ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులు ఇప్పుడు మరోసారి చర్చానీయాంశమవుతున్నాయి. వాస్తవానికి ఇలా నమోదవుతున్న వాటిలో 67% పైగా కేసుల్లో తప్పిపోయినవారిని గుర్తిస్తున్నారు. కానీ, యువతులు, టీనేజీ బాలికల విషయంలో మాత్రం పోలీసులు అది ప్రేమ వ్యవహారమంటూ కొట్టిపారేస్తున్నారు. దీంతో కొన్నింటిలో బాధితులు విగతజీవులుగా కనిపిస్తున్నారు. గతంలో హాజీపూర్ గ్రామంలోనూ ఫిర్యాదు చేసినపుడు పోలీసులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. తాజాగా ‘దిశ’ కేసులోనూ పోలీసులకు యువతి అదృశ్యం పై ఫిర్యాదు చేయగానే.. తొలుత ప్రేమ వ్యవహారమంటూ తేలిగ్గా తీసుకున్నారు. మరునాడు ఆమె విగతజీవిగా మారింది. పోలీసులు అదేక్షణంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని బాధిత కుటుంబీకులు ఆరోపించడంతో ముగ్గురు పోలీసులపై వేటుపడిన సంగతి తెలిసిందే.
67 శాతం పురోగతి..
తెలంగాణలో మిస్సింగ్ కేసులు నమోదు భారీగా ఉంటోంది. వాటి పరిశోధన కూడా అంతేస్థాయిలో ఉంటుంది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ (ఎన్సీఆర్‌బీ) 2017 ప్రకారం.. నమోదైన ప్రతీ వంద కేసుల్లో 67 కేసులను పోలీసులు ఛేదిస్తున్నారు. మిస్సింగ్ కేసుల పురోగతిలో ఒడిశా 87%, కేరళ 85.4 శాతంగా ఉంది. వీటి తరువాత స్థానంలో తెలంగాణ నిలవడం గమనార్హం. సాధారణంగా మిస్సింగ్ కేసుల్లో ఇంటినుంచి పారిపోయిన, తప్పిపోయిన పిల్లలు, మతిస్థిమితి లేనివారు, వృద్ధులు, ప్రేమవ్యవహారాలు, కిడ్నాపులు అన్ని రకాలు ఉంటాయి. పిల్లలు, వృద్ధుల విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేసులు నమోదు చేసే పోలీ సులు, యువతుల విషయంలో ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుతో తల్లిదండ్రులు కలత చెందుతున్నారు.
నిర్లక్ష్యం వద్దు : డీజీపీ కార్యాలయం
‘దిశ’కేసు నేపథ్యంలో యువతులు, బాలికల మిస్సింగ్ కేసుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల ఎస్పీ, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. డయల్ 100కు వచ్చే కాల్స్‌లోనూ వీలైనంత త్వరగా ఘటనాస్థలానికి చేరుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment