ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాలుడికి కౌన్సెలింగ్ చేస్తున్న చైల్డ్‌లైన్ సభ్యులు
మక్కువకు చెందిన చెందిన 14 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులు మందలించారని కొద్ది రోజుల క్రితం రైల్లో ముంబై వెళ్లిపోయాడు. అక్కడి పోలీసులు బాలుడిని విచారించి రెండు, మూడు రోజుల్లో స్వస్థలానికి పంపించనున్నారు. విశాఖపట్నానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చేశాడు. చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.. వీరిద్దరే కాదు ఎందరో పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. –
విజయనగరం ఫోర్ట్: తల్లిదండ్రులు మందలించారని కొందరు.. పట్టణాలు చూద్దామని మరి కొందరు ఇంటి నుంచి పారిపోతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వీరు పోలీసులకో.. చైల్డ్‌లైన్ సభ్యులకో దొరికితే పరవాలేదు. పొరపాటున సంఘ విద్రోహ శక్తులకో దొరికితే అత్యంత ప్రమాదకరం.
అయిదేళ్లలో 156 మంది
మూడేళ్ల కాలంలో 156 మంది వరకు ఇంటి నుంచి పారిపోయి వచ్చేసారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే. అధికారుల దృష్టికి వచ్చిన వారు.. దృష్టికి రాకుండా ఇంటి నుంచి పారిపోయిన వారు మరి కొందరున్నారు.
పిల్లల ఇష్టాలను తెలుసుకోలేకే..
పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. పనులు, ఉద్యోగాల్లో నిమగ్నమై వారి ప్రవర్తనను గమనించలేకపోతున్నారు. అసలు వారేం చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత హడావుడిగా తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలకు ఏది ఆసక్తి.. ఏదంటే ఇష్టం ఉండదన్న విషయాలను తెలుసుకోవడం లేదు. పిల్లల ఇష్టాలను తెలుసుకోకుండా మందలించడం.. కొట్టడం వల్ల భయపడి చాలా మంటి ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. కొందరు పదేపదే చదువు పేరిట సతాయించడం, కోప్పడటం వల్ల బయటికి వచ్చేస్తున్నారు.
సోషల్ మీడియా ప్రభావం
కుటుంబంలో, భార్యభర్తల మధ్య గొడవల వల్ల కొందరు పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొందరు పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్చ ఉండటం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – ఎస్.రంజిత, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్
పిల్లల ఇష్టాలను తెలుసుకోవాలి
పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తు ఉండాలి. వారి ఇష్టాలను తెలుసుకోవాలి. కోప్పడటం, తిట్టడం వల్ల పిల్లలు భయపడి ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంది. చిన్న కుటుంబాల వల్ల కూడా నేడు పిల్లలను పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు ఉండటం లేదు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి, చెడుల గురించి చెప్పేవారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేస్తున్నారో కూడా చూసే తీరిక ఉండటం లేదు. – వావిలపల్లి లక్ష్మణ్, అధ్యక్షుడు, జిల్లా బాలల సంక్షేమ సమితి
Comments
Please login to add a commentAdd a comment