సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మక్తల్: దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ ముమ్మాటికీ బూటకమని, పోలీసులు ముందస్తు ప్లాన్ ప్రకారమే అంతమొందించారని.. ఇదే విషయాన్ని సిర్పూర్కర్ కమిషన్ నివేదించిందని మృతుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందన్నారు. ఇప్పుడు హైకోర్టులో కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. తమవారిని చంపిన వారికి కూడా తగిన శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ ఎన్‌కౌంటర్‌తో తమ కుటుంబాలు బజారున పడ్డాయని వాపోయారు. సర్కారు ఇప్పటివరకు చేసిందేమీ లేదని, తమకు న్యాయం చేయడంతోపాటు ఆదుకోవాలని వేడుకున్నారు.
ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు
మాకున్న ఒక్క కొడుకును బూటకపు ఎన్‌కౌంటర్‌లో చం పారు. ఆ పోలీసులకు కూడా కఠినశిక్ష పడినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. మూడేళ్లుగా అష్టకష్టాలు పడుతున్నాం. రోజు కూలికి వెళితేనే బతుకు. ముసలితనంలో కష్టాలు భరించలేకపోతున్నాం. మాకు భూమి లేదు. ప్రభుత్వం నుంచి కనీసం పింఛన్ రాలేదు. మా ఇంటికి ఎవరైనా రావాలంటే కూడా భయపడుతున్నారు. ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
–మహ్మద్ మౌలాన్‌బీ, హుస్సేన్,
ఆరిఫ్ తల్లిదండ్రులు, జక్లేర్, నారాయణపేట జిల్లా
మమ్మల్ని ఆదుకునేవారే లేరు..
మాకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు గొర్రెల కాపరిగా పనిచేస్తుండేవాడు. ఆ డబ్బుతో బతుకు గడిచేది. కొడుకు చనిపోయినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికంగా చితికిపోయాం. మమ్మల్ని ఆదుకునేవారే కరువయ్యారు. గ్రామంలో చిన్నపాటి పనులు చేసుకుంటున్నాం. ఎవరైనా దయతలచి డబ్బులిస్తే వాటితో కాలం వెళ్లదీస్తున్నాం. మా కుటుంబాన్ని ఆగం చేసిన పోలీసులకు శిక్ష పడాలి, ప్రభుత్వం ఆదుకోవాలి.
– జొల్లు మణెమ్మ, రాజప్ప, ఎన్‌కౌంటర్ మృతుడు జొల్లు శివ తల్లిదండ్రులు, గుడిగండ్ల
వారికి శిక్ష పడితేనే..
పోలీసుల వల్లే నా కుటుంబం బజారున పడింది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్తను కిరాతకంగా చంపేశారు. మూడు నెలల తర్వాత నాకు బిడ్డ పుట్టింది. నా బిడ్డకు తండ్రి లేకుండా చేశారు. ఏ పోలీసులు అయితే బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారో.. వారిని కూడా కిరాతకంగా చంపాలి. వారికి శిక్ష పడితేనే నా కుటుంబానికి న్యాయం జరిగినట్లు. ఈ నమ్మకం నాకుంది.
– రేణుక, ఎన్‌కౌంటర్ మృతుడు
చెన్నకేశవులు భార్య, గుడిగండ్ల,
మక్తల్, నారాయణపేట
మాకు ఎవరు దిక్కు?
నాకున్న ఒక్క కొడుకును పోలీసులు పొట్టనబెట్టుకున్నారు. తర్వాత రెండు నెలలకే నా భర్త కురుమయ్య చనిపోయాడు. మా కుటుంబానికి ఎవరూ దిక్కు లేకుండా అయింది. నేను, నా కోడలు కలిసి కూలీనాలి చేసుకుని బతుకుతున్నాం. ఎవరికేం చెప్పినా మాకు ఒరిగేదేమీ లేదు. అంతా దేవుడిపైనే భారం.
– జయమ్మ, ఎన్‌కౌంటర్ మృతుడు చెన్నకేశవులు తల్లి,
గుడిగండ్ల, మక్తల్, నారాయణపేట జిల్లా
పోలీసులకూ అదే శిక్ష పడాలి
నా భర్త గతంలోనే కన్నుమూశాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును పోలీసులు బలితీసుకున్నారు. ఏకాకిని అయిపోయిన. కూలీనాలి చేసుకుని బతుకుతున్నా. నా కొడుకుకు ఏదైనా శిక్ష పడి ఉన్నా కళ్లతో చూసుకునే దాన్ని. నా కొడుక్కు వేసిన శిక్షనే ఈ ఘాతుకానికి పాల్పడిన పోలీసులకు కూడా వేయాలి.
– జొల్లు లక్ష్మి, ఎన్‌కౌంటర్ మృతుడు నవీన్ తల్లి,
గుడిగండ్ల, మక్తల్, నారాయణపేట జిల్లా
Comments
Please login to add a commentAdd a comment