బైక్ నడుపుతున్న స్కూల్ పిల్లలు
విజయనగరం, రామభద్రపురం(బొబ్బిలి): దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సెక్షన్ ప్రతీ ఒక్కరిలోనూ గుబులు రేపుతోంది. సెక్షన్ 304 (ఏ) ద్వారా ఈ విషయంలో శిక్షలను మరింత కఠినతరం చేశారు. మైనర్లు బైక్ నడిపి ప్రమాదానికి కారణమైనా, మితి మీరిన వేగంతో ఎదుట వ్యక్తి ప్రాణాలు బలిగొన్నా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, సదరు వాహన యాజమానిపై సెక్షన్ 304 (ఏ)ప్రకారం కేసు నమోదు చేస్తారు. వెంటనే రిమాండ్‌కు కూడా తరలిస్తారు.
బైక్ ఇస్తే అంతే సంగతులు..
చాలా మంది తల్లిదండ్రులు, బంధువులు పిల్లలకు బైక్ ఇవ్వడం గొప్పగా భావిస్తారు. అయితే ఇకపై అది కుదరదు. సదరు బాలుడు లేదా బాలిక బైక్ నడిపి ప్రమాదం చేసినట్లు అయితే ఆ తల్లిదండ్రులపై, సెక్షన్ 304 (ఏ) కేసు నమోదు చేస్తారు. మద్యం సేవించి బైక్ నడిపి ప్రమాదం చేసి ప్రాణనష్టం కలిగించిన వారిపై కూడా ఇదే సెక్షన్ కింద కేసులు పెడతారు. లైసెన్స్ లేకుండా ఇతరుల వాహనం నడిపి ప్రమాదాలు చేస్తే వాహనం ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో వారిపై కేసు నమోదు చేస్తారు. యాక్సిడెంట్ చేసిన వారితో పాటు వాహనం ఇచ్చిన వారు, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అమ్మిన వ్యక్తిపై కూడా కేసులు పెడతారు. గతంలో యాక్సిడెంట్ చేసిన వారికి కూడా 304 (ఏ)ను నమోదు చేసేవారు. అయితే అప్పట్లో వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరయ్యేది. నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. యాక్సిడెంట్‌కు కారణమైన వ్యక్తితో పాటు సంబంధిత వాహన యాజమానికి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం లేదు. పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ప్రమాదాల నివారణ కోసం..
మూడేళ్లలో దేశంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. వాటిని అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు బలిగొనే వారిని, ఉద్దేశ పూర్వకంగానే హత్య చేసినట్లుగా భావిస్తూ సెక్షన్ 304(ఏ)ను రూపొందించారని పోలీసు వర్గాలు తెలిపాయి. వాహనం నడిపే వారు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని, తల్లిదండ్రులు, బంధువులు మైనర్ వ్యక్తులకు బైక్‌లు ఇస్తే ఎదురయ్యే సంఘటనలకు సిద్ధంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పాత వాహనాలు ఎవరికైనా అమ్మితే కొనుగోలు చేసిన వారి పేరున బైక్ రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే అమ్మిన వారికి ఇబ్బందులు తప్పవు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ను యువత మానుకోవాలి అని పోలీసులు సూచిస్తున్నారు.
కేంద్రానిది మంచి నిర్ణయం..
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎంతో మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అమాయకులు బలైపోతున్నారు. వాహనాలు నడిపిన వారు రోడ్డు ప్రమాదాలకు పాల్పడి ఆయా కుటుంబాల్లో విషాదం నింపారు. ప్రమాదాలు చేసిన వారికి వెంటనే స్టేషన్ బెయిల్ రావడం, పెద్దగా చర్యలు లేకపోవడంతో పరిస్థితి మారడం లేదు. ఈ సెక్షన్ అమలు చేస్తే కొంత వరకు ప్రమాదాలు నివారణ అవుతాయి.
– గుల్లిపల్లి కృష్ణ, విశ్రాంత ఉద్యోగి
రామభద్రపురం భారీ మూల్యం తప్పదు...
వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మైనర్లకు బైక్‌లు ఇచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, మద్యం సేవించి వాహనం నడిపే వారు రోడ్డు ప్రమాదం చేస్తే, ప్రాణ నష్టం జరిగితే ఉద్దేశ పూర్వకంగానే హత్య చేసినట్లు సెక్షన్ 304(ఎ) చెబుతోంది. దీన్ని గట్టిగా అమలు చేస్తే ప్రమాదాలు నివారణయ్యే అవకాశం ఉంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే.
– బి.లక్ష్మణరావు, ఎస్‌ఐ, రామభద్రపురం
Comments
Please login to add a commentAdd a comment