lanes
-
రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
దేశంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక లేన్ రూపొందించే ప్రణాళికను పరిశీలిస్తోంది. నగరాల్లో ద్విచక్ర వాహనాలు, పాదచారుల కోసం ప్రత్యేక లేన్లు, అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.రోడ్డుపై అన్ని రకాల వాహనాలు ఏకకాలంలో వెళ్లడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది. వాహనాల రకాన్ని బట్టి వేర్వేరు లేన్లను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, మరణాలలో 44 శాతం ద్విచక్ర వాహనాలతో ముడిపడినవే ఉంటున్నాయి.రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించే దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం 2022 లో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,43,366 మంది గాయపడ్డారు.గత ఏడాది దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. -
ఖరముకదిలితేనే..రైతుల బతుకుబండి నడిచేది
‘‘ఎవరైనా ఎక్కువగా కష్టపడి పనిచేస్తే గాడిద చాకిరీ చేస్తున్నాడు’’ ‘‘వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు’’ ఇది ఉపమానం అయినా, సామెత అయినా..పని, అవసరం విశిష్టత చెప్పడమే. అవి కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాలు. పొలాలకు వెళ్లేందుకు వీలుగా ఎడ్లబండ్లు తీసుకెళ్లడానికి మట్టిబాటలు కూడా లేవు. ఎరువులు, విత్తనాలు తీసుకెళ్లాలన్నా, పండిన పంట ఇంటికి చేరాలన్నా రైతులకు ఎన్నో వ్యయప్రయాసలే. అలాంటి వారి పాలిట గాడిదలే కార్గో విమానాలు, ట్రాక్టర్లు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి గాడిదల వినియోగం ఎక్కడంటే.. కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దులో ఉంటే సంగారెడ్డి జిల్లాలోని మారుమూల మండలాలైన సిర్గాపూర్, కంగి్ట, కల్హేర్, మనూరు మండలాల్లో రైతుల పంట రవాణాకు గాడిదల వినియోగం ఎక్కువ. ఆయా మండలాల్లోని చీమలపాడు, వాసర్, వంగ్దాల్, తడకల్, రాసోల్, జంగి, గాజుర్పాడు, దామరగిద్దలో ఆయా వ్యవసాయ సీజన్లకు అనుగుణంగా వీటి వినియోగం చూడొచ్చు. అంగడి.. శూన్య అమావాస్య రోజున గాడిదల అంగడి మహారాష్ట్రలోని మాలేగాంలో జరుగుతుంది. ఏడాదికోసారి వచ్చే శూన్య అమావాస్య రోజు (సంక్రాంతి పండుగకు ముందు) జరిగే ఈ అంగడిలో గాడిదల క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈ అంగట్లో తమకు అవసరమైన గాడిదలు కొనుగోలు చేస్తారు. ఒక్కో గాడిద ఖరీదు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. సీజన్లో మహారాష్ట్ర నుంచి.. ఆయా పంట సీజన్‌కు అనుగుణంగా మహారాష్ట్ర నుంచి గాడిదలు సంగారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాలకు తీసుకొచ్చి సరుకు రవాణా చేయిస్తారు. నెల, రెండు నెలలు ఇక్కడ ఉండి సీజన్ ముగిశాక వెళ్లిపోతారు. కిరాయి... వస్తు బదిలీ రూపంలోనే వ్యవసాయ ఉత్పత్తులు తరలించినందుకు గాడిదల యజమానులకు కిరాయి డబ్బురూపంలో కాకుండా, వస్తురూపంలో ఉంటుంది. ఇది పాత పద్ధతే అయినా ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో అమలులో ఉంది. 