్నారు. అసలు వారేం చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత హడావుడిగా తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలకు ఏది ఆసక్తి.. ఏదంటే ఇష్టం ఉండదన్న విషయాలను తెలుసుకోవడం లేదు. పిల్లల ఇష్టాలను తెలుసుకోకుండా మందలించడం.. కొట్టడం వల్ల భయపడి చాలా మంటి ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. కొందరు పదేపదే చదువు పేరిట సతాయించడం, కోప్పడటం వల్ల బయటికి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం కుటుంబంలో, భార్యభర్తల మధ్య గొడవల వల్ల కొందరు పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొందరు పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్చ ఉండటం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – ఎస్.రంజిత, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ పిల్లల ఇష్టాలను తెలుసుకోవాలి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తు ఉండాలి. వారి ఇష్టాలను తెలుసుకోవాలి. కోప్పడటం, తిట్టడం వల్ల పిల్లలు భయపడి ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంది. చిన్న కుటుంబాల వల్ల కూడా నేడు పిల్లలను పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు ఉండటం లేదు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి, చెడుల గురించి చెప్పేవారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేస్తున్నారో కూడా చూసే తీరిక ఉండటం లేదు. – వావిలపల్లి లక్ష్మణ్, అధ్యక్షుడు, జిల్లా బాలల సంక్షేమ సమితి -
మార్కులు తక్కువొచ్చాయ్.. మన్నించండి
కుషాయిగూడ: మార్కులు తక్కువగా వచ్చాయని ఒకే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు.. హెచ్‌బీకాలనీ తిరుమలనగర్‌కు చెందిన ఎం.చరణ్, ఎస్వీనగర్, నాగారానికి చెందిన వై. సామ్యూల్, శ్రీరాంనగర్ కాలనీకి చెందిన హేమంత్‌సాయికృష్ణ ఏఎస్‌రావునగర్‌లోని సెయింట్ «థెరిసా పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరికి ఇటీవల జరిగిన ప్రి ఫైనల్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నా.. తమకు మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్తాపం చెందారు వీరు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి ప్రయోజకులుగా మారి తిరిగి రావాలని నిర్ణయించుకొన్నారు. ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. మంగళవారం ముగ్గురు స్కూల్ వెళ్లకుండా డుమ్మా కొట్టారు. ఇంట్లో ఎవరూ గమనించకుండా బ్యాగులు సిద్ధం చేసుకొని రహస్యంగా భద్రపరుచుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సామ్యూల్, హేమంత్‌సాయికృష్ణ హెచ్‌బీకాలనీలోని చరణ్ వద్దకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. హెచ్‌బీకాలనీ నుంచి వీరు ముగ్గురు కలిసి వెళ్లినట్లు సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. చరణ్, హేమంత్లు తమ గురించి బెంగపడొద్దని, తాము క్షేమంగా ఉంటామని, ప్రయోజకులమయ్యాక తిరిగి వస్తామంటూ లేఖలు రాసి పెట్టారు. ఇంటి నుంచి హేమంత్ రూ.5 వేలు, సామ్యూల్ రూ.6 వేలు నగదు తీసుకెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రత్యేక బృందాలతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద గాలిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
సైదాబాద్: హాస్టల్ ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మహబూబ్‌నగర్ జిల్లా, చంద్రదాన గ్రామం, పుల్సింగ్తండాకు చెందిన పత్లావత్ రేణుక(17) ఐఎస్‌సదన్ డివిజన్, వినయ్‌నగర్ కాలనీలోని నాయుడు హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉండే సంఘం లక్ష్మిబాయి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7న సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. దీంతో హాస్టల్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బంధువు పరుశురాం గురువారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగిని.. మల్కాజిగిరి:ప్రైవేట్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.దయానంద్‌నగర్ సాయికృప ఎంపైర్ అపార్ట్మెంట్లో ఉంటున్న తొగర్ క్లెమెంట్ దైవకర్ భార్య జ్యోత్స్న లత గచ్చిబౌలిలోని అభిరాం డెవలపర్స్‌లో జీఎంగా పనిచేస్తోంది. ఈ నెల 8 న డ్యూటీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఆఫ్ వస్తుండడంతో ఆమె భర్త దైవకర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు అదృశ్యం ఉప్పల్: రామంతాపూర్ డాన్‌బాస్కో నవజీవన్ అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆశ్రమంలో ఉంటున్న కోడి అఖిల్, నడిపి పోలు అనే విద్యార్థులు ఈ నెల 8న ఉదయం ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. వారికోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సొసైటీ ఇన్చార్జి శిల్వరాజు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
వీళ్లు మారరంతే!
సాక్షి, సిటీబ్యూరో: ‘చేతులుకాలాక ఆకులు పట్టుకోవడం..’ఈ సామెత పోలీసుల తీరుకు సరిగ్గా సరిపోతుంది. దిశ మిస్సింగ్ కేసు నమోదులో సైబరాబాద్ పోలీసులు చూపించిన నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అది పూర్తిగా మరువకముందే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో శరణప్ప కేసు వెలుగు చూసింది. అతడు మృత్యుముఖం వరకు చేరిన తర్వాత మేల్కొన్న బోయిన్పల్లి పోలీసుల నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వీరి వ్యవహారశైలిపై సిటీ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. మరోపక్క ఏదైనా ఉదంతం జరిగినప్పుడు హడావుడి చేడయం తప్ప చక్కదిద్దే చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శ ఉంది. రెండు కేసుల్లోనూ సుస్పష్టం... గత నెల ఆఖరి వారంలో దిశ మిస్సింగ్‌పై ఫిర్యాదు చేయడానికి ఆమె కుటుంబీకులు అర్ధరాత్రి వేళ పోలీసుల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పరిధుల పంచాయితీ పెట్టుకున్న సిబ్బంది వారిని రెండు ఠాణాల మధ్య తిప్పడంతో పాటు కేసు దర్యాప్తులోనూ నిర్లక్ష్యం వహించారు. పోలీసులు సత్వరం స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే వాదనా వినిపించింది. ఈ ఘటనను పూర్తిగా మరువక ముందే నగరంలోని నార్త్‌జోన్ పరిధిలో ఉన్న బోయిన్పల్లి ఠాణాలో శరణప్ప కేసు వెలుగులోకి వచ్చింది. బోయిన్‌పల్లిలోని శివ ఎన్‌క్లేవ్‌లో ఓ వివాదాస్పద స్థలం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న శరణప్పతో పాటు అతడి భార్యపై గురువారం సాయంత్రం దాడి జరిగింది. దీనిపై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నా నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ నిందితులే శనివారం సాయంత్రం శరణప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దుర్ఘటనలో అతడికి 40 శాతం కాలినగాయాలు కావడంతో ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. ఏవి జరిగితే వాటిపైనే దృష్టి... తీవ్ర సంచలనం సృష్టించే ఉదంతాలు చోటు చేసుకుంటేనే పోలీసులు దృష్టి పెడుతున్నారనే విమర్శ వస్తోంది. దిశ ఉదంతం తర్వాత రాజధానిలో మహిళల భద్రతకు పెద్ద పీట వేయడంతో పాటు డయల్–100, హాక్–ఐపై విస్తృత ప్రచారం చేయడం మొదలెట్టారు. పరిధుల పంచాయితీకి తావు లేకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు విధానానికి శ్రీకారం చుట్టారు. శరణప్పపై దాడి కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం ఫలితంగా అతడిపై హత్యాయత్నం జరిగిన తర్వాత స్థానిక పోలీసుల తీరును ఉన్నతాధికారులు తప్పుబట్టాకే స్పందన వచ్చింది. రెండు కేసుల్లోనూ నిందితులుగా ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నేరాలు చోటు చేసుకున్న తర్వాత స్పందించి, హడావుడి చేయడం కంటే వాటి నిరోధానికి పోలీసులు కృషి చేస్తే ఏ కుటుంబానికీ నష్టం జరగదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఓ సంచలనాత్మక కేసు జరిగితే పోలీసుల దృష్టి అంతా ఆ తరహా నేరాల పైనే ఉంటోంది. ఫలితంగా మిగిలిన కేసులు మూలనపడి మరో ఉదందం చోటు చేసుకుని ఇంకో కుటుంబం నష్టపోతోంది. కానరాని పటిష్ట చర్యలు... ఓ ఉదంతం చోటు చేసుకున్నప్పుడు పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వస్తే హడావుడి చేయడం, కొందరు కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం మాత్రమే కనిపిస్తోంది. దిశ ఉదంతంలో మిస్సింగ్ కేసు నమోదులో తాత్సారం చేసిన సబ్–ఇన్స్పెక్టర్ సహా మరికొందరిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇలా సస్పెన్షన్లు జరిగిన సందర్భాలు గతంలోనూ అనేకం ఉన్నాయి. ఏదైనా జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం కాకుండా అలా జరగకుండా ఉండేలా క్షేత్రస్థాయి అధికారుల తీరు మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులూ విఫలం అవుతున్నారు. అత్యంత కీలకమైన, ఎమర్జెన్సీ సర్వీసుగా పరిగణించే పోలీసు విభాగంలో ఏ దశ, ఏ స్థాయిలో నిర్లక్ష్యం చోటు చేసుకున్నా దాని వల్ల బాధితుడికి జరిగే నష్టాన్ని ఒక్కోసారి పూడ్చలేని పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి అవగతం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెట్టాలి. -
తప్పిపోయిన కేసుల్లో తక్షణం స్పందించండి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులు ఇప్పుడు మరోసారి చర్చానీయాంశమవుతున్నాయి. వాస్తవానికి ఇలా నమోదవుతున్న వాటిలో 67% పైగా కేసుల్లో తప్పిపోయినవారిని గుర్తిస్తున్నారు. కానీ, యువతులు, టీనేజీ బాలికల విషయంలో మాత్రం పోలీసులు అది ప్రేమ వ్యవహారమంటూ కొట్టిపారేస్తున్నారు. దీంతో కొన్నింటిలో బాధితులు విగతజీవులుగా కనిపిస్తున్నారు. గతంలో హాజీపూర్ గ్రామంలోనూ ఫిర్యాదు చేసినపుడు పోలీసులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. తాజాగా ‘దిశ’ కేసులోనూ పోలీసులకు యువతి అదృశ్యం పై ఫిర్యాదు చేయగానే.. తొలుత ప్రేమ వ్యవహారమంటూ తేలిగ్గా తీసుకున్నారు. మరునాడు ఆమె విగతజీవిగా మారింది. పోలీసులు అదేక్షణంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని బాధిత కుటుంబీకులు ఆరోపించడంతో ముగ్గురు పోలీసులపై వేటుపడిన సంగతి తెలిసిందే. 67 శాతం పురోగతి.. తెలంగాణలో మిస్సింగ్ కేసులు నమోదు భారీగా ఉంటోంది. వాటి పరిశోధన కూడా అంతేస్థాయిలో ఉంటుంది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) 2017 ప్రకారం.. నమోదైన ప్రతీ వంద కేసుల్లో 67 కేసులను పోలీసులు ఛేదిస్తున్నారు. మిస్సింగ్ కేసుల పురోగతిలో ఒడిశా 87%, కేరళ 85.4 శాతంగా ఉంది. వీటి తరువాత స్థానంలో తెలంగాణ నిలవడం గమనార్హం. సాధారణంగా మిస్సింగ్ కేసుల్లో ఇంటినుంచి పారిపోయిన, తప్పిపోయిన పిల్లలు, మతిస్థిమితి లేనివారు, వృద్ధులు, ప్రేమవ్యవహారాలు, కిడ్నాపులు అన్ని రకాలు ఉంటాయి. పిల్లలు, వృద్ధుల విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేసులు నమోదు చేసే పోలీ సులు, యువతుల విషయంలో ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుతో తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. నిర్లక్ష్యం వద్దు : డీజీపీ కార్యాలయం ‘దిశ’కేసు నేపథ్యంలో యువతులు, బాలికల మిస్సింగ్ కేసుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీ, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. డయల్ 100కు వచ్చే కాల్స్‌లోనూ వీలైనంత త్వరగా ఘటనాస్థలానికి చేరుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
నీటిలో ప్రాణం.. గాలిలో దీపం!
చీమకుర్తి: నాలుగు రోజుల క్రితం కేవీపాలెం వంతెన లాకులకు సమీపంలో ఉన్న డ్రాప్‌ల వద్ద సాగర్ కాలువలో ఈత కోసం దిగిన ఇద్దరు ఇంటర్ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. త్రోవగుంట మేజర్ వద్ద గతంలో ఒంగోలుకు చెందిన ఇద్దరు స్నానానికి దిగి ప్రాణాలను నీటిలోనే వదిలేశారు. సంతనూతలపాడు మండలం చండ్రపాలెం లాకుల వద్ద దుస్తులు ఉతుకుతూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి సంఘటనల్లో ఏటా ఒంగోలు బ్రాంచ్ కెనాల్ (ఓబీసీ)లో సరాసరిన 10 మందికిపైగా మృత్యువాత పడుతుంటారని స్థానికుల అంచనా. రామతీర్థం రిజర్వాయర్ నుంచి టెయిల్ ఎండ్ ప్రాంతం వరకు దాదాపు 5–6 లాకులు ఉన్నాయి. 10కి పైగా డ్రాప్‌లు ఉన్నాయి. లాకుల వద్ద కంటే డ్రాప్‌ల వద్దే నీటి ప్రవాహ వేగం ఎక్కువుగా ఉంటుంది. డ్రాప్‌నకు దిగువన నీటి సుడులు సుడులుగా తిరుగుతూ ప్రమాదకరంగా ఉంటోంది. ఈత కోసం వచ్చే వారే ఎక్కువ రబీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసుకునే వారికి ఇరిగేషన్ అధికారులు సాధారణంగా జూలై నుంచి మరుసటి సంవత్సరం ఫిబ్రవరి లేక మార్చి వరకు సాగర్ నీరు విడుదల చేస్తుంటారు. చీమకుర్తికి సమీపంలో ఓబీసీ కాలువ అందుబాటులో ఉండటంతో కూనంనేనివారిపాలెం వెళ్లే దారిలో వంతెన వద్ద ఎక్కువ మంది విద్యార్థులు, ఇతర పెద్దలు స్నానాలకు దిగుతుంటారు. వారిలో సగం మందికిపైగా ఈత నేర్చుకుందామనుకుని వచ్చేవారే. ఈత బాగా వచ్చిన వారు కూడా కాలువలో నీటి ప్రవాహం ఎక్కువైతే కొట్టుకుపోయి డ్రాప్లో పడ్డారంటే సుడి తిప్పినట్లు తిప్పేసి చివరకు శవాన్ని మరుసటి రోజుకు కిలోమీటరు దూరంలో కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఏటా రామతీర్థం, ఎన్ఎస్పీ కాలనీ, గురుకుల పాఠశాల వెనుక, మువ్వవారిపాలెం డొంక సమీపం, కేవీ పాలెం వద్ద, చండ్రపాలెం, త్రోవగుంట మేజర్ వంటి పలు డేంజర్స్పాట్ల వద్దే ఎక్కువ మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఓబీసీ కట్టపైనే చీమకుర్తి బైపాస్ కూడా ఉండటంతో మనుషులే కాకుండా భారీ వాహనాలు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు కూడా కాలువలోకి దూసుకొచ్చి చావుతుప్పి కన్నులొట్టబోయిన సంఘటనలు బోలెడు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం సాగర్ నీరు ఓబీసీలో దాదాపు నాలుగైదు నెలల పాటు ప్రవహిస్తుంటాయి. ఏటా కాలువలోని డ్రాప్‌ల వద్ద పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ ప్రమాదాల గురించి జిల్లాస్థాయి, మండల స్థాయి ఇరిగేషన్ అధికారులు కొన్నేళ్లుగా వింటూనే ఉన్నారు. జాగ్రత్తలు మాత్రం ఇంతవరకు తీసుకోకపోవడం గమనార్హం. డేంజర్ స్పాట్ల వద్ద ఈతకు దిగితే కలిగే ప్రమాదం గురించి తెలియజేసే హెచ్చరిక బోర్డులు ఎక్కడా కనిపించవు. డ్రాప్‌ల వద్ద నీటి వేగం నుంచి ఈతకు దిగిన వారు బయట పడేందుకు ఆసరాగా ఉండే సిమెంట్ పిల్లర్లు, భీమ్‌లు లేక ఇతర ఆధారాలను కల్పించే ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం శోచనీయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమాయక ప్రజల ప్రాణాలు నీటిలో కలిసి పోకుండా ఉండాలంటే ఈతకు దిగే డేంజర్ స్పాట్లను ముందుగా గుర్తించాలని, వాటి వద్ద సరైన హెచ్చరికలు తెలియజేసే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం ఓబీసీలో రామతీర్థం నుంచి టెయిల్ ఎండ్ వరకు 10 వరకు డ్రాప్‌లు ఉన్నాయి. వాటి వద్ద నీటి సుడులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈత వచ్చిన వారికి కూడా డ్రాప్‌ల వద్ద బయట పడాలంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి డేంజర్ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా సైన్‌బోర్డులు లేక ఇతర ఏర్పాట్ల గురించి జిల్లా ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటా.శ్రీనివాసరావు, ఈఈ, ఇరిగేషన్ -
నేను చనిపోతున్నా..
దుండిగల్:ఐ మిస్ యూ.. నేను చనిపోతున్నా.. అంటూ ఓ వ్యక్తి తన స్నేహితులకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి అదృశ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విఠల్ నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం కాలనీ, సుభాష్‌చంద్రబోస్ నగర్‌కు చెందిన కె.తిరుపతిరెడ్డి (34) డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ నెల 8న రాత్రి అతను తన స్నేహితులైన నాగరాజుగౌడ్, సత్యనారాయణ, కమలాకర్‌రావు లకు ‘నేను చనిపోతున్నా.. ఐమిస్ యూ అంటూ’ .. మెసేజ్ పెట్టాడు. స్నేహితులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుపతిరెడ్డి బావమరిది శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సోమవారం దుండిగల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పది నిమిషాలకో ‘పిల్ల(డు)’ అదృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రతి పది నిమిషాలకు ఓ బాలుడు లేదా బాలిక అదృశ్యమవుతున్నారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెబ్సైట్ వెల్లడిస్తోంది. ఈ లెక్కన గతేడాది దేశంలో 54, 750 మంది పిల్లలు అదృశ్యమయ్యారు. వారిలో సగం మందిని మాత్రమే పోలీసులు కనుగొన్నారు. మిగతా వారు పోలీసులకు దొరకలేదంటే వారంతా గల్లంతైనట్లే! జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ప్రకారం 2016 సంవత్సరంలో 63,407 మంది కిడ్నాప్ అయ్యారు. 2016 నుంచి ఏడాదికిపైగా గడిచిన కాలంలో ఏకంగా 1,11,569 మంది పిల్లలు అదృశ్యమయ్యారని, వారిలో దాదాపు సగం మంది పిల్లల ఆచూకీ మాత్రాన్నే పోలీసులు కనుగొనగలిగారని జాతీయ నేరాల రికార్డు బ్యూరో తెలియజేసింది. ఈ గల్లంతైన వారి పిల్లల్లో వివిధ జాతులు, మతాలు, సంస్కతి , సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. భారత్‌లో 18 ఏళ్లకు లోపు పిల్లలు దాదాపు 40 కోట్ల మంది ఉన్నారని, దేశ జనాభాలో యువత, పిల్లల సంఖ్య 55 శాతం ఉంటుందన్నది మరో అంచనా. ఇలా పిల్లలు అదృశ్యమైన కేసుల్లో చాలా వరకు పోలీసుల వద్దకు రావడం లేదని, కొన్ని వచ్చినా వాటిని పోలీసులు నమోదు చేయడం లేదని తెల్సింది. ప్రతి కేసును నమోదు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా పోలీసులు పట్టించుకోవడం లేదు. పిల్లలు అదృశ్యమయ్యారంటే ఒక్క ఫిర్యాదు అందినా వెంటనే కిడ్నాప్ కేసును నమోదు చేయాలని 2013లో సుప్రీం కోర్టే స్వయంగా పోలీసులకు ఆదేశించినా పోలీసులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని పలు ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. తమ పిల్లలు తప్పి పోయారంటూ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడల్లా ‘ఆ ఇంటి నుంచి పారిపోయి ఉంటారు, నాలుగు రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తారు’ అంటూ చెప్పి పంపించడం పోలీసులకు పరిపాటిగా మారిపోయిందని స్వచ్ఛంద సంస్థలు తెలియజేస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో పిల్లలను ఎత్తుకుపోయే వారొచ్చారంటూ ప్రజలే మూక హత్యలకు పాల్పడుతున్నారు. గత రెండు నెలల కాలంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రలో వందకు పైగా మూక హత్యలు చోటు చేసుకున్నాయి. గత వారం రోజుల్లో, ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 20 మూక దాడులు జరిగాయి. ప్రత్యక్షంగా వదంతుల కారణంగా మూక దాడులు జరుగుతుంటే పరోక్షంగా కిడ్నాప్ కేసుల్లో పోలీసులు స్పందించక పోవడమేనని ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. వ్యభిచారం, వెట్టి చాకిరీల కోసమే దేశంలో పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల మేరకు 1956 నాటి మానవ అక్రమ రవాణా చట్టాన్ని సవరించాల్సి ఉంది. -
బ్లెస్సీ.. ఎక్కడున్నావ్?
బంజారాహిల్స్: ఇంట్లో ముద్దుగా పెంచుకుంటున్న జంతువుల పట్ల నగరవాసుల మమకారం పెరుగుతోందనడానికి ఇదో ఉదాహరణ. తమ పెట్స్ కనిపించకపోతే తట్టుకోలేకపోతున్నారు. తిరుమలగిరి జూపిటర్ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి రాజేశ్వరి తన పెంపుడు పిల్లి కనిపించకుండా పోయిందని, దాన్ని దత్తత తీసుకున్న వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. దాన్ని వెతికిపెట్టాలంటూ శుక్రవారంబంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ‘క్యాట్ మిస్సింగ్’ కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలగిరికి చెందిన రాజేశ్వరి కొంత కాలంగా బ్లెస్సీ ముద్దు పేరుతో రెండు నెలల వయసున్న పిల్లిని ముద్దుగా పెంచుకుంటున్నారు. దీనికి తోడుగా మరో పిల్లి కూడా ఉండటంతో త్వరగా జబ్బులు సంక్రమిస్తాయన్న కారణంగా ఓ పిల్లిని ఎవరికైనా దత్తత ఇవ్వాలని ఇటీవల పీపుల్ ఫర్ ఏనిమల్ సంస్థను సంప్రదించారు. చట్టప్రకారం దత్తత ఇవ్వవచ్చని ఆ సంస్థ చెప్పడంతో తన పిల్లిని దత్తత ఇస్తానని ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. అది చూసి బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని శ్రీనికేతన్ కాలనీలో నివసించే యువకుడు ఆ పిల్లిని తాను దత్తత తీసుకుంటానని ఆమెను సంప్రదించాడు. అలా ఈ నెల 13వ తేదీన రాజేశ్వరి తన బ్లెస్సీ(పిల్లి)ని యువకుడికి అప్పగించింది. అయితే, ఈ నెల 20వ తేదీన ఆ పిల్లికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉండడంతో గుర్తు చేసేందుకు సదరు యువకుడికి ఫోన్ చేయగా సరైన సమాధానం రాలేదు. దాంతో ఆమె ఆయన ఇంటికి వచ్చి పిల్లి ఏదని ప్రశ్నించగా ఆ రోజు కూడా అతడు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆమె మూడు రోజుల పాటు తిరిగినా పిల్లి కనిపించలేదు. చివరాకరకు పిల్లి కనిపించడం లేదని సదరు యువకుడు చెప్పడంతో అక్కడే కుప్పకూలిపోయింది. తేరుకొని శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. దత్తత పిల్లిని పొగొట్టిన ఆ యువకుడిపై ‘క్రుయాలిటీ చట్టం’ కింద కేసు నమోదు చేయాల్సిందిగా ఆమె ఇన్స్పెక్టర్ను కోరారు. వైట్ అండ్ బ్లాక్ ఇండియన్ బ్రీడ్‌కు చెందిన ఈ పిల్లి అంటే తనకు ప్రాణమని బాగా చూసుకుంటానంటే ఇచ్చానని, ఆదానికి ఏ ఆహారం ఇష్టంగా తింటుందో.. ఏది పెట్టకూడదో ముందే జాగ్రత్తలు చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. తన పిల్లిని ఇతరులకు విక్రయించాడా..? కొట్టి చంపాడా..? సహజంగానే అదృశ్యమైందా అన్నదానిపై దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిల్లిని పట్టి అప్పగించిన వారికి రూ.10 వేల బహుమతి కూడా ప్రకటిస్తూ మళ్లీ ఫేస్బుక్లో పోస్టు చేసిందామె. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పిల్లి కోసం గాలింపు చేపట్టి సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి): పట్టణంలో నివాసం ఉంటున్న కాగిత త్రినాథ్ అనే వ్యక్తి గడిచిన పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదని అతని భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.కేశవరావు తెలిపారు. విజ్జేశ్వరం జీటీపీఎస్ ప్లాంటు ఫైర్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న త్రినాథ్ పదిహేను రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. త్రినాథ్ ఆచూకీ తెలిసిన వాళ్లు పట్టణ పోలీసు స్టేషన్ 08813–231100 నెంబర్‌కి ఫోన్ చేయాలని ఎస్సై కోరారు. చాగల్లు గ్రామంలో.. చాగల్లు: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. చాగల్లు గ్రామానికి చెందిన సుంకవల్లి గంగాధర్(43) మతి స్తిమితం లేని వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు ఇళ్ల వద్ద వెతికినా సమాచారం తెలియకపోవడంతో తల్లి సుంకవల్లి శకుంతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. వివాహిత అదృశ్యం చాగల్లు: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. కలవలపల్లి గ్రామానికి చెందిన బోల్లా కీర్తి అనే 23 సంవత్సరాల వివాహిత ఈ నెల 24వ తేదీన నిడదవోలులో ఆస్పత్రికి వెళ్తానని భర్త నాగసూర్యచంద్రంకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభ్యంకాక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జి.విష్ణువర్థన్ తెలిపారు. -
మ్యావ్ మ్యావ్... ఏమైపోయావ్!
రక్తసంబంధీకులు దూరమైతేనే వారం... పది రోజుల పాటు బాధపడి యధావిధిగా రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్న ఈ సమాజంలో ఓ జంట, తాము కొద్దికాలంగా పెంచుకుంటున్న పిల్లి కనిపించకుండా పోయేసరికి దానికోసం పడుతున్న తపన చూపరులను తమవైపునకు తిప్పుకుంటోంది. ఏడాది పాటు తమ కుటుంబంలో ఓ సభ్యునిగా భావించి పెంచుకున్న పిల్లి కోసం ఊరుగాని ఊరిలో, భాష తెలియని ప్రాంతంలో... ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా నెల రోజులకుౖ పెగా కళ్లలో ఒత్తులేసుకుని వెతుకుతున్నారు. నేపథ్యమిదీ... గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరానికి చెందిన జయేష్, మీన దంపతులు నగరంలో హోల్‌సేల్ దుస్తులవ్యాపారం, మొబైల్షాపులతో హాయిగానే జీవిస్తున్నారు. అయితే వివాహమై పదేళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదన్న వెలితి వారిని బాధించేది. ఏడాది కిందట ఓ పిల్లి పిల్ల వారింటికి చేరుకుంది. జయేష్, మీన దంపతులు ఆ పిల్లిని తమకు దేవుడు పంపిన బిడ్డగా భావించి కంటికిరెప్పలా పెంచుకున్నారు. చూస్తుండగానే వారికి ఆ పిల్లితో తెలియని బంధం ఏర్పడింది. అది పిల్లి కాదు.. పిల్లోడే అనుకునేంతగా వారి బంధం దృఢ పడింది. వెంకన్న దర్శనం కోసం వచ్చి... తిరుమల వెంకన్న దర్శనార్థం జయేష్, మీన దంపతులు ఇటీవల సూరత్ నుంచి పిల్లిని ప్రత్యేకంగా ఓ బుట్టలో పెట్టుకుని వెంట తెచ్చుకున్నారు. తిరుమలకు గత నెల 9న చేరుకున్నారు. నాలుగు రోజులపాటు శ్రీ వారి సన్నిధిలో గడిపిన తర్వాత తిరుగు పయనమై గతనెల 12న రాత్రి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి ముంబైకు వెళ్లి మరో రైలెక్కి స్వస్థలం చేరాలన్న ఆలోచనతో స్టేషన్లో రైలుకోసం వేచి ఉన్నారు. పిల్లితో ఆడుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూడటంతో ఒడిలో నిద్రిస్తున్న పిల్లి కనిపించలేదు. దాంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పిల్లితో చివరిసారిగా తిరుమల కొండపై దిగిన ఫోటోఫ్రేమ్‌ను చూపుతూ స్టేషన్ ప్రాంగణమంతా వెతికారు. పిల్లి ఆచూకీ లభించకపోవడంతో పిల్లి ఆచూకీ దొరికే వరకు ఈ ప్రాంతాన్ని వదిలి ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. రేణిగుంట, తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కోడూరు, గూడూరు, నెల్లూరు, కస్మూరు దర్గా.. ఇలా అన్ని చోట్లకు వెళ్లి వెతుకుతూనే ఉన్నారు. నెలరోజులు దాటినా పిల్లి ఆచూకీ తెలియలేదు.. ప్రాణసమానమైన పిల్లి జాడను దేవుడే చూపుతాడన్న విశ్వాసంతో పిల్లిని దొరకబుచ్చుకోవడమే లక్ష్యంగా కనిపించిన ప్రతి ఒక్కరినీ పిల్లి కోసం ఆరా తీస్తున్నారు. వీరి అన్వేషణ ఫలించాలని కోరుకుందాం. పిల్లి రూపురేఖలివీ... ‘ఫెలిసియో’ సంతతికి చెందిన ఈ అరుదైన పిల్లి సుమారు 3.5 నుంచి 4 కిలోల బరువుంటుంది. 14 నెలల వయస్సు కలిగిన ఈ పిల్లి 10 అంగుళాలు ఎత్తు ఉండి, తెలుపు, ఊదా రంగులతో నిలువు చారలు కలిగి ఉంటుంది.– చింత మునిశేఖర్, సాక్షి, రేణిగుంటఫొటోలు: షేక్ మహ్మద్ రఫి -
విద్యార్థిని అదృశ్యం
కాచిగూడ: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ఏ్టషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మధు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ డివిజన్, మోతీమార్కెట్ ప్రాంతానికి చెందిన ఫక్రుద్దీన్ కుమార్తె రహమత్ బేగం (19) నారాయణగూడలోని సమత డిగ్రీ కళాశాలలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 9న హైటెక్‌సిటీలో ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లిన రహమత్ బేగం తిరిగి ఇంటికి రాలేదు. వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి ఫక్రుద్దీన్ బుధవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గృహిణి ... మీర్‌పేట: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్‌పేట, కేశవరెడ్డినగర్కు చెందిన రాంచందర్ కుమార్తె మౌనిక (25)కు సురేష్‌తో వివాహం జరిగింది. గత నెల 29న పుట్టింటికి వచ్చిన మౌనిక తన వస్తువులను ఇంట్లో పెట్టి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె సోదరుడు అశోక్ బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహానగరంలో ఒకేరోజు 11 మంది అదృశ్యం
మహానగరంలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది కనిపించకుండా పోయారు. ఆదివారం వివిధ పోలీస్స్టేషన్లలో ఈ మేరకు కేసులునమోదయ్యాయి. ఆటో డ్రైవర్.. మీర్‌పేట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆటోడ్రైవర్ అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నందనవనం ప్రాంతానికి చెందిన చెందిన రమావత్ కరుణాకర్ (30) కొన్ని రోజుల క్రితం ఆటోతో బయటకు వెళ్లి నల్లకుంట ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రంకన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. అప్పటి నుంచి అతను ఇంటికి తిరిగిరాలేదు. ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో కటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాపీమేస్త్రీ... వనస్థలిపురం వెంకటరమణ కాలనీకి చెందిన చిన బ్రహ్మయ్య తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. హస్తినాపురం గోకుల్ఎన్క్లేవ్కు చెందిన కాశిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అనే బిల్డర్ వద్ద అడ్వాన్స్ తీసుకుని వారం రోజుల క్రితం భార్యను ఊరికి పంపించాడు. మరుసటి రోజు పనిలోకి వచ్చిన బ్రహ్మయ్య బాత్రూమ్కి వెళ్లి వస్తానని తోటి మేస్త్రీకి చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వెంకటేశ్వర్‌రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పరీక్ష రాసేందుకువెళ్లిన విద్యార్థిని.. బృందావన్ కాలనీకి చెందిన రత్లావత్ రాములు కుమార్తె హరిత (21) గత కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌లోని టీకేఆర్ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదు. స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి రాములు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సాయికుమార్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కుమారుడితో సహా తల్లి.. జిల్లెలగూడ వెంకటేశ్వరకాలనీకి చెందిన కె.అంజన్‌దాస్, ఉపేంద్రమ్మ (32) భార్యాభర్తలు. కొన్ని రోజుల క్రితం ఉపేంద్రమ్మ పుట్టింటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి కుమారుడి (3)తో సహా బయటికి వెళ్లింది. అటు పుట్టింటికి వెళ్లక, ఇటు ఇంటికి తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో గొడవపడి .. నందనవనంకు చెందిన వడ్త్యావత్ రమేష్, నాన్కో (24)లు భార్యాభర్తలు. వారం రోజుల క్రితం నాన్కో భర్త రమేష్‌తో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె భర్త రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తేనె విక్రయించేందుకు వెళ్లి .. తేనె విక్రయించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. నందనవనం ప్రాంతానికి చెందిన పతోలియా మండల్ (28) వారం రోజుల క్రితం తీనె విక్రయించేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుంచి వస్తూ చిన్నారి.. భాగ్యనగర్‌కాలనీ: తల్లిదండ్రులతో కలిసి ఎంఎంటీఎస్ రైలు దిగిన చిన్నారి అదృశ్యమైన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బోరబండ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన షఫీక్ శనివారం ఉదయం బోరబండ రైల్వేస్టేషన్లో కుటుంబంతో సహా ఎంఎంటీఎస్ రైలు దిగాడు. ఈ క్రమంలో అతని కుమార్తె పర్హానా (7) తల్లిదండ్రుల కంటే ముందుగా ఇంటికి వెళ్లాలని వేగంగా ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్ళింది. తల్లిదండ్రులు ఇంటికి చేరుకోగా పర్హానా మాత్రం కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్.. మల్కాజిగిరి:విధులకు వెళ్లిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లికార్జుననగర్‌కు చెందిన కేవీ రమణారెడ్డి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్‌గా కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 6న మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం రమణారెడ్డి సహోద్యోగి వీ.ఎల్.చారి, రమణారెడ్డి కుమారుడు భార్గవ తేజకు ఫోన్ చేసి రమణారెడ్డి విధులకు హాజరుకాలేదని తెలిపాడు. అతని కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐస్‌క్రీం కోసం వెళ్లి.. చైతన్యపురి: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యం అయ్యారు. పోలీసుల సమాచారం మేరకు... మోహన్‌నగర్ జనప్రియ అపార్టుమెంట్స్‌లో నివసించే మహమ్మద్ సిరాజుద్దీన్ ప్రైవేటు కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తుంటాడు. సిరాజుద్దీన్‌కు ఫిబ్రవరిలో హుస్నా జబీన్(21)తో వివాహం జరిగింది. శనివారం ఉదయం అతను డ్యూటీకి వెళ్లి రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. ఇంట్లో భార్య కనిపించకపోవటంతో ఎదురుగా ఉండే అత్తగారిని అడిగాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఐస్‌క్రీం తీసుకొస్తానని చెప్పి వెళ్లిందని సమాధానం ఇచ్చింది. ఫోన్ చేయగా సెల్ స్విచ్ ఆఫ్ ఉంది. ఆమె కోసం పలు ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేక పోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మందలించినందుకు... మందులు వేసుకోలేదని మందలించినందుకు ఓ తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వివరాలివీ... కూలీ పనిచేసుకునే రమావత్ లిచ్చరాం(57) భార్యతో కలిసి చైతన్యపురి అంంబేడ్కర్నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. ఇటీవల లచ్చిరాంకు జ్వరం వచ్చింది. డాక్టర్‌కు చూపించారు. మందులు రాసి ఇవ్వగా వేసుకోకుండా మద్యం సేవిస్తున్నాడు. కుటుంబ సభ్యులు మద్యం మాని టాబ్లెట్స్ వేసుకోమని మందలించారు. దీంతో శనివారం సాయంత్రం మూడు గంటల సమయలో బయటకు వెళ్లిన లచ్చిరాం తిరిగి రాలేదు. వెతికినా జాడ తెలియక పోవటంతో అతని కుమారుడు భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేర్వేరుగా కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఇద్దరు పిల్లలు సహా తల్లి అదృశ్యం
మీర్‌పేట: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ అనంతరాములు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బడంగ్‌పేట శ్రీ సాయినగర్ కాలనీకి చెందిన మేకల శంకర్ ఇంట్లో నరపాక జగదీష్ భార్య శ్యామల (36), కుమారులు సందీప్ (5), లిఖిత్ (4)లతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. జూన్ 28న జగదీష్ ఇంట్లో లేని సమయంలో శ్యామల ఇద్దరు పిల్లలతో సహా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువుల ఇలళ్లు, ఇతర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో జగదీష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వారి ఇంటి యజమాని కుమారుడు మేకల శివకుమార్ (21) కూడా కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అఖిల్ ఎక్కడ?
