దయచేసి లైనులో వెళ్లండి | Line Discipline Act Soon in Hyderabad ORR | Sakshi
Sakshi News home page

దయచేసి లైనులో వెళ్లండి

Published Mon, Dec 16 2019 9:48 AM | Last Updated on Mon, Dec 16 2019 9:48 AM

Line Discipline Act Soon in Hyderabad ORR - Sakshi

నిత్యం రహదారిపై తిరుగుతూ ఉంటాం. కానీ మనలో ఎంతమందికి రోడ్డు నిబంధనలు తెలుసు? అంటే సగం మంది నుంచి కూడా సమాధానం రాదు. ఎవరికి వారు ఇష్టానుసారం దూసుకుపోతుంటారు. ఎదుటివారికి ఇబ్బంది కలిగినా.. వెళ్లేది రాంగ్‌ రూట్‌ అయినా ఎక్కడి నుంచో దూసుకొచ్చివాహనాన్ని అడ్డంగా పెట్టేస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో ‘లైన్‌ డిసిప్లేన్‌’ అమలు చేయాలని యోచిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తప్పనిసరిగా అమలు చేస్తున్న ఈ విధానం ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ ‘లైన్‌ డిసిప్లేన్‌’ విధానాన్ని గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అమలు చేయాలని ట్రాఫిక్‌ పోలీసులుభావిస్తున్నారు.

ముంబైలో విజయవంతం 
మహానగరం కంటే వాహనాలు ఎక్కువగా ఉన్న ముంబైలో లేన్‌ డిసిప్లేన్‌ విధానం అమలు చేస్తున్నారు. ఇది అక్కడ మంచి ఫలితాలనిచ్చింది. అక్కడి అధికారులు కొన్నేళ్ల క్రితమే లేన్‌ డిసిప్లేన్‌ను అమలు చేశారు. నగరంలో తిరిగే వాహనాల సామర్థ్యం, ప్రయాణించే వేగాన్ని బట్టి సిగ్నల్స్‌ వద్ద వేర్వేరుగా లైన్లు కేటాయిస్తారు. రెడ్‌లైట్‌ పడినప్పుడు ఆయా వాహనాలను కచ్చితంగా వాటికి కేటాయించిన వరుసలోనే ఆగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రీన్‌లైట్‌ పడినప్పుడూ ముందుకు క్రమపద్ధతిలో వెళ్లడంతో జంక్షన్లలో ట్రాఫిక్‌ జామ్స్‌తో పాటు ప్రమాదాలు సైతం గణనీయంగా తగ్గాయి. ఫలితంగా ఈ విధానం అమలుకు ముందున్న పరిస్థితి పూర్తిగా మారింది.  

పద్ధతిలేని ప్రయాణం
నగరంలో ఏ జంక్షన్‌ వద్ద చూసినా రెడ్‌లైట్‌ సిగ్నల్‌ పడినప్పుడు ‘స్టాప్‌లైన్‌’ వద్ద వాహనాలు ఆగే తీరు నిర్దిష్టంగా ఉండదు. ద్విచక్ర వాహనాల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా ఆగుతాయి. కుడి వైపు వెళ్లాల్సిన వాహనాలు కూడా ఎడమ వైపు ఆగుతుంటాయి. దీనివల్ల ‘గ్రీన్‌లైట్‌’ పడినప్పుడు వేటికవి ముందుకు దూసుకు పోవడానికి ప్రయత్నించడంతో అనేక సందర్భాల్లో తీవ్రమైన ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. కొన్నిసార్లు ఇబ్బందికరమైన జంక్షన్లలో వీటివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాహన చోదకుల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఘర్షణలు పరిపాటిగా మారాయి. ఇలాంటి సమస్యలకు ‘లేన్‌ డిసిప్లేన్‌’ అమలు పరిష్కారం చూపుతుంది.  

ఏదైనా సంస్థ సహకారంతో.. 
రహదారులను సర్వే చేయడంతో పాటు లైన్‌ డిసిప్లేన్‌ అమలు, అందుకు చేపట్టాల్సిన ఇంజినీరింగ్‌ మార్పులను సూచించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఏదైనా ప్రముఖ సంస్థకు చెందిన నిపుణుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. వారి ద్వారా సాంకేతిక అధ్యయనం చేసిన తర్వాతే లైన్‌ డిసిప్లేన్‌ విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనాల సరాసరి వేగం పెరగడంతో పాటు గమ్యం చేరే సమయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ‘గ్రీన్‌లైట్‌–రెడ్‌లైట్‌’ మధ్య సమయంలో సిగ్నల్‌ను 100 వాహనాలు దాటుతున్నాయనుకుంటే.. లేన్‌ డిసిప్లేన్‌ అమలుతో ఆ వాహనాల సంఖ్యను 150కి పైగా దాటేలా చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. లేన్‌ డిసిప్లేన్‌ విధానాన్ని పరిచయం చేయడానికి ముందు కొన్ని మౌలిక వసతులను మెరుగుపచడంతో పాటు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన
కల్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

అన్ని రోడ్లలోనూ సాధ్యమేనా!
ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆ లైన్‌ డిసిప్లేన్‌ విధానాన్ని కేవలం జంక్షన్ల వద్దే కాకుండా.. రహదారుల పైనా అమలు చేయాలని భావిస్తున్నారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లోని రహదారులూ ఒకేలా లేవు. కొన్ని రోడ్లు అవసరమైన వెడల్పుతో ఉండగా.. మరికొన్ని కుంచించుకుపోయి, బాటిల్‌ నెక్స్‌గా మారాయి. జంక్షన్ల పరిస్థితీ ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఒకేసారి ‘లైన్‌ డిసిప్లేన్‌’ విధానాన్ని అమలుచేస్తే వీటివల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తి వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ప్రాథమికంగా లైన్‌ విధానం అమలుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు.  

గ్రేటర్‌లో ప్రాథమికంగా ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయోగాత్మకంగా ‘లైన్‌ డిసిప్లేన్‌’ విధానం అమలు చేసి.. ఆపై అనువైన ప్రతి మార్గానికీవిస్తరించాలని ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం అవసరమైన అధ్యయనంచేయడానికి ఓ సంస్థ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విధానం ముంబైలో మంచి ఫలితాలిచ్చిందంటున్నారు. రాజధానిలోని రోడ్లపై ‘లేన్‌ డిసిప్లేన్‌’ను అమలు చేయడం ద్వారా వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచడంతో పాటు వాహన చోదకులు గమ్యం చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement