road safety week
-
చండీగఢ్ జనాభా కంటే ఎక్కువ.. రోడ్డు ప్రమాదాల్లో పదేళ్లలో 15 లక్షల మంది మృతి
మనదేశంలో రోడ్డు ప్రమాదాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. రహదారి దుర్ఘటనల్లో అసువులు బాసిన వారి సంఖ్య ఏటేటా భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో 15.3 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. భువనేశ్వర్ నగర జనాభాకు దాదాపు సమానం. దీన్నిబట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎంత ఎక్కువ స్థాయిలో ప్రజలను బలిగొంటున్నాయో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపడుతున్నా, అఖరికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు.50 లక్షల మంది క్షతగాత్రులు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. మనదేశంలో 10 వేల కిలోమీటర్లకు సగటు మరణాల సంఖ్య 250. చైనాలో పది వేల కిలోమీటర్లకు 117, అమెరికాలో 57, ఆస్ట్రేలియాలో 11 మరణాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలం (2014-23)లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో 15.3 లక్షల మంది దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు దశాబ్దం (2004-13)లో 12.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2014-23 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు 45.1 లక్షలు కాగా, 2004-13లో ఏకంగా 50.2 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.రెండింతలైన వాహనాలుజనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు రహదారులు విస్తరించడం కూడా ఎక్కువ మరణాలకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు సరైన చర్యలు చేపట్టలేదని వారు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో రిజిస్టర్డ్ వాహనాలు 15.9 కోట్లు కాగా, 2024 నాటికి రెండింతలు పైగా పెరిగి 38.3 కోట్లకు చేరుకున్నాయి. 2012 నాటికి 48.6 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్న రహదారులు.. 2019 నాటికి 63.3 లక్షల కిలోమీటర్లకు చేరాయి.యాక్సిడెంట్ కేసులపై శీతకన్నుఅయితే రోడ్డు ప్రమాదాలకు వాహనాలు, రహదారులు పెరగడం ఒక్కటే కారణం కాదని.. రహదారి భద్రత అనేది చాలా అంశాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విభాగాలు, వాహనదారులు, లాభాపేక్షలేని సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు. యాక్సిడెంట్ కేసులను పోలీసులు సరిగా విచారణ జరపడం లేదని ఆరోపిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, అన్ని దర్యాప్తు సంస్థలు యాక్సిడెంట్ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఢిల్లీ మాజీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.ఘోర ప్రమాదం.. ట్రక్కు, ఇన్నోవా కారు ఢీ; ఆరుగురి మృతిహత్య కేసులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. రోడ్డు ప్రమాదాలు, మరణాల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని ఐపీఎస్ మాజీ అధికారి, ఎంపీ టి కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. రహదారి భద్రతపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టాలని భావిస్తున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. మనదేశంలో సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య.. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కంటే చాలా ఎక్కువని ఆయన తెలిపారు. -
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్: కేంద్ర మంత్రి
డ్రైవర్ల ఉద్యోగాలను కాపాడే దృష్టితో డ్రైవర్ లెన్ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఐఐఎం నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు భద్రతా సమస్యలపై గురించి మాట్లాడుతూ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం, రోడ్లపై బ్లాక్ స్పాట్లను తొలగించడం లాంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామన్నారు. ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా ఆయన అభివర్ణించారు. కాగా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో గడ్కరీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14లో రూ. 51 వేల కోట్లు ఉండగా, అది 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,40 వేల కోట్లకు పెరిగిందన్నారు. రోడ్డు,రవాణా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2013-14లో రూ.31,130 కోట్లు ఉండగా, 2023-24 నాటికి ఇది రూ. 2,70,435 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇది కూడా చదవండి: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి! -
రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌తో రహదారి భద్రతా నిధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి భద్రతకు సంబంధించి రూ.50 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ నిధులతో ప్రత్యేకంగా రహదారి భద్రతా నిధిని ఏ ర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రహదారి భద్రత, రహదారి భద్రత డ్రాప్ట్ ఆ డిట్ నివేదిక అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రహ దారి ప్రమాదాల వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోడం లేదా తీవ్రంగా గాయపడడం వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నా రు. రహదారి భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుందని తెలిపారు. కొత్తగా చేపట్టే వివిధ రహదారుల ప్రాజెక్టు అంచనాల్లో 2 శాతం నిధులు రహదారి భద్రతా నిధికి జమ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. వివిధ జాతీయ, రాష్ట్ర, ఇతర ముఖ్యమైన రహదారులపై గల జంక్షన్లను మెరుగుపర్చడంతో పాటు బ్లాక్ స్పాట్లను తక్షణం సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు వినియోగంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన క ల్పించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై నూతన మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాల్లో ప్రమాదాల నివారణకు సిగ్నల్ వ్యవస్థతో పాటు సీసీ కెమెరాలను సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. వివిధ పాఠశాలలు, కళాశా లలు, ప్రార్థనా మందిరాల పరిసరాల్లోని రహదారులపై ప్రత్యేకంగా సైనేజి బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర రహదారులు–భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న సమావేశపు అజెండా, రోడ్డు సేఫ్టీ ఆడిట్‌కు సంబంధించిన సిఫార్సులను వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
ట్రెండ్ సెట్టింగ్ ఐడియా..ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసుల వినూత్న ప్రయోగం..
ఢిల్లీ: పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తుంటారు. దీంతో చలాన్లను ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంటారు పోలీసులు. వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడానికి పోలీసులు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సారి ఢిల్లీ పోలీసుల వినూత్నంగా ఆలోచించారు. పబ్లిక్ ఆలోచనలకు సరిపోయే విధంగా ఓ రీల్ రూపంలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఆ రీల్లో ఏముందంటే..? ఓ అందమైన అమ్మాయి పెళ్లికూతురుగా ముస్తాబైంది. ఖరీదైన దుస్తులు, నగలు ధరించింది. హెల్మెట్ లేకుండా స్కూటీని నడుపుతోంది. 'వారీ వారీ జాన్' పాటను ఎంజాయ్ చేస్తూ.. అందుకు తగ్గట్టుగా మూమెంట్స్ ఇస్తూ రైడింగ్ చేస్తున్నట్లుగా వీడియో ఉంది. కానీ చివర్లో అసలు ట్విస్టు ఎదురైంది. అలా స్కూటీ నడుపుతున్న ఆ అమ్మాయికి పోలీసులు రూ.6000 ఫైన్ విధించారు. హెల్మెట్ లేనందుకు రూ.1000, లైసెన్స్ లేనందుకు రూ.5000 చొప్పున వేశారు. జరిమానాకు సంబంధించిన 'పే స్లిప్'లు వీడియో చివర్లో చూపించారు. సదరు వీడియోను ఢిల్లీ పోలీసు తమ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానా తప్పదు అని తెలిపే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. పోలీసుల వినూత్న ఆలోచనలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. పోలీసుల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు జోహార్లు అంటూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఐడియాలు ఎక్కడ నుంచి వస్తాయయ్యా? అంటూ ఫన్నీగా స్పందించారు. Going 'Vaari Vaari Jaaun' on the road for a REEL makes your safety a REAL WORRY! Please do not indulge in acts of BEWAKOOFIYAN! Drive safe.@dtptraffic pic.twitter.com/CLx5AP9UN8 — Delhi Police (@DelhiPolice) June 10, 2023 ఇదీ చదవండి:బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! -
సిబిల్ స్కోర్ తరహాలోనే.. డ్రైవింగ్‌కూ స్కోర్! కేంద్రం కీలక నిర్ణయం?
సిబిల్ స్కోర్ తరహాలోనే డ్రైవింగ్‌కూ స్కోరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బ్యాంకులు అంత సులువుగా రుణాలు ఇస్తాయి. అలాగే డ్రైవింగ్ స్కోర్ ఎక్కువ ఉంటే వాహనాల బీమా, కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. రహదారి భద్రతలో భాగంగా కేంద్రం ఈ వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది. – సాక్షి, అమరావతి ప్రమాదాలను తగ్గించేలా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 3.84 లక్షల మంది గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 70 శాతం ప్రమాదాలు జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రత లక్ష్యాలు సాధించాలంటే డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం.. వారిని నియంత్రించడం ప్రధానమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ క్రమశిక్షణను ఎప్పటికప్పుడు అంచనా వేసే వ్యవస్థను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘రహదారి భద్రతా ప్రణాళిక 2.0’ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారంతా దీని పరిధిలోకి వస్తారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర భారీ వాహనాల డ్రైవర్ల క్రమశిక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాలు, రోడ్డు ప్రమాదాలకు కారణమైన సందర్భాలు, పోలీసులు నమోదు చేసిన కేసులు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా డ్రైవింగ్ క్రమశిక్షణకు స్కోర్ ఇస్తారు. స్కోర్ ఆధారంగా ప్రోత్సాహకాలు డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్ బాగున్నవారికి వాహన బీమాలో రాయితీలిస్తారు. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బీమా ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ధరలో రాయితీ ఇస్తారు. వీటిపై కేంద్ర రవాణా శాఖ వాహనాల తయారీ కంపెనీలు, బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ఢిల్లీలో అమలు చేయాలని భావిస్తున్నారు. లోటుపాట్లను సరిదిద్దుకుని 2025 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడీఏఎస్ ఏర్పాటు.. రెండో దశలో కార్లు, ఎస్‌యూవీలు, ఇతర భారీ వాహనాల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం(ఏడీఏఎస్)ను ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడే ఏడీఏఎస్ వ్యవస్థ కోసం కాస్త అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాల యజమానులు కూడా ఏడీఏఎస్ను తమ వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇది డ్రైవర్ నావిగేషన్‌కు సహకరిస్తుంది. అలాగే డ్రైవింగ్ సీటులో ఎవరు ఉన్నారో రికార్డు చేస్తుంది. తద్వారా క్రమశిక్షణారహితంగా వాహనం నడిపినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఏడీఏఎస్ను ఇప్పటికే విద్యుత్ వాహనాల్లో ప్రవేశపెట్టారు. త్వరలో పెట్రోల్, డీజీల్ వాహనాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడీఏఎస్ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్‌ను నిర్ణయిస్తారు. -
బ్లాక్స్పాట్లకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రమాదకర మలుపుల వద్ద రహదారి భద్రత చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర రహదారి భద్రత కమిటీ సర్వే నిర్వహించింది. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు ఎక్కువమంది దుర్మరణం చెందుతున్న బ్లాక్స్పాట్లను గుర్తించింది. అటువంటి బ్లాక్స్పాట్లు రాష్ట్రంలో 300 ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైంది. గత మూడేళ్లలో ఆ బ్లాక్స్పాట్లలో ఏకంగా 5,708 మంది దుర్మరణం చెందారని గుర్తించింది. దీంతో ఆ బ్లాక్స్పాట్ల వద్ద ఏటా రూ.400 కోట్లతో భద్రతాపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. గుంటూరు జిల్లాలో ఎక్కువ బ్లాక్స్పాట్లు రాష్ట్రంలో రహదారి భద్రత కోసం ప్రభుత్వం పోలీసు, రవాణా, వైద్య–ఆరోగ్య శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న రహదారులపై ఈ కమిటీ సర్వే చేసింది. రాష్ట్రంలో 26 జిల్లాలకుగాను 23 జిల్లాల పరిధిలో ఉన్న ఈ 300 బ్లాక్స్పాట్లలో మూడేళ్లలో 5,708 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలోని 15 బ్లాక్స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1,383 మంది దుర్మరణం చెందారు. ఆ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో బాపట్ల, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. బాపట్లలో 15 బ్లాక్స్పాట్ల వద్ద 328 మంది మృతిచెందగా, తిరుపతి జిల్లాలో 15 బ్లాక్స్పాట్లలో 282 మంది మృత్యువాత పడ్డారు. బ్లాక్స్పాట్ల వివరాలు డీఆర్సీలకు.. బ్లాక్స్పాట్ల వద్ద రూ.400 కోట్లతో అమలు చేయనున్న రహదారి భద్రత చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, స్పీడ్గన్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక అధికారులు బృందాలతో వాహనాల తనిఖీ చేపట్టడం, అంబులెన్స్‌ల ఏర్పాటు, ఆ సమీపంలోని ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరచడం వంటివి చేపడతారు. రహదారి భద్రత కమిటీ బ్లాక్ స్పాట్ల వివరాలను ఆయా జిల్లా అభివృద్ధి మండళ్లకు(డీఆర్సీలకు) సమర్పించింది. ఈ ప్రదేశాల్లో చేపట్టాల్సిన పనులను జిల్లా భద్రత కమిటీల ఆధ్వర్యంలో చేపడతారు. బ్లాక్స్పాట్ల వద్ద భద్రత చర్యలను మెరుగుపరిచిన ఏడాది తరువాత పరిస్థితి సమీక్షిస్తారు. రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గిందీ లేనిదీ పరిశీలిస్తారు. తదనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారు. ఈ విధంగా ఐదేళ్లపాటు బ్లాక్స్పాట్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
టీమిండియాను మరోసారి ముందుండి నడిపించనున్న సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం, భారత లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మరోసారి భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. సెప్టెంబర్ 10 నుంచి ఆక్టోబర్ 1 వరకు కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్, డెహ్రడూన్ వేదికలుగా జరిగే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2 కోసం ఇండియన్ లెజెండ్స్ జట్టుకు సచిన్ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దిగ్గజ జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎడిషన్‌లో కొత్తగా న్యూజిలాండ్ టీమ్ కూడా యాడ్ కావడంతో మొత్తం జట్ల సంఖ్య 8కి చేరింది. రోడ్ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి సీజన్లో సచిన్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2లో పాల్గొనే భారత జట్టు ఇదే.. సచిన్ టెండూల్కర్ (కెప్టెన్) రాజేశ్ పవార్ వినయ్ కుమార్ యూసఫ్ పఠాన్ నమన్ ఓజా సుబ్రమణ్యం బద్రీనాథ్ నోయల్ డేవిడ్ మన్‌ప్రీత్ గోని మునాఫ్ పటేల్ ప్రగ్యాన్ ఓజా ఇర్ఫాన్ పఠాన్ మహ్మద్ కైఫ్ యువరాజ్ సింగ్ చదవండి: టీమిండియాతో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. కళ్లన్నీ ఆ యువతిపైనే! -
బస్సు డ్రైవర్లు జాగ్రత్త ! పరధ్యానంగా ఉంటే..
రోడ్డు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. లిప్తకాలం పాటు చేసే పొరపాటు నిండు ప్రాణాలకే చేటు తెస్తుంది. తాజాగా కర్నాటకలోని కలబుర్గిలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇందుకు ఉదాహారణ. ఈ తరహా ప్రమాదాలు నివారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని నిర్ణయించింది. శివాయ్-ఈ టెక్నాలజీ ఉపయోగిస్తూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడంతో పాటు ప్రమాణంలో భద్రత పెంచే ప్రయత్నంలో ఉంది మహారాష్ట్ర సర్కారు. అందులో భాగంగా ఇటీవల ఎలక్ట్రిక్ బస్సులను మహా సర్కార్ కొనుగోలు చేసింది . వీటిని శివాయ్-ఇ పేరుతో జూన్ 1 నుంచి పూనే నుంచి అహ్మద్నగర్ల మధ్య నడిపిస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు దేశంలోని మిగిలిన బస్ సర్వీసుల కంటే మిన్నగా శివాయ్-ఇ బస్సుల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శివాయ్-ఇ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా రూపొందించారు. బస్సు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండేందుకు.. ఇందులో డ్రైవర్ క్యాబిన్ సెంట్రిక్‌గా సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ టీవీ కెమెరా మానిటరింగ్ వ్యవస్థకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించారు. అంతేకాదు సీసీకెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా లైవ్ మానిటరింగ్ చేస్తుంటారు. అలెర్ట్.. అలెర్ట్.. ప్రయాణ సమయంలో డ్రైవర్లకు నిద్రమత్తు ఆవహించినా, డ్రైవింగ్ చేస్తూ ఎవరితోనైనా మాట్లాడుతున్నా... మొబైల్‌ఫోన్ ఉపయోగిస్తున్నా సీసీ కెమెరాలో వెంటనే పసిగడతాయి. ఈ సీసీ కెమెరాలకు అనుసంధానించబడిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్త వెంటనే తన పని ప్రారంభిస్తుంది. జాగ్రత్తగా నడపాలంటూ వాయిస్ కమాండ్స్ ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. దీంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి కూడా కీలక సూచనలు చేరవేస్తుంది. అంతేకాదు మితిమీరిన వేగంతో బస్సు వెళ్తున్నా వెంటనే అలెర్ట్ చేస్తుంది. మూడువేల బస్సుల్లో మహారాష్ట్ర ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం మూడువేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంది. వీటన్నింటిలోనూ ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారు. వీటితో పాటు పాత బస్సుల్లోనూ డ్రైవర్ మానిటరింగ్ అలెర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మహా రవాణా శాఖ అధికారులు తెలిపారు. చదవండి: ఎక్కడికెళ్లినా ఈ పాడు బుద్ది పోదా.. మెటావర్స్‌లో లైంగిక వేధింపులు -
యువరాజ్‌సింగ్ గాయపడిన బాహుబలి..!
రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ఆదివారం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ గెలవడంలో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతగానో ఉంది.ఫైనల్లో యువరాజ్ సింగ్ 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇండియా టీం ప్లేయర్లకు హోటల్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. యువరాజ్ సింగ్ భారత ఆటగాళ్లకు జరిగిన స్వాగత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక్కడ చదవండి: ఇండియాదే లెజెండ్స్ కప్ వీడియోలో యువీ హోటల్లోకి డ్యాన్స్ చేస్తూ వచ్చాడు , సిబ్బంది అతనికి గౌరవ సూచకంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ మాదిరిగా, లాంగ్ హ్యాండిల్ ప్యాన్లను కత్తులలాగా పైకిలేపారు. ఈ వీడియోకు బ్లాక్ గ్రౌండ్లో సాహోరే బాహుబలి పాటను వేశారు. ఫైనల్ మ్యాచ్‌లో యువీ కుడికాలికి కాస్త గాయమైంది. దీంతో యువీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "బ్రోకెన్ బాహుబలి," అంటూ వీడియోకు క్యాప్షన్ ఇస్తూ షేర్ చేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్లో అత్యధిక సిక్సర్లను బాదిన బ్యాట్స్‌మన్‌గా యువరాజ్ సింగ్ నిలిచాడు. ఏడు మ్యాచ్‌లలో 17 సిక్స్‌లను కొట్టాడు. View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) (చదవండి: యువీ దూకుడు.. యూసఫ్ మెరుపులు) -
కోహ్లి డకౌట్; ఉత్తరాఖండ్ పోలీస్ వార్నింగ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ 3వ వేసిన స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లిన విరాట్ కోహ్లీ మిడాఫ్ దిశగా ఫీల్డర్ క్రిస్ జోర్దాన్ తలమీదుగా బౌండరీ కొట్టేందుకు ట్రై చేశాడు. కానీ అనూహ్యంగా బంతి బౌన్స్ కావడంతో.. కోహ్లి ఆశించిన విధంగా షాట కనెక్ట్ కాలేదు. దాంతో బంతి నేరుగా వెళ్లి క్రిస్ జోర్దాన్ చేతుల్లో పడింది. దీంతో కోహ్లి ఏమి చేయలేక నిరాశగా వెనుదిరిగాడు. అయితే కోహ్లి డకౌట్‌ను షేర్ చేస్తూ ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం తమ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. ''హెల్మెట్ పెట్టుకోవడం ఒకటే కాదు.. బాధ్యతాయుతంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవు. ఒకవేళ అలాకాకుండా నిర్లక్ష్యంగా ఉన్నారంటేకోహ్లి మాదిరే జీవితంలోనూ డకౌట్ అవుతారు ''అంటూ ట్వీట్ చేశారు. అయితే కోహ్లిని కించపరచడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఇలా చేశామని ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం తెలిపింది. కాగా ఇంతకముందు పాకిస్థాన్‌పై 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా చేసిన నోబాల్ తప్పిదాన్ని జైపూర్ ట్రాఫిక్ పోలీసులు అప్పట్లో బ్యానర్లుగా వేయించి సిగ్నల్స్ వద్ద వాహనదారులకి అవగాహన కల్పించారు. భారత్‌లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అవగాహన కోసం పోలీసులు ఇలాంటివి వినియోగిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జేసన్ రాయ్ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీసినందుకుగాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) ఇదే వేదికలో జరగనుంది. చదవండి: సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం కోహ్లి కథ ముగిసినట్టేనా..! हेलमेट लगाना ही काफ़ी नहीं है! पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है, वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. #INDvEND #ViratKohli pic.twitter.com/l66KD4NMdG — Uttarakhand Police (@uttarakhandcops) March 12, 2021 -
ప్రతి 84 నిమిషాలకు ఒక ప్రాణం బలి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా వాహనదారుల తీరులో మార్పు రావడం లేదు. ఏటా దేశంలో దాదాపు 1,60,000 మంది (రాష్ట్రంలో 6,600–7,200 మంది) అకాల మరణం చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రోడ్డు భద్రతా వారోత్సవాల స్థానంలో మాసోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అన్ని రాష్ట్రాల్లోని రవాణా, పోలీసు, వైద్య, విద్య, పంచాయతీ శాఖలను భాగస్వాములను చేసింది. కోవిడ్ కారణంగా తెలంగాణలో స్కూళ్లు సరిగ్గా తెరుచుకోకపోవడంతో విద్యాశాఖ అంతగా ప్రచారం చేపట్టనప్పటికీ పోలీసు, రవాణా, పంచాయతీ, వైద్య శాఖలు చురుగ్గానే ప్రచారం చేశాయి. అయినా గతేడాది జనవరితో పోలిస్తే ఈ జనవరిలో ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు.. దేశంలో కరోనా అన్‌లాక్ ప్రక్రియ మొదలైనా వైరస్ వ్యాప్తి భయంతో చాలా మంది రైళ్లు, బస్సులను కాదని వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల వైపు మొగ్గుచూపారు. దీంతో కార్లు, బైకుల విక్రయాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ట్రాఫిక్‌తోపాటు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి సంఖ్య పెరగడం తదితర కారణాల వల్ల ఈ జనవరిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. దీనికితోడు రాష్ట్రంలోని బ్లాక్ స్పాట్ల నివారణపై ఇంతవరకూ ఎలాంటి ముందడుగు పడలేదు. చాలాచోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టలేదు. ఇవి కూడా ప్రమాదాలు అధికమయ్యేందుకు కారణమయ్యాయి. గతేడాది జనవరిలో జరిగిన 2,008 ప్రమాదాల్లో 576 మంది మరణించగా 2,072 మంది గాయపడ్డారు. ఈ ఏడాది జనవరిలో 2,027 ప్రమాదాలు చోటుచేసుకోగా అందులో 627 మరణాలు సంభవించాయి. 2,038 గాయాలపాలయ్యారు. అంటే ప్రతి 24 గంటలకు 20 మంది మరణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి 84 నిమిషాలకు ఒక ప్రాణాన్ని రహదారులు మింగేస్తున్నాయి. మార్పు చూపని ప్రచారం.. కారు సీటు బెల్టు ధరించడం, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం ప్రాధాన్యం తదితర అంశాలపై దాదాపు నెలరోజులు పోలీసులు, రవాణాశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించినా అవేవీ వాహనదారుల్లో పెద్దగా మార్పు చూపించలేకపోయాయి. ఎప్పటిలాగే వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలకు నీళ్లొదిలి గతేడాది కంటే అధికస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడుతుండటం గమనార్హం. మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం పోలీసులు విధించిన జరిమానాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో నమోదు చేసిన వివిధ ఉల్లంఘనలు, జరిమానాలు ఇలా.. క్రం.సం ఉల్లంఘన రకం నమోదైన కేసులు విధించిన జరిమానా 01 అతివేగం 1,19,489 10,69,85,175 02 ఓవర్‌లోడ్ 16,638 15,24,635 03 రాంగ్ పార్కింగ్ 72,881 1,43,79,164 04 గూడ్సు వాహనాల్లో ప్రయాణం 4,886 7,60,351 05 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 10,044 69,85,390 06 సీటు బెల్టు ధరించకపోవడం 10,016 12,11,415 మొత్తం 2,33,954 13,18,46,130 -
అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం!