రామాయంపేట(మెదక్): మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్‌వద్ద సుమారు ఆరునెలలక్రితం అదృశ్యమైన గిరిజన బాలుని ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో సదరు బాలుని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు బాలుని ఆచూకీ కోసం తల్లడిల్లుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాకు చెందిన లంబాడి కపూర్య, అతని రెండేళ్ల కుమారుడు అఖిల్ గతంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో కాలువిరిగి ఏపని చేసుకోలేని స్థితిలో విధిలేక కపూర్య బిక్షాటన మార్గం ఎంచుకున్నాడు. ఇదే సమయంలో అతని భార్య.. కొడుకును, భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తన కుమారునితోపాటు రామాయంపేటకు వచ్చిన కపూర్య బిక్షాటన ద్వారా కొద్దిరోజులు గడిపాడు. బిక్షాటనకై రామాయంపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కపూర్య రాత్రి అక్కడే తన కుమారునితోపాటు పడుకొని ఉదయం లేచిచూసేసరికి తన కొడుకు కనిపించలేదు. దీనితో అంతటా గాలించిన కపూర్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానితులను విచారించడంతో పాటు అంతటా గాలించినా బాలుని ఆచూకీ లభించలేదు. రైలులో ప్రయాణిస్తున్న దూరప్రాంతానికి చెందినవారే బాలున్ని అపహరించుకుపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా మహారాష్ట్రకు చెందినవారే బాలున్ని అపహరించుకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన కుమారుని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న కపూర్య అవిటితనాన్ని సైతం లెక్కచేయకుండా తిరుగుతున్నాడు. బాధపడుతున్నాడు. బాలుని ఆచూకీ విషయమై ప్రయత్నిçస్తున్నామని స్థానిక ఎస్ఐ మహేందర్ పేర్కొన్నారు. -
వివాహిత అదృశ్యం
విశాఖపట్నం , సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఒక వివాహిత అదృశ్యమైన సంఘటనకు సంబంధించి ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముస్లిం తాటిచెట్లపాలెంకు చెందిన ఎ.భవాని(22)కి నగరానికి చెందిన జగదీష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భర్తతో గొడవ పడి ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిందనుకొని భర్త ఆమె సోదరుడికి ఫోన్ చేశాడు. అక్కడికి రాలేదని చెప్పడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఫోర్తుటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పానీపూరీ తినేందుకు వెళ్లి అదృశ్యం
కాచిగూడ: పానీపూరీ తినేందుకు బయటికి వెళ్లిన తల్లి, కూతురు అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ ఎస్.జానకీరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లకుంట డివిజన్ వెంకటేశ్వరనగర్ ప్రాంతానికి చెందిన త్రివేద్ భార్య నవనీత, కుమార్తె మోక్షతో కలిసి ఈ నెల 8న సాయంత్రం పానీపూరీ తినేందుకు బయటికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసినవారి ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో నవనీత తండ్రి సుధాకర్ మంగళవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధర్మ తెలిపారు. -
ఓ బాలిక, ఓ యువతి మిస్సింగ్!
సాక్షి, రంగారెడ్డి : శంషాబాద్‌లో ఓ బాలిక, యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కిరాణా షాపుకు వెళ్లిన పదహారేళ్ల మైనర్ బాలిక తిరిగి రాలేదు. ఈ ఘటన ఊటుపల్లిలో చోటుచేసుకోగా.. సిద్దంతిలో ఉంటే 23 ఏళ్ల యువతి కూడా అదృశ్యమైంది. బేకరీలో పనికోసమని వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆ యువతి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
హెచ్చరికలు పట్టించుకోక.. మృత్యువాత
పశ్చిమగోదావరి, పెరవలి: గోదావరి అందాలను తిలకించటానికి వచ్చిన సందర్శకులు అందులో స్నానం చేసేందుకు నీటిలోకి దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది విహారయాత్రకు వచ్చే సందర్శకులతో గోదావరి తీరం కళకళలాడుతూ ఉంటుంది. అదే సమయంలో గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదాలబారిన పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ∙2011లో కాకరపర్రు వద్దకు విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు స్నానం చేస్తూ నీటమునిగి ఏడుగురు మృతిచెందారు. 2017లో ముగ్గురు స్నానాలకు దిగి మృతి చెందారు. ప్రతి ఏడాది ఒకటో రెండో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయటమే కాకుండా కార్తీక మాసంలో పహరా కాస్తూ ఉంటారు. సందర్శకులు ప్రమాదం అని తెలిసినా దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 16న ముగ్గురు యువకులు మునిగి మృతిచెందారు. ఇక్కడ ఇసుక తిన్నెలు ఎక్కువగా ఉండటం, అవతల ఒడ్డుకు వెళ్లడానికి గోదావరి తక్కువుగా ఉండటంతో స్నానం చేయటానికి అనువుగా ఉంటుందని తొందరలో గోదావరిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ గోదావరి ఎంతో లోతు లేనట్టు కనిపిస్తున్నా సుడిగుండాల వల్ల ఏర్పడిన గోతుల్లో పడి మృత్యువాత పడుతున్నారు. నాలుగేళ్లుగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖలు సమన్వయంతో అధికారులు కార్తీక మాసం నెల రోజులు గోదావరి పొడవునా డ్యూటీలు నిర్వహించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. లంకకు పక్కనే ఇసుక తిన్నెలకు బదులు ఒండ్రునేలలు ఏర్పడి బురదగా ఉంటాయి. ఇవి ఊబిగా మారాయని, ఇవి చాలా ప్రమాదమని లంకరైతులు చెబుతున్నారు. మండలంలో కానూరు అగ్రహారం నుంచి కడింపాడు వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర గోదావరి విస్తరించి ఉన్నా పిక్నిక్లకు అనువైన ప్రదేశాలు తీపర్రు, కాకరపర్రు అని చెప్పవచ్చు. ఈప్రాంతంలో ఆహ్లాదపరిచే వాతావరణంతో పాటు పచ్చని పచ్చికబయళ్లు, గోదావరి నది దగ్గరగా ఉండటం ఆడుకోవడానికి ఇసుకతిప్పలు, నీడనివ్వడానికి కొబ్బరి, అరటి తోటలు ఉన్నాయి. చల్లని గాలితో బహిరంగ ప్రదేశాలతో ఉండే ఈప్రాంతానికి జనం తండోపతండాలుగా వచ్చి ఎంతో ఆనందంతో గడుపుతూ ఉంటారు. ఇంత ఆహ్లాదపరిచే ఈ సుందర ప్రదేశాలలో ప్రమాదాలు కూడా పొంచిఉన్నాయి. ఈఏడాది గోదావరికి 5 సార్లు వరదలు రావడంతో తీరం వెంబడి ఎక్కడికక్కడ ఒండ్రునేలలు ఏర్పడి ఇవి ఊబిగా తయారయ్యాయి. హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేసినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు పడకుండా జరగకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయితీ శాఖలు పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కన్నీటి గోదావరి
పెరవలి: ఎస్సై వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు స్నేహితులు విజ్జు సాయికిరణ్, ముత్యాల మణికంఠ, మిరియాల వంశీ, సైపురెడ్డి నవీన్ కుమార్ పెరవలి మండలం కాకరపర్రు వద్ద గోదావరి తీరంలో విహారానికి ఉదయం 11 గంటలకు వచ్చారు. వీరు ఉదయం నుంచి ఆడుతూపాడుతూ గడిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో గోదావరి నదిలో స్నానాలు చేయడానికి దిగారు. స్నానాలు చేయటానికి వచ్చారు. వీరిలో సైపురెడ్డి నవీన్ కుమార్ ఇసుక తెన్నెల్లోనే ఉండగా, మిగతా ముగ్గురు నదిలో దిగారు. లోతు లేదని కొద్దికొద్దిగా లోపలకు వెళ్లారు. ఒక్కసారిగా మునిగిపోయారు. దీనిని గమనించిన నవీన్‌కుమార్ స్నేహితులను రక్షించడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఎంతగా కేకలు వేసినా ఎవరూ రాకపోవడంతో ఏమీ చేయలేకపోయాడు. స్నేహితులు కళ్లముందే మునిగిపోవడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. పెరవలి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పాడు. బంధువుల రోధనలు: విషయం తెలిసిన బంధువులు ఘటనా స్థలానికి వచ్చి తమ పిల్లల జాడ తెలియకపోవటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటి దగ్గర కూడా చెప్పకుండా వచ్చేశారని ఇలాంటి సమాచారం వస్తుందని అనుకోలేదని అంటూ వాపోయారు. ముమ్మరంగా గాలింపు గోదావరిలో ముగ్గురు గల్లంతయ్యారని తెలిసిన వెంటనే పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు సంఘటనా స్థలానికి సిబ్బందితో సహా వచ్చారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. స్థానికులను ఆరా తీశారు. చేపలు పట్టే వలలతోనూ యువకుల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
యువతి అదృశ్యం
నల్లకుంట: ఓ యువతి అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహేశ్వరి(19) అనే విద్యార్థిని నల్లకుంటలోని ఆమె చిన్నమ్మ సంగీత ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. గత నెల 28న బయటికి వెళ్లిన మహేశ్వరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వారిని, పరిచయస్తులను విచారించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో సంగీత ఆదివారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సేవాశ్రమంలో.. సికింద్రాబాద్: జీరాలోని మానసిక వైకల్యం, వృద్ధుల సేవాశ్రమం నుంచి ఓ యువతి అదృశ్యమైన సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 2న జీరా వృద్ధుల సేవాశ్రమం నుంచి ఇరానీబీ(20) అనే యువతి కనిపించకుండా పోవడంతో సేవాశ్రమం నిర్వాహకులు ఆదివారం గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు గాంధీనగర్ పోలీసు స్టేషన్, లేదా 040–27853585 నంబర్‌కు సమాచా రం అందించాలని పోలీసులు తెలిపారు. -
అమెరికాకు టిక్కెట్లు బుక్.. అంతలోనే అదృశ్యం
చిక్కడప్లలి: అమెరికాకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న ఓ మహిళ ఆకస్మాత్తుగా అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాష్ అనే వ్యక్తి తన భార్య అమృత(29), ఇద్దరు పిల్లలతో గత ఆరేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. గత నవంబర్ 8న వారు సెలవుల నిమిత్తం నగరానికి వచ్చారు. ఈ ఏడాది జనవరి 1న ప్రకాష్ అమెరికా వెళ్లిపోగా, అమృత ఈ నెల 25న అమెరికా వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంది. ఈ నెల 23న బయటికి వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. అమృత తల్లి గంగ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏమయ్యారో..!
తూర్పుగోదావరి, కొత్తపల్లి: ముస్లింల ఆరాధ్య దైవంగా కొలిచే బషీర్ బీబీ(బంగారుపాప) ఉరుసు 64వ ఉత్సవాల్లో ఇద్దరు బాలురు అద్యశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ ఉత్సవాల్లో ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదని స్థానిక ముజావర్లు అంటున్నారు. ఉత్సవాలు ముగిసిన తరువాత ఆలయానికి వచ్చిన భక్తులు ఇంటికి బయలు దేరేసమయంలో వారిరువురు అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం పొన్నాడలో వేంచేసిన బషీర్‌బీబీ ఉరుసు ఉత్సవాలు ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగాయి. గుంటూరు జిల్లా పట్నారిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన షేక్ అజీజ్ తన కుటుంబ సభ్యులతో పాటు కుమారుడు షేక్ మహబూబ్ సుభానీ(4), ఇదే జిల్లా పొన్నూరు రోడ్డుకు చెందిన కరీముల్లా కుటుంబసభ్యులతో పాటు తన కుమారుడు సయ్యద్ అబ్దులా(5)తో కలిసి ఉరుసు ఉత్సవాలకు 16న పొన్నాడ చేరుకున్నాడు. రెండు రోజుల పాటు ఉత్సవాలు పాల్గొన్నారు. సోమవారం ఉదయం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకు ఆలయ సమీపంలో ఆడుకున్న షేక్ మహబూబ్ సుభానీ, సయ్యద్ అబ్దుల్లాలు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు విచారణ ప్రారంభించారు. కాకినాడ డీఎస్పీ రవివర్మ, పిఠాపురం ఇన్చార్జి సీఐ ఈశ్వరుడు, ఎస్సై కృష్ణమాచార్యులు పొన్నాడ చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఇద్దరు బాలురు కిడ్నాప్‌కు గురయ్యారా? లేక తప్పిపోయారా? అనే కోణాల్లో దర్యప్తు చేస్తున్నారు. ఆలయ సమీపంలో ప్రత్యేక బలగాలతో గాలింపు చేపట్టారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీపీ ఫుటేజీని సేకరించారు. పిఠాపురం, కా>కినాడ రైల్వే, బస్ స్టేషన్లలో ఆచూకీ కోసం సిబ్బందిని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ తెలిసిన వారు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సెల్ : 9440900752కి సమాచారం తెలియజేయాల్సిందిగా కోరారు. చిన్నారులవివరాలిలా.. షేక్ మహబూబ్ సుభానీ వయస్సు నాలుగేళ్లు. ఎత్తు మూడడుగులు, చామనఛాయ రంగు, జీన్ ఫ్యాంటు, పచ్చరంగు కలిగిన గళ్ల చొక్కా దుస్తులు ధరించాడు. సయ్యద్ అబ్దుల్లా వయస్సు ఐదు సంవత్సరాలు. ఎత్తు 3.5అడుగులు రంగు చామనఛాయ, తెలుపురంగు నిక్కరు, నలుపు రంగు చొక్కా దుస్తులు ధరించారు. తప్పిపోయిన ఇద్దరు పిల్లలు కూడా అన్నయ్య, చెల్లెలు కుమారులు. అబ్దుల్లా స్వగ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి వెళుతున్నాడు. వారు అదృశ్యం కావడంతో ఆలయం వద్ద కుటుంబ సభ్యులు విషాదానికి గురయ్యారు. -
పెళ్లి ఒత్తిడితోనే పారిపోయా..
చిత్తూరు , కలికిరి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం మాచిరెడ్డిగారిపల్లెకు చెందిన యువతి (17) అదృశ్యం కేసు సుఖాంతమైంది. కలికిరి మండలం తుమ్మలపేట లోని తన అమ్మవారి ఇంటికి వచ్చి ఈ నెల రెండో తేదీన ఆమె అదృశ్యమైన విషయం విదితమే. మూడు రోజుల పాటు వెతికిన ఆమె తల్లిదండ్రులు 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదృశ్యమైన విద్యార్థిని వైఎస్సార్ జిల్లా కడపలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులతో సహా మంగళవారం కలికిరి మండల మెజిస్ట్రేట్ కులశేఖర్ ముందు హాజరుపరిచారు. తల్లిదండ్రులు వివాహం చేసుకోవాలని తనపై ఒత్తిడి చేయడంతోనే ఇంటి నుంచి అదృశ్యమైనట్లు సదరు యువతి అధికారులకు వెల్లడించింది. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, విద్యార్థినిని చదివించాలని ఆదేశించారు. అనంతరం పోలీసుల సమక్షంలో విద్యార్థినిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
రిజిస్టర్లు, గొడౌన్ తాళాలతో సహా... పరారీ...!
ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. సెలవు పెట్టాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ ఆ ఉద్యోగి ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా...సెలవు పెట్టకుండా పది రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో చౌక దుకాణాలకు వెళ్లాల్సిన బియ్యం పంపిణీ నిలిచిపోయింది. తీరా చూస్తే ఇప్పుడు ఆ ఉద్యోగి ఆచూకీ కోసం ఉన్నతాధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. విజయనగరం , చీపురుపల్లి: పౌర సరఫరాల శాఖ నేతృత్వంలో నిర్వహిస్తోన్న ఎంఎల్ఎస్ పాయింట్ గొడౌన్ ఇన్చార్జి పరారీలో ఉన్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. సుమారు పది రోజులుగా గొడౌన్ ఇన్చార్జి హెచ్.రమణారావు ఆచూకీ లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారులు సైతం గుట్టు చప్పుడు కాకుండా వెతికించే పనిలో పడ్డారు. అయితే గొడౌన్ ఇన్చార్జి కనిపించకుండా పరారీలో ఉండడం ఒకెత్తయితే ఆయనతో పాటు గొడౌన్‌కు చెందిన అతి ముఖ్యమైన రిజిస్టర్లు, ప్రధాన గొడౌన్ తాళాలు కూడా ఆయన వద్దే ఉండడం చర్చనీయాంశమైంది. అది కూడా మార్చి నెలలో తెలుపు రంగు రేషన్ కార్డు లబ్ధిదారులకు సరఫరా చేయాల్సిన బియ్యం దాదాపు 70 వేల క్వింటాళ్లకు పైగా గొడౌన్లో నిల్వ ఉండగా ఆయన తాళాలతో సహా కనిపించకుండా వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి సెలవు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరవ్వడం మాత్రమే కాకుండా కనిపించకుండా వెళ్లిపోవడంపై సంబంధిత అధికార వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అయితే వ్యక్తిగత అవసరాలు ఉంటే సెలవుపై వెళ్తారని, లేకపోయినప్పటికీ తాళాలు, రిజిస్టర్లు కూడా అప్పగించకుండా కనిపించకుండా వెళ్లిపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 4 నుంచి పరారీలోనే.... చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం(పార్ట్), గుర్ల(పార్ట్)కు సంబంధించిన ఆయా పరిధిలో ఉండే చౌకదుకాణాలకు చీపురుపల్లిలో ఉండే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రతీ నెలా రేషన్ సరుకులు పంపిస్తారు. ఈ గొడౌన్‌కు ఇన్చార్జిగా ఉండే హెచ్.రమణారావు ఈ నెల 4 నుంచి కార్యాలయానికి వెళ్లడం లేదు. ఎక్కడున్నారో తెలియదు. జిల్లా అధికారుల ఫోన్లకు సైతం స్పందించడం లేదు. ప్రభుత్వ సెల్ నంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉండగా, వ్యక్తిగత సెల్ నంబరు కూడా ఏదో ఒక సమయంలో మాత్రమే పని చేస్తోందని తెలిసింది. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో సమావేశానికి కూడా ఆయన హాజరు కానట్టు సమాచారం. అయితే ఆయనతో పాటు రిజిస్టర్లు, గొడౌన్ తాళాలు కూడా ఉండడంతో విభిన్న చర్చలకు దారి తీస్తోంది. 70 వేల క్వింటాళ్లకు పైగా బియ్యం.... మార్చి నెలకు సంబంధించి చౌక దుకాణాలు ద్వారా పంపిణీ చేసేందుకు అవసరమైన బియ్యం ఫిబ్రవరి 3న స్థానిక గొడౌన్‌కు చేరుకుంది. అప్పటికి గొడౌన్ ఇన్చార్జి విధుల్లోనే ఉన్నారు. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 4 నుంచి ఆయన అందుబాటులో లేరు. అయితే గొడౌన్లులో దాదాపు 70 వేల క్వింటాళ్లకు పైగా బియ్యం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 18 నుంచి గొడౌన్ నుంచి చౌక దుకాణాలకు సరుకులు వెళ్లాల్సి ఉంది. ఇంతవరకు ఇన్చార్జి ఆచూకీ లభించలేదు. ఫిబ్రవరి 4 నుంచి దాదాపు పది రోజులుగా ఇన్చార్జి ఆచూకీ లేకపోయినప్పటికీ ఎలాంటి చర్యలు కానరావడం లేదు. జిల్లా అధికారులు రెండు రోజులుగా ఆయన ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. చర్యలకు సిద్ధం... చీపురుపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ గొడౌన్ ఇన్చార్జిపై చర్యలకు సిద్ధమవుతున్నాం. ముఖ్యమంత్రి పర్యటన పూర్తి కాగానే ఆయనపై చర్యలు ప్రారంభమవుతాయి. గొడౌన్ తాళాలు, రిజిస్టర్లు ఆయన వద్ద పెట్టుకోవడం చాలా పెద్ద నేరం. ఆయన ఎలాంటి సెలవు పెట్టలేదు. ఎన్నో ఫోన్ కాల్స్ చేసాం, ఇంటికి పంపించాం ఎవ్వరూ లేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగి కావడంతో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. చర్యలు తీసుకోమని జాయింట్ కలెక్టర్ గారికి కోరతాం. తాళాలు, రిజిస్టర్లు స్వాధీనం చేసుకుంటాం. రిజిస్టర్లు, తాళాలు వచ్చాక పరిశీలన చేసి ఎలాంటి తేడాలు ఉన్నా గట్టి చర్యలు ఉంటాయి.– షర్మిల,జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ -
ఇద్దరు వివాహితల అదృశ్యం
పెదవాల్తేరు(విశాఖ తూర్పు):ఎంవీపీ కాలనీ, వాంబేకాలనీలకు చెందిన ఇద్దరు వివాహితలు అదృశ్యమయ్యారు. ఈమేరకు ఆయా పోలీస్స్టేన్ల లో ఫిర్యాదులు అందాయి. ఎంవీపీ కాలనీ సెక్టార్ – 9 ఫిషర్‌మేన్‌కాలనీలో శ్రీకాంత్,జి.సుప్రియ (29) దంపతులు నివసిస్తున్నారు. శ్రీకాంత్ పోర్టులో ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. సుప్రియ సోమవారంసాయంత్రం ఆస్పత్రికి ఇం ట్లోంచి వెళ్లింది. అనంతరం ఇంటికి చేరకపోవడంతో బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో భర్త వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం ఎంవీపీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సీఐ ఎన్.సన్యాసినాయుడు పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాదరావుకేసుదర్యాప్తుచేస్తున్నారు. వాంబేకాలనీలో మరో వివాహిత... పీఎం పాలెం(భీమిలి): ఓ వివాహిత అదృశ్యంపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. స్థానిక సీఐ కె.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 5వ వార్డులోని వాంబేకాలనీలో బొడ్డు సతీష్, స్వాతి దంపతులు నివసిస్తున్నారు. ఈ నెల 4న స్వాతి(20) ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేకుండాపోయంది. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో స్వాతి అత్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
గడప దాటిస్తున్న భయం
రాష్ట్రంలో ఏటా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ తగాదాలు, చదువంటే అయిష్టత–భయం, అనారోగ్య సమస్యలు ఇల్లు వదలడానికి పురిగొలుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 8,410 మంది కనిపించకుండా పోగా,ఈ ఏడాది ఇప్పటివరకు 7,509 మంది కనిపించకుండాపోయారు. ఈ ఏడాది మిస్సింగ్ కేసుల్లో 3,382 మంది పిల్లలుండటం సమస్య తీవ్రతను సూచిస్తోంది. వీరిలోనూ 1,008 మంది పిల్లలు అపహరణకు గురికావడం అందరిలోనూ తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. మిస్సింగ్ కేసుల్లో రాజధాని నగరం విజయవాడ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. సాక్షి, అమరావతి: ఏదో ఒక భయమే వారిని ఇంటి గడప దాటేలా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీరి కుటుంబసభ్యుల్లో కొందరు మాత్రమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలినవారు పరువు పోతుందనే భయం, ఇతర కారణాలతో పోలీసుల దృష్టికి తేవడం లేదు. పోలీసు రికార్డుల ప్రకారం.. ఏటా దాదాపు ఎనిమిది వేల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రేమ వ్యవహారాలు, చదువంటే భయం, కుటుంబ వివాదాలు, అనారోగ్యమే కారణమంటున్నారు.. పోలీసులు. మిస్సింగ్ కేసుల్లో కొన్ని కిడ్నాప్ కేసులూ ఉంటున్నాయి. బలవంతపు వ్యభిచారానికి, బాల కార్మికులుగా, యాచకులుగా మార్చేందుకు నేరగాళ్లు పంజా విసురుతున్నారని చెబుతున్నారు. గతేడాది 8,410 మంది మిస్సింగ్ గతేడాది 8,410 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 7,509 మంది కనిపించకుండా పోయారు. ఈ ఏడాది కనిపించకుండా పోయినవారిలో 5,044 మంది తిరిగి ఇంటికి చేరారు. మిగిలినవారి ఆచూకీ లేదు. గతేడాది 1,025 మంది పిల్లలు కిడ్నాప్‌కు గురికాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1,008 మంది పిల్లలు కిడ్నాప్ అయ్యారు. కనిపించకుండాపోయినవారు, తిరిగొచ్చినవారిలో ఏకంగా 3,382 మంది పిల్లలు ఉండటం విస్మయపరుస్తోంది. పోలీసుల కార్యాచరణ ఇలా..: ఇంటి నుంచి వెళ్లిపోవడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలపై యువతీయువకులు, విద్యార్థులకు కాలేజీలు, సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కాలేజీలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, చిన్నారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉండే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు, అనుమానితులపై నిఘా పెంచడం వంటి చర్యలతో మిస్సింగ్ కేసులకు చెక్ పెట్టాలని భావిస్తోంది. -
పుట్టింటికని.. పత్తా లేకుండా పోయారు..
వైఎస్ఆర్ జిల్లా, ఖాజీపేట : అత్తింట్లో ఉన్న ఆ యువతి వద్దకు ఆమె తండ్రి వచ్చి పుట్టింటికి తీసుకెళ్లి తిరిగి తీసుకు వస్తానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. 45 రోజులు దాటినా వారి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందిన అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే యువకునికి ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన మౌనికతో 3 నెలల క్రితం వివాహమైంది. వారిద్దరు అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మౌనిక తండ్రి అనంత రెడ్డి ఆగస్టు 25న కొమ్మలూరుకు వచ్చి తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లి తిరిగి తీసుకువస్తానని చెప్పి పిలుచుకుని పోయాడు. మామను, భార్యను రామకృష్ణారెడ్డి ఖాజీపేట బస్టాండ్‌కు తీసుకు వచ్చి బస్సు ఎక్కించి పంపాడు. తరువాత వారు ప్రకాశం జిల్లాలోని వారి ఇంటికి వెళ్లలేదు. ఇటు కొమ్మలూరుకు రాలేదు. సుమారు 45 రోజులు దాటినా వారి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందిన రామకృష్ణారెడ్డి ఈనెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పెళ్లిళ్లు చేసుకోవడం పరారవడం..? మౌనిక తన భర్తతో గొడవ పడి వెళ్లిందా లేక ఇంటిలోని బంగారాన్ని తీసుకుని ఉడాయించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో గొడవ పడితే పుట్టింటికి వెళ్లాలి కానీ ఇలా ఎవ్వరికీ అంతుచిక్కకుండా వెళ్లడంపై పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఆమె తండ్రి అనంత రెడ్డి పాత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మౌనిక స్వగ్రామానికి వెళ్లి విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమె ఇలా గే కొందరిని వివాహం చేసుకుని ఆ తరువాత డబ్బు, బంగారంతో అత్తవారింటి నుంచి పరారైనట్లు అక్కడి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. తండ్రి, కూతురు కనిపించకపోయినా కనీసం మౌనిక కుటుంబ సభ్యులు ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం కూడా పలు అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తమది పేద కుటుంబం అని తాము ఎలాంటి కట్న కానుకలు ఇవ్వలేమని చెప్పడం.. ఆ తర్వాత పెళ్లి కుమారునితోనే అమ్మాయికి బంగారం పెట్టించడం.. అలా వచ్చిన బంగారంతో ఉడాయించడం జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరు వాడుతున్న ఫోన్ ఆధారంగా వారి ఆచూకి కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలు వారు ఎందుకు వెళ్లిపోయారు.. పుట్టింటికి ఎందుకు వెళ్లలేదు.. అందుకు కారణం ఏమిటి.. కేవలం బంగారం కోసమే ఇలా చేశారా.. భర్తతో వచ్చిన గొడవలే కారణమా అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తండ్రి, కూతురు ఆచూకీ దొరికితే గానీ మిస్టరీ వీడదని పోలీసులు చెబుతున్నారు. -
తప్పిపోతున్న వారందరూ ఏమైపోతున్నారు?!
అసలు ఏం జరుగుతోంది.. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి ఒకటీరెండు మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి.. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువతులు అదృశ్యమైపోతున్నారు.. వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు.. మనుషుల అక్రమ రవాణా జరుగుతోందా.. లేక తప్పిపోతున్నారా.. వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తున్నారా.. ఎక్కడికైనా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నారా.. ఇంతకు ఏం జరుగుతోంది.. అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు. మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న లోకేష్ కనిపించకుండా పోయాడు.. బోయపల్లికి చెందిన చరణ్ అనే విద్యార్థి బడికి వెళ్లి వస్తానని చెప్పి ఇంతవరకు తిరిగిరాలేదు. పట్టణంలోని బాల సదనం నుంచి శైలజ అనే చిన్నారి అదృశ్యమైంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఒక్క మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నెలకు 20 మంది అదృశ్యమయ్యారు. ఈ లెక్కన జిల్లాలో ని త్యం కనిపించకుండా పోతున్న వారి సంఖ్య ఎంత ఉంటుందో అంచన వేయడం కూడా కష్టసాధ్యం. ప్రతీస్టేషన్‌లో ఇలాంటి కేసులే.. జిల్లాలో మనుషుల అక్రమ రవాణ సాధారణమై పోయింది. ఒక్క రోజులో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకటి లేదా రెండు కేసులు ‘మా వాళ్లు అదృశ్యం అయ్యారని’ బాధితులు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరానికి ఒక్క మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో సగటున 720 మంది కనిపించకుండా పోయినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. వారిలో కొందరు మతిస్థిమితం లేనివారు, ప్రేమించిన వారితో వెళ్తున్నవారు, వివాహేతర సంబంధాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అదృశ్యమైన వారు ఉన్నారు. మరికొందరు ఇతర కారణాల వల్ల కన్పించకుండా పోతున్నారు. వారిలో చాలా మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. నిత్యం నిరీక్షణ అదృశ్యమైన వారి ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు, అయినవాళ్లు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. గత మూడేళ్లలో 18 సంవత్సరాలు పైబడినవారు 963మంది కనిపించకుండా పోయారు. వారిలో 259మంది ఆచూకీ లభ్యం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గల్ఫ్ అక్రమ రవాణా గురించి చెప్పనక్కరలేదు. అభం శుభం తెలియని అమాయకులకు గాలం వేస్తూ కొందరు నకిలీ ఏజెంట్లు వారివద్ద లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేసి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. మూడునాలుగేళ్లు కుటుంబాలకు దూరంగా ఉండి కష్టపడి నాలుగు రాళ్లు సంపాదిద్దామని వెళ్లిన అమాయకులు తాము మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నకిలీ ఏజెంట్ల చేతిలో జిల్లా వ్యాప్తంగా ఏడాదికి సుమారుగా రెండు వేల మంది నష్టపోతున్నారు. వలసల్లోనూ మోసాలు జిల్లాలోని మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్తున్న వారున్నారు. వీరిలో దినసరి కూలీలు చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదశ్యమవుతున్నారు. ముఖ్యంగా కోయిలకొండ, నవాబ్‌పేట, మద్దూర్ మండల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబాయి, కర్ణాటక, పూణే తదితర నగరాలకు వెళ్లి చాలా మంది తప్పిపోతున్నారు. దీంట్లో కొంత మంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి చూపిస్తామని తీసుకువెళ్లిన వారిలో చాలా వరకు వెనుక్కి తిరిగి రావడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కేసులు జిల్లాలోని 31 పోలీస్స్టేషన్లలో వందల సంఖ్యలో మిస్సింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటూ కుటుంబ సభ్యులు, అటు బంధువులు గాలిస్తుంటే మరోవైపు పోలీసులు వారి కోణంలో విచారణ చేస్తున్నారు. స్టేషన్లలో నమోదైన కేసుల్లో చాలా వరకు అదృశ్యమైన వారు కనిపించకపోవడంతో పెండింగ్‌లో ఉండటం విశేషం. అయితే చాలా వరకు పోలీసులు అదృశ్యం అవుతున్న కేసులపై ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం వల్ల వారి సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఫైల్‌ను గాలికి వదిలేస్తున్నారు. ఇవీ కారణాలు పాఠశాలలో, కళాశాలలో, హాస్టళ్లలో ఉపాధ్యాయులు, వార్డెన్లు మందలించారని, ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం తిడుతున్నారని.. పిల్లలు, విద్యార్థులు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. కొంత మంది వివాహితులు ఇష్టంలేని పెళ్లి చేశారని వెళ్లిపోతుండగా మరికొంత మహిళలు భర్తలు, అత్తమామలు వేధింపులకు తట్టుకోలేక ఇంటి గడప దాటుతున్నారు. ఇంకొందరు ఆరోగ్యం బాగాలేక, మానసిక పరిస్థితి సక్రమంగా ఎటూ వెళ్తున్నామో తెలియక వెళ్తున్నారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు మత్యువాతపడితే మరికొందరూ రోడ్లపై యాచకులుగా తయారవుతున్నారు. ఇవీ తీసుకోవాల్సిన చర్యలు పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. రైళ్లు, బస్సులను, ఇతర వాహనాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్ నెంబర్స్ గుర్తుండేలా నేర్పించాలి. పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతోపాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించేలా జాగ్రత్త పడాలి. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి జిల్లాలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం. కొన్ని స్టేషన్ల పరిధిలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు మారం చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకునే లక్షణాలను ముందే పసిగట్టి కౌన్సెలింగ్ ఇప్పించాలి. పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నాం. – రెమారాజేశ్వరి, ఎస్పీ,మహబూబ్‌నగర్ -
‘తల్లి’డిల్లుతున్నారు..
యాదగిరిగుట్ట(ఆలేరు) : ‘‘ముక్కు పచ్చలారని మా పిల్లలను కొందరు దుండగులు మా నుంచి దూరం చేశారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా దొరికిన పిల్లలపై వస్తున్న కథనాలను చూసి మా పిల్లల ఆచూకీ కోసం వచ్చాం. ఇటీవల వ్యభిచార ముఠా చెర నుంచి విముక్తి పొందిన పిల్లల్లో మా పిల్లలు ఉన్నారేమో చూడండి’ అని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఏసీపీ, సీఐలను ఆశ్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మతం చిన్న దిబ్బయ్య–విశ్రాంతమ్మ దంపతులు తన కూతురు చిన్ని మార్కపురం వద్ద హాస్టల్లో చదువుకుంటూ 2017 నుంచి కనిపించడం లేదని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అదేరోజు ఈసీఐఎల్‌కు చెందిన అనురాధ–కృష్ణ దంపతులు తమ కూతురు ఇందు 2014 లో కుషాయిగూడలో వినాయకచవితి పండగ నుంచి కనిపించకుండా పోయిందని కలిశారు. 15మంది చిన్నారుల్లో తమ కూతురు కల్పన ఉండొచ్చని బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగని నందం–భాగ్యమ్మ దంపతులు యాదగిరిగుట్ట టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను ఈనెల 4న∙కలిశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిన్నకోడూర్‌కు చెందిన ఆరేళ్ల ఎల్లమ్మ 27–7–2018 నుంచి కనిపించడం లేదని పాప తండ్రి పెద్ద నర్సింహులు ఈనెల 5వ తేదీన యాదగిరి గుట్ట పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలోని మచ్చనారాయణపురానికి చెందిన మూడేళ్ల చిన్నారి త్రివేణి అక్కడ రైల్వే స్టేడియం దగ్గర 22–8–2015న కూర్చోని రో డ్డుపైకి వెళ్లి వచ్చే సరికి కనిపించడం లేదని ఆమె తండ్రి రెడ్డి రమణ 5వ తేదీన వచ్చారు.విజయవాడకు చెందిన మల్లీశ్వరి–కుమారుల మూడో కుమార్తె గరికపాటి అనుష(4) 24–4–2017న ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని ఈనెల 5న పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. గోషమాల్లోని బేగంబజార్‌కు చెందిన ఆరేళ్ల కుమారి రజిత 2006 నుంచి కనిపించకుండా పోయిందని, అప్పటి నుంచి తన కూతురిని వెతుకుతున్నామని తండ్రి మల్లేష్ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు ఈనెల 6వ తేదీన వచ్చాడు. వరంగల్ జిల్లా కేంద్రంలోని చిత్రాసికుంటకు చెందిన అయిలమ్మ తమ కూతురు ప్రవళిక(26)తో పాటు మనవరాల్లు కూతుర్లు వైష్ణవి (4), విశాల(3)లు ఏడాది క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయారని వచ్చింది. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన మధులత–భగవాన్ దంపతులు ఐదేళ్ల కూతురు లిఖిత 5–8–2012లో తమ హోటల్లో పనికోసం వచ్చిన ఓ వ్యక్తి ఎత్తుపోయాడని 7వ తేదీన (మంగళవారం) తల్లి మధులత యాదగిరిగుట్ట సీఐ అశోక్‌కు ఆశ్రయించి తమ పిల్లల ఆచూకీ తెలిపాలని కోరారు. డీఎన్ఏ టెస్టులు చేయిస్తాం.. ఇటీవల వ్యభి చా ర గృహాల నిర్వాహకుల నుంచి విముక్తి పొందిన చిన్నారుల్లో ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ ప్రజ్వల హోమ్స్‌లో 11మంది, మరో నలుగురు స్త్రీ, శిశు సంక్షేమ సంరక్షణలో క్షేమంగా ఉన్నారు. పిల్లలు తప్పిపోయినప్పుడు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సమయంలో ఇచ్చిన ఫొటోలను కొంతమంది తల్లిదండ్రులు తీసుకువచ్చి చూపెడుతున్నారు. చిన్నారులకు, వారి తల్లిదండ్రులుగా వచ్చిన వారికి డీఎన్ఏ పరీక్షలు చేయించిన తర్వాత అప్పగిస్తాం. – అశోక్‌కుమార్, టౌన్ సీఐ, -
కక్ష
ప్రేమలు కనుమరుగౌతున్నాయి. అసూయలు కక్షలైపోతున్నాయి. కుతంత్రాలు కాటికి తీసుకెళ్తున్నాయి. కుటుంబాలు కల్లోలమౌతున్నాయి. ప్రేమలు పునఃపరిమళిస్తే కక్షలు కటకటాలదాకా పోవు. అతను ఇంటికి లేడు... ఊరికి లేడు... అదృశ్యమయ్యాడు. అతను భార్యకు లేడు.. పిల్లలకు లేడు... అదృశ్యమయ్యాడు. అతను ఉద్యోగానికి లేడు... జీతానికి లేడు... అదృశ్యమయ్యాడు. చావులో ఒక నిర్థారణ ఉంది. మనిషి పోయాడని ఏడ్వొచ్చు. అదృశ్యమైతే ఉన్నట్టా.. లేనట్టా... బతికినట్టా... చచ్చినట్టా.1998. గోదావరి ఖని.‘లెక్కల సారు వచ్చాడా?’ అడిగాడు రాజేష్.నైట్‌డ్యూటీకి రెడీ అవుతున్నాడతడు. బొగ్గుబావిలో అతని ఉద్యోగం. ఇప్పుడు వెళితే తెల్లారిన తర్వాత వస్తాడు.‘వస్తాడు లేండి. వస్తే టీ ఇస్తాను’ అంది భార్య రాణి.ఇద్దరికీ కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉంది. వాడిప్పుడు టెన్త్ క్లాస్. క్రికెట్లో పడి లెక్కల్లో బాగా వెనుకబడ్డాడు. ప్రీ పబ్లిక్ పరీక్షల్లో వాడి మార్కులు చూసి స్కూలు మాస్టారినే బతిమిలాడి ట్యూషన్ పెట్టించాడు రాజేష్. రోజూ ఇంటికొచ్చి లెక్కలు చెప్పాలని అందుకు గౌరవమైన డబ్బు ఇస్తానని ఒప్పంది.స్కూలు మాస్టారు గణేష్ సార్‌కి ఇది కొత్తేగాని బ్యాచిలర్‌గా రూముకు వెళ్లి చేసేదేముందని ఒప్పుకున్నాడు.ఇంటి ముందు టీవీఎస్ అలికిడి అయ్యింది.‘అదిగో వచ్చినట్టున్నాడు’ అంది రాణి. గణేష్ సార్ రాజేష్‌ను చూసి విష్ చేసి ట్యూషన్ చెప్పడానికి కేటాయించిన ముందు గదిలోకి నడిచాడు. అప్పటి వరకూ టీవీ చూస్తున్న కొడుకు కుమార్ కూడా లేచి పుస్తకాలు తీసుకొని గదిలోకి వెళ్లాడు.వాళ్లను సంతృప్తిగా చూసుకొని స్కూటర్ తీసుకొని డ్యూటీకి బయలుదేరాడు రాజేష్.గణేష్ సార్‌కు టీ ఇవ్వడానికి కిచెన్‌లోకి వెళ్లింది రాణి. రెండు నెలలు గడిచాయి. ఒకటో తేదీ వచ్చింది. జీతం తెచ్చి ఇంట్లో ఇవ్వాల్సింది ఇచ్చాక గణేష్ సార్‌కు ఇవ్వాల్సింది కూడా భార్యకు ఇచ్చి ఇచ్చేయమన్నాడు రాజేష్.‘అలాగే’ అంది రాణి.ఆ తర్వాత భర్త ఏం చేస్తాడో ఆమెకు తెలుసు. ఒక వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకుని రెండు రోజులు ఊరికి వెళ్లి వస్తాడు. ఊళ్లో తల్లి ఉంటుంది. తమ్ముడు, మరదలు ఉంటారు. వాళ్లనుపలకరించి అక్కడే ఓ రెండు రోజులు ఉండి డబ్బులిచ్చి వస్తాడు. ‘ఇవాళ వెళుతున్నారా?’ అడిగింది.‘వెళ్లాలిగా వచ్చేస్తాలే. వాణ్ణి టీవీ చూడనివ్వకు’ అని చెప్పి బయలుదేరాడు.భర్త వెళ్లిన దారిలోనే చూస్తూ నిలుచుంది రాణి.భర్త వీధి చివర కనుమరుగయ్యాడు. అయినా అలాగే నిలుచుంది. ఐదు నిమిషాల తర్వాత గణేష్ సార్ వస్తూ కనిపించాడు.సంతృప్తిగా కిచెన్‌లోకి నడిచింది. రెండు రోజులు గడిచాయి.రాజేశ్ ఇంటికి రాలేదు. నాలుగురోజులు గడిచినా రాలేదు. రాణి కంగారుపడింది. సెల్ఫోన్లు లేని రోజులవి. ఐదో రోజు తానే అత్తగారింటికి వెళ్లింది. ‘అదేంటి... ఒక్కరోజే ఉండి పనుందని వెళ్లాడే’ అంది అత్త.రాణి హతాశురాలయ్యింది. ఈలోపు మరిది రమేశ్ వచ్చాడు. జరిగింది తెలుసుకుని ‘కంగారు పడకు వదినా! అన్న కోసం వెదుకుదాం’ అన్నాడు.అంతా కలిసి గోదావరిఖనికి వచ్చారు. రాజేశ్ కనిపించడం లేదన్న వార్త వాడ మొత్తం పాకింది. ఇరుగూ పొరుగువారు, మిత్రులు వచ్చి పరామర్శించి వెళుతున్నారు. మరోవైపు పనిచేసే వెళ్లి వాకబు చేశాడు రమేశ్. అక్కడా సమాచారం ఏమి చెప్పలేదని వారు చెప్పారు. బావి కాడ కూడా ఎవరికీ ఏమీ తెలియదట’ అని చెప్పాడు ఇంటికొచ్చింది.రాణి, రాజేష్ తల్లి ఏడుపు అందుకున్నారు. ‘నా కొడుకు ఏమయ్యాడు దేవుడో’...అందరి సలహా మేరకు పోలీసు కంప్లయింట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. ఎంక్వయిరీ మొదలైంది. రాజేశ్ ఎలాంటివాడు? వైవాహిక జీవితం ఎలా ఉంది? శత్రువులెవరైనా ఉన్నారా? లేక కావాలని వెళ్లిపోయాడా? అన్న విషయాలపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. చాలామందిని ప్రశ్నించినా ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. ప్రభుత్వ ఉద్యోగం, చక్కటి భార్య, చదువుకుంటున్న కొడుకు, సమాజంలో గౌరవం అన్నీ బానే ఉన్నాయి. అలాంటపుడు రాజేశ్ ఏమైనట్లు? ఇంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏంటి? అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎస్.ఐ. రెండు రోజులు గడిచాయి.చిన్నకొడుకు రమేష్‌తో కలిసి స్టేషన్‌కి వచ్చింది రాజేష్ తల్లి.‘సార్. మా రాజేశ్ నుంచి ఉత్తరం వచ్చింది’ అంటూ పోస్ట్ కార్డ్ తెచ్చి ఎస్.ఐకి చూపించింది. వెనక్కి తిప్పి చూశాడు. కరీంనగర్ స్టాంప్ ఉంది. ‘నేను బానే ఉన్నాను.. నా గురించి వెతక వద్దు’ అని రాసి ఉంది అందులో.‘ఇది మీ అబ్బాయి రాతేనా’ అడిగాడు.‘మా అబ్బాయి రాతే’ అంది తల్లి.‘మరి ఇంకేటి?’ అన్నాడు.ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి.‘సార్... కొడుక్కి ఏదైనా అయితే తల్లి మనసు ఊరికే ఉండదు. కొట్టుకుంటుంది. ఈ ఉత్తరం చూసినా నా మనసు కుదుట పడలేదు. కొట్టుకుంటూనేఉంది. నా కొడుకు బతికి ఉన్నాడని నేననుకోవడం లేదు. చెప్పకుండా ఎటో వెళ్లాల్సిన అవసరం వాడికి లేదు. నాకు మా కోడలి మీదే అనుమానంగా ఉంది. వాడు మాయమయ్యాడన్న బాధ ఆమెలో కొంచెం కూడా లేదు. పైగా మా మనవడికి ట్యూషన్ చెప్పేందుకు వచ్చే టీచర్‌తో కలివిడిగా ఉంటోంది.’ అంది. వెంటనే గణేష్ సార్ మీద నిఘా పెట్టారు పోలీసులు. రాజేష్ కనపడకుండా పోయినప్పటి నుంచి అతను ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు.అతన్ని స్టేషన్‌కి తీసుకొచ్చారు పోలీసులు. చాలాసేపు విచారించారు. ‘తండ్రి కనిపించడం లేదని ఆ కుర్రాడు డిస్ట్రబ్ అయి ఉన్నాడు. ఈ గోలలో ట్యూషన్ ఎందుకని వెళ్లడం లేదు’ అన్నాడు గణేష్ సార్.‘రాణితో నీకు ఎలాంటి పరిచయం’ అడిగాడు ఎస్.ఐ.‘అయ్యో.ఆమె చాలా మంచిదండీ’ అన్నాడు గణేష్.అతను అబద్దం చెబుతున్నట్లుగా ఎస్.ఐకి అనిపించలేదు. ‘ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు’ అని హెచ్చరించి వదిలేసాడు. కథ మళ్లీ మొదటికొచ్చింది. గణేశ్ సార్ కాదు... రాణి పాత్ర లేదు. మరి, రాజేశ్ అదృశ్యం వెనక ఎవరి హస్తం ఉందని బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ఎస్.ఐకి టేబుల్ మీద అమాయకంగా ఉన్న పోస్ట్‌కార్డ్ వెక్కిరిసూ కనిపించింది. ఆ పోస్ట్‌కార్డ్ తీసుకొని రంగంలోకి దిగాడు ఎస్.ఐ. మొదట ఒక టీమ్‌ను కరీంనగర్ పంపాడు. కాని అక్కడ రాజేష్ ఉన్నట్టుగా ఎటువంటి ఆనవాలు దొరకలేదు. తర్వాత దానిని తీసుకెళ్లి్ల రాజేశ్ పని చేసే గనిలో, సొంతూళ్లో అతని మిత్రులకు చూపించాడు. ‘ఇది రాజేష్ రాతే’ అని అందరూ చెప్పారు.మరైతే అతడు ఎలా ఎందుకు అదృశ్యమయ్యాడనేది పెద్ద మిస్టరీగా ఉంది ఎస్.ఐకి.ఇక ఒక్క స్నేహితుడు మిగిలాడు.అతడికి లెటర్ చూపించాడు ఎస్.ఐ. అతడు ఆ అక్షరాలు చూసి ‘ఇవి రాజేష్వి కావు’ అన్నాడు.‘ఎలా చెప్పగలవు?’ అన్నాడు ఎస్.ఐ.ఒక అక్షరం చూపిస్తూ ‘ఇది రాజేష్ ఇలా రాయడు. కాని ఈ లెటర్ రాసింది మాత్రం ఈ ఊరి వాళ్లే’ అన్నాడు. రెండు రోజులు పోలీసులు ఎవరి కదలికల మీద నిఘా పెట్టాలో వారి మీద పెట్టారు. మూడో రోజు తెచ్చి లోపల వేశారు. అతడే రమేష్. రాజేష్ తమ్ముడు.‘చెప్పు ఈ లెటర్ ఎందుకు రాసావు?’ ప్రశ్నించాడు ఎస్.ఐ.‘ఇది మా అన్న రాసిందే, కావాలంటే కింద సంతకం ఉంటుంది చూసుకోండి’ అన్నాడు రమేష్.‘అది నువ్వే రాసావు. అందులో ‘క’ అనే అక్షరం కాస్త డిఫరెంటుగా ఉంది.‘మీ ఊరు మొత్తంలో అలా రాసేది నువ్వొక్కడివే. అది నీ తప్పు కాదు మీకు చదువు నేర్పిన తెలుగు మాస్టారుది. ఆయన కర్ణాటక వ్యక్తి. అతని వద్ద అక్షరాలు దిద్దిన నువ్వు ‘క’ అక్షరాన్ని కన్నడలో రాసినట్లుగా రాస్తావు. కాలక్రమంలో నీ మిత్రులందరూ ఆ అలవాటు మార్చుకున్నా మధ్యలోనే చదువు మానేసిన నువ్వుమాత్రం ఇప్పటికీ అలాగే రాస్తున్నావు’ అన్నాడు ఎస్.ఐ.రమేశ్ ముఖంలో రంగులు మారాయి.అదే అదనుగా లాగిపెట్టి చెంపకు ఒక్కటి అంటించాడు ఎస్.ఐ.ట్రీట్మెంట్ పనిచేసింది.. నిజం కక్కేసాడు రమేశ్.‘ఆ లెటర్ రాసింది నేనే.. మా అన్నను చంపింది కూడా నేనే’...విషయాలు ఒక్కొక్కటి చెబుతున్నాడు.. ‘రాజేశ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడేది కాదు. చదువులో వాడెప్పుడూ ఫస్టే. నాకు చదువు రాదని అంతా గేలి చేసేవారు. ఇంట్లో వాళ్లు కూడా వాడే గ్రేట్ అంటూ పొగిడేవారు. పెద్దయ్యాక వాడు సింగరేణిలో ఉద్యోగం సంపాదించాడు. నాకు చదువు అబ్బకపోవడంతో ఊళ్లోనే పొలం పనులు చూసుకునేవాడిని. మా అన్న ఊరికి వచ్చిన ప్రతీసారి ఇంకెప్పుడు బాగుపడతావంటూ తిట్టేవాడు. పైగా వాడు ఊళ్లోకి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు అంతా అతని చుట్టే మూగేవారు. ఇవన్నీ మా అన్న మీద ఈర్ష్య పెరిగేలా చేసాయి. అన్నకు సమాజం ఇస్తున్న గౌరవాన్ని చూసి ఓర్వలేక పోయాను. చంపాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు మా అన్న తిరిగి ఊరు నుంచి బయల్దేరినప్పుడు బస్టాపు వద్ద దిగబెడతానని నమ్మబలికాను. మాటలు చెబుతూ గోదావరిఖని దాకా తీసుకెళ్లాను. దారిలో ఓ పాడుపడిన బావి ఉంది. అక్కడ ఎవరూ ఉండరు. అక్కడే అన్నను కత్తితోపొడిచి చంపి, శవానికి రాళ్లుకట్టి బావిలో పడేసాను. నాపై అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డాను. వదిన మా ఇంటికి వచ్చి అన్న గురించి చెప్పాక నింద వదిన– ట్యూషన్ మాస్టారుపై పడేలా అమ్మకు చాడీలు చెప్పాను. అయినా నేరం బయటపడుతుందని భయమేసి పక్కదోవ పట్టించడానికి కార్డు రాసి కరీంనగర్లో పోస్ట్ చేసి వచ్చాను. మా అన్న రైటింగ్ నా రైటింగ్ ఒక్కలాగే ఉంటుంది. కాని క అక్షరం నన్ను పట్టించింది’ అంటూ తల ఒంచుకున్నాడు.మరునాడు ఆ పాడుబడ్డ బావి నుంచి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని బయటికి తీసారు పోలీసులు.కోర్టు రమేష్‌కు యావజ్జీవం వేసింది. సొంత అన్న మీద ద్వేషం పెంచుకుని చేసిన పిచ్చి పని వల్ల ఆ తల్లికి ఇద్దరు కొడుకులు దూరమయ్యారు. రాణికి ఇది కోలుకోని దెబ్బ అయినా భర్త స్థానంలో ఉద్యోగం రావడంతో కొడుకును భర్త ఆశయాలకు తగినట్టుగా తీర్చిదిద్ద గలిగింది. కొడుకును చూసుకుంటూ జీవితం గడుపుతోంది. – అనిల్‌కుమార్ భాషబోయిన -
వారంతా ప్రేమికులు కాదు..
సాక్షి, ముంబై : అదృశ్యమైన మైనర్ బాలికలంతా సినిమాల్లో చూపినట్టు ప్రేమికులతో పారిపోయారని పోలీసులు ఊహించుకోవడం విరమించాలని బాంబే హైకోర్టు పేర్కొంది. గత ఏడాది థానే నుంచి అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీని పసిగట్టడంలో విఫలమైన మహారాష్ట్ర పోలీసులపై హైకోర్టు విరుచుకుపడింది. మైనర్ బాలికల అదృశ్యం కేసుల్లో పోలీసుల పనితీరు, వ్యవహార శైలిని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ భారతి డాంగ్రేలతో కూడిన బెంచ్ తప్పుపట్టింది. ఆయా కేసుల్లో బాలిక తల్లితండ్రులు ఎంతగా మధనపడుతుంటారో మానవతా దృక్పథంతో అర్ధం చేసుకోవాలని బాధిత బాలిక తండ్రి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు పేర్కొంది. పిటిషనర్ కుమార్తె ఆచూకీని త్వరితగతిన పసిగట్టాలని ఆదేశించింది. బాలిక తన స్కూల్లో సీనియర్ విద్యార్థితో కలిసి వెళ్లిందని, వారు తరచూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారని, బాలుడి తల్లితండ్రుల స్టేట్మెంట్ను రికార్డు చేశామని అదనపు పబ్లిక్ ప్రాసక్యూటర్ నివేదిక సమర్పించారు. దీనిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనర్లయిన వారిద్దరూ వేరొకరి సహకారం లేకుండా ఇంతకాలం ఎలా కలిసి ఉన్నారని, వారు నివసించేందుకు, తరచూ పలు ప్రాంతాలు వెళ్లేందుకు వారికి డబ్బులు ఎలా సమకూరాయి..? బంధువులు, బాలుడి తల్లితండ్రుల సహకారం లేకుండా ఇది జరిగే పనేనా అంటూ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. బాలుడి తల్లితండ్రులు అబద్ధం చెబుతున్నారని ఎందుకు అనుమానించలేదని ప్రశ్నించింది. కేసుపై తాజా పురోగతిని వివరిస్తూ రెండు వారాల్లోగా మరో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. -
అనుమానం
‘‘బై రియో! నేను వెళ్తున్నా. మళ్లీ నేనొచ్చే వరకు ఏడ్వద్దు. వచ్చేప్పుడు నీకిష్టమైన స్ట్రాబెర్రీ చాక్లెట్లు తీసుకొస్తాను,’’ అని ప్రేమగా కూతుర్ని ముద్దు పెట్టుకుంది సుచిత్ర. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌గా పని చేస్తోంది. తాను వెళ్లే సమయానికి కూతుర్ని స్కూల్లో దింపి, వచ్చేటప్పుడు తీసుకొస్తుంది. రియో స్మైల్ కిడ్స్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. అమ్మకు బై చెప్పిన రియో అక్కడే ఉన్న వ్యాన్‌డ్రైవర్ సంతోష్‌ని చూసి ఒక్కసారిగా భయపడింది. సంతోష్ రియోను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినా.. వదిలించుకొని క్లాస్ రూంలోకి పరుగుపెట్టింది. సంతోష్ పెరిగిన జుట్టు, గడ్డంతో ఉండటం వల్లనేమో పిల్లలు అతని దగ్గరకు వెళ్లడానికి భయపడతారు.కిడ్స్ స్కూల్ కావడంతో దాదాపుగా టీచర్లంతా మహిళలే. ప్రిన్సిపల్ ఉమాదేవి వీరందరినీ కోఆర్డినేట్ చేస్తుంది. స్కూల్ వ్యవ హారాలు మొత్తం ఉమాదేవి భర్త కరస్పాండెంట్ సురేందర్ చూసుకుంటాడు. సురేందర్ పిల్లల తల్లిదండ్రులందరికీ తెలుసు. పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారని పిల్లల తల్లి దండ్రులకు ఆ స్కూల్ అంటే మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ప్రారంభంలో ఇరవై మంది ఉన్న పిల్లల సంఖ్య 150కి చేరింది. ఒకసారి పిల్లలు ఏడుస్తున్నారని టీచర్ చేయి చేసుకోగా, ఆమెను ఉద్యోగం నుంచే తొలగించాడు. అది పిల్లల తల్లిదండ్రుల ముందే జరగడంతో స్కూల్‌పై నమ్మకం ఇంకా పెరిగింది. సాయంత్రం రియోను తీసుకెళ్లడానికి సుచిత్ర రానే వచ్చింది. ఫీజు విషయమై ప్రిన్సిపల్ ఉమాదేవితో ఏదో మాట్లాడుతుండగా రియో తల్లి చుట్టూ తిరుగుతూ చీర కొంగుతో ఆడుకుంటోంది. అమ్మ తీసుకెళ్లడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్న రియో డ్రైవర్ సంతోష్‌ను చూడగానే తెలియని భయానికి లోనైంది. తల్లిని గట్టిగా పట్టుకుంది. రియో ఫీజు గురించి మాట్లాడి తన కారులో రియోను తీసుకెళ్లింది సుచిత్ర. ‘‘రియో! హోమ్‌వర్క్ చేస్కో. టీవీ చూడటం ఆపేయ్’’ అని వంటింట్లో నుంచి గద్దించింది సుచిత్ర. రియో పోగో చానల్లో కార్టూన్లను చూస్తూ అల్లరి చేస్తోంది. ‘‘డాడీ వస్తారు. వచ్చే వరకు నువ్వు ఇలాగే టీవీ చూస్తుండు. నిన్ను కొడతాడు’’ అంది బెదిరింపుగా. రియో ఆ విషయాన్ని వినీ విననట్లుగా, భయం లేనట్టుగా టీవీకి అంకితమైంది. రియో అల్లరిని ఆపడానికి సుచిత్ర డ్రైవర్ సంతోష్‌కి చెప్తా తీసుకెళ్తాడు అంది. అంతే ఆ ముక్క విన్నదో లేదో రియో ‘మమ్మీ!’ అంటూ భయంగా పరుగెత్తుకొచ్చింది. ఎన్నడూ భయపడని విధంగా విచిత్రంగా రియో భయ పడటాన్ని సుచిత్ర గమనించింది. ‘‘లేదు.. లేదు.. ఊరికే అన్న. ఏం లేదు’’ అని ఊరడించింది. తెల్లారాక రియో సాధారణంగా కనిపించడం చూసి సుచిత్ర మనసు కుదుట పడింది. ‘డాడీ ఈ బాల్ పట్టుకో’ అంటూ డాడీతో ఆడుకుంటూ సాధారణంగా ఉంది రియో. ‘‘స్కూల్ టైమౌతోంది. త్వరగా రా.. రెడీ అవ్వాలి’’ అని సుచిత్ర పిలిచింది. కొద్దిసేపటి తర్వాత సుచిత్ర రియోను రెడీ చేసి తానూ రెడీ అయింది. ఇద్దరూ కార్లో బయల్దేరారు. దారిలో సిగ్నల్ దగ్గర తన స్కూల్ బస్సు పక్కనే వాళ్ల కారు ఆగడంతో అటువైపు తనను పిలుస్తున్న ఫ్రెండ్స్ కనిపించారు. వారికి హాయ్ అని చేతులూపింది. అదే సందర్భంలో వ్యాన్ డ్రైవర్ సంతోష్‌ను చూసి చటుక్కున మొహాన్ని తిప్పేసింది రియో.సుచిత్ర రియోను స్కూల్లో దింపి ఆస్పత్రికి వెళ్లింది. ఫస్ట్ అవర్ క్లాస్ అయిపోయింది. ఇంటర్వల్ పీరియడ్‌లో రియో తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటోంది. ఇంతలో ఒక టీచర్ వారి దగ్గరకొచ్చి ‘’చిల్డ్రన్ గోటూ యువర్ క్లాస్ రూమ్స్’’ అని అంది. పిల్లలంతా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడు ఫ్లోర్లున్న బిల్డింగ్‌లో తమ తమ క్లాస్ రూమ్స్‌లోకి వెళ్తున్నారు. రియో క్లాస్ రూమ్ రెండో ఫ్లోర్లో ఉంది. మూడో ఫ్లోర్లో మొత్తం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. రియో తన క్లాస్‌రూమ్‌కి వెళ్తూ.. తన క్లాస్మేట్ చిన్నూ ఏడుస్తుండగా, ఆయా తనని బలవంతంగా మూడో ఫ్లోర్‌కి తీసుకెళ్లడం చూసింది. ‘‘ఏయ్ చిన్నూ..! ఎక్కడికి?’’ అంటూ ఆమె వెనుకే మూడో ఫ్లోర్‌కి వెళ్లింది. రియో రావడం గమనించని ఆయా చిన్నూని బరబరా గుంజుకెళ్లి హాల్లో ఉన్న పీఈటీ టీచర్ ముందు ఉంచింది. ‘‘ఈ పిల్ల అస్సలు కుదురుగా ఉండట్లేదు. పైగా బాగా ఏడుస్తోంది’’ అని ఆయా ఆ టీచర్‌తో అంది. ‘‘అవునా! ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావ్’’ అని పాలుగారే ఆ చెంపలపై చెళ్లున చరిచింది. చిన్నూ ఇంకా ఏడుపు ఎక్కువ చేసింది. దాంతో టీచర్ కోపం ఇంకా పెరిగింది. చిన్నూని పట్టుకోమని ఆయాతో చెప్పి, గదిలోకెళ్లి ఏదో ఇంజెక్షన్ తెచ్చింది. చేతులను గట్టిగా పట్టుకోమని, నోరు మూయమని ఆయాతో చెప్పి చిన్నూకి ఆ ఇంజెక్షన్ చేసింది. అంతే, అప్పటి వరకూ బిగ్గరగా ఏడ్చిన చిన్నూ ఒక్కసారిగా కూలబడిపోయింది. చిన్నూ రెక్కల్ని పట్టుకుని ఈడ్చుకుంటూ అదే ఫ్లోర్‌లోని ఒక గదిలోకి తీసుకెళ్లింది టీచర్. ఈ తతంగాన్నంతా దూరం నుంచి బిక్కుబిక్కుమంటూ గమనించిన రియో మెల్లిగా మెట్లు దిగి రెండో ఫ్లోర్‌లోని తన క్లాస్‌రూమ్‌కి వెళ్లింది. ఉమాదేవి రియో ఇదంతా చూడటాన్ని గమనించింది.సాయంత్రం సుచిత్ర వచ్చింది. స్కూల్ వదిలాక పిల్లలంతా తాము ఎక్కాల్సిన వ్యాను దగ్గరకు వెళ్తున్నారు. మిగతా పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్నారు. రియో కోసం సుచిత్ర ఆత్రంగా చూస్తోంది. చివరగా రియో దిగాలుగా వస్తుండటాన్ని సుచిత్ర చూసింది. ప్రిన్సిపల్ ఉమాదేవి వేరే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూనే, రియో సుచిత్రకు ఏం చెబుతుందోనని టెన్షన్ పడుతోంది. సుచిత్ర దగ్గరకు వచ్చిన రియో ‘‘మమ్మీ! మరేమో చిన్నూ.. చిన్నూ...’’ అని ఏదో చెప్పబోయేసరికి ఉమాదేవి సుచిత్ర దగ్గరికొచ్చి నవంబర్ పద్నాలుగున జరగబోయే చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడుతూ సుచిత్ర దృష్టిని రియో చెప్పే మాటలపైకి వెళ్లకుండా అడ్డుపడింది. కొద్దిసేపు మాట్లాడాక సుచిత్ర రియోతో ఇంటికి బయల్దేరింది. ఇంటికెళ్లాక రియో విషయాన్ని భర్త సురేందర్‌కి చెప్పింది ఉమాదేవి. ‘‘ఏవో మాయమాటలు చెప్పి ఆ పిల్లని మరిపించలేకపోయావా? ఈ విషయం సుచిత్రకు తెలిస్తే ఏమైనా ఉందా? పదేళ్లుగా కష్టపడుతున్న దానికి ఫలితం ఉండదు. స్కూల్ రెప్యుటేషన్ పోతుంది. అందరికీ తెలిస్తే కొత్తగా పిల్లలను ఎవరూ చేర్పించరు’’ అంటూ ఉమాదేవితో సురేందర్ తన మనసులోని అనుమానాల్ని బయటికి తీసుకొస్తున్నాడు. ‘‘అలా ఏం జరుగదు లేండి. రియో చిన్నపిల్ల. వెంటనే మర్చిపోతుంది’’ అని భర్తతో అంది ఉమాదేవి. ఈ మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఆలోచనల్లో మునిగిపోయాడు సురేందర్.ఇంటికెళ్లిన రియో.. చిన్నూ విషయం మర్చిపోయి ఆడుకుంటోంది. నానమ్మ పిలి చినట్టుగా వినిపిస్తే రియో వెళ్లింది. అప్పుడే భోజనం చేసిన నానమ్మ రియోతో టీవీ పక్కనున్ను ట్యాబ్లెట్స్ను తీసుకురమ్మంది. టీవీ పక్కన ట్యాబ్లెట్ల కవర్లో ఇంజెక్షన్లు చూసింది. అంతే, పరుగున వంట గదిలో ఉన్న తల్లి దగ్గరకు వచ్చి.. ‘‘మమ్మీ.. చిన్నూకి స్కూల్లో ఇంజెక్షన్ చేశారు’’ అని చెప్పింది. ‘‘అవునా ఎక్కడ.. ఇక్కడా.. ఇక్కడా’’ అని చెక్కిలిగింతలు పెట్టి, ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు సుచిత్ర. ‘‘త్వరగా హ్యాండ్‌వాష్ చేసుకుని రా.. డిన్నర్ చేద్దాం’’ అని పిలిచింది. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకున్నారు. నిద్రలో రియో ‘మమ్మీ..! డ్రైవర్.. డ్రైవర్..’ అంటూ భయంగా కేకలు వేసింది. దిగ్గున లేచిన సుచిత్ర ‘‘రియో.. రియో.. ఏమైంది’’ అంటూ.. తన చేతులతో రియోని నెమ్మదిగా తడుతూ పడుకోబెట్టింది.తెల్లారి ఉదయం రియోని స్కూల్లో దింపడానికి సుచిత్ర వెళ్లింది. వెళ్లేసరికి ఎవరో పేరెంట్స్ డ్రైవర్ సతీష్‌ని కొడుతుండటాన్ని చూసింది. అక్కడే సురేందర్, ఉమాదేవి.. కొందరు టీచర్లు ఉన్నారు. వేరే వ్యాన్‌లో వెళ్లే పాపను ఇతని వ్యాన్‌లో తీసుకెళ్లాడని, చీకటి పడ్డాక పాప తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టారని, ఇప్పుడొచ్చి సతీష్‌ని కొడుతూ సురేందర్‌ని వివరణ అడుగుతున్నారని అక్కడి వారిలో ఒకరు సుచిత్రకు చెప్పారు. రియోని దింపి సుచిత్ర ఆస్పత్రికి వెళ్లింది. సురేందర్ ఆ పాప పేరెంట్స్‌తో పొరపాటు జరిగిందని చెప్పి తక్షణమే సతీష్‌ని ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇదంతా తనకు పట్టనట్లు రియో క్లాస్‌కి వెళ్లింది. బ్రేక్ సమయంలో పిల్లలంతా ఆడుకుంటుండగా రియో దిగాలుగా కూర్చుంది. ఈ విషయాన్ని టీచర్ అశ్విని గమనించింది. రియోకి కూడా అశ్విని టీచర్‌తో చనువు ఉంది. కాబట్టి టీచర్ అడక్కుండానే చిన్నూకి ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పింది. ‘‘ఇంజెక్షన్ ఏంటి రియో?’’ అని నవ్వింది ఆ టీచర్. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్సిపల్ ఉమాదేవి భర్త సురేందర్‌కి చెప్పింది. ఆ రోజు రియోని తీసుకెళ్లడానికి సుచిత్ర లేట్‌గా వచ్చింది. పిల్లలంతా వెళ్లిపోయారు. రియో ఎక్కడని అక్కడున్న టీచర్ని అడిగింది. ప్రిన్సిపాల్‌ని కలవమని చెప్పగా కలిసింది. ప్రిన్సిపాల్ ఉమాదేవి ‘‘మీరొచ్చి తీసుకెళ్లా రనుకున్నాం. మీరు తీసుకెళ్లలేదా?’’ అని ఎదురు ప్రశ్నించింది.‘‘ఏం మాట్లాడుతున్నారు? నేనొచ్చిందే ఇప్పుడు’’ అంటూ రియో ఎక్కడని నిలదీసింది. దాంతో భయపడ్డ ఉమాదేవి, భర్త సురేందర్‌కి ఫోన్ చేయగా స్కూల్‌కి వచ్చాడు. ‘‘డ్రైవర్ సతీష్ వచ్చాడా?’’ అని అడిగాడు. ‘‘ఆ వచ్చాడు సర్. మిమ్మల్ని కలవాలని చెప్పి ఇంతకు ముందే వెళ్లాడు’’ అని మరో డ్రైవర్ చెప్పాడు. ‘‘రియోను సతీష్ తీసుకెళ్లాడా?’’ అనుమానంగా అన్నాడు సురేందర్. అనుమానం వచ్చి సుచిత్ర, ప్రిన్సిపాల్‌తో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చీకటి పడటంతో రేపు ఉదయం స్కూల్‌కి వస్తామని చెప్పారు.రోజూ రియో ఆటలతో సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా మూగబోయినట్లైంది. మర్నాడు ఉదయమే స్కూల్‌ని పరిశీ లించడానకి వచ్చాడు ఎస్సై రమణ. రియో స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, టీచర్ల గురించి ఆరా తీశాడు. అంతా డ్రైవర్ సతీష్ ప్రవర్తన గురించి చెప్పారు. సురేందర్ కూడా సతీష్‌ను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో ఎస్సైకి వివరించాడు. ఈ క్రమంలో పిల్లలు బ్రేక్ టైమ్‌లో బయటకొచ్చారు. కొందరు అక్కడ పడి ఉన్న ఇంజెక్షన్ నీడిల్‌తో ఆడుకోవడం ఎస్సై గమనించాడు. స్కూల్ మొత్తాన్నీ చూడాలని చెప్పాడు ఎస్సై. మూడో ఫ్లోర్లో 304 గది ఏంటి తాళం వేసి ఉందని అడిగాడు. ‘‘సార్! లోపల సీలింగ్ చేయలేదు. అందుకే దాన్ని స్టోర్‌రూమ్‌గా వాడుతున్నాం’’ సమాధానమిచ్చాడు సురేందర్. సుచిత్రను సాయంత్రం స్టేషన్‌కి రావాలని ఎస్సై కబురు పంపాడు. సాయంత్రం సుచిత్ర, భర్త రఘుతో కలిసి స్టేషన్‌కి వెళ్లింది. గంటన్నరసేపు వారితో విడివిడిగా మాట్లాడిన ఎస్సై... కేసు నమోదు చేశామని, ఎంక్వైరీ జరుగుతోందని, ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే చెబుతామని వాళ్లను పంపించేశాడు.మర్నాడు ఉదయం రఘు ఇంటికెళ్లాడు ఎస్సై రమణ. కాలింగ్ బెల్ కొట్టేసరికి రఘు వచ్చి డోర్ తీశాడు. మీరొకసారి స్టేషన్‌కు రావాలన్నాడు. పాప విషయం ఏమైందని రఘు అడిగేసరికి స్టేషన్లో చెబుతానని సుచిత్ర, రఘులను తీసుకెళ్లాడు.సుచిత్రను ఇంటరాగేషన్ రూమ్‌లోకి తీసుకెళ్లి ‘‘నేనడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో అనే సమాధానమే చెప్పాలి’’ అని బెదిరించాడు. దాంతో కంగుతిన్న సుచిత్ర అలాగే ఉండిపోయింది.‘‘రియో మీకు పుట్టిన బిడ్డ కాదు. ఎస్ ఆర్ నో’’ అని అడగ్గా.. ‘‘నో’’ అని చెప్పింది సుచిత్ర. ‘‘రఘుకు నువ్వు రెండో భార్యవి. అవునా?’’ అనే ప్రశ్నకు ‘‘అవును’’ అని భయంగా చెప్పింది. ‘‘ఇప్పుడు చెప్పు రియోను ఎందుకు చంపావు?’’ అని అడగ్గా బిత్తరపోయిన సుచిత్ర, ‘‘నేను చంపడం ఏంటీ?’’ అని ఎదురు ప్రశ్నించింది. పోలీసులు తమ స్టైల్లో అడిగేసరికి నిజాన్ని ఒప్పుకుంది. చిన్న పాపను చంపడానికి మనసెలా వచ్చిందని ఎస్సై కోపంగా అడిగేసరికి... ‘‘రఘు మొదటి భార్య అర్చన రోడ్డు ప్రమాదంలో మరణించగా.. రఘు ఇంట్లో వాళ్ల ఒత్తిడితో ఏడాది క్రితం నన్ను పెళ్లి చేసుకున్నాడు. అర్చన కూతురు రియోనే తన సర్వస్వం అన్నాడు. ఇంకా పిల్లలొద్దు అన్నాడు. దాంతో నా ప్రాణం ఆగినంత పనైంది. రియో ఉండబట్టేగా రఘు ఇలా అన్నాడని తట్టుకో లేకపోయాను. అందుకే రియోని కిడ్నాప్ చేయించి హత్య చేయించాను. చిన్నూకి ఇంజెక్షన్ చేశారని రియో చెప్పినప్పుడు కావాలనే పట్టించుకోలేదు. హత్య చేయడానికి ఇదే సరైన సమయమని అనుకున్నాను. ఇప్పుడు అనుమానం మొత్తం కరెస్పాండెంట్ సురేందర్ పైకి వెళ్తుందని పథకం చేసి అమలు చేశాను’’ అంది. ‘‘రియో మిస్సింగ్ తర్వాత అందర్నీ విచారించాం. డ్రైవర్ సతీష్ తల్లి అనారోగ్యంగా ఉండటంతో అలా డిప్రెషన్లో ఉన్నాడని తేలింది. అలాగే స్కూల్ కరస్పాండెంట్ సురేందర్‌ని కూడా ఇంటరాగేట్ చేశాం. చిన్నపిల్లలపై డ్రగ్స్ ప్రయోగిస్తున్నాడన్న ఆధారాలు దొరకడంతో కరెస్పాండెంట్ సురేందర్ దంపతులను అదుపులోకి తీసుకున్నాం. అయితే రియో విషయంలో వాళ్లకేమీ సంబంధం లేదని తేలింది. దాంతో వాళ్లందరి మీదా అనుమానాలు తీరిపోయాయి. దాంతో మీ ఇద్దరినీ విడివిడిగా ఇంటరాగేట్ చేశాం. నువ్వు రియోకి కన్నతల్లివి కాదని తెలియడంతో, అనుమానం నీవైపు తిరిగింది. చివరికి మా అనుమానమే నిజమైంది’’ అన్నాడు ఎస్సై రమణ. -ఉమేశ్ కోమటి -
టెక్కీ అజితాబ్ ఆచూకీ చెబితే రూ. 10 లక్షలు
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ టెక్కీ కుమార్ అజితాబ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 18న ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన తన కారును కొనుగోలుదారుడికి అమ్మేందుకు బయటకు వెళ్లిన అజితాబ్ అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అజితాబ్ అదృశ్యంపై వైట్‌ఫీల్డ్‌లో కేసు నమోదైంది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అతని తండ్రి అశోక్‌కుమార్ సిన్హా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సిట్ దర్యాప్తునకు నగర కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా ఎంత విచారించినా, సుదీర్ఘంగా గాలించిన అజితాబ్ ఆచూకీ లభించలేదు. ఐదు నెలలు గడుస్తున్నా అజితాబ్ ఆచూకీ పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సీఐడీ ఈ కేసును స్వీకరించి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అజితాబ్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. అజితాబ్ ఆచూకీ తెలిసిన వారు సీఐడీ కంట్రోల్ రూమ్ 080–2204498, 22942444 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలని సూచించింది. -
యువతుల అదృశ్యం అసత్య ప్రచారమే
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మూడు నెలల్లో వంద మంది యువతులు అదృశ్యమైనట్టు కొన్ని చానల్స్‌లో జరుగుతున్న ప్రచారం అబద్ధమేనని ఎస్పీ శిబిచక్రవర్తి అన్నారు. తిరువల్లూరులో ట్రాఫిక్ నిబందనలు పాటించడంపై వాహనచోదలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. మొదట ట్రాఫిక్ నియంత్రణ, నిబంధనల పేరిట నిర్వహించిన బైక్ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న పలువురికి ప్రమాద రహిత ప్రయాణంపై అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. కిలోమీటరు దాకా సాగిన ర్యాలీలో ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 40 మంది యువతులు మాత్రమే.. తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 40 మంది యువతులు మాత్రమే అదృశ్యమైయ్యారని వీరిలో 36 మంది ఆచూకీ ఛేదించమన్నారు. కొన్ని చానల్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు బాలికలు మాత్రమే మిస్ అయ్యారని వీరి ఆచూకీ కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. వాహన చోదకుల గురించి ఎస్పీ మాట్లాడుతూ వాహనాలను నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని ఎస్పీ తెలిపారు.డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కలకలం రేపిన వీహెచ్‌పీ చీఫ్ అదృశ్యం
-
ఆచూకీ తెలియడం లేదు
హైదరాబాద్ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి.. బొల్లారంలో యువతి... బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఎస్ఐ సతీష్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్త బస్తీకి చెందిన లక్ష్మన్ కుమార్తె లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం బోనాల జాతరకు వెళ్లిందన్నారు. అయితే రాత్రి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇళ్లల్లో గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో తండ్రి లక్ష్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బీటెక్ విద్యార్థి... ఘట్కేసర్: విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఘట్కేసర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రశాంత్ అనురాగ్ విద్యాసంస్థలో బీటెక్ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి స్థానిక టీచర్స్ కాలనీలో ఉండేవాడు.సోమవారం అతని స్నేహితుడు ఆర్యన్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సోమవారం తెల్లవారుజామునుంచి ప్రశాంత్ కనిపించడం లేదని సమాచారం అందించాడు. ప్రశాంత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్ యువకుడు.. చిలకలగూడ: దుఖాణంలో పని చేసేందుకు వచ్చిన రాజస్తాన్ యువకుడు అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన మనోజ్ నార్ట్మల్ సువాషియా (18) ఈనెల 16న వారాసిగూడలోని రాందేవ్ ట్రేడర్స్‌లో పనిచేసేందుకు వచ్చాడు. 17న బయటికి వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో యజమాని ప్రకాష్‌చౌదరి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జైలు నుంచి విడుదలైన వ్యక్తి.. డబీర్‌పురా: జైలు విడుదలైన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కర్వేన గ్రామానికి చెందిన మహేశ్ (30)ను బేగంపేట్ పోలీసులు కిడ్నాప్ కేసులో 2015లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత నెల 9న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అతను ఇంటికి చేరుకోలేదు. కాగా ఈ నెల 13న కాయిన్ బాక్స్ నుంచి తండ్రికి ఫోన్ చేసి తాను ఇంటికి రావడం లేదని సమాచారం అందించాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు డబీర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 9912466555, 9490616525 నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఇద్దరు యువతులు.. పంజగుట్ట: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బిఎస్ మక్తాకు చెందిన వివేక్ విద్యావర్థన్ భార్య సాయి మాధురి (23)తో కలిసి గత నెల 11న నగరానికి వచ్చాడు. ఈ నెల 17న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.మంగళవారం ఉదయం నిద్ర లేచేసరికి సాయి మాధురి కనిపించకపోవడంతో అతను పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 9490616610 నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. లేడీస్ హాస్టల్ ఉద్యోగిణి.. . అమీర్‌పేట శాంతినగర్ అపురూప లేడీస్ హాస్టల్లో స్వీపర్‌గా పని చేస్తున్న దొడ్ల బాలమణి (29) ఈ నెల 13న బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బాలమణి సోదరి కాశమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
8 నెలలు.. 356 మిస్సింగ్ కేసులు
ఇంకా దొరకని 47 మంది ఆచూకీ అక్రమ రవాణాకు గురవుతున్న పిల్లలు అదృశ్యంతో కుటుంబాల్లో విషాదం పెరుగుతున్న మిస్సింగ్ కేసులు జిల్లాలో మిస్సింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పలువురి ఆచూకీ దొరుకుతుండగా.. మరికొందరేమో మాయమై ‘పోతున్నారు’.. ఇంకొందరి ఆచూకీ అసలే దొరకడం లేదు. ఎనిమిది నెలల్లో 356 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పిల్లల నుంచి యువత వరకు మిస్ అవుతున్నారు. అదృశ్యమవుతున్న వారిలో 18 ఏళ్ల లోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో రోజురోజుకూ మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. చిన్నపెద్ద తేడా లేకుండా అదృశ్యమవుతున్నారు. ఇంటి నుంచి మాయమై.. సొంత వారికి దూరమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 356 మిస్సింగ్ కేసులు నమోదుకాగా 309 కేసులను గుర్తించారు. ఇంకా 47 మంది ఆచూకీ దొరకలేదు. 2014 సంవత్సరంలో 336 కేసులు నమోదుకాగా 299 మందిని గుర్తించారు, 37 మంది ఆచూకీ తెలియలేదు. 2015 సంవత్సరంలో 504 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 427 మందిని గుర్తించారు. 77 మంది ఆచూకీ దొరకలేదు. మొత్తం మూడేళ్లలో 162 మంది ఇంకా అదృశ్యంలోనే ఉన్నారు. దీంతో తమవారు కనిపించక అదృశ్యమైన వారి కుటుంబాలు శోకసంద్రంలో ఉండిపోయాయి. అదృశ్యమైన వారిలో 18 సంవత్సరాల్లోపు బాలబాలికలు, మహిళలు, పురుషులు ఉన్నారు. వీరంతా అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇటీవల అక్రమ రవాణాకు సంబంధించి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కారణమేదైనా జిల్లాలో మిస్సింగ్ కేసులు పెరిగిపోవడం కలకలంరేపుతోంది. పోలీసు స్టేషన్లలో బాధిత కుటుంబాలు తమవారు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాన్ని మిస్సింగ్ కేసు కింద నమోదు చేస్తున్నారు. ఇందులో ఇంటి నుంచి పారిపోయారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, మరేదైనా కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోయారా అనే దానిపై స్పష్టమైన వివరాలు లేవు. పెళ్లి చేసుకుంటున్నారు.. యువతుల మిస్సింగ్ కేసుల్లో చాలా మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవే ఎక్కువ. సాధారణంగా యువతులు అదశ్యమైనప్పుడు వారి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెడుతున్నారు. ఇలాంటి చాలా కేసుల్లో యువత కొన్ని నెలల తర్వాత ప్రేమ వివాహం చేసుకొని జంటలుగా తిరిగివస్తున్నారు. యువతి మైనార్టీ తీరిన పక్షంలో ఆమె వాంగ్మూలం తీసుకొని ఆ కేసులను కొట్టివేస్తారు. కాగా మరికొందరి ఆచూకీ దొరకడం లేదు. వీరు కూడా ఏదైనా ప్రేమవివాహం చేసుకున్నారా లేదా ఎక్కడైనా వేధింపులకు గురవుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా చేతికొచ్చిన పిల్లలు అందకుండా పోతున్నారనే బాధ తల్లిందుడ్రుల్లో నెలకొంటుంది. ఒకవేళ అదశ్యమై పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఇంటికి రాకుండా బయటే ఉండే పిల్లల గురించి తల్లిదండ్రులు.. వారు ఏమయ్యారనే ఆవేదనతోనే మరి కొంత మంది గడుపుతున్నారు. మిస్సింగ్ కేసులపై గాలిస్తున్నాం.. ప్రస్తుతం మిస్సింగ్ కింద నమోదైన కేసుల్లో చాలా వరకు పురోగతి ఉంది. ఎప్పటికప్పుడు కేసును దర్యాప్తు చేసి అదృశ్యమైన వారికోసం గాలిస్తున్నాం. కొంత మంది యువతులు ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నాం. కానీ వారు కొన్ని రోజుల తర్వాత ప్రేమవివాహాం చేసుకుని వస్తున్నారు. ఇకా పిల్లల అదృశ్యంపై పోలీసు నిఘా ఉంచాం. - సత్యనారాయణ, వన్‌టౌన్ సీఐ పిల్లల అక్రమ రవాణా.. జిల్లాలో అదృశ్య కేసులను బట్టి చూస్తే మనుషుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అదృశ్యమైన వారిలో 10 శాతం మంది ఆచూకీ దొరకడం లేదు. ఇందులో ఎక్కువగా 18 సంవత్సరాలలోపు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో చిన్నపిల్లలను అపహరించడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు తిరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి ముంబాయి, నాగ్‌పూర్‌లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడేళ్లలో ఇప్పటి వరకు 60 మంది పిల్లల ఆచూకీ తెలియలేదు. బాలబాలికల్లో కొంత మంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంతో ఇంటిని విడిచివెళ్లిపోగా, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మిక పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, కెరమెరి, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఇలా అదశ్యమైన వారిలో కొంత మంది ఇంటికి తిరిగివస్తుండగా మరికొందరి ఆచూకీ దొరకడం లేదు. అదృశ్యమైన మహిళలను రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి వివాహం చేసుకుంటున్నారని, కొంత మందిని లైంగిక వేధింపులకు గురిచేసి మళ్లీ తిరిగి ఇక్కడ వదిలేసి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక మహిళలకు డబ్బులు ఎరవేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కింద నమోదు చేసిన చాలా కేసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చిన్నపిల్లలు అదృశ్యమై. ఎంత వెతికినా దొరకని కేసులపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గళ్లీలో ఆడుకుంటున్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలపై నిఘా పెట్టాలి. ఐసీడీఎస్, పోలీసులు ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మిస్సింగ్ కేసుల కోసం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్ కరీంనగర్లో ఉంది. పోలీసులతో పాటు ఈయూనిట్ బృందం కూడా మిస్సింగ్ కేసులపై గాలించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్‌రోడ్ ప్రాంతానికి చెందిన చల్లవార్ పుష్ప ( 72) అనే వృద్ధురాలు 2015 ఆగస్టు 7న సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరింది. ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె అదృశ్యమై ఏడాది గడుసున్నా ఇంకా ఎలాంటి వివరాలు తెలియలేదు. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన సంతోష్ కుమారుడు వినోద్ (7), కూతురు రాధ ( 5) గత ఏడాది డిసెంబర్ 22న సాయంత్రం ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లిన వీరు ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సంతోశ్ వన్టౌన్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదు. జిల్లా కేంద్రంలోని వికలాంగుల కాలనీకి చెందిన నన్నెపు సంపత్‌రాజ్ ( 26) ఈ ఏడాది జూలై 3న ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు ఇంటర్వ్యూకి వెళ్తున్నాని చెప్పి బయల్దేరాడు. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఇంక ఛేదనలోనే ఉంది. సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన బోరె సురేశ్ ( 21) ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి కనపించడం లేదు. మెకానిక్‌గా పనిచేస్తున్న సురేశ్ 23 నుంచి ఇంటిని వదిలి వెళ్లి ఇప్పటికీ కనిపించకుండా పోయాడు. -
ఇక ఈజీగా పట్టేస్తారు...
► తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్లకు చెక్ ► అందుబాటులోకి ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ► ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో, త్వరలో లైవ్ సెర్చ్‌లు సైతం ► మిస్సింగ్ కేసులు కొలిక్కితెచ్చేందుకూ వినియోగం సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో అరెస్టై, వారెంట్ల నేపథ్యంలో వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి ఎస్సార్‌నగర్ పరిధిలో స్వేచ్ఛగా సంచరిస్తుంటాడు... అంబర్‌పేట ఠాణా పరిధి నుంచి ఉద్దేశపూర్వకంగా అదృశ్యమైన వ్యక్తి/మైనర్ గోల్కొండ పోలీసుస్టేషన్ పరిధిలో తిరుగుతుంటాడు... నగర జనాభా, పోలీసు విభాగంలో మౌలికవసతుల కొరత నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి వారిని గుర్తించడం అధికారులకు సాధ్యం కావట్లేదు. ఈ తరహాకు చెందిన కేసుల్ని కొలిక్కితెచ్చేందుకు ఉపకరించే ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను నగర పోలీసు విభాగం సమీకరించుకుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో వినియోగిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో లైవ్సెర్చ్కు ఉపయుక్తంగా మార్చేలా ఐటీ సెల్ చర్యలు తీసుకుంటోంది. ‘లక్ష లక్ష్యం’ పక్కాగా సిద్ధించేందుకు... రాజధానిలో 2019 నాటికి లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంతో పోలీసు విభాగం ముందుకు వెళ్తోంది. వీటిలో 60 వేల కెమెరాలు నగర కమిషనరేట్ పరిధిలోనే ఏర్పాటుకానున్నాయి. ఓపక్క ప్రభుత్వం అందిస్తున్న నిధులు, మరోపక్క కమ్యూనిటీ ప్రాజెక్టు కింద వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వీటి ద్వారా నేర నిరోధం, కేసుల్ని త్వరితగతిన కొలిక్కి తీసుకురావడం పక్కాగా జరిపేందుకు సాఫ్ట్‌వేర్స్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం సమీకరించుకోడంపై పోలీసు విభాగం దృష్టిపెట్టింది. వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ నెంబర్‌ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం ట్రాఫిక్ విభాగం ఏర్పాటు చేస్తున్న ఐటీఎంఎస్ ప్రాజెక్టు ద్వారా సమకూరుతుండగా... ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను నెక్ సంస్థ నుంచి ఖరీదు చేశారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో వినియోగం... ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రస్తుతం ఐటీ సెల్ అధికారులు ఆఫ్‌లైన్ విధానంలో వినియోగిస్తున్నారు. నగరంలోని వివిధ ఠాణా పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల ఫొటోల డేటాబేస్‌ను రూపొందించారు. ఇవి నిక్షిప్తమై ఉన్న సర్వర్‌తో ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో నగరంలోని ఏ పోలీసుస్టేషన్, ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులైనా ఓ వ్యక్తి ఫొటోను పంపి, గతంలో ఎక్కడైనా అరెస్టు అయ్యాడా? అనేది తెలపాలని ఐటీ సెల్‌ను కోరుతున్నారు. ఈ ఫొటోను సాఫ్ట్వేర్ ఆధారంగా సర్వర్‌లో సెర్చ్ చేసి అలాంటి వివరాలుంటే గుర్తించి తెలియజేస్తున్నారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌లో చిక్కిన అనుమానితుల ఫొటోలనూ ఈ రకంగానే సరిచూసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో లైవ్సెర్చ్కు ఏర్పాట్లు... ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆన్లైన్లో ఉంచి లైవ్ సెర్చ్‌లు చేయడానికి ఐటీ సెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. ప్రభుత్వం అందించనున్న నిధులతో అక్కడ ఉండే సర్వర్‌ను బలోపేతం చేయనున్నారు. ఆపై ఈ సాఫ్ట్‌వేర్‌ను సర్వర్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానిస్తారు. ఇదే సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పాత నేరగాళ్లు, మిస్సింగ్ కేసులకు సంబంధించి అదృశ్యమైన వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా నగరంలో ఏ సీసీ కెమెరా ముందు నుంచైనా ఆ వ్యక్తి కదలికలు ఉంటే సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించే సర్వర్ తక్షణం కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఫలానా వ్యక్తి, ఫలానా ప్రాంతంలో ఉన్న కెమెరా ముందు నుంచి వెళ్లాడనేది పాప్అప్ రూపంలో అక్కడి సిబ్బందికి తెలియజేస్తుంది. వారు క్షేత్రస్థాయి అధికారుల్ని అప్రమత్తం చేయడం ద్వారా తమకు ‘కావాల్సిన’ వారిని పట్టుకునే ఆస్కారం ఏర్పడుతుంది. ఉన్నవాటిలో బెస్ట్ ఖరీదు చేశాం ‘ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిలో ఉత్తమమైన సాఫ్ట్వేర్ ఖరీదు చేశాం. అయితే దీనిలోనూ కొన్ని లోపాలు ఉన్నాయని గమనిస్తున్నాం. సీసీ కెమెరా ముందు ఫొటోలు ఉన్నట్లు స్పష్టంగా నిల్చుంటే మాత్రమే ఇది గుర్తించగలుగుతోంది. ప్రయోగాత్మకంగా అధ్యయనం తర్వాత లోపాలను గుర్తించి వాటిని అధిగమించే పరిజ్ఞానం సమకూర్చుకుంటాం’. - ఐటీ సెల్ అధికారి -
బూచోళ్లున్నారు
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రక్షణ కరువు బిడ్డలను ఎత్తుకెళ్లే ముఠా తిష్టవేసినట్లు అనుమానాలు ఈ ఏడాదిలో రెండు మిస్సింగ్ కేసులు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పురిటి బిడ్డలకు రక్షణ కరువైంది. కొంతకాలంగా బిడ్డలను ఎత్తుకెళ్లే ముఠా అక్కడే తిష్టవేసినట్లు అనుమానాలున్నాయి. ఈ ఏడాదే రెండు మిస్సింగ్ కేసులు నమోదు కావడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ సంఘటనల కారణంగా తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారుల్లో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి కార్పొరేషన్: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గ్రామీణులు, అమాయకులే లక్ష్యంగా పురిటి బిడ్డలను మాయం చేస్తుండంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యాధికారులు, పోలీసు యంత్రాంగం తమకేమి పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా పురిటి బిడ్డల భద్రతకు శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. మొన్న సోనియాకు కడుపు శోకం... ఈ ఏడాది జనవరిలో చంద్రగిరి నియోజకవర్గం, మొరవపల్లికి చెందిన సోనియా మొదటి కాన్పుకు ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో వ్యాక్సిన్ వేయాలంటూ నర్సు డ్రస్సులో వచ్చిన ఓ మహిళ బిడ్డను తనతో పాటు తీసుకెళ్లిపోయింది. నాలుగు రోజుల తరువాత నాటకీయంగా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలి వెళ్లిపోయింది. తాజాగా తుపాకుల సుధకు శోకం... ఏర్పేడు మండలం రావుల వారి కండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన సుధా మొదటి కాన్పు కోసం భర్త వెంకటయ్యతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. ఈనెల 1వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అడ్మిట్ సమయంలో ఎవరైనా ఆడవాళ్లు తోడుగా ఉండాలని వైద్యసిబ్బంది చె ప్పారు. దీంతో ఆమె ఎదురుచూస్తుండగా ఓ మహిళ తనకు తాను లక్ష్మిగా పరిచయం చేసుకుని కాన్పు అయ్యేంత వరకు తోడుగా ఉంటానని నమ్మబలికింది. వైద్యసిబ్బందికి అక్కగా పరిచయం చేయాలని సూచించింది. శనివారం ఉదయం నుంచి తోడుగా ఉంది. ఆదివారం వేకువ జామున సుధ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఉమ్మనీరు తాగిందని, నవజాత శిశువు విభాగానికి తీసుకెళ్లాలన్న వైద్యసిబ్బంది సూచన మేరకు బిడ్డతో వెళ్లిన ఆమె అరగంట పాటు వైద్యం చేయించి అక్కడి నుంచి అటే ఉడాయిం చినట్లు తెలుస్తోంది. పనిచేయని సీసీ కెమెరాలు.. ఈ ఏడాది జనవరిలో సోనియా బిడ్డను మాయం చేసిన ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఆసుపత్రిలో 24కుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణపై కొంతకాలం శ్రద్ధ పెట్టిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో అవి మూలనపడ్డాయి. విషయం ఆసుపత్రి ఉన్నతాధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే బిడ్డలను మాయం చేసే ముఠాకు మాత్రం ముందుగానే తెలిసింది. అందుకే దర్జాగా బిడ్డను ఎత్తుకెళ్లిపోయేందుకు ధైర్యం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది సహకరించారా? లేదంటే కనీసం భద్రతా సిబ్బంది కూడా ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు ఆసుపత్రి నుంచి నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఓ మహిళను గుర్తించి ఆమె ఏ మార్గంలోంచి వెళ్లిందన్న కోణంలో విచారిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ముఠాను పట్టుకుంటామని అలిపిరి సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఒత్తిళ్లతోనే ‘మిస్సింగ్’..!
సాక్షి, ముంబై: నగరంలో మిస్సింగ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీరిలో ఎక్కువ శాతం మహిళలే కావడం గమనార్హం. ముఖ్యంగా 16 నుంచి 25 వయస్సు గలవారే నగరంలో ఎక్కువగా తప్పిపోతున్నారని గణాంకాల ద్వారా తేలింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల మేరకు.. 2010 నుంచి 2013 వరకు తప్పిపోయిన వారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. తప్పిపోయిన వారిలో 0.34 శాతం మంది మహిళలు, 1.37 శాతం మంది పురుషులు మృతిచెందారని గణాంకాలు చెబుతున్నాయి. 2012లో నమోదైన మిస్సింగ్ కేసుల కంటే 2013లో 23 శాతం అధికంగా నమోదయ్యాయి. మిస్సింగ్ పర్సన్స్ బ్యూరో (ఎంపీబీ) నుంచి గత నెలలో సామాజిక కార్యకర్త చేతన్ కోటారి ఈ వివరాలను సేకరించారు. కాగా, చాలా మంది యువత తీవ్ర ఒత్తిడికి గురవుతూనో, కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి పారిపోతున్నారని ఎంపీబీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వసంత్ దోబ్లే తెలిపారు. మరికొంతమంది మానసిక ఆందోళనకు గురవుతూ, ఇంకొంతమంది ఆర్థికసంక్షోభాన్ని తట్టుకోలేక ఇళ్లు వదిలి పారిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోయి ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే ఉంటున్నాయి. అందులోనూ తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తేకాని నగరంలో ఒక మోస్తరు జీవితాలను గడపలేని పరిస్థితి.. దీంతో పిల్లలకు ఇంటిలో మంచీ చెడూ చెప్పేవారు లేక వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని మానసిక వైద్యుడు డాక్టర్ హరీష్ శెట్టి అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ముఖ్యమన్నారు. కాగా, మిస్సింగ్ కేసులు నేరాల కిందికి రాకపోవడంతో వీటి విషయాలలో పోలీసులు అశ్రద్ధ వహిస్తున్నారని ఠాణే మాజీ పోలీస్ కమిషనర్ ఎస్.పి.ఎస్.యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు బాంబే హైకోర్టు కూడా పలు మార్గదర్శకాలను సూచించింది. తప్పిపోయిన వారి ఫొటో, పూర్తి వివరాలతో ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారమివ్వాలని, ఆచూకీ చెప్పిన వారికి బహుమతులు అందజేయాలని వాటిలో సూచించింది. అయితే మిస్సింగ్ కేసు కాగానే పోలీసులు స్పందిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని చేతన్ కోటారి సూచించారు. కేసును నమోదు చేయడంతోపాటు విచారణలో సైతం పోలీసులు అశ్రద్ధ వహిస్తుండటంతో మిస్సింగ్ కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. -
వీరంతా ఏమయ్యారో?
సాక్షి, సిటీబ్యూరో: అదృశ్యమైన వారు ఎక్కడున్నారో? ఏమయ్యారో తెలియక బాధిత కుటుంబాలు వారి కోసం ధీనంగా ఎదురు చూస్తుండగా... పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుల దర్యాప్తును తూతూ మంత్రంగా జరిపి, ఆచూకీ దొరకలేదని కేసులను మూసివేస్తున్నారు. దీంతో బాధితులకు న్యాయం జరగడంలేదు. ఇలా గత ఆరేళ్లలో నగరంలో 14,835 అదృశ్యం కేసులు నమోదు కాగా, వీటిలో 8.325 కేసులను పోలీసులు ఛేదించారు.ఇంకా 6,510 మంది ఆచూకీ నేటికీ తెలియరాలేదు. వీరిలో బాలికలు 1,310 మంది, బాలురు 770 మంది కాగా... మహిళలు 1,985 మంది, పురుషులు 2,445 ఉన్నారు. అసలు వీరంతా బతికే ఉన్నారా..? ఉంటే ఎక్కడున్నారు..? అనే ప్రశ్నలకు పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావడంలేదు. దర్యాప్తు పరంగా తాము చేయాల్సిందంతా చేశామని, ఇక ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు. అదృశ్యమైన వారిలో విద్యార్థులు, వ్యాపారులతో పాటు పోలీసులూ ఉండటం గమనార్హం. నమోదవుతున్న మిస్సింగ్ కేసులు బాలుర కంటే బాలికలవే ఎక్కువ ఉంటున్నాయి. గత ఆరేళ్లలో తప్పిపోయిన వారిలో బాలురు 2.029 కాగా, బాలికలు 3,343 మంది. ముఖ్యంగా అదృశ్యమైన బాలికలు, మహిళల విషయంలో వారి కుటుంబసభ్యులు పడే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఠాణాల చుట్టూ ప్రదక్షిణలు చేసి.. చేసి చివరకు దేవుడిపై భారం వేస్తున్నారు. ఉన్నతాధికారులు మిస్సింగ్ కేసులపై దృష్టి పెట్టకపోవడంతోనే తమకు న్యాయం జరగడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు ఇలా... ఎవరైనా తమ కుటుంబ సభ్యుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత అదృశ్యమై వ్యక్తి పూర్తి వివరాలతో పాటు ఫొటోను తీసుకుంటారు. వాటిని పొందుపర్చి లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తారు. చుట్టుపక్కల ఠాణాలకు, సరిహద్దు జిల్లాల పోలీసులకు ఆ సమాచారం పంపుతారు. అప్పటికీ అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ దొరక్కపోతే ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం పంపుతారు. ఆరు నెలలలోపు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోతే ఆ కేసును తాత్కాలికంగా మూసివేస్తారు. ఆ తర్వాత ఏదైనా కేసులో ఆధారాలు లభిస్తే మాత్రమే తిరిగి తెరుస్తారు. -
అదృశ్యం కేసులో దోషులను శిక్షించాలి
వెంకటాపురం, న్యూస్‌లైన్: మండలంలోని వీఆర్కేపురం గ్రామానికి చెందిన డర్రా రాధ, డర్రా పోతురాజుల అదృశ్యం కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం వెంకటాపురంలో ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పోలీసులు ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో వీఆర్కేపురం, చొక్కాల, ఇప్పలగూడెం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. న్యాయం చేయాలంటూ నిరసన దీక్షలు ప్రారంభం రాధ, పోతురాజుల అదృశ్యానికి కారణమైన వారికి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ రాధ, పోతురాజుల తల్లిదండ్రులు మల్లయ్య, గంగ, లక్ష్మయ్య, నాగమ్మలు వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ళో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను వెంకటాపురం సర్పంచ్ బెజ్జరి నారాయణమ్మ ప్రారంభించి మాట్లాడారు. బాధితులకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తుందని ఆమె అన్నారు. ఈ నిరసన దీక్షలకు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిడెం శివ, సయ్యద్‌హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు మంగాయమ్మ, సీతాదేవి, సీపీఐ నాయకులు తోట మల్లిఖార్జునరావు, సీపీఎం నాయకులు గ్యానం సారయ్య, ఏసురత్నం పాల్గొన్నారు. -
మాయమవుతుండ్రు!
సాక్షి, సంగారెడ్డి: అదృశ్యం కేసులపై ఖాకీలు అలక్ష్యాన్ని వీడటం లేదు. అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ 24 గంటల్లో లభ్యం కాకపోతే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుంది. వ్యక్తి ఫొటో, వివరాలను పత్రికల్లో ప్రచురణ కోసం పోలీసులు ప్రకటన విడుదల చేయాలి. అదృశ్యమైన వ్యక్తి తరుచూ సందర్శించే ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు సమాచారాన్ని చేరవేయాలి. కుటుం బ సభ్యులతో కలిసి పోలీసు సిబ్బంది అనుమానిత ప్రదేశాలకు వెళ్లి ఆచూకీ కోసం ఆరా తీయాలి. కానీ, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయకుండా రోజులు, వారాల తరబడి కాలయాపన చేస్తున్నారు. చివరకు కేసు నమోదు చేసినా దర్యాప్తు చేపట్టకుండా కేసులను నీరుగారిస్తున్నారు. అదృశ్యమైన వ్యక్తుల కేసుల దర్యాప్తు కోసం జిల్లాలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు శాఖ పేర్కొంటోంది. కానీ, ఆ బృందాలు దర్యాప్తు చేసి ఒక్క కేసు చిక్కుముడి విప్పిన దాఖలాల్లేవు. అసలాంటి బృందాలున్నట్లు సొంత శాఖ అధికారులకే తెలి యదు. ఫిర్యాదుదారులు రోజులు, వారాల తరబడి పోలీసు స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొట్టి అలసిపోతున్నారు. ఆచూకీ లభిస్తే మేమే కబురు పంపుతాం.. మీరు పదేపదే రావద్దని పోలీసులు కరుకుగా చెప్పి తిప్పి పంపుతున్నారు. దీంతో అదృశ్యమవుతున్న వ్యక్తులు ఏమైపోతున్నారో అంతు చిక్కడం లేదు. ఆత్మీయుల ఆచూకీ లభించక అయినవాళ్లు అంతులేని ఆవేదనలో మునిగిపోతున్నారు. భారీగా పెరిగిన అదృశ్యాలు ఈ ఏడాది అదృశ్యం కేసులు భారీగా పెరిగాయి. జిల్లా నేర రికార్డుల విభాగం(డీసీఆర్బీ) గణాంకాల ప్రకారం .. గడిచిన 11 నెలల్లో జిల్లాలో ఏకంగా 439 మంది అదృశ్యమయ్యారు. అందులో 349 మంది ఆచూకీ లభ్యం కాగా.. మరో 90 మంది ఏమైపోయారో ఇంత వరకు తేలలేదు.బాలలు, మహిళలు, పురుషులు.. వీరిలో ఎవరు అదృశ్యమైనా దర్యాప్తు చేయకుండా పోలీసులు ఓ అభిప్రాయానికి వస్తున్నారు. ఈ ఏడాది 150 మంది బాలలు అదృశ్యం కాగా.. అందులో 126 మంది తిరిగి రాగా, 24 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. యువతీయువకులు అదృశ్యమైతే ప్రేమ వ్యవహారమేనని ఫిర్యాదును బుట్టదాఖలు చేస్తుండడంతో కన్నవాళ్ల ఆవేదన మరింత పెరిగిపోతోంది. ఇక స్త్రీలు, పురుషుల అదృశ్యం వెనక మానసిక, ఆర్థిక సమస్యలు కారణమవుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 154 మంది స్త్రీలు అదృశ్యమైనట్లు కేసులు నమోదు కాగా.. అందులో 128 మంది ఆచూకీ లభ్యమైంది. మిగిలిన 26 మంది ఆచూకీ తేలలేదు. అదే విధంగా 135 మంది పురుషులు కనిపించకుండా పోగా అందులో 95 మంది లభ్యమయ్యారు. 45 మంది ఆచూకీ నేటికీ తేల లేదు. ఇప్పటికైనా పోలీసులు సక్రమంగా దర్యా ప్తు చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.