60 నుంచి 70 కిలోల వ్యవసాయ ఉత్పత్తుల బస్తా తరలిస్తే అడ్డెడు సరుకుల చొప్పున ఇస్తున్నారు. పెసర, మినుము, సోయా వంటి పంటలను తరలిస్తే రెండు, మూడు బస్తాలకు ఒక అడ్డ చొప్పున ఇస్తున్నారు. పంట చేను నుంచి తరలించే ఇంటి దూరాన్ని బట్టి కిరాయి పెరుగుతుంది. ఒకఅడ్డ అంటే ఐదు కిలోలతో సమానం. వడ్లు అయితే కాస్త తక్కువగా ఉంటుంది. సీజన్లో కొందరు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప మండల కేంద్రాలకు తెచ్చేందుకు కూడా గాడిదలను వినియోగిస్తారు. ఎరువులు, విత్తనాల బస్తాలను ఇంటి నుంచి పొలాలకు తరలిస్తే బస్తాకు రూ.30 నుంచి రూ.50 వరకు దూరాన్ని బట్టి తీసుకుంటారు. వేరే ప్రత్యామ్నాయం లేకనే... నాకున్న భూమిలో నాలుగు ఎకరాల వరకు సరిగ్గా దారి లేదు. దీంతో ఏటా నేను ఆ పొలం నుంచి వడ్లు, సోయా, కందులు, పెసర్లు ఇంటికి తెచ్చేందుకు గాడిదలనే కిరాయికి పెట్టుకుంటాను. తూము(16 అడ్డల)కు ఒక అడ్డెడు కిరాయి కింద గాడిదల యజమానికి చెల్లిస్తా. అంటే సుమారు 20 క్వింటాళ్ల సరుకు తరలిస్తే క్వింటాలు వరకు కిరాయి ఇస్తా. ఈ పొలాల నుంచి పంటను తరలించేందుకు ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. ఆ పొలం వరకు ట్రాక్టర్ వెళ్లదు. – దేవుకతే యాదవరావు, రైతు, సిర్గాపూర్ రెండు గాడిదలతో కనిపిస్తున్న ఈ వ్యక్తి కుమ్మరి పండరి. సిర్గాపూర్ మండలం చీమలపాడు గ్రామం. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలో పండరికి ఎనిమిది గాడిదలు ఉన్నాయి. రోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి చీకటిపడే వరకు గాడిదలను మేపేందుకు తీసుకెళ్లాడు. పంటలు వేసుకునే సమయంలో ఎరువులు, విత్తనాల బస్తాలు తరలించేందుకు సీజన్ మొత్తంలో రూ.8వేల నుంచి 10 వేల వరకు వస్తాయని, పంట ఇంటికి చేరే సీజన్లో తన కుటుంబం ఏడాదంతా తినేందుకు సరిపడా పప్పుదినుసులు, ఏడెనిమిది క్వింటాళ్ల వరకు సోయాలు వస్తాయని చెబుతున్నాడు. వీటిని అమ్ముకుంటే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చేతికందుతుందని పండరి చెప్పుకొచ్చాడు. -
ట్రాఫిక్ని బట్టి సెట్ చేసుకునే డివైడర్: వీడియో వైరల్
మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు గురించి అందరికి తెలిసిందే. ఏదైన పండుగలకు లేదా ప్రత్యేకమైన రోజుల్లో సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లామా! అంతే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతాం. అసలు ఆ ట్రాఫిక్ నుంచి బయటపడితే ఏదో సాధించనంత ఫీలింగ్ వస్తుంది. ఐతే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెడుతూ చైనా ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. చైనీయులు ఈ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఒక సరికొత్త విధానాన్ని కూడా అనుసరిస్తున్నారు. ఈ విషయాలన్నింటిని వినియోగదారులతో పంచుకుంటూ... ఒక వీడియోను పోస్ట్ చేశారు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్. ఆ వీడియోలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడూ క్లియర్ చేసేందుకు ఒక రివర్సబుల్ లేన్ పని తీరు చూపిస్తుంది. ఇది ఏంటంటే...రోడ్డు మధ్యలో ఉండే డివైడర్ వెడల్పును కావల్సినట్లుగా ఎడ్జెస్ట్ చేసుకుంటూ ట్రాఫిక్ని తగ్గించడం. చైనా వాసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఉదయం ఒక దిశలోనూ సాయంత్రం సమయాల్లో వ్యతిరేక దిశలో వెళ్తారు. అందుకోసం ఆయా దిశల్లో వెళ్లేలా డివైడర్ లైన్‌ని సెట్ చేసేకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ వీడియోలో ఆ డివైడర్ లైన్‌ని ట్రాఫిక్ కోసం జిప్ మాదిరిగా రెండు వాహనాల సాయంతో దగ్గరగా చేయడం కనిపిస్తుంది. వీటిని రివర్సబుల్ ట్రాఫిక్ లైన్లు అంటారు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపకరిస్తాయి. ఐతే నెటిజన్లు దీన్ని సరికొత్త సాంకేతిక ఆవిష్కరణగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇదేమీ కొత్త ఆవిష్కరణ కాదని అమెరికా 1960లలోనే ఈ మౌలిక సదుపాయాల ఆవిష్కరణను ప్రవేశపెట్టినట్లు సమాచారం. #ChinaInfrastructure: How does Beijing relieve traffic jams? By changing the direction of traffic. Here's how they do it. The traffic authority selects a lane to go one direction in the morning and the opposite direction in the evening to release peak pressure. pic.twitter.com/OaaxycwDJQ — Hua Chunying 华春莹 (@SpokespersonCHN) August 31, 2022 (చదవండి: స్నేహితుడి కోసం ఎంతలా తపించిందో ఆ కంగారు: వీడియో వైరల్) -
ప్రపంచంలోనే అతి సన్నని సందు
ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇరుకు సందు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదుచేసుకుంది. ఈ రెండు భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలం ఉత్త సందు మాత్రమే కాదు, ఇది ఒక వీథి. జర్మనీలోని రియూల్టిన్‌జెన్ పట్టణంలో ఉంది. ఈ వీథి పేరు ‘స్ప్రోయూర్హోఫ్ స్ట్రాసే’. సుమారు రెండు శతాబ్దాల నాటి ఈ వీథి ప్రపంచంలోనే అత్యంత ఇరుకైంది. 1726లో నిర్మించిన ఈ వీథి వెడల్పు కేవలం 31 సెం.మీ (1.1 అడుగు) మాత్రమే! జర్మనీ భూభాగ లెక్కల ప్రకారం ఈ వీథికి రెండు వైపులా ఉన్న భవనాలు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. పైగా దీనిని చేతితో నిర్మించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే, ఈ వీథిని 1820లో అధికారికంగా పబ్లిక్ స్ట్రీట్ 77గా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇదొక పర్యాటక స్థలంగా మారింది. చాలామంది దీనిని చూడటానికి, దీని లోపలి నుంచి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. 2017 ఫిబ్రవరిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు దీనిని పరిశీలించి, ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీథిగా ప్రకటించారు. దురదృష్టవశాత్తు వీథికి ఎడమవైపు ఉన్న భవనం ఈ మధ్యనే శిథిలావస్థకు చేరింది. గోడలను కూల్చి, కొత్త భవంతి నిర్మిస్తే.. ఈ వీథి ప్రాముఖ్యత కోల్పోతుందని అలాగే ఉంచారు. అంతేకాదు, ఇప్పుడు ఆ వీథి నుంచి ప్రయాణించేందుకు ప్రజలకు అనుమతి లేదు. అలా ఆ గోడలు ఉన్నంత వరకు ఇదే అత్యంత ఇరుకైన వీథి. చూడాలి మరి, ఇంకా ఎన్ని రోజులు తన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో నిలుపుకుంటుందో! -
దయచేసి లైనులో వెళ్లండి
నిత్యం రహదారిపై తిరుగుతూ ఉంటాం. కానీ మనలో ఎంతమందికి రోడ్డు నిబంధనలు తెలుసు? అంటే సగం మంది నుంచి కూడా సమాధానం రాదు. ఎవరికి వారు ఇష్టానుసారం దూసుకుపోతుంటారు. ఎదుటివారికి ఇబ్బంది కలిగినా.. వెళ్లేది రాంగ్ రూట్ అయినా ఎక్కడి నుంచో దూసుకొచ్చివాహనాన్ని అడ్డంగా పెట్టేస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలో ‘లైన్ డిసిప్లేన్’ అమలు చేయాలని యోచిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తప్పనిసరిగా అమలు చేస్తున్న ఈ విధానం ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ ‘లైన్ డిసిప్లేన్’ విధానాన్ని గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులుభావిస్తున్నారు. ముంబైలో విజయవంతం మహానగరం కంటే వాహనాలు ఎక్కువగా ఉన్న ముంబైలో లేన్ డిసిప్లేన్ విధానం అమలు చేస్తున్నారు. ఇది అక్కడ మంచి ఫలితాలనిచ్చింది. అక్కడి అధికారులు కొన్నేళ్ల క్రితమే లేన్ డిసిప్లేన్‌ను అమలు చేశారు. నగరంలో తిరిగే వాహనాల సామర్థ్యం, ప్రయాణించే వేగాన్ని బట్టి సిగ్నల్స్ వద్ద వేర్వేరుగా లైన్లు కేటాయిస్తారు. రెడ్‌లైట్ పడినప్పుడు ఆయా వాహనాలను కచ్చితంగా వాటికి కేటాయించిన వరుసలోనే ఆగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రీన్‌లైట్ పడినప్పుడూ ముందుకు క్రమపద్ధతిలో వెళ్లడంతో జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్‌తో పాటు ప్రమాదాలు సైతం గణనీయంగా తగ్గాయి. ఫలితంగా ఈ విధానం అమలుకు ముందున్న పరిస్థితి పూర్తిగా మారింది. పద్ధతిలేని ప్రయాణం నగరంలో ఏ జంక్షన్ వద్ద చూసినా రెడ్‌లైట్ సిగ్నల్ పడినప్పుడు ‘స్టాప్‌లైన్’ వద్ద వాహనాలు ఆగే తీరు నిర్దిష్టంగా ఉండదు. ద్విచక్ర వాహనాల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా ఆగుతాయి. కుడి వైపు వెళ్లాల్సిన వాహనాలు కూడా ఎడమ వైపు ఆగుతుంటాయి. దీనివల్ల ‘గ్రీన్‌లైట్’ పడినప్పుడు వేటికవి ముందుకు దూసుకు పోవడానికి ప్రయత్నించడంతో అనేక సందర్భాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కొన్నిసార్లు ఇబ్బందికరమైన జంక్షన్లలో వీటివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాహన చోదకుల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఘర్షణలు పరిపాటిగా మారాయి. ఇలాంటి సమస్యలకు ‘లేన్ డిసిప్లేన్’ అమలు పరిష్కారం చూపుతుంది. ఏదైనా సంస్థ సహకారంతో.. రహదారులను సర్వే చేయడంతో పాటు లైన్ డిసిప్లేన్ అమలు, అందుకు చేపట్టాల్సిన ఇంజినీరింగ్ మార్పులను సూచించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏదైనా ప్రముఖ సంస్థకు చెందిన నిపుణుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. వారి ద్వారా సాంకేతిక అధ్యయనం చేసిన తర్వాతే లైన్ డిసిప్లేన్ విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనాల సరాసరి వేగం పెరగడంతో పాటు గమ్యం చేరే సమయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ‘గ్రీన్‌లైట్–రెడ్‌లైట్’ మధ్య సమయంలో సిగ్నల్‌ను 100 వాహనాలు దాటుతున్నాయనుకుంటే.. లేన్ డిసిప్లేన్ అమలుతో ఆ వాహనాల సంఖ్యను 150కి పైగా దాటేలా చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. లేన్ డిసిప్లేన్ విధానాన్ని పరిచయం చేయడానికి ముందు కొన్ని మౌలిక వసతులను మెరుగుపచడంతో పాటు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని రోడ్లలోనూ సాధ్యమేనా! ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ లైన్ డిసిప్లేన్ విధానాన్ని కేవలం జంక్షన్ల వద్దే కాకుండా.. రహదారుల పైనా అమలు చేయాలని భావిస్తున్నారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లోని రహదారులూ ఒకేలా లేవు. కొన్ని రోడ్లు అవసరమైన వెడల్పుతో ఉండగా.. మరికొన్ని కుంచించుకుపోయి, బాటిల్ నెక్స్‌గా మారాయి. జంక్షన్ల పరిస్థితీ ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఒకేసారి ‘లైన్ డిసిప్లేన్’ విధానాన్ని అమలుచేస్తే వీటివల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తి వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా లైన్ విధానం అమలుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. గ్రేటర్లో ప్రాథమికంగా ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయోగాత్మకంగా ‘లైన్ డిసిప్లేన్’ విధానం అమలు చేసి.. ఆపై అనువైన ప్రతి మార్గానికీవిస్తరించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం అవసరమైన అధ్యయనంచేయడానికి ఓ సంస్థ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విధానం ముంబైలో మంచి ఫలితాలిచ్చిందంటున్నారు. రాజధానిలోని రోడ్లపై ‘లేన్ డిసిప్లేన్’ను అమలు చేయడం ద్వారా వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచడంతో పాటు వాహన చోదకులు గమ్యం చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
లైఫ్‘లైన్’ లేదాయె!
సాక్షి, సిటీబ్యూరో: రోగులు, క్షతగాత్రులను అత్యవసరంగా తరలించే అంబులెన్స్‌ల కోసం రహదారులపై ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘కామన్వెల్త్ లైన్’ను పరిశీలించిన నగర పోలీసు అధికారులు ఆ తరహాలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే సిటీలోని రోడ్ల స్థితిగతులు, పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రత్యేక లైన్ అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య రంగానికి కేంద్రంగా మారిన నగరంలో అనేక కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ పెద్దాస్పత్రులైన ఉస్మానియా, గాంధీ, మెటర్నిటీ దవాఖానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిటీతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన రోగులను వైద్యం కోసం అంబులెన్స్‌లో సిటీకి తీసుకొస్తుంటారు. ఆయా వాహనాలు నగర శివార్ల వరకు వేగంగా వచ్చినా, సిటీలోకి రాగానే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి. ఫలితంగా ఒక్కోసారి రోగుల పరిస్థితి చేయిదాటిపోతోంది. సాధారణ రోజుల్లో కంటే ట్రాఫిక్ జామ్ అధికంగా ఉండడం, వర్షం కురవడం తదితర సమయాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయి. ‘గ్రీన్ చానల్’ స్ఫూర్తిగా.. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ప్రజల్లో అవయవ దానంపై ఇటీవల అవగాహన పెరిగింది. దీంతో ఇతర నగరాలతో పాటు రాష్ట్రాల్లోనూ బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరినవారి అవయవాలను ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు తరలించచడం జరుగుతోంది. ఆయా సందర్భాల్లో వైద్యులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అవయవాలను తీసుకెళ్లే అంబులెన్స్‌లు విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి చేరుకునే వరకు సమన్వయంతో పని చేస్తున్నారు. ఈ అంబులెన్స్‌ల కోసం ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ ‘గ్రీన్ చానల్’ ఇస్తున్నారు. ఫలితంగా అవయవదానానికి సంబంధించిన లక్ష్యం నెరవేరుతోంది. ఈ ‘గ్రీన్ చానల్’ విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు స్ఫూర్తిగా తీసుకున్నారు. అవయవదానం సందర్భంలోనే కాకుండా ఇతర సమయాల్లోనూ అంబులెన్స్‌లో ప్రయాణించే రోగుల పరిస్థితి విషమంగా ఉండే ఆస్కారం ఉందని, కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా ‘గోల్డెన్ అవర్’ దాటిపోవడంతో పరిస్థితులు చేజారిపోతున్నాయని భావించిన అధికారులు నగరంలో అంబులెన్స్‌లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రహదారులకు కుడివైపున కనీసం నాలుగడుగుల దారిని అంబులెన్స్‌ల కోసం కేటాయించాలని భావించారు. ఇందుకు ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ సమయంలో అమలు చేసిన విధానాన్ని అధ్యయనం చేశారు. ఈ ప్రత్యేక రూట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అత్యంత రద్దీ సమయాల్లో, ప్రధాన ఆస్పత్రులున్న 15 మార్గాల్లో అమలు చేయాలని యోచించారు. అయితే సిటీలోని రహదారుల పరిస్థితి, వాటి వెడల్పు అన్ని చోట్ల ఒకేలా లేకపోవడం, బాటిల్ నెక్స్ తదితరాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు అమలులో ఇబ్బందులను గుర్తించారు. ఏంటీ ‘కామన్వెల్త్ లైన్’? 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సమయంలో ఆటగాళ్లకు అక్కడి ప్రధాన హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి క్రీడాకారులు మైదానాలకు చేరుకోవడంలో ఎలాంటి ఆలస్యానికి తావులేకుండా అక్కడి పోలీసు విభాగం చర్యలు తీసుకుంది. ప్రధాన రహదారులకు కుడివైపుగా ఓ లైన్ ఏర్పాటు చేసి, ఆ భాగానికి ‘కామన్వెల్త్ లైన్’గా మార్కింగ్ ఇచ్చింది. ఇందులో సాధారణ వాహనాలు ప్రయాణిస్తే రూ.2వేలు జరిమానా విధించింది. దీంతో ఆ ‘లైన్’ విజయవంతమై క్రీడాకారులకు ఇబ్బందులు తప్పాయి. సమస్యలను అధిగమిస్తాం ‘కామన్వెల్త్ లైన్’ విధానం తరహాలో సిటీలో అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలంటే ఆర్టీఏ విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా 15 ప్రాంతాల్లో అధ్యయనం చేయాలని భావించాం. ఇప్పటికే వాహనచోదకులు అంబులెన్స్‌లకు దారి ఇస్తున్న నేపథ్యంలో వారిలో మరికొంత అవగాహన కల్పిస్తే ఈ విధానం విజయవంతమయ్యే అవకాశం ఉంది. అయితే సిటీలోని రోడ్లపై ప్రయోగాత్మక అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా సమస్యలను అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నాం. ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే అంబులెన్స్‌లకు ప్రత్యేక లైన్ విధానం అమలులోకి తీసుకొస్తాం.– సిటీ ట్రాఫిక్ పోలీసులు గ్రేటర్లో అంబులెన్స్‌లు ఇలా (లెక్కలు సుమారు)ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్సులు 4,500 ప్రతిరోజు జిల్లాల నుంచి నగరానికి వచ్చి వెళ్లేవి 200, 108 అంబులెన్సులు 42 ఒక్కో 108 వాహనం రోజుకు సగటునఅటెండ్ అవుతున్న కేసులు 67 ఆస్పత్రికి తరలించే సమయంలోమార్గమధ్యలోనే జరుగుతున్న ప్రసవాలు 12 -
రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలి
రామన్నపేట: చిట్యాల–భువనగిరి ప్రధాన రహదారిని నాలుగులేన్లుగా విస్తరించాలని తెలంగాణ ఉద్యమ వేదిక వర్కింగ్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే చాంద్ కోరారు. గురువారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయనీ చెప్పారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు విస్తరణకు అవసరమైన చర్యలను ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట గొరిగె సోములు, దుర్క నర్సింహ, బెడిద లింగస్వామి, గుండ్లపల్లి బాలయ్య, జే.వెంకటేష్, కందుల నర్సింహ ఉన్నారు. -
బ్యాంకులు.. బ్లాక్ మనీకి దారులు
♦ వేలకోట్లు దేశం దాటించేస్తున్న హవాలా రాయుళ్లు ♦ బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కు; లొసుగులతో ఆటలు ♦ ఇరాన్ రూపీ ఖాతాలతో... 20 వేల కోట్లు విదేశాలకు ♦ నకిలీ దిగుమతి బిల్లులతో ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ.15 వేల కోట్లు ♦ జీడిపప్పు దిగుమతి అంటూ బీఓబీ ద్వారా రూ.6,000 కోట్లు ♦ నిజంగా వస్తువుల్ని ఎగుమతి చేసినట్లుగా... పన్ను రిఫండ్ కూడా ♦ ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా మోసంతో కాజేసిన ఘనులు ♦ ఇదీ మన బ్యాంకుల తీరు రూ. 50 వేలు ఒకేసారి డిపాజిట్ చేసినా.. లేక రూ. 2 లక్షలు దాటి ఎలాంటి లావాదేవీలు జరిపినా పాన్ నంబర్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలంటే సవాలక్ష పత్రాలివ్వాలి. మీ చిరునామా నుంచి అన్ని వివరాలూ చెప్పాలి. కనీసం పాత ఖాతాదారులు మిమ్మల్ని పరిచయం చేయాలి. ఇక ఇంటి రుణమో, వాహన రుణమో, వ్యక్తిగత రుణమో తీసుకోవాలంటే... చుక్కలు కనిపిస్తాయి. ఏ నెలైనా చెల్లించటంలో ఒకటి రెండురోజులు ఆలస్యమైతే... పెనాల్టీల భారం తప్పదు. దానికి తోడు సిబిల్లోనూ ‘మార్కు’ పడిపోతుంది. ఇలాంటి మార్కులు పడ్డాయంటే మళ్లీ రుణం దొరకటమనేది కలే. మరి సామాన్యుడికి ఇన్ని నిబంధనలు పెట్టే బ్యాంకుల ద్వారా కొందరు బడా బాబులు వేల కోట్ల రూపాయల్ని ఈజీగా దేశం దాటించేస్తున్నారంటే నమ్మగలమా? ఆ బ్యాంకుల్లో పనిచేసే ఒకరిద్దరిని అడ్డం పెట్టుకుని వందల కోట్లు కొల్లగొడుతున్నారంటే ఏమనుకోవాలి? కానీ ఇవే జరుగుతున్నాయి. నల్లధనాన్ని ఏకంగా బ్యాంకుల్నుంచే దేశం దాటించి... మళ్లీ వాటిద్వారానే తెల్లడబ్బుగా వెనక్కి తెస్తున్నారు. ఈ హవాలా ఘరానా మోసానికి నజరానాగా... సుంకాల రిఫండ్ రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచి వందల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక్క యూకో బ్యాంక్ ద్వారానే హవాలా మార్గంలో రూ.20,000 కోట్ల నల్లడబ్బు అరబ్ దేశాలకు వెళ్ళిపోయింది. ఆరు ప్రైవేటు బ్యాంకుల నుంచి ఏకంగా రూ.15,000 కోట్లు సరిహద్దులు దాటాయి. జీడిపప్పు దిగుమతి పేరిట బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రూ.6,000 కోట్లు దేశం దాటేశాయి. ఇలాంటి కుంభకోణాలు అసలెలా జరుగుతున్నాయి? వాటి వెనక జరుగుతున్న తతంగమేంటి? ఎలా వెలుగు చూస్తున్నాయి? ఇవన్నీ తెలియజెప్పటానికే ఈ ‘ఫోకస్’... - సాక్షి, బిజినెస్ బ్యూరో యూకో ఖాతాలో భారీ హవాలా.. విదేశాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో ఉన్న మీ వాళ్లకు డబ్బులు పంపాలి. అందుకు లీగల్‌గా బ్యాంకులు, మనీ ట్రాన్స్ఫర్ సంస్థలు ఉంటాయి. కానీ వీటిద్వారా పంపితే ఆ లావాదేవీ రికార్డవుతుంది. అనుమానం వస్తే... ఆ డబ్బు ఎక్కడిదని ఆదాయపు పన్ను అధికారులు ఆరా తీయొచ్చు. హవాలా మార్గంలో అయితే!! స్థానికంగా ఉండే హవాలా డీలర్‌కు మీరు డబ్బులిస్తారు. మీకు కావాల్సిన చోట... అక్కడుండే ఈ గ్రూపులోని మరో వ్యక్తి డబ్బు డెలివరీ ఇస్తాడు. ఇక్కడి వ్యక్తి డబ్బు తీసుకుని తన వద్దే ఉంచుకుంటాడు. అక్కడి వ్యక్తి తన దగ్గరున్న డబ్బు అందజేస్తాడు. అలాగే అట్నుంచి ఇటు కూడా!! అంతా బ్లాక్. ఎక్కడా ఏ లావాదేవీ నమోదు కాదు. చిత్రమేంటంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద హవాలా కుంభకోణం 2015లో బ్యాంకింగ్ వ్యవస్థలోనే బయటపడింది. అది కూడా ప్రభుత్వ రంగ యూకో బ్యాంకులో!!. ఎలాంటి వ్యాపార లావాదేవీలూ నిర్వహించకుండానే రూ.20,000 కోట్లను అడ్వాన్స్ పేమెంట్ల పేరిట దుబాయ్, ఇరాన్ దేశాలకు తరలించేశారు. గుజరాత్‌కు చెందిన ఓ హవాలా వ్యాపారి దీనికి సూత్రధారిగా దర్యాప్తు అధికారులు తేల్చారు. ఆయన్ను అరెస్టు చేశారు కూడా. ఎలా జరిగిందంటే... చదువుకోవటానికి విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది విద్యార్థుల పేరిట చండీగఢ్‌లో 80 కాగితపు కంపెనీలను ఏర్పాటు చేశారు. అంటే ఇవి కాగితంపై మాత్రమే ఉంటాయి. వీటికి ఎలాంటి కార్యకలాపాలు, కార్యాలయాలు ఉండవు. చిరునామా కోసం 80 కంపెనీలకూ ఒకే అడ్రస్ ఇచ్చారు. స్థానిక బ్యాంకు సిబ్బంది సాయంతో చండీగఢ్ యూకో బ్యాంకులో ఈ 80 కంపెనీల పేరిటా ఖాతాలు ప్రారంభించారు. ఈ విద్యార్థుల్లో ఏడుగురు ఇరాన్ నుంచి వచ్చినవారు కాగా... ఒకరు అజర్‌బైజాన్‌కు చెందినవారు. ఇరాన్ నుంచి వజ్రాలు, బంగారాన్ని దిగుమతి చేసుకొని వాటిని ఆభరణాలుగా మార్చి తిరిగి ఎగుమతి చేయటానికి ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు బ్యాంకులకు చెప్పి... వజ్రాల దిగుమతి కోసం ముందే అడ్వాన్స్‌లు ఇస్తున్నామంటూ... ఆ పేరుతో భారీ మొత్తాలను రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) విధానంలో దుబాయ్, ఇరాన్ దేశాల్లోని ఖాతాలకు తరలించారు. ఎక్కడా పైసా వ్యాపారం జరగకుండానే దాదాపు 20 వేల కోట్ల రూపాయలు విదేశాలకు రెక్కలు కట్టుకుపోయాయి. దీనిపై ఇప్పుడు ఈడీ, సీబీఐ, సిట్ దర్యాప్తు చేస్తున్నాయి. బ్యాