సాక్షి, హైదరాబాద్: తమవారు కనిపించకుండా పోయారంటే సంబంధీకుల బాధ వర్ణనాతీతం. నిద్రాహారాలు మాని వెతకడమే కాదు.. కనిపించిన ప్రతి దైవాన్నీ మొక్కుతారు. అలా మిస్సైంది మైనర్లు అయితే పరిస్థితి మరింత ఘోరం. పూర్తి స్థాయిలో ఫలితం ఉండదని తెలిసీ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ మిస్సింగ్ కేసులంటే పోలీసులకు చాలా అలుసుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సీఆర్‌పీసీ, ఐపీసీలతో సహా ఏ చట్టంలోనూ సెక్షన్ సైతం లేకపోవడంతో మరింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
చాలా కేసులను పెండింగ్ జాబితాలో పడేస్తుంటారు. ‘కీలకం’ అనుకుంటే తప్ప వీటిలో ప్రాథమిక దర్యాప్తు సైతం జరపరు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం గతేడాది రాష్ట్రంలో 3,100 మంది మైనర్లు మిస్సయ్యారు. అంతకు ముందు ఏళ్లల్లో చోటు చేసుకుని కొలిక్కి రాని కేసులు మరో 655 ఉన్నాయి. ఈ 3,755 కేసుల్లో ఇప్పటికీ 777 మంది ఆచూకీ తెలియలేదు. పోలీసు విభాగం ప్రతి ఏడాదీ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కనీసం 2022లో అయినా మైనర్ల మిస్సింగ్ కేసులకు తగు ప్రాధాన్యం ఇస్తుందా? అనేది వేచి చూడాలి.
ఎందుకీ నిర్లక్ష్యం?
► గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మిస్సింగ్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ఏటా 2 వేల మందికి పైగా అదృశ్యమవుతున్నారు. వీటిలో సగానికి పైగా ప్రేమవ్యవహారాలకు సంబంధించినవే. అమ్మాయి, అబ్బాయి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతారు. దాంతో ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. కొద్ది రోజులకు వారి విషయం తెలియడంతో కేసు పరిష్కారమవుతుంది.
►‘ప్రేమ’ తర్వాత పరీక్షల సమయంలో మిస్సింగ్ కేసు సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో సగటున రోజుకు 10–15 కేసులు రిజిస్టర్ అవుతుంటాయి. ఇలాంటి వారు కూడా కొన్ని రోజులకు ‘కనిపిస్తుంటారు’. ఈ కేసుల్లోనూ పోలీసులు చేస్తున్న కృషి ఏమాత్రం ఉండట్లేదు. ఎక్కువగా ఇలాంటి కేసులే వస్తుండటంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
►నిజమైన మిస్సింగ్, కిడ్నాప్ కేసులనూ ఇదే కోవకు చేర్చేసి చేతులు దులుపుకొంటున్నారు. యుక్త వయసు బాలబాలికల మిస్సింగ్ కేసులను పోలీసులు పట్టించుకోవట్లేదనే వాదనలు ఎక్కువగా ఉన్నాయి. 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారు మిస్ అయ్యారంటే అది కేవలం ‘ప్రేమ’ వ్యవహారమో, అలకో అని భావిస్తున్నారు. అలాంటి లేదంటూ తల్లిదండ్రులు గొల్లుమంటున్నా పట్టించుకోవట్లేదు.
చదవండి: తెలంగాణ: 20 మంది బాధితుల్లో నలుగురికి సీరియస్!
సమీక్షల్లోనూ వీరికి విలువ లేదు..
►రాష్ట్ర డీజీపీ నుంచి జిల్లా ఎస్పీలు, జోనల్ డీసీపీల వరకు అనునిత్యం క్రైమ్ రివ్యూల పేరుతో సమీక్షలు నిర్వహిస్తుంటారు. వీటిలో ప్రధానంగా సొత్తు సంబంధిత కేసులు, సంచలనం సృష్టించిన వాటి పైనే దృష్టి పెడతారు. ఠాణాల వారీగా నమోదైన మిస్సింగ్ కేసులు ఎన్ని, లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడంతో పాటు కాల్ డిటేల్స్ సేకరించడం మినహా మరే ఇతర చర్యలు తీసుకున్నారు? తదితర అంశాల జోలికి ఈ ఉన్నతాధికారులు పొరపాటున కూడా పోవడంలేదు.
►ఏడాదికి రెండుసార్లు మాత్రం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో హడావుడి చేసి, ఫొటోలకు పోజులిచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సీఐడీ అధీనంలోని మహిళ భద్రత విభాగం గతంలో ఇతర రాష్ట్రాల్లోని వ్యభిచార గృహాలపై దాడులు చేసి అక్కడ మగ్గుతున్న రాష్ట్రానికి చెందిన బాధితులను బయటకు తీసుకువచ్చేది. ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్ర మహిళ భద్రత విభాగం ఏర్పడిగా ఇటీవల కాలంలో ఇలాంటి దాడుల ఊసే లేకుండాపోయింది.
నేరగాళ్లకు వరం..
►వ్యవహార శైలి నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ నిర్లక్ష్యంతో అనేక ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇంట్లోంచి కావాలని బయటకు వచ్చి దిక్కుతోచని వాళ్లు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో సంచరిస్తుంటారు. ఇలాంటి వారిని చేరదీస్తున్న కొన్ని ముఠాలు ఘోరాలకు పాల్పడుతున్నాయి. మాయమాటలతో వల వేసిన, ఎత్తుకుపోయిన ఆడపిల్లలను ఏకంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు.
►స్థానిక పోలీసుల రికార్డుల్లో కేవలం మిస్సింగ్ కేసులుగా నమోదైన అనేక వ్యవహారాలు ఆపై టాస్క్‌ఫోర్స్ వంటి స్పెషలైజ్డ్ వింగ్స్ చొరవతో హత్యలుగా తేలిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. సిటీలో నిత్యం లభిస్తున్న అనేక గుర్తుతెలియని శవాలు ఎక్కడో ఒకచోట మిస్సింగ్‌గా ఉంటున్నవే. వీటిపై పోలీసులు చూపుతున్న నిర్లక్ష్యంలో అనేక మంది నేరగాళ్లు స్వేచ్ఛగా బాహ్య ప్రపంచంలో విహరించేస్తున్నారు.
ఇవీ మైనర్ల మిస్సింగ్ గణాంకాలు:
►2020కి ముందు అదృశ్యమై ఆచూకీ లేని మైనర్లు: 655
►2020లో అదృశ్యమైన వారు: 3100
►2020 ఆచూకీ లభించిన వారు: 2978
►ఇప్పటికీ ఆచూకీ లేని వాళ్లు: 777
Comments
Please login to add a commentAdd a comment