సాక్షి, అమరావతి: రహదారి భద్రతకు సంబంధించి ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల కంటే తక్కువగా సస్పెండ్ చేయాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్ (డీసీ)లను రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశించారు. ప్రస్తుతం పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి వారి లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమైన 4 కేటగిరీల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని, ఈ నిబంధన కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు కేటగిరీలు ఇవే.. కేంద్ర మోటారు వాహన చట్టం సెక్షన్ 19 కింద డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తారు. అధిక వేగంతో వెళ్లినా..ఓవర్ లోడ్‌తో వాహనం నడుపుతున్నా, మద్యం సేవించి వాహనం నడిపినా, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపినా డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు. మోటార్ వాహన చట్టం 206(4) సెక్షన్ కింద ఉల్లంఘనలకు పాల్పడినా.. లైసెన్స్ సస్పెండ్ చేయాలని అధికారులను రవాణా శాఖ ఆదేశించింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవాల్సి ఉంటుంది. రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రీ ఎల్ఎల్ఆర్ (లెర్నర్ లైసెన్స్ ఇచ్చే ముందు) దరఖాస్తుదారులకు ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకుగాను విజయవాడ, విశాఖలలో సేఫ్టీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2022 మార్చి కల్లా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. శిక్షణకు హాజరైతేనే ఎల్ఎల్ఆర్ రవాణా శాఖ కార్యాలయాల్లో లెర్నర్ లైసెన్స్‌లకు స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు ముందుగా 2 గంటల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహకారం అందించేందుకుగాను హోండా మోటార్ సైకిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. ఎల్ఎల్ఆర్ పరీక్షలకు హాజరయ్యే దరఖాస్తుదారులకు ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంటుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రహదారి భద్రతకు సంబంధించి వాహనదారుల్లో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ఈ శిక్షణ అవసరమని రవాణా శాఖ భావిస్తోంది. ఎల్ఎల్ఆర్ దరఖాస్తుదారులు కచ్చితంగా శిక్షణ కార్యక్రమానికి హాజరైతేనే ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తారు. -
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు యూపీలోనే ఎక్కువ
ఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన 32వ జాతీయ రహదారి భద్రత సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పేర్నినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రహదారి భద్రతా నియమాలు పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. రహదారి ప్రమాదాల గణాంకాల ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అధికమని పేర్కొన్నారు. దేశంలో యూపీలో ఎక్కువ మరణాలు నమోదవుతున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్‌తో ఏడాదిలో 1.45 లక్షల మరణాలు నమోదు కాగా, రోడ్డు ప్రమాదాల్లో 1.51 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి కంటే రహదారి ప్రమాదాలు చాలా ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా చనిపోతున్నారని, తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వారు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలు పాటించడంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకుని మరణాల సంఖ్యను నివారించాలని మంత్రి పేర్నినాని విజ్ఞప్తి చేశారు. -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పఠాన్
ముంబై : ఇర్ఫాన్ పఠాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో భారత జట్టు సునాయాస విజయాన్ని చేజెక్కించుకుంది. అదేంటి పఠాన్ ఈ మధ్యనే ఆటకు వీడ్కోలు పలికాడుగా.. మ్యాచ్ ఎప్పుడు ఆడాడనేగా మీ సందేహం.. ఏం లేదండి రోడ్ సేప్టీపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేప్టీ సిరీస్ నిర్వహిస్తోంది. ఈ సిరీస్‌లో పలువురు భారత మాజీ ఆటగాళ్లు ఆడుతున్నారు. కాగా ఇండియా లెజెండ్స్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. (సెహ్వాగ్ అదే బాదుడు) ముందుగా బ్యాటింగ్ దిగిన శ్రీలంక లెజెండ్స్ మునాఫ్ పటేల్ 4 వికెట్లతో రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ ఆదిలోనే సచిన్(0), సెహ్వాగ్(3) వికెట్లను కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన యూవీ(1) కూడా అవుటవడంతో 5 ఓవర్లో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజయ్బంగర్, కైఫ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే బంగర్, కైఫ్‌లు వెనువెంటనే వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్ 5 వికెట్లు కోల్పోయింది. (క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?) ఈ దశలో క్రీజలోకి వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ మన్‌ప్రీత్ గోని సహాయంతో చెలరేగిపోయాడు. పఠాన్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. కాగా పఠాన్ 31 బంతుల్లోనే 57 పరుగులు చేసి ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బౌలింగ్ వేసిన పఠాన్ కీలకమైన తిలకరత్నే దిల్షాన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా శనివారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్- వెస్టిండీస్ లెజెండ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ వీర బాదుడుతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. (ఆ పంచ్‌లకు సచిన్ మురిసిపోయాడు!) The Highlights of The Match Winning Knock Played by @IrfanPathan 🔥🔥🔥 57* In just 31 Deliveries ❤️🙏🏻 #IrfanPathan #roadsafetyworldseries2020 #IndiaLegends #INDvsSL #CricketMeriJaan #cricketsuperstar #pathanpower pic.twitter.com/9BiGyWzBLJ — JABIR PATEL (@MUHAMMEDJABIR78) March 11, 2020 -
ప్రమాదాల నివారణకు చర్యలు
మెదక్ రూరల్: ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులను(బ్లాక్ స్పాట్లను), జాతీయరహదారికి సమీపంలోని గ్రామాలకు వెళ్లే దారులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదకరమైన ప్రతి మలుపు వద్ద హెచ్చరిక బోర్డులను, స్టాపర్లను, సీసీ కెమెరాలను ఏర్పాటుచేసే విధంగా సంబంధిత అధికారులను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదాలు జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు తమవంతు బాధ్యతగా భావించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా, రాష్ట్ర ముఖ్య రహదారులు, అవసరమైన ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను, రేడియం స్టిక్కర్లతో సూచిక బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత త్వరగా బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటని పోలీస్స్టేషన్లకు అనుసంధానించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణమూర్తితో పాటు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఉన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదకర మూలమలుపులను పరిశీలిస్తున్న ఎస్పీ -
సమంత సందేశం
-
ఒక్క క్షణం.. ఆలోచించండి
నాగర్‌కర్నూల్ క్రైం: మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు నిబంధనలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు కొద్దిరోజులు మాత్రమే నిబంధనలు అనుసరిస్తూ మళ్లీ యథావిధిగా మారుతున్నారు. ఏ విషయంలోనైనా చట్టాలు కఠినంగా అమలు చేస్తే వచ్చే ఫలితాల కన్నా ప్రజలు స్వచ్ఛందంగా చట్టం పరిధిలో నడుచుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిఏటా దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 161 రోడ్డు ప్రమాదాలు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో గడిచిన ఏడాది 161 ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించగా అందులో 172 మంది మరణించారు. అలాగే సాధారణ రోడ్డు ప్రమాదాలు 193 నమోదు కాగా అందులో 478 మంది గాయపడ్డారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై మరణించిన వారిలో హెల్మెట్ లేకుండా, సీట్ బెల్టు లేకుండా, పరిమితికి మించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైన వారే అధికంగా ఉన్నారు. జాగ్రత్తలు పాటిస్తే.. వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా తాగి వాహనాలను నడిపే వారి వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో భారీగా ప్రాణనష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తాగి వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతనే వాహనాలు నడపాలి. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉండటంతో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదు. వాహనడ్రైవర్లు ఎక్కువ గంటలు వాహనాలను నడపడం వల్ల అలసిపోయి నిద్రలోకి జారుకొని అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. డ్రైవర్లు అలసిపోయే వరకు ఎక్కువ గంటలు వాహనాలను నడపకూడదు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. వినూత్నంగా ప్రచారం.. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఎస్పీ సాయిశేఖర్ ఆదేశాలతో పోలీస్, రవాణా శాఖాధికారులు సంయుక్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లాలో శనివారం వరకు వాహనదారులకు, ఆటోడ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, ఆర్టీసి డ్రైవర్లతోపాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానాల రూపంలో నగదు వసూలు చేసే అధికారులు ప్రస్తుతం ప్రజల్లో మార్పు రావడం కోసం వినూత్నంగా జరిమానాలకు బదులుగా హెల్మెట్, సీటుబెల్టు ధరించని వాహనదారులకు పూలు అందిస్తూ మార్పును కోరుకుంటున్నారు. స్వచ్ఛందంగా మార్పురావాలి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకూడదంటే వాహనదారుల్లో స్వచ్ఛందంగా మార్పు రావాలి. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే కుటుంబ సభ్యులకు కలిగే ఆవేదనను ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకోవాలి. చట్టాలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎర్రిస్వామి, జిల్లా రవాణా శాఖాధికారి, నాగర్‌కర్నూల్ -
తప్పు ఎవరిదైనా ప్రాణం చాలా ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ట్రాఫిక్ రూల్స్ ఓ భాగమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. వీటిని గౌరవించి ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పోలీసులు ఉన్నదే ప్రజల కోసమన్నారు. మీ భద్రత మా బాధ్యతగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో బాధ్యతాయుత పౌరునిగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఈ బాధ్యత కొత్త జనరేషన్‌పై ఎక్కువగా ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో యువత అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు అనుక్షణం కృషి చేస్తున్నారన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఏటా అనేక మంది మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదంలో యువత మృతి.. వారి కుటుంబాలకు తీరని లోటని పేర్కొన్నారు. నిన్న యూసఫ్‌గూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందారని, తప్పు ఎవరిదైనా ప్రాణం చాలా ముఖ్యమన్నారు. హెల్మెట్ దరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి, పోలీసులకు సహకరించాలని యువతను కోరారు. చదవండి: డెత్ స్పీడ్‌లో యూత్.. దయచేసి లైనులో వెళ్లండి -
మర్యాదగా బండి నడపండి...
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో యువత నెత్తురోడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం జరుగుతున్నప్రమాదాల్లో యువతే పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు.అదే సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. దీంతో వేలాది కుటుంబాలు సంపాదించే వాళ్లను కోల్పోయి రోడ్డునపడుతున్నాయి. రహదారి భద్రతా నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అపరిమితమైన వేగం, సెల్ఫోన్లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్ల చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 80 శాతం ప్రమాదాలు ఓవర్‌స్పీడ్ వల్లనే జరుగుతున్నట్లు అంచనా. గత రెండేళ్లలో సుమారు 3536 మంది చనిపోయారు. రహదారి భద్రతా సంస్థ, రవాణా శాఖ అంచనాల మేరకు వారిలో 75 శాతం మంది 18 నుంచి45 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వాహనాలు నడిపే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను కబలిస్తోందని రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ‘యువశక్తిని ’లక్ష్యంగా చేసుకున్నాయి. రహదారి భద్రతకు యువశక్తి ఎంతో అవసరమని నినదిస్తున్నాయి. ఇటు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు, అటు దేశానికి ఎంతోకీలకమైన యువతలో రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూత్ సేఫ్టీయే రోడ్‌సేఫ్టీ... ఒకవైపు ఓవర్‌స్పీడ్. మరోవైపు దానికి ఆజ్యం పోస్తున్న మద్యం. దీంతో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లవలసిన కార్లు 130 నుంచి 150 కిలోమీటర్ల వరకు పరుగులు తీస్తున్నాయి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మొదలుకొని ఔటర్ రింగ్‌రోడ్డు వరకు, నగరంలోని అనేక చోట్ల ఈ వేగమే యువత ప్రాణాలను కబలిస్తోంది. ఖరీదైన వాహనాలపైన అపరిమితమైన వేగంతో దూసుకుపోవడాన్ని ఎంతో క్రేజీగా భావిస్తున్నారు. కార్లు, బైక్‌లపైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి బంగారు భవిష్యత్తు రక్తసిక్తమవుతుంది. గతేడాది తెలంగాణలో 21,588 ప్రమాదాలు జరిగితే వాటిలో 6434 ప్రమాదాలు ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే చోటుచేసుకున్నాయి. 1863 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 8790 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 75 శాతం కుటుంబాన్ని పోషించే వాళ్లే. దీంతో అప్పటి వరకు ఎలాంటి బాధలు, కష్టాలు లేకుండా ప్రశాంతంగా గడిపిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కకావికలమవుతున్నాయి. సికింద్రాబాద్ ఆర్టీఏ వద్ద వాహనదారులకు నిబంధనలు తెలియజేస్తున్న దైవజ్ఞశర్మ, ఆర్టీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఓవర్‌స్పీడ్ వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి వర్గాలే ఉన్నారు.ద్విచక్రవాహనదారులు, పాదచారులే ఎక్కువగా చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్ధిక తోడ్పాటు ఎంతో ముఖ్యమేనని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్ల ప్రవర్తన వల్లనే జరుగుతున్నాయి. పరిమితికి మించిన వేగం, పరిమితికి మించిన బరువు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్లు మాత్రం పాదచారులు, సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులే.’ అని ప్రముఖ రోడ్డు భద్రతా నిపుణులు నరేష్ రాఘవన్ అన్నారు. ‘ఒకప్పటి ఉమ్మడి కుటుంబ సంస్కృతి ఇప్పుడు లేదు, న్యూక్లియర్ కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కష్టపడుతారు. ఎన్నో కలలు కంటారు. కానీ అలాంటి ఇంట్లో సంపాదించే ముఖ్యమైన వ్యక్తే చనిపోవడం వల్ల మొత్తం కుటుంబమే దిక్కులేనిదవుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మర్యాదగా బండి నడపండి... రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోన్న రవాణాశాఖ వాహనదారులు మర్యాదగా బండి నడపాలని సూచిస్తోంది. రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి వాహనదారుడు, తన తోటి వాహనదారుడికి అవకాశం ఇస్తూ ప్రయాణం చేయడం ఒక బాధ్యతగా భావించాలి.ఈ లక్ష్యంతోనే వాహనదారుల్లో స్ఫూర్తిని కలిగిస్తూ హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నగరంలో గత రెండేళ్లుగానమోదైన ప్రమాదాల వివరాలు సంవత్సరం ప్రమాదాలు క్షతగాత్రులు మృతులు 2018 6434 8790 1863 2019 6523 8679 1673 -
నిబంధనలు తెలుసుకో.. ప్రాణం విలువ తెలుసుకో..
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, వాహన చోదకుల్లో అవగాహన పెంచేందుకు రవాణాశాఖ ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్ని నిర్వహిస్తోంది. కరపత్రాలు, ప్రచార రథాలు, యాక్సిడెంట్ వాహనాల ప్రదర్శన, అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. రవాణాశాఖ నిబంధనలు వాటిని అతిక్రమిస్తే తీసుకునే చర్యలపై ప్రత్యేక కథనం. కడప వైఎస్ఆర్ సర్కిల్:బడి బస్సులకు..ఏపీ మోటారు వాహన నియమావళి ప్రకారం 1989లో 185(జి) ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోకూడదు. 60 ఏళ్ల వయస్సు దాటిన వారు డ్రైవింగ్ చేయరాదు. పర్మిట్ నిబంధనల్ని ఉల్లఘించరాదు. నిబంధనలు అతిక్రమిస్తే మోటారు వాహన చట్టం సెక్షన్ 85 కింద జరిమానా, పర్మిట్‌పై చర్య తీసుకుంటారు. డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ వద్దు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే మోటారు వాహన చట్టం 184 ప్రకారం రూ. వెయ్యి జరిమానా లేదా సీఎంవీ రూల్ 21 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు రద్దు చేస్తారు. సెల్లో మాట్లాడుతూ ఏ వాహనాన్ని డ్రైవ్ చేసినా ఇవే చర్యలు ఉంటాయి. హెల్మెట్ ప్రాణానికి రక్ష.... హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో ప్రాణానికి రక్షణగా ఉంటుంది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేకుంటే మోటారు వాహనాల చట్టం సెక్షన్ 194డీ ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేస్తారు. అతివేగం ప్రమాదకరం: అతివేగం అత్యంత ప్రమాదకరం. శ్రుతిమించిన వేగం వల్ల వాహన చోదకుడితో పాటు ఎందరో అభాగ్యులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 112,183(1) ప్రకారం అతివేగంగా వాహనాలు నడిపిన వారికి రూ.2 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు. సిగ్నల్ జంప్ చేస్తే: రాష్ డ్రైవింగ్ చేస్తూ సిగ్నల్ జంపింగ్ చేస్తే నేరం. వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు. తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. వాహనం నడపాలంటే ఇవి తప్పనిసరి వాహనం నడిపేందుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తప్పని సరిగా ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్లు 39,192 ప్రకారం జరిమానా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మోటారు సెక్షన్ 3,4, 180,181 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే సెక్షన్ 190(2) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే సెక్షన్ 196(ఏ) ప్రకారం మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా ఉంటుంది. సీటు బెల్ట్ ధరించకుంటే : సీఎంవీ రూల్ 138(3) ప్రకారం విధిగా సీటు బెల్ట్ ధరించాల్సిందే. సీటు బెల్ట్ ధరించకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్ 194(బి) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ప్రమాదాల్నినివారించడమే లక్ష్యం రోడ్డు ప్రమాదాలను నివారించడమే రోడ్డు భద్రత వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. లారీ, బస్సు, ఆటో డ్రైవర్లతో పాటు విద్యార్థులకు కూడా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. డ్రైవర్ల ఆరోగ్య స్థితులపై వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.–శాంతకుమారి, ఆర్టీఓ, కడప -
హైవే పోలీస్
సాక్షి,సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలుజరిగినప్పుడు క్షతగాత్రులను రక్షించే క్రమంలో తమపైనా కేసులునమోదవుతాయన్న అపోహలు ప్రజలు వీడనాడాలని, సహాయం చేసేవారిపై ఎలాంటి కేసులు ఉండవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర సమయాల్లో సహాయం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో గురువారం హైవే పెట్రోలింగ్ వాహనాలను ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్‌తో కలిసి సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. ఇటు జాతీయరహదారులు, అటు అంతర్గతరహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో క్షతగ్రాతులను సరైన సమయాల్లో ఆస్పత్రికి చేర్చకపోవడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్టుఅధ్యయనంలో తేలిందన్నారు. ఈ ఏడాది రోడ్డు భద్రతపై ప్రధానంగా దృష్టి సారించామని, ఇందులో భాగంగా‘నేషనల్ హైవే పెట్రోలింగ్’తోపాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 36 పోలీసు స్టేషన్ల పరిధిలో కానిస్టేబుల్ స్థాయి గల సిబ్బందిని రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల సహాయానికి కో–అర్డినేటర్స్ (సమన్వయకర్త)గా నియమించామన్నారు. వీరు 24 గంటలపాటు విధుల్లో సేవలు అందిస్తారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు బతికేందుకు అవకాశమున్న ‘గోల్డెన్ అవర్’(తొలి గంట)లో ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రిలో చేర్పించేలా అటు హైవే బృందాలు, ఇటు కో–అర్డినేటర్స్ సమర్థంగా పనిచేసేలా వైద్యులతో శిక్షణ ఇప్పించామని సీపీ చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు రక్షించడంపై ప్రతి ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్‌తో పాటు ఎమర్జెన్సీ సెంటర్ ఉండేలా చూడాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను కోరామన్నారు. తొలిసారి శంషాబాద్ జోన్లో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ఎన్‌హెచ్–44 మార్గంలోని రాజేంద్రనగర్ ఠాణా పరిధి హసన్‌నగర్ ఎక్స్ రోడ్డు నుంచి షాద్‌నగర్ ఠాణా పరిధిలోని హమీద్ కాటన్ మిల్స్ వరకు 54 కిలోమీటర్లలో నాలుగు పెట్రోలింగ్ వాహనాలు గురువారం నుంచి సేవలు అందిస్తాయని సీపీ సజ్జనార్ తెలిపారు. త్వరలో మాదాపూర్, బాలానగర్ జోన్లలోనూ హైవే పెట్రోలింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ‘ఒక్కో పెట్రోలింగ్ వాహనంలో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక డ్రైవర్ ఉంటారు. వీరికి రోడ్డు ప్రమాద సమయాల్లో అవసరమైన 18 అర్టికల్స్ అందించాం. ఫస్ట్ ఎయిడ్ కిట్, బ్రీత్ అనలైజర్, ట్యాప్, వాహనాలు ప్రమాదమై అందులో శరీరాలు ఇరుక్కుపోయినా.. వెహికల్ స్ట్రక్ అయినా కట్ చేయడానికి కట్టర్స్, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి స్ట్రెచర్ అందుబాటులో ఉంచాం. రెండు షిఫ్ట్‌ల్లో 24 గంటల పాటు పెట్రోలింగ్ చేస్తారు. ఏమాత్రం ఇబ్బంది, అవసరమున్నా, రోడ్డు ప్రమాదమైనా డయల్ 100కి కాల్ చేయండి. లేదంటే హైవే పెట్రోలింగ్ నంబర్ 85004 11111కు సమాచారం అందించండి’ అని సీపీ ప్రజలను కోరారు. హైవే రక్షణ దళం విధులు ఏమంటే.. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఈ హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెళ్లి క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స చేసి వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తారు. ఫొటో, వీడియో తీస్తారు. లా అండ్ అర్డర్ పోలీసులు, 108కి కూడా సమాచారం ఇస్తారు. డ్రంకన్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ట్రిపుల్ రైడింగ్, ఆటోల్లో ఎక్కువగా ప్రయాణికులు, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, అతి వేగంగా వెళ్లడం తదితర ట్రాఫిక్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటారు. అనధికారిక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలతో పాటు మద్యపానాన్ని నియంత్రిస్తారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటారు. వాహనాలు బ్రేక్‌డౌన్, ఇంధనం అయిపోయినా, సరైన మార్గం లేకుండా వేచి ఉండేవారికి సహకరిస్తారు. ఆస్పత్రులు, ఠాణాలు, ఆర్టీఓ, ఎన్హెచ్ఏఐ సిబ్బందిని సమన్వయం చేస్తారు. అలాగే, రోడ్డు ధ్వంసమై ఉండటం, సైన్ బోర్డులు, మార్కింగ్‌లు సరిగా లేకపోయినా నివేదిక రూపొందించి సంబంధిత విభాగాలకు పంపుతార’ని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. త్వరలో ఈ ప్రాంతాల్లోనూ.. స్టేట్ హైవే నార్సింగి నుంచి మెయినాబాద్ చేవెళ్ల రోడ్డు శంకర్పల్లి రోడ్డు, రాజీవ్ రహదారి, డెయిరీ ఫాం సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్, హత్వేలీ నేషనల్ హైవే, మియాపూర్ జంక్షన్ నుంచి బాచుపల్లి గండిమైసమ్మ మేడ్చల్ చెక్‌పోస్టు ప్రాంతాల్లో హైవే పెట్రోలింగ్‌ను అందుబాటులోకి తేనున్నారు. -
దయచేసి లైనులో వెళ్లండి
నిత్యం రహదారిపై తిరుగుతూ ఉంటాం. కానీ మనలో ఎంతమందికి రోడ్డు నిబంధనలు తెలుసు? అంటే సగం మంది నుంచి కూడా సమాధానం రాదు. ఎవరికి వారు ఇష్టానుసారం దూసుకుపోతుంటారు. ఎదుటివారికి ఇబ్బంది కలిగినా.. వెళ్లేది రాంగ్ రూట్ అయినా ఎక్కడి నుంచో దూసుకొచ్చివాహనాన్ని అడ్డంగా పెట్టేస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలో ‘లైన్ డిసిప్లేన్’ అమలు చేయాలని యోచిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తప్పనిసరిగా అమలు చేస్తున్న ఈ విధానం ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ ‘లైన్ డిసిప్లేన్’ విధానాన్ని గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులుభావిస్తున్నారు. ముంబైలో విజయవంతం మహానగరం కంటే వాహనాలు ఎక్కువగా ఉన్న ముంబైలో లేన్ డిసిప్లేన్ విధానం అమలు చేస్తున్నారు. ఇది అక్కడ మంచి ఫలితాలనిచ్చింది. అక్కడి అధికారులు కొన్నేళ్ల క్రితమే లేన్ డిసిప్లేన్‌ను అమలు చేశారు. నగరంలో తిరిగే వాహనాల సామర్థ్యం, ప్రయాణించే వేగాన్ని బట్టి సిగ్నల్స్ వద్ద వేర్వేరుగా లైన్లు కేటాయిస్తారు. రెడ్‌లైట్ పడినప్పుడు ఆయా వాహనాలను కచ్చితంగా వాటికి కేటాయించిన వరుసలోనే ఆగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రీన్‌లైట్ పడినప్పుడూ ముందుకు క్రమపద్ధతిలో వెళ్లడంతో జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్‌తో పాటు ప్రమాదాలు సైతం గణనీయంగా తగ్గాయి. ఫలితంగా ఈ విధానం అమలుకు ముందున్న పరిస్థితి పూర్తిగా మారింది. పద్ధతిలేని ప్రయాణం నగరంలో ఏ జంక్షన్ వద్ద చూసినా రెడ్‌లైట్ సిగ్నల్ పడినప్పుడు ‘స్టాప్‌లైన్’ వద్ద వాహనాలు ఆగే తీరు నిర్దిష్టంగా ఉండదు. ద్విచక్ర వాహనాల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా ఆగుతాయి. కుడి వైపు వెళ్లాల్సిన వాహనాలు కూడా ఎడమ వైపు ఆగుతుంటాయి. దీనివల్ల ‘గ్రీన్‌లైట్’ పడినప్పుడు వేటికవి ముందుకు దూసుకు పోవడానికి ప్రయత్నించడంతో అనేక సందర్భాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కొన్నిసార్లు ఇబ్బందికరమైన జంక్షన్లలో వీటివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాహన చోదకుల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఘర్షణలు పరిపాటిగా మారాయి. ఇలాంటి సమస్యలకు ‘లేన్ డిసిప్లేన్’ అమలు పరిష్కారం చూపుతుంది. ఏదైనా సంస్థ సహకారంతో.. రహదారులను సర్వే చేయడంతో పాటు లైన్ డిసిప్లేన్ అమలు, అందుకు చేపట్టాల్సిన ఇంజినీరింగ్ మార్పులను సూచించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏదైనా ప్రముఖ సంస్థకు చెందిన నిపుణుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. వారి ద్వారా సాంకేతిక అధ్యయనం చేసిన తర్వాతే లైన్ డిసిప్లేన్ విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనాల సరాసరి వేగం పెరగడంతో పాటు గమ్యం చేరే సమయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ‘గ్రీన్‌లైట్–రెడ్‌లైట్’ మధ్య సమయంలో సిగ్నల్‌ను 100 వాహనాలు దాటుతున్నాయనుకుంటే.. లేన్ డిసిప్లేన్ అమలుతో ఆ వాహనాల సంఖ్యను 150కి పైగా దాటేలా చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. లేన్ డిసిప్లేన్ విధానాన్ని పరిచయం చేయడానికి ముందు కొన్ని మౌలిక వసతులను మెరుగుపచడంతో పాటు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని రోడ్లలోనూ సాధ్యమేనా! ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ లైన్ డిసిప్లేన్ విధానాన్ని కేవలం జంక్షన్ల వద్దే కాకుండా.. రహదారుల పైనా అమలు చేయాలని భావిస్తున్నారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లోని రహదారులూ ఒకేలా లేవు. కొన్ని రోడ్లు అవసరమైన వెడల్పుతో ఉండగా.. మరికొన్ని కుంచించుకుపోయి, బాటిల్ నెక్స్‌గా మారాయి. జంక్షన్ల పరిస్థితీ ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఒకేసారి ‘లైన్ డిసిప్లేన్’ విధానాన్ని అమలుచేస్తే వీటివల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తి వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా లైన్ విధానం అమలుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. గ్రేటర్లో ప్రాథమికంగా ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయోగాత్మకంగా ‘లైన్ డిసిప్లేన్’ విధానం అమలు చేసి.. ఆపై అనువైన ప్రతి మార్గానికీవిస్తరించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం అవసరమైన అధ్యయనంచేయడానికి ఓ సంస్థ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విధానం ముంబైలో మంచి ఫలితాలిచ్చిందంటున్నారు. రాజధానిలోని రోడ్లపై ‘లేన్ డిసిప్లేన్’ను అమలు చేయడం ద్వారా వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచడంతో పాటు వాహన చోదకులు గమ్యం చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
వీళ్లింతే.. వాళ్లంతే! స్పీడ్‌కు లాక్ లేకపాయె!
సాక్షి,సిటీబ్యూరో: రహదారి భద్రత కోసం ప్రతిష్ఠాత్మకంగాప్రవేశపెట్టిన ‘స్పీడ్ గవర్నర్’ల వినియోగం ఆచరణలోఅపహాస్యం పాలవుతోంది. కొంతమంది తమవాహనాలను ఫిట్నెస్ పరీక్షలకు తెచ్చే ముందే ఆర్టీఏ ఏజెంట్లు, దళారుల సాయంతో తాము కోరుకున్న స్పీడ్కుఅనుగుణంగా స్పీడ్ గవర్నర్లను బిగించుకొని వస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పరీక్షల వరకు వేగాన్ని నియంత్రణలో ఉంచుకొని తర్వాత చెలరేగిపోతున్నారు. ఇందుకోసంటెక్నీషియన్ల సహాయంతో తమకు అనుకూలంగా స్పీడ్‌గవర్నర్ డివైజ్‌లో మార్పులు చేయించుకుంటున్నారు. మరోవైపు వేగనియంత్రణ డివైజ్‌లను ఏర్పాటు చేసిన తర్వాత వాహనాల వేగం ఎలా ఉందనే అంశాన్ని ఏ మాత్రంపరిశీలించకుండానే ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ఇచ్చేస్తున్నారు. దీంతో నగరంలో స్పీడ్ గవర్నర్ల ఏర్పాటుఒక ఫార్స్‌గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి దాకా సుమారు 50 వేలకు పైగా వాహనాలకు స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేస్తే..వాటిలో స్కూల్ బస్సులు మినహా మిగతా వాహనాల్లోసగానికి పైగా వేగనియంత్రణకు తిలోదకాలిచ్చేశాయి.వీటిలో ఎక్కువ శాతం క్యాబ్‌లు మ్యాక్సీ క్యాబ్‌లు, తదితర ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. రహదారి భద్రతకు తూట్లు అపరిమితమైన వేగం వల్లనే హైవేలపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనాల వేగానికి కళ్లెంవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను డ్రైవర్లు అదుపు చేయలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం తీవ్రంగా ఉంటోంది. ఏటా కొన్ని వందలమంది మృత్యువాత పడుతున్నారు. అంతే సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చనే ఉద్దేశంతో వేగనియంత్రణ పరికరాలను తప్పనిసరి చేశారు. 2015 తర్వాత వచ్చిన వాహనాలకు వాటి తయారీ సమయంలోనే వేగనియంత్రకాలను అమర్చగా, అంతకంటే ముందు మార్కెట్లోకి వచ్చిన వాహనాలకు మాత్రం నిబంధన మేరకు కొత్తగా నియంత్రికలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ లెక్కన గ్రేటర్లో సుమారు 4 లక్షల వాహనాలకు వేగనియంత్రకాలను అమర్చాలి. కానీ స్పీడ్ గవర్నర్లను బిగించిన తర్వాత నిబంధనల మేరకు వాహనాల వేగం 80 కిలోమీటర్లకు పరిమితమైందా, లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించకుండానే మోటారు వాహన తనిఖీ అధికారులు అనుమతులు ఇవ్వడం వల్ల వాహనదారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ వాహనాల వేగాన్ని 100 నుంచి 120 కి.మీ వరకు పెంచేస్తున్నారు. ఈ మేరకు స్పీడ్ గవర్నర్లను బిగించే సమయంలోనే డీలర్లు, వారి టెక్నీషియన్ల సహాయంతో తమకు కావాల్సిన వేగాన్ని సరి చేసుకుంటున్నారు. ఒక్క స్కూల్ బస్సుల్లో మినహా మిగతా రవాణా వాహనాల్లో కచ్చితమైన వేగనియంత్రణ అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, టాటాఏస్‌లు వంటి ప్రైవేట్ వాహనాల యజమానులు తమకు కావాల్సిన వేగానికి అనుగుణంగా స్పీడ్ గవర్నర్లను బిగించుకొనేందుకు దళారులు, ఆర్టీఏ ఏజెంట్లసహాయంతో ఈ మొత్తం ప్రక్రియ యధేచ్ఛగాసాగిపోతోంది. స్పీడ్ ఎలా పెంచేస్తారంటే.. వాహనాల ఇంజిన్‌కు పవర్ సరఫరా అయ్యే చోట స్పీడ్ గవర్నర్ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. ఒక మల్టిమీటర్ వంటి లాగర్ సహాయంతో వేగాన్ని 80 కి.మీకు నియంత్రిస్తారు. ఇలా లాగర్‌తో వేగాన్ని నియంత్రించే సమయంలోనే ఏజెంట్ల సహాయంతో వేగాన్ని 100 నుంచి 120 కి.మీ పెంచి సెట్ చేయించుకుంటున్నారు. ఎక్కువ శాతం వాహనాల్లో ఫిట్నెస్ పరీక్షలకు ముందే ఈ ఏర్పాటు జరుగుతుండగా, కొంతమంది మాత్రం ఫిట్నెస్ పరీక్షల వరకు 80 కి.మీ వేగ నియంత్రణకు కట్టుబడి ఉండి తర్వాత స్పీడ్ గవర్నర్‌కు, ఇంజిన్‌కు అనుసంధానమై ఉన్న సెన్సార్ వైర్‌ను తొలగించి వేగాన్ని పెంచుకుంటున్నారు. ఇదంతా ఆర్టీఏ ఏజెంట్ల సహాయ సహకారాలతోనే జరగడం గమనార్హం. ఏజెంట్ల ద్వారా వచ్చే వాహనాలకు ఎంవీఐలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఫిట్నెస్సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. డివైజ్ ధరలోనూ మోసం.. పొరుగు రాష్ట్రాల్లో రూ.3500 స్పీడ్ గవర్నర్లను విక్రయిస్తుండగా నగరంలో మాత్రం రూ.7 వేల చొప్పున తీసుకుంటున్నారు. చాలామంది ఆర్టీఏ నిబంధనల మేరకు రూ.వేలకు వేలు వెచ్చించి స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, స్పీడ్ నియంత్రణకు మాత్రం కట్టుబడి ఉండడం లేదు. ‘హై వేలపై గంటకు 80 కి.మీ మాత్రమే పరిమితమై బండి నడిపితే రోజుకు 4 ట్రిప్పులు తిరగాల్సిన చోట 3 ట్రిప్పులు కూడా పూర్తి చేయడం సాధ్యం కాదని’ వాహనదారులు చెబుతున్నారు. ఆటోమెబైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలు 37 స్పీడ్ గవర్నర్స్ తయారీ కంపెనీలను గుర్తించాయి. కానీ నగరంలో మాత్రం ఇప్పటి దాకా కొన్ని సంస్థలకు చెందిన స్పీడ్ గవర్నర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ‘‘వాహనాల వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ ప్రభుత్వం స్పీడ్ గవర్నర్ నిబంధనలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క ఒటో రిక్షాలు మినహా మిగతా అన్ని రవాణా వాహనాలకు వేగ నియంత్రణ తప్పనిసరి. నగరంలో మాత్రమే తిరిగే వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవిధంగా, హేవేపై గంటకు 80 కి.మీతో వెళ్లేలా కేంద్రం స్పీడ్ గవర్నర్లను తప్పనిసరి చేసింది. 2015కు ముందు తయారుచేసిన (వేగ నియంత్రణ పరికరాలు లేని) అన్ని రవాణా వాహనాలు వీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, రవాణాశాఖ వీటి వినియోగంపై దృష్టి పెట్టకపోవడంతో వాహనదారులు నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ చెలరేగిపోతున్నారు. వాహనాలకు డివైజ్ ఉందో లేదో చూస్తున్నారు తప్ప.. అది ఎంత స్పీడ్‌కు లాక్ అయిందో ఆర్టీఏఅధికారులు పట్టించుకోవడం లేదు.’’ -
వేగం వద్దు.. ప్రాణం ముద్దు
సాక్షి, సిటీబ్యూరో: రోడ్లపై దూసుకెళ్లే వాహనదారులు అతివిశ్వాసానికి పోయి వాహనాల వేగం పెంచొద్దంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఎప్పుడూ వెళ్లే రోడ్డే కదా.. నాకేం అవుతుందిలే అన్న నిర్లక్ష్యం వద్దని.. ముఖ్యంగా వర్షాకాలంలో వాహన వేగానికి కళ్లెం వేయకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జరిగిన 79 రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ఆర్సీపురం నుంచి చందానగర్ మార్గంలో 21 ప్రమాదాలు జరిగాయని, ఈ రూట్లో వెళ్లే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. జాతీయ రహదారి 65 మార్గంలోని శేరిలింగంపల్లి ఎంఐజీ కాలనీ పోచమ్మ గుడి నుంచి లింగంపల్లిలోని గాంధీ విగ్రహం వరకు ఈ ఏడాది 21 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మియాపూర్‌లోని సౌతిండియా షాపింగ్ మాల్ నుంచి సినీటౌన్ సమీపంలోని దుర్గమ్మ గుడి మార్గంలో 15 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కూకట్పల్లి వైజంక్షన్ నుంచి మూసాపేట మార్గంలో 14 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇక జాతీయ రహదారి 765 మార్గంలోని రాజేంద్రనగర్‌కు సమీపంలోని ఆరాంఘర్ ఎక్స్ రోడ్డు పిల్లర్ నంబర్ 314 నుంచి కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు 13 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక మాదాపూర్‌లోని అంతర్గత రహదారిలో మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి బెంజ్ షోరూం యూటర్న్ వరకు 16 రోడ్డు ప్రమాదాలు జరిగి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండో స్థానంలో నిలిచింది. ప్రమాదాలకు కారణాలివే.. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడంపై ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అటు జీహెచ్ఎంసీ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు అధ్యయనం చేశారు. రోడ్లు ఇరుకుగా ఉండటం, యూటర్న్లు ఉండటం, రహదారి ఇంజినీరింగ్ పనుల్లో లోపాలతో పాటు వాహనదారుల అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కూడా చాలా మంది ప్రాణాలు తీస్తోందని గుర్తించారు. ఓవైపు వాహనదారులకు డ్రైవింగ్‌పై అవగాహన కలిగిస్తూనే.. మరోవైపు వర్షాకాలం సమీపించడంతో ఆ 79 బ్లాక్‌స్పాట్ ప్రాంతాల్లో ఇతర ప్రభుత్వ విభాగాల సహకారంతో మరమ్మతులు చేపడుతున్నారు. ఏది ఏమైనా ఆ ప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఐదేళ్లుగా 700 బ్లాక్స్పాట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కమిషనరేట్ పరిధిలో బ్లాక్స్పాట్లపై అధ్యయనం చేశారు. 2015లో 110, 2016లో 130, 2017లో 187, 2018లో 194, 2019లో 79 బ్లాక్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించారు. ఈ సంవత్సరాల్లో ఎక్కువగా రాజేంద్రనగర్‌లోని అరాంఘర్ ఎక్స్ రోడ్డు నుంచి డైమండ్ కంట, బాబుల్‌రెడ్డి నగర్, హైదరగూడ నుంచి అత్తాపూర్, ఉప్పర్‌పల్లి పిల్లర్ నంబర్ 190 నుంచి 226, అరాంఘర్ జంక్షన్ ఫ్లైఓవర్ నుంచి సూర్య ధాబా, అరాంఘర్ ఎక్స్ రోడ్డు పిల్లర్ నంబర్ 314 నుంచి కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరగడంతో వాటిని బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించారు. తర్వాత స్థానాల్లో ఆర్సీపురం, కేపీహెచ్‌బీ, మియాపూర్, బాలానగర్, మాదాపూర్ ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో 700 బ్లాక్‌స్పాట్‌ను ప్రకటించి అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో మరమ్మతు పనులు చేపట్టారు. డ్రైవింగ్‌లో అప్రమత్తత తప్పనిసరి వర్షాకాలం కావడంతో రహదారులపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ఎదురుగా వచ్చే ప్రాంతాలను బట్టి ముఖ్యంగా బ్లాక్‌స్పాట్ ప్రాంతాల్లో నిదానంగా ముందుకెళ్లాలి. అతివేగంతో వెళితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవచ్చు. ఆయా ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి బాగా లేకపోవడంతో జాగ్రత్తగా వెళ్లాలి. కుటుంబ సభ్యులకు మాత్రం శోకం మిగల్చవద్దు. – వీసీ సజ్జనార్,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ -
రక్తమోడుతున్న... రహదారులు
సాక్షి, సిటీబ్యూరో: నిత్యం రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రమాదకరమైన రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఏటా వేలాది మందిని కబళిస్తున్నాయి. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వందల సంఖ్యలో బ్లాక్‌స్పాట్స్ (ప్రమాదకరమైన ప్రాంతాలు)ను గుర్తించారు. ప్రభుత్వం రహదారి భద్రతను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రోడ్డు భద్రతపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించే ప్రతిపాదన మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో వాయిదా పడినప్పటికీ ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటైన రహదారి భద్రతా మండలి అనేక అంశాలపై విస్తృతంగా చర్చించింది. రహదారుల నిర్మాణం, ప్రమాదాలకు దారితీస్తున్న పరిణామాలు వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. రోడ్లు భవనాల శాఖ, రవాణా, పోలీసు, వైద్య ఆరోగ్య, రెవెన్యూ తదితర విభాగాల ప్రాతినిధ్యంతో ఏర్పాటైన రోడ్డు భద్రతా మండలిని ముందుకు తీసుకెళ్లడంలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ (లీడ్ ఏజెన్సీ) అవసరమని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మండలిలో ఉన్న భాగస్వామ్య సంస్థల్లోనే ఏదో ఒక సంస్థకు లీడింగ్ బాధ్యతలు అప్పగించడం వల్ల పారదర్శకత లోపిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మంగళవారం రోడ్డు భద్రత బిల్లును ఆమోదించి చట్టంగా రూపొందించే ప్రతిపాదన వాయిదా పడడం కూడా తాజాగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని లోపాలను సవరించాల్సి ఉన్నట్లు సమావేశంలో పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రమాదాలను పూర్తిగా అరికట్టి, రోడ్డు భద్రతలో మెరుగైన, నాణ్యమైన ఫలితాలను సాధించేందుకు స్వతంత్రంగా పని చేసే ఏజెన్సీ అవసరమని కొందరు అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా రోడ్డు భద్రతా మండలి దృష్టి సారించాల్సి ఉంది. పక్కా కార్యాచరణ అవసరం.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. గతేడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో సుమారు 6,603 మంది మృత్యువాత పడ్డారు. మరో 23 వేల మందికిపైగా క్షతగాత్రులయ్యారు. గత రెండు మూడేళ్లుగా మృతుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ప్రమాదాల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. తెలంగాణ అంతటా 173 ప్రమాదకరమైన (బ్లాక్‌స్పాట్స్)ను గుర్తించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 150 బ్లాక్‌స్పాట్స్ ఉన్నాయి. రాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రోడ్ల నిర్మాణంలో ఇంజినీరింగ్ లోపాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. లోపాలను సరిదిద్దడంలో పటిష్టమైన యంత్రాంగం ఎంతో అవసరమని రోడ్డు భద్రతా మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘మండలిలో ఉన్న ప్రభుత్వ విభాగాల్లో ఏదో ఒకటి లీడ్ ఆర్గనైజేషన్‌గా వ్యవహరించడం వల్ల ఆ సంస్థ మిగతా సంస్థల లోపాలను మాత్రమే ఎత్తి చూపుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. అలా కాకుండా రోడ్డు భద్రతా చట్టం అమలులో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేయాలంటే స్వతంత్ర సంస్థ అవసరం’ అని పేర్కొన్నారు. గత ఏడాది రోడ్డు భద్రతా బిల్లును ప్రతిపాదించినప్పటి నుంచి ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సమావేశాలను నిర్వహించింది. కేబినెట్ సబ్‌కమిటీ సూచనల మేరకు ఉన్నతాధికారులు కేరళలో రోడ్డు భద్రతను అధ్యయనం చేశారు. అనంతరం అనేక ప్రతిపాదనలు చేశారు. స్కూళ్లలో రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా పాఠ్యాంశాలను బోధించాలని ప్రతిపాదించారు. అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ మూడు రోజుల పాటు ఉచిత వైద్య సదుపాయం అందజేయాలని సూచించారు.మరోవైపు హైవేలపై నిరంతర గస్తీ నిర్వహించడంతో పాటు, అంబులెన్స్ సదుపాయం అందుబాటులో ఉండడం, మద్యం దుకాణాలు రహదారులకు దూరంగా తరలించడం వంటివి అమల్లోకి కూడా వచ్చాయి. అనేక చోట్ల రోడ్లకు మరమ్మతులు కూడా పూర్తి చేశారు. రోడ్డు భద్రతలో కొంత పురోగతి ఉన్నప్పటికీ మరింత పక్కాగా అమలు చేసేందుకు స్వయంప్రతి కలిగిన సంస్థ అవసరం ఎంతో ఉందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. గ్రేటర్లో ప్రమాదాలనియంత్రణపై దృష్టి.. నగరంలోని 150 ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. లోపాలను సరిదిద్దడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం రాజ్‌భవన్ రోడ్డులో పాదచారులు ఇటు వైపు నుంచి అటు వైపు రోడ్డు దాటడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఈ మార్గంలో ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించిన అన్ని చోట్ల ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలను తీసుకోనున్నారు. -
రోడ్ టెర్రర్.. అయినా బేఖాతర్
సాక్షి, హైదరాబాద్ ఓ తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు, కొంతలో కొంత సమస్యకు చెక్ పెట్టే వనరులు సిద్ధంగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? ఆ వనరులని సమర్థంగా వినియోగించుకుని పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. కానీ రోడ్డు ప్రమాదాల విషయంలో మన రాష్ట్రంలో దానికి విరుద్ధంగా జరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉంది. డ్రైవర్లలో నైపుణ్యం లేకపోవడం దీనికి ప్రధాన కారణం అన్నది కాదనలేని వాస్తవం. వాహన చోదకులను సుశిక్షితులుగా తీర్చిదిద్దగలిగే ఉత్తమ శిక్షణ కేంద్రానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్. దేశంలోనే మంచి మౌలిక వసతులున్న టాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ఇదీ ఒకటి. 29 ఎకరాల సువిశాల విస్తీర్ణం, 450 గదులు, మంచి శిక్షకులు, సొంతంగా రూపొందించిన నాణ్యమైన మాడ్యూల్స్, హాస్టల్ వసతులతో కూడిన ఈ కేంద్రం దాదాపు ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉండిపోయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ కేంద్రంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి ప్రమాదాలను నియంత్రించేందుకు వీలున్నా ఆ దిశగా ఆలోచన చేయకపోవటం విడ్డూరం. సమైక్య రాష్ట్రంలో కర్ణాటక తర్వాత దేశంలోనే ఉత్తమ రవాణా సంస్థగా మన ఆర్టీసీ గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ప్రమాదాలు, ఇంధన పొదుపు.. ఇలా పలు కేటగిరీల్లో మన ఆర్టీసీ వరసగా పురస్కారాలు సొంతం చేసుకుంది. దాదాపు 20 వేల బస్సులతో కళకళలాడిన ఆర్టీసీకి సొంతంగా డ్రైవర్లకు శిక్షణ కేంద్రం ఉండాలన్న ఉద్దేశంతో హకీంపేటలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లను ఇందులోనే సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు. ఒకేసారి 420 మంది అక్కడే ఉండి శిక్షణ తీసుకునేలా హాస్టల్ వసతితో ఉన్న ఈ కేంద్రం ఇప్పుడు బోసిపోయింది. రాష్ట్ర విభజనతో తెలంగాణకు తక్కువ బస్సులు ఉండటం, కొత్తగా ఆరేళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటంతో ఈ కేంద్రం వెలవెలబోయింది. అడపాదడపా కొద్దిమందికి తప్ప ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ఉండటం లేదు. ఫలితంగా దేశంలోనే మంచి మౌలిక వసతులున్న శిక్షణా కేంద్రం పెద్దగా ఉపయోగంలో లేకుండా పోయింది. ప్రమాదాలు తీవ్రమవుతున్న సమయంలోనూ దానిని వినియోగించుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటివరకు రాకపోవటం విడ్డూరం. డ్రైవింగ్ పరిచయం లేనివారికి సమగ్ర శిక్షణకు ఎనిమిది వారాల ప్రత్యేక మాడ్యూల్ రూపొందించారు. శిక్షణార్థులు క్యాంపస్‌లోని హాస్టల్లో ఉంటూ శిక్షణ తీసుకోవచ్చు. ఇప్పటికే డ్రైవింగ్ వచ్చి నైపుణ్యం పెంచుకోవాలనుకునేవారికి వారం రోజుల మాడ్యూల్, రెండు రోజుల మాడ్యూల్ రూపొందించారు. ఎక్కువ రోజులు సమయాన్ని కేటాయించలేని పక్షంలో తక్కువ సమయంలోనే శిక్షణ ఇచ్చేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా రుసుములు నిర్ధారిస్తున్నారు. గతంలో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించే క్రమంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, సింగరేణి సంస్థలు స్పాన్సర్ చేసి కొంతమంది యువకులకు శిక్షణ ఇప్పించటం తప్ప ప్రైవేటు డ్రైవర్లకు ఇప్పటివరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వలేదు. తొలిసారి ఆర్టీసీ ఆ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారికి క్యాంపస్ ఇంటర్వ్యూలు పెట్టి ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది శిక్షణకు వచ్చే అవకాశం ఉంది. 2018... రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. సగటున ప్రతి లక్ష జనాభాలో 18.90 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశంలోనే రెండో స్థానం. ప్రమాదాలతో వణికిపోయిన ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానం మనదే. ఏడాదికాలంలో 6,599 మంది చనిపోయారు. ఇది అంతకుముందు సంవత్సరంకంటే ఎక్కువ. రోడ్డు ప్రమాదాలనగానే దక్షిణ భారతదేశంలో వెంటనే గుర్తొచ్చే రాష్ట్రం తమిళనాడు. కానీ... 2017 కంటే 2018లో ఆ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల రేటు ఏకంగా 24 శాతం తగ్గింది. విచ్చలవిడిగా జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే దీనికి కారణమని అధ్యయనాలు తేల్చాయి. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు డ్రైవింగ్ నైపుణ్యం లేకపోవటమే ప్రధాన కారణమనేది నిపుణుల మాట. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రమాదాల నుంచి బయటపడాలంటే కచ్చితంగా డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉండాలి. మరి రోడ్డెక్కే భారీ వాహనాల డ్రైవర్లకు నైపుణ్యం ఉందా అంటే..లేదన్న సమాధానమే రవాణా శాఖ నుంచి ఠక్కున వస్తుంది. మన రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న విద్యా సంస్థలు చాలావరకు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. విద్యార్థులను ఆకట్టుకునేందుకు అనుసరించే పద్ధతుల్లో ఇదీ ఒకటి. కానీ, భారీ వాహనాలు నడపడంలో నైపుణ్యం లేనివారినే తక్కువ జీతాలకు డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. 2015లో నగర శివారులోని మాసాయిపేటలో కాపలాలేని లెవల్ క్రాసింగ్ దాటే క్రమంలో పాఠశాల బస్సును రైలు ఢీకొనడానికి ఇదే కారణం.ప్రైవేటు సంస్థల్లో బస్సు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారు గతంలో లారీ క్లీనర్లుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేసినవారే ఉన్నారని ఇటీవల తేలింది. సరైన నైపుణ్యం లేనప్పటికీ వీరు బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఆర్టీసీ శిక్షణ కేంద్రంలో ఉన్న వసతులేంటి...? 29 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కళాశాలలో అన్ని వసతులున్నాయి. భారీ వృక్షాలతో మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంది. శిక్షణ కోసం కండిషన్లో ఉన్న నాలుగు బస్సులు, ఆరు కార్లు, జీపులు ఉన్నాయి. ఆరుగురు శిక్షకులు ఉన్నారు. వాహనాల విడిభాగాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాటి పనితీరుపై చక్కటి అవగాహన కల్పిస్తారు. వాహనాలు నడపడంలో శిక్షణ మాత్రమే కాకుండా ఇంధన పొదుపులో కూడా మెళకువలు నేర్పుతారు. హైదరాబాద్‌లాంటి చోట్ల ప్రమాదాలకు డ్రైవర్ల అసహనం కూడా కారణమవుతోంది. అందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా మైండ్ మేనేజ్మెంట్ నిపుణులు, సైకాలజిస్టులు కూడా తరగతులు నిర్వహిస్తారు. రామ్‌దేవ్ బాబా వద్ద శిక్షణ తీసుకున్న యోగా గురువు కూడా ఉన్నారు. నిత్యం గంటసేపు యోగా తరగతులు నిర్వహిస్తారు. శిక్షణార్థులు అక్కడే ఉండి శిక్షణ తీసుకునేందుకు వీలుగా 420 గదులతో కూడిన హాస్టల్ భవనం ఉంది. ఒకేసారి 500 మంది భోజనం చేసేందుకు వీలుగా విశాలమైన డైనింగ్ హాలు ఉంది. టీ, అల్పాహారం, భోజన వసతి కళాశాలనే కల్పిస్తుంది. ఆదాయంకోసం కొత్త అడుగులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కునారిల్లుతున్న టీఎస్ఆర్టీసీ పైసాపైసా కోసం ఆరాటపడుతోంది. ఆదాయం పెరగకపోవటం, ఖర్చులో నియంత్రణ లేకపోవటంతో నష్టాలు కొండలా పెరిగిపోతున్నాయి. ప్రైవేటు సంస్థలలోని డ్రైవర్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వటం ద్వారా రుసుము రూపంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ఇప్పుడు ఆర్టీసీ శిక్షణ కేంద్రం కొత్త అధికారి ప్రణాళిక రూపొందించారు. ఐటీ కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, క్యాబ్ సర్వీసులు, ఇతర ప్రైవేటు సంస్థలకు చెందిన డ్రైవర్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం బస్సులే కాకుండా కార్లు, జీపు డ్రైవింగ్‌లో కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. -
24 గంటల్లోగా రహదారుల గుంతల పూడ్చివేత
నగరంలో అధ్వానపు రోడ్లతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రోడ్ల నిర్వహణ..భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు వివిధ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం రోడ్ల నిర్మాణ వ్యయంలో కొంత శాతం నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ నిధులతో సిటీలో ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులు, ఇతర పనులు చేపడతారు. రాకపోకలు సాఫీగా, సౌకర్యవంతంగా జరిగేలా చూస్తారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రాబోయే రోజుల్లో గుంతల్లేని రోడ్లు దర్శనమివ్వనున్నాయా..? రోడ్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు సత్వరం చేపట్టనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. రోడ్ సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎందరో గాయాల పాలవుతుండటం.. మరణాలు చోటు చేసుకుంటుండటం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని కఠినమైన రోడ్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని భావించింది. ఈ అంశంపై దాదాపు రెండు నెలల క్రితం వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఇందులో రోడ్‌సేఫ్టీ కోసం ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు రోడ్లు, ఫ్లై ఓవర్లు తదితర ఇంజినీరింగ్ పనులు చేసేప్పుడు వాటిల్లో కొంతశాతం నిధులు రోడ్‌సేఫ్టీ కోసం కేటాయించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ నిధులతో భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. అందుకుగాను రోడ్ సేఫ్టీ అమలుకు ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఆమేరకు ముసాయిదా బిల్లు రూపొందించినట్లు తెలిసింది. అవసరమైన పక్షంలో సదరు బిల్లుకు తగిన మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ఆమోదం అనంతరం అమల్లోకి తేనున్నారు. ఇంజినీరింగ్ పనుల్లో ఎంత శాతాన్ని రోడ్ సేఫ్టీ కోసం కేటాయించాలనేదానిపై తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపు రెండు శాతం కేటాయించాలనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. జీహెచ్ఎంసీకి సంబంధించి అంతమొత్తం కేటాయించే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేవు. రహదారులు, ఫ్లై ఓవర్లు తదితరమైన వాటికి బాండ్ల ద్వారా సేకరించిన నిధులను వినియోగిస్తున్నారు. వాటికి వడ్డీ కట్టాల్సి వస్తోంది. అంతే కాకుండా గ్రేటర్లో చేపట్టాల్సిన పనులు దాదాపు 25 వేల కోట్ల మేర ఉండటంతో రెండు శాతం అంటే.. భారీ నిధులు కేటాయించాల్సి ఉన్నందున జీహెచ్ఎంసీకి సంబంధించి 0.25 శాతం లేదా 0.50 శాతం కేటాయించినా చాలుననే అభిప్రాయాలున్నాయి. ఎంత శాతమనేది ఖరారై, బిల్లు కార్యరూపం దాల్చాక సదరు నిధులతో ఎప్పటికప్పుడు రహదారుల మరమ్మతులు సత్వరం చేస్తారు. రోడ్లపై పడే గుంతల్ని 24 గంటల్లోగా పూడ్చివేస్తారు. తద్వారా నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. తక్షణ మరమ్మతు బృందాలు మరిన్ని పెరగాలి.. విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా రోడ్ల మరమ్మతులు చేసేందుకు, పాట్‌హోల్స్ వెంటనే పూడ్చివేసేందుకు 79 తక్షణ మరమ్మతు బృందాలు (ఐఆర్టీ) ఉన్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలపగా, వాటిని ఇంకా పెంచాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ఏడాది పొడవునా నగరంలోని అన్ని రోడ్లు ఎలాంటి పాట్‌హోల్స్ లేకుండా ఉండాలని, దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని సూచించారు. ఇందుకుగాను తగినన్ని ప్రీమిక్స్ బీటీ బ్యాగుల్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకంగా రోడ్ సేఫ్టీ కమిషనరేట్ ఏర్పాటు అవసరం కూడా అధికారుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. -
రోడ్ సేఫ్టీ కమిషనరేట్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో వందల మంది మృత్యువాత పడుతున్నారు. వేల మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. రహదారుల దుస్థితితో పాటు భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం కారణంగానే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రహదారుల స్థితిగతుల మెరుగుదలతోపాటు రహదారుల భద్రతా ప్రమాణాల అమలుపై నిరంతర పర్యవేక్షణ కోసం త్వరలో రోడ్ సేఫ్టీ కమిషనరేట్ ఏర్పాటు కానుంది. రహదారుల భద్రత బిల్లును సైతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. తుది రూపుదిద్దుకుంటున్న ఈ బిల్లును భవిష్యత్‌లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే రహదారుల భద్రతకు రాష్ట్రంలో మరింత ప్రాధాన్యత పెరగనుంది. అన్ని శాఖల పరిధిలోని రహదారుల స్థితిగతులు, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు రోడ్డు సేఫ్టీ కమిషనరేట్ పేరుతో కొత్త ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రహదారుల భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆపరేషనల్ వింగ్స్‌ను స్థాపించనున్నారు. అదేవిధంగా రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన నిధుల్లో కొంత శాతాన్ని రహదారుల భద్రత కోసం ఆయా శాఖలు కేటాయించనున్నాయి. రహదారుల భద్రతకు సంబంధించి హైకోర్టు గతంలో జారీ చేసిన ఓ తీర్పు అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇటీవల రాష్ట్ర రవాణా, పురపాలక, పంచాయతీరాజ్, పోలీసు శాఖలు, జాతీయ రహదారుల విభాగం అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో రహదారు ల నిధుల నుంచి కొంత శాతాన్ని భద్రతా ప్ర మాణాల అమలుకు కేటాయించాలని తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, క్షతగాత్రులు, మరణాల సంఖ్య తగ్గింపు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. 24 గంటల్లో మరమ్మతులు.. హైదరాబాద్ నగర పరిధిలో రహదారుల మరమ్మతుల కోసం 79 తక్షణ మరమ్మతుల బృం దాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. రహ దారులు దెబ్బతిన్న చోట్లలో తక్షణ మరమ్మతులు చేసేందుకు ఏడాది పొడవున ఈ బృందా లు పనిచేయనున్నాయి. గుంతలను బీటీ మిశ్రమంతో పూడ్చేందుకు బీటీ మిక్సింగ్ ప్లాంట్‌ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసుకుంది. నగరంలో దెబ్బతిన్న రోడ్లను కేవలం 24 గంటల్లోగా మరమ్మతు చేసేందుకు బృందాల సంఖ్య ను ఇంకా పెంచుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను సీఎస్ ఎస్కే జోషి ఆదేశించారు. రా ష్ట్రంలో రహదారుల భద్రతా ప్రమాణాల అమలుపై సంబంధిత శాఖలతో ఇకపై ఆయన క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించనున్నారు. -
రోడ్డు భద్రత పౌరులందరి బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు భద్రత అన్నది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, అది పౌరులందరి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జేకే టైర్స్–కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో ఏటా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై మీడియా విస్తృత ప్రచారం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో దివంగతులైన ఎం.రామ్‌గోపాల్ రెడ్డి, నందమూరి హరికృష్ణ, లాల్ జాన్ బాషా, ఎర్రన్నాయుడు, తదితర పార్లమెంటు సభ్యులకు ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే వింటేజ్ కార్ ర్యాలీని వెంకయ్య ప్రారంభించారు. -
రహదారుల్లో రక్తపుటేరులు
పిఠాపురం/తణుకు/పాడేరు/మాకవరపాలెం (విశాఖజిల్లా): రాష్ట్రంలో రహదారులు రక్తపుటేరులయ్యాయి. శుభకార్యానికి వెళ్లి వస్తున్నవారు.. పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారు.. పనిపై పక్క ఊరికి వెళ్తున్న వారు రహదారుల భద్రతను ప్రశ్నిస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సోమవారం మూడు జిల్లాల్లోని రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలానికి చెందిన వారు కాకినాడలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద రాంగ్ రూట్లో వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన కార్మికులు లారీలో బొబ్బిలి వెళుతుండగా తణుకు వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇక విశాఖ జిల్లా పాడేరు మండలంలో వైఎస్సార్ సీపీ నేత ఎస్వీ రమణమూర్తి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులు ఆటోలో వెళ్తుండగా అది బోల్తా పడి ముగ్గురు కన్నుమూశారు. రక్తమోడిన ఎన్‌హెచ్ 216.. తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్‌హెచ్ 216పై జరిగిన ప్రమాదం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాకినాడలోని బంధువు గృహప్రవేశానికి మండలంలోని జి.వెంకటాపురం, భీముకోటపాలెం, జి.కోడూరు గ్రామాలకు చెందిన సుమారు 16 మంది టాటా మేజిక్ వ్యాన్‌లో ఆదివారం రాత్రి బయల్దేరి వెళ్లారు. కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ వద్దకు వచ్చేసరికి రాంగ్రూట్లో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారి వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.ఇందులో ప్రయాణిస్తున్న ఆరుగురు.. గవిరెడ్డి రాము (40), సబ్బవరపు పైడితల్లి (42), సబ్బవరపు అచ్చియమ్మ (50), పైలా లక్ష్మి (45), సబ్బవరపు మహాలక్ష్మి (54), సబ్బవరపు పాప (30) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ఆళ్ల సంతోష్ (34), సబ్బవరపు వరహాలు (45)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశారు. చికిత్స పొందుతూ బీమిరెడ్డి నాగరాజు (42) తుదిశ్వాస విడిచారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఎస్సై శివకృష్ణ తన జీప్‌లో వారిని పిఠాపురం తరలించారు. పనుల కోసం వెళ్తుంటే.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన 11 మంది కార్మికులు విజయనగరం జిల్లా బొబ్బిలిలోని చెరువుల్లో చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో లారీలో బయల్దేరారు. అర్ధరాత్రి తణుకు మండలం తేతలి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళ్తున్న కాంక్రీట్ మిక్స్‌ర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మైనం లక్ష్మణరావు (33), పెరుమాళ్ల హుస్సేన్ అలియాస్ సురేష్ (35), నెక్కల కాశీవిశ్వనాథం (48) మృతి చెందారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పాడేరు ఘాట్‌లో ఆటో బోల్తా పాడేరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీపీ ఎస్.వి.రమణమూర్తి కుటుంబ సభ్యులు ఐదుగురు ఆటోలో పాడేరు నుంచి పెందుర్తి వెళుతుండగా బ్రేకులు ఫెయిలై కల్వర్టు గోడను ఆ ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణమూర్తి కుమార్తె సాయిలత (చిట్టి), కోడలు మరియమ్మ, మనవరాలు (2 నెలల చిన్నారి) మృతి చెందారు. రమణమూర్తి కుమారుడు అంబేడ్కర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు పాడేరు ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నం తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గణపతిని, రెండు మాసాల చిన్నారిని చోడవరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చిన్నారి కన్నుమూసింది. అరకులోయ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు రమణమూర్తిని, కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. వైఎస్ జగన్ తీవ్ర విచారం రాష్ట్రంలో సోమవారం జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందడం పట్ల ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
పిల్లలకు బైక్ ఇచ్చారో..?
విజయనగరం, రామభద్రపురం(బొబ్బిలి): దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సెక్షన్ ప్రతీ ఒక్కరిలోనూ గుబులు రేపుతోంది. సెక్షన్ 304 (ఏ) ద్వారా ఈ విషయంలో శిక్షలను మరింత కఠినతరం చేశారు. మైనర్లు బైక్ నడిపి ప్రమాదానికి కారణమైనా, మితి మీరిన వేగంతో ఎదుట వ్యక్తి ప్రాణాలు బలిగొన్నా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, సదరు వాహన యాజమానిపై సెక్షన్ 304 (ఏ)ప్రకారం కేసు నమోదు చేస్తారు. వెంటనే రిమాండ్‌కు కూడా తరలిస్తారు. బైక్ ఇస్తే అంతే సంగతులు.. చాలా మంది తల్లిదండ్రులు, బంధువులు పిల్లలకు బైక్ ఇవ్వడం గొప్పగా భావిస్తారు. అయితే ఇకపై అది కుదరదు. సదరు బాలుడు లేదా బాలిక బైక్ నడిపి ప్రమాదం చేసినట్లు అయితే ఆ తల్లిదండ్రులపై, సెక్షన్ 304 (ఏ) కేసు నమోదు చేస్తారు. మద్యం సేవించి బైక్ నడిపి ప్రమాదం చేసి ప్రాణనష్టం కలిగించిన వారిపై కూడా ఇదే సెక్షన్ కింద కేసులు పెడతారు. లైసెన్స్ లేకుండా ఇతరుల వాహనం నడిపి ప్రమాదాలు చేస్తే వాహనం ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో వారిపై కేసు నమోదు చేస్తారు. యాక్సిడెంట్ చేసిన వారితో పాటు వాహనం ఇచ్చిన వారు, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అమ్మిన వ్యక్తిపై కూడా కేసులు పెడతారు. గతంలో యాక్సిడెంట్ చేసిన వారికి కూడా 304 (ఏ)ను నమోదు చేసేవారు. అయితే అప్పట్లో వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరయ్యేది. నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. యాక్సిడెంట్‌కు కారణమైన వ్యక్తితో పాటు సంబంధిత వాహన యాజమానికి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం లేదు. పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదాల నివారణ కోసం.. మూడేళ్లలో దేశంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. వాటిని అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు బలిగొనే వారిని, ఉద్దేశ పూర్వకంగానే హత్య చేసినట్లుగా భావిస్తూ సెక్షన్ 304(ఏ)ను రూపొందించారని పోలీసు వర్గాలు తెలిపాయి. వాహనం నడిపే వారు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని, తల్లిదండ్రులు, బంధువులు మైనర్ వ్యక్తులకు బైక్‌లు ఇస్తే ఎదురయ్యే సంఘటనలకు సిద్ధంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పాత వాహనాలు ఎవరికైనా అమ్మితే కొనుగోలు చేసిన వారి పేరున బైక్ రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే అమ్మిన వారికి ఇబ్బందులు తప్పవు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ను యువత మానుకోవాలి అని పోలీసులు సూచిస్తున్నారు. కేంద్రానిది మంచి నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎంతో మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అమాయకులు బలైపోతున్నారు. వాహనాలు నడిపిన వారు రోడ్డు ప్రమాదాలకు పాల్పడి ఆయా కుటుంబాల్లో విషాదం నింపారు. ప్రమాదాలు చేసిన వారికి వెంటనే స్టేషన్ బెయిల్ రావడం, పెద్దగా చర్యలు లేకపోవడంతో పరిస్థితి మారడం లేదు. ఈ సెక్షన్ అమలు చేస్తే కొంత వరకు ప్రమాదాలు నివారణ అవుతాయి. – గుల్లిపల్లి కృష్ణ, విశ్రాంత ఉద్యోగి రామభద్రపురం భారీ మూల్యం తప్పదు... వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మైనర్లకు బైక్‌లు ఇచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, మద్యం సేవించి వాహనం నడిపే వారు రోడ్డు ప్రమాదం చేస్తే, ప్రాణ నష్టం జరిగితే ఉద్దేశ పూర్వకంగానే హత్య చేసినట్లు సెక్షన్ 304(ఎ) చెబుతోంది. దీన్ని గట్టిగా అమలు చేస్తే ప్రమాదాలు నివారణయ్యే అవకాశం ఉంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే. – బి.లక్ష్మణరావు, ఎస్ఐ, రామభద్రపురం -
ప్రగతి నివేదన సభకు వస్తున్నారా..?
సాక్షి, సిటీబ్యూరో: ప్రగతినివేదన సభకు వచ్చే వాహనాలు కచ్చితమైన రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, డ్రైవర్లు క్రమశిక్షణతో వాహనాలు నడపాలని ప్రాంతీయ రవాణా అధికారి, ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ పాపారావు పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రగతి నివేదన సభకు తరలి రానున్న వాహనాల నిర్వహణను పర్యవేక్షిస్తున్న ఆయన డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌టేక్‌లకు స్థానం ఇవ్వరాదని కోరారు. లైన్ విధానాన్ని పాటించాలి. జనాన్ని సురక్షితంగా తీసుకొచ్చి తిరిగి అంతే సురక్షితంగా తమ ఇళ్ల వద్దకు చేర్చవలసిన బాధ్యత డ్రైవర్లపైనే ఉంది. ఇందుకోసం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలి’ అని అన్నారు. డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగవద్దని హెచ్చరించారు. మరోవైపు సభకు తరలి వచ్చే వాహనాల రాకపోకలు, డ్రైవర్లపై నిఘా, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. జిల్లాలవారీగా కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలపాలి. రోడ్డు భద్రతపైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. -
అతివేగం.. ప్రాణాంతకం
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు : రోడ్డు ప్రమాదాలు చాలా వరకు చోదకుల నిర్లక్ష్యంతోనే చోటు చేసుకుంటున్నాయి. దీనికితోడు వారు నిబంధనలను పాటించడం లేదని రవాణా, పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రతి మూడు ప్రమాదాల్లో ఒకదానికి అతివేగం, మరొక దానికి నిబంధనలు పాటించకపోవడమే కారణాలు. వాహ న వేగాన్ని ఐదు శాతం తగ్గించి నడిపితే ప్రమాదాల్లో 30 శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా యువత ఎక్కువ సంఖ్యలో ప్రమాదాల బారిన పడుతున్నారనేది గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరణించన వారిలోనూ 50 శాతం మంది 15–29 ఏళ్ల మధ్య ఉన్న వారే కావడం విషాదకరం. అలసటతోనే అధికంగా ప్రమాదాలు మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవర్లకు పని వేళలు ఉన్నాయి. కానీ చాలా మంది ఈ వేళల కంటే అధిక సమయం డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని అరికట్టేందు కు పలు నిబంధనలను రవాణా శాఖ తీసుకువచ్చిం ది. డ్రైవర్లు ఎనిమిది గంటలు వాహనం నడిపిన తరువాత కచ్చితంగా మూడు గంటలు విశ్రాంతి తీ సుకోవాలి. కానీ చాలా మంది రాత్రింబవళ్లు డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. తెల్లవారుజామున కునుకు తీసి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాణరక్షణకు సీట్‌బెల్ట్, హెల్మెట్ చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం, హెల్మెట్ ధరించకపోవడమే కారణం. ప్రమాదాలు జరిగినప్పుడు సీట్‌బెల్ట్ పెట్టుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రమాద సమయంలో కారులో నుంచి రోడ్డు మీదకు విసిరేయకుండా సీట్‌బెల్ట్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు సీట్‌బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయి గాయాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు తలకు తీవ్ర గాయాలు అవడంతోనే చనిపోతున్నారు. హెల్మెట్ ధరిస్తే తలకు గాయాలు తగలవు. తగిలినా అవి స్వల్పంగా ఉంటాయి. తల నుంచి రక్త స్రావం కూడా జరగకుండా హెల్మెట్ కాపాడుతుంది. నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు రక్ష ♦ అధికారులు రూపొందించిన నిబంధనలను పాటించడం ద్వారా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవడం ద్వారా కూడా ప్రమాదాలను తగ్గించవచ్చు. ♦ కూడళ్ల వద్ద వాహనాల వేగం తగ్గించాలి. ఎడమ వైపు తిరగడానికి వలయంలోని బయట లైన్లో వెళ్లాలి. రౌండ్ సర్కిల్ నుంచి బయటకు రావడానికి ఎడమవైపు సిగ్నల్ చూడాలి. జంక్షన్ నుంచి వెళ్లే వాహనదారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ♦ వాహనదారులు ఎడమ వైపు ముందు భాగంలో గాని రివర్స్ వ్యూ మిర్రర్లో గానీ చూడలేని ప్రదేశాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. ఇతర వాహనాల బ్లైండ్ స్పాట్‌లోకి వాహనాలను తీసుకెళ్లకూడదు. ఇలాంటి ప్రదేశాల వద్ద మలుపు తిప్పాలనుకున్న సమయంలో, దాటాలను కున్న సమయంలో ఒక సారి తలతిప్పి చూసి ముందుకు సాగాలి. ♦ వాహనాన్ని వెనుక నడవడానికి చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్డులోకి రివర్స్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు డ్రైవర్ సీటు వైపు రివర్స్ చేయాలి. వెనుక ప్రదేశాన్ని మిర్రర్లో గమనించి రివర్స్ చేయాలి. రాత్రివేళలో.. ♦ ఎదురుగా వాహనం వచ్చే సమయంలో లైట్లను డిమ్ అండ్ డిప్ వేయాలి. తెల్లవారుజామున ఒం టి గంట నుంచి ఐదు వరకు వాహనం నడపకుంటే మంచిది. ఓవర్టేక్ సమయంలో హెడ్‌లైట్‌ను డిమ్ అండ్ డిప్ చేసి ముందు వెళ్తున్న వాహనానికి సంకేతం ఇవ్వాలి. హైవేపై పార్కింగ్ చేయకూడదు. ♦ చీకటి ప్రదేశాల్లో వాహనం నిలపాల్సి వస్తే వెనుక వైపు వచ్చే వాహనాలను గమనించాలి. ఒకే హెడ్ లైట్ ఉన్న నాలుగు చక్రాల వాహనాలతో జాగ్రత్తగా ఉండి గమనించుకోవాలి. వెనుక వచ్చే వాహనం ఓవర్టేక్ చేసేందుకు కుడివైపు ఉన్న ఇండికేటర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. రోడ్డుకు ఎడమవైపున వాహనం నిలిపినప్పుడు పార్కింగ్ లైట్లు వేసి ఉంచాలి. ♦ డ్రైవరు ప్రతి నాలుగు గంటలకొకసారి వాహనం ఆపి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ముందు వెళుతున్న వాహనానికి తగినంత దూరంలో నడపాలి. ముందుకున్న వాహనం ఆగిన సమయంలో ప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్త ఉపయోగý పడుతుంది. ♦ వర్షం మొదలైన మొదటి గంట సమయంలో రోడ్డు మీద ఉన్న ఆయిల్, మట్టి నీటితో కలిసి జారుడుగా ఉంటుంది. ఈ సమయంలో వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. కల్వర్టు, వంతెనల వద్ద వర్షపు నీరు ప్రవహిస్తున్నపుడు వాహనాన్ని దూరంగా నిలిపాలి. మృతి చెందిన ప్రముఖులు : రెండు రోజుల కిందట మాజీ ఎంపీ, సినీ నటులు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నల్గొండకు చెందిన మాజీ మంత్రి కోమటి రెడ్డి కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జిల్లాకు చెంది న మాజీ మంత్రి ఆహ్మదుల్లా కుమారుడు కడప సబ్‌జైలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించా డు. మాజీ ఎంపీ అజారుద్దీన్ కుమారుడు ద్విచక్ర వా హన ప్రమాదంలో మరణించాడు. సినీ నటులు కోట శ్రీనివాసరావు. బాబుమోహన్ కుమారులు కూడా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరందరూ కూ డా అతివేగం కారణంగా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవ డం, హెల్మెట్ ధరించకపోవడంతోనే మరణించారు. ప్రాణాలను ఫణంగా పెట్టే రిస్క్ వద్దు చాలా మంది యువత రిస్క్‌ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. కానీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి రిస్క్ చేయకూడదు. సినిమాలు, రేస్ల్లో విన్యాసాలను అనుకరిస్తున్నారు. దీంతో యువత ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు. నిర్లక్ష్యం, అతి ఆత్మవిశ్వాసం కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. కుటుంబానికి తామే దిక్కు.. నేను లేని లోటు వారికి తీర్చలేనిది అనే విషయాన్ని వారికి తెలియజేప్పాలి. ‘సురక్షిత డ్రైవింగ్‌కు ప్రాధాన్యత ఇస్తా’ అనే విషయాన్ని డ్రైవింగ్ సమయంలో గుర్తు చేసుకోవాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తన ఉండాలనే విషయాన్ని వారి మనసులోకి చొప్పించాలి. పాత ప్రమాద సంఘటనలు, వాటి వల్ల కలిగిన నష్టాలు, బాధితులతో కళాశాలలలో తరగతులు నిర్వహించాలి. పరిణితితో కూడిన డ్రైవింగ్ మేలనే విషయాన్ని గుర్తెరగాలి. – ఓవీరెడ్డి, మానసిక వ్యా«ధి నిపుణులు నిబంధనలు పాటించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యం లేకుండా డ్రైవింగ్ చేయాలి. ఎన్ని చర్యలు తీసుకున్నా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. నిబంధనలు పాటిస్తే తాము క్షేమంగా ఉండటమే కాక ఇతరులకూ ఇబ్బంది కలగదు.– శ్రీనివాసులు, డీఎస్పీ, మైదుకూరు -
రోడ్డు భద్రత పట్టేదెవరికి..!
అతివేగం అనర్థదాయకం.. ఓవర్ లోడ్ ప్రమాదకరం.. ఇవి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగాఅధికారులు పలికే నినాదాలు. కేవలం వారోత్సవాల్లో తప్ప ఆచరణలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారుల కంటికి మాత్రం కన్పించడం లేదు. వారోత్సవాల్లో నినాదాలివ్వడమే కాదు.. ఏడాది మొత్తం నిబంధనలపై నిఘా వేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చూసీ చూడనట్లు విడిచిపెట్టకుండా అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఇలా ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడకుండా కాపాడిన వారవుతారు. అంతేకాక రోడ్డు భద్రత అందరి బాధ్యత అనేది అధికారులు గుర్తించాల్సిన అంశం. ఇటీవల ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన కొన్ని ప్రమాదకర ప్రయాణ దృశ్యాలు. – ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
సురక్షిత ప్రయాణం
జనగామ: ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖవంతం అనే నినాదం ప్రతి బస్సుపైనా కనిపిస్తుంది. అంకితభావం కలిగిన డ్రైవర్లు ఈ నినాదాన్ని అక్షర సత్యంగా మార్చారు. ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ ప్రయాణం సురక్షితమన్న భావన ప్రజలకు కల్పించడంలో సఫలీకృతులయ్యారు. జిల్లాలో ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు స్వల్పం. ఈ నెల19 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాలు 25 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి అధికారుల ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. బస్సు కండీషన్, డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రత.. ప్రయాణికులతో ఎలా ఉండాలనే దానిపై నిపుణులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. బస్సును ఈ రోజు పూర్తి ఏకాగ్రతతో నడిపిస్తాను, అవసరమైన సమయంలో వేగాన్ని నియంత్రణ చేస్తూ, ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తానని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఉత్తమ డ్రైవర్లకు బహుమతులను అందిస్తున్నారు. తగ్గిన ప్రమాదాలు... ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితనే భావన ప్రయాణికుల్లో బలంగా నాటుకు పోయింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా డ్రైవర్‌పై పని ఒత్తిడి తక్కువ. మూడేళ్లుగా జనగామ జిల్లా పరిధిలో ఆర్టీసీ ప్రమాదాలు తక్కువనే చెప్పుకోవచ్చు. 2015తో పోలిస్తే 2016లో ప్రమాదాల సంఖ్య తగ్గింది. 2015లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. చిన్నవి, పెద్దవి కలుపుకుని జరిగిన ప్రమాదాల్లో 12 మంది క్షతగాత్రులయ్యారు. 2016లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా..మేజర్, మైనర్ ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 2015తో పోలిస్తే మూడు శాతం మేర ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2017 ఏప్రిల్‌లో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జనగామ డిపోకు చెందిన బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోగా.. తొమ్మిది రోడ్డు ప్రమాదాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై.. వరంగల్–హైదరాబాద్, సిద్దిపేట–విజయవాడ జాతీయ, స్టేట్ హైవేలపై ప్రైవేట్ వాహనాల రోడ్డు ప్రమాదాలు ఎక్కువే. అతివేగం, మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. అమాయకులను బలి చేస్తున్నారు. జనగామ జిల్లాలో 2015 సంవత్సరంలో జాతీయ, రాష్ట్ర రహదారిలో 320 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగగా..ఇందులో 170 మందికి పైగా మృతి చెందారు. 350 మందికి పైగా తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్, పోలీసు పెట్రోలింగ్, నిరంతర నిఘా పెంచడంతో 2016లో ప్రమాదాల సంఖ్య 292కు తగ్గి పోయింది. ఈ ప్రమాదాల్లో 133 మంది అక్కడికక్కడే చనిపోగా.. 299 మంది గాయాల పాలయ్యారు. 2017లో 265 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగగా..100కు పైగా మృతి చెందారు. నేడు ఫ్యామిలీ కౌన్సెలింగ్.. తరుచూ రోడ్డు ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్లకు కుటుబ సభ్యులతో కౌన్సెలింగ్ ఇస్తారు. డ్రైవర్ ఇంటి నుంచి వెళ్లే క్రమంలో ఎలాంటి చికాకులు ఉండకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు వివరిస్తారు. బస్సులో ప్రయాణిస్తున్న ఎన్నో కుటుంబాలు డ్రైవర్‌పై ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని గర్తుంచుకోవాలని సూచిస్తారు. 23న బస్సు కండీషన్‌పై అవగాహన బస్సు కండీషన్, ప్రమాదాన్ని గమనించి వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలనే దానిపై మంగళవారం అవగాహన కలిగిస్తారు. గతంలో రోడ్డు ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు ఉత్తములతో శిక్షణ ఇప్పిస్తారు. అవసరమైన సమయంలో వారిని శిక్షణ కోసం రీజియన్‌కు పంపిస్తారు. 24న ఉత్తమ డ్రైవర్లకు సత్కారం వారోత్సవాల ముగింపులో ఉత్తమ సేవలందించిన డ్రైవర్లను బుధవారం సత్కరిస్తారు. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచేలా వారి ఫొటోలను ప్రదర్శిస్తారు. విజయాలు అందరికి తెలిసేలా వారి సర్వీసు రికార్డులో ఫొటోలు ఉంచుతారు. 25న సేవా కార్యక్రమాలు రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం రక్తదాన శిబిరాలు, సేవా కారక్రమాలను చేపడుతారు. డ్రైవర్లు రక్తదానం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకుంటారు. అత్యవసర సమయంలో ఈ రక్తాన్ని వినియోగిస్తారు. ప్రయాణికుల సేవలో.. జనగామ డిపో పరిధిలో 125 బస్సులు నిత్యం 40 వేల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చుతున్నాయి. ఆర్టీసీలో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ. వంద శాతం యాక్సిడెంట ఫ్రీ జోన్‌గా జనగామను తీర్చి దిద్దేందుకు డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. గత మూడేళ్లుగా పరిశీలిస్తే ప్రమాదాలను చాలా వరకు నియంత్రించగలిగాం. – శ్రీనివాసరావు, జనగామ డిపో మేనేజర్ ఆర్టీసీ రూల్స్ పాటించాలి వాహన డ్రైవర్లు, యజమానులు ఆర్టీ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతనే వాహనాన్ని రోడ్డు ఎక్కించాలి. ముఖ్యంగా ఫిట్నెస్, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఓవర్‌లోడ్ ఉంటే కేసులు తప్పవు. నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేస్తూ..అవగాహన కలిగిస్తున్నాం. మధ్యం సేవించి ఎవరూ కూడా డ్రైవింగ్ చేయరాదు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేసుకోవాలి. – రమేష్‌రాథోడ్, డీటీఓ, జనగామ -
గోషామహల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు
-
నో హెల్మెట్.. నో కాలేజ్
హయత్‌నగర్: రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా హయత్‌నగర్ పోలీసు స్టేషన్ సీఐ నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పలు కాలేజీల వద్ద పోలీసులు నో హెల్మెట్.. నో కాలేజ్ పేరిట విద్యార్థులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. ఈ సమయంలో హెల్మెట్ లేకుండా కాలేజీలకు వచ్చిన విద్యార్థులకు జరిమానా విధించారు. సుమారు వందమంది విద్యార్థులకు హెల్మట్లు లేకపోవడంతో వారిని ఇంటికి పంపించేశారు. -
ప్రమాదరహిత తెలంగాణకు కృషి
రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రమాదరహిత తెలంగాణ సాధనకు కృషి చేస్తామని రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 17 నుంచి 23 వరకు జరగనున్న రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. దేశంలో ఏటా 1.5 లక్షల మంది, రాష్ట్రంలో 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో 1,125 మంది మృత్యువాత పడ్డారు. తర్వాతి స్థానాల్లో మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలున్నాయి’’ అని చెప్పారు. ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు. -
17నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాలు
హైదరాబాద్: ప్రమాద రహిత తెలంగాణ కోసం నడుం బిగించాలని ప్రజలకు మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 17నుంచి 23వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరగనున్న సందర్భంగా ఈ వారోత్సవాల లోగోను ఆయన ఆవిష్కరించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాద ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నామని, తమ ప్రభుత్వం రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానం మంచి ఫలితం ఇచ్చిందన్నారు. ప్రమాదాల నివారణకు మూడు నెలలకోసారి సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న మద్యం దుకాణాలను తొలగిస్తామన్నారు.