సాక్షి, సిటీబ్యూరో: అదృశ్యమైన వారు ఎక్కడున్నారో? ఏమయ్యారో తెలియక బాధిత కుటుంబాలు వారి కోసం ధీనంగా ఎదురు చూస్తుండగా... పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుల దర్యాప్తును తూతూ మంత్రంగా జరిపి, ఆచూకీ దొరకలేదని కేసులను మూసివేస్తున్నారు. దీంతో బాధితులకు న్యాయం జరగడంలేదు. ఇలా గత ఆరేళ్లలో నగరంలో 14,835 అదృశ్యం కేసులు నమోదు కాగా, వీటిలో 8.325 కేసులను పోలీసులు ఛేదించారు.ఇంకా 6,510 మంది ఆచూకీ నేటికీ తెలియరాలేదు. వీరిలో బాలికలు 1,310 మంది, బాలురు 770 మంది కాగా... మహిళలు 1,985 మంది, పురుషులు 2,445 ఉన్నారు.
అసలు వీరంతా బతికే ఉన్నారా..? ఉంటే ఎక్కడున్నారు..? అనే ప్రశ్నలకు పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావడంలేదు. దర్యాప్తు పరంగా తాము చేయాల్సిందంతా చేశామని, ఇక ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు. అదృశ్యమైన వారిలో విద్యార్థులు, వ్యాపారులతో పాటు పోలీసులూ ఉండటం గమనార్హం. నమోదవుతున్న మిస్సింగ్ కేసులు బాలుర కంటే బాలికలవే ఎక్కువ ఉంటున్నాయి. గత ఆరేళ్లలో తప్పిపోయిన వారిలో బాలురు 2.029 కాగా, బాలికలు 3,343 మంది. ముఖ్యంగా అదృశ్యమైన బాలికలు, మహిళల విషయంలో వారి కుటుంబసభ్యులు పడే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఠాణాల చుట్టూ ప్రదక్షిణలు చేసి.. చేసి చివరకు దేవుడిపై భారం వేస్తున్నారు. ఉన్నతాధికారులు మిస్సింగ్ కేసులపై దృష్టి పెట్టకపోవడంతోనే తమకు న్యాయం జరగడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసు దర్యాప్తు ఇలా...
ఎవరైనా తమ కుటుంబ సభ్యుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత అదృశ్యమై వ్యక్తి పూర్తి వివరాలతో పాటు ఫొటోను తీసుకుంటారు. వాటిని పొందుపర్చి లుక్‌అవుట్ నోటీస్ జారీ చేస్తారు. చుట్టుపక్కల ఠాణాలకు, సరిహద్దు జిల్లాల పోలీసులకు ఆ సమాచారం పంపుతారు. అప్పటికీ అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ దొరక్కపోతే ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం పంపుతారు. ఆరు నెలలలోపు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోతే ఆ కేసును తాత్కాలికంగా మూసివేస్తారు. ఆ తర్వాత ఏదైనా కేసులో ఆధారాలు లభిస్తే మాత్రమే తిరిగి తెరుస్తారు.
వీరంతా ఏమయ్యారో?
Published Mon, May 5 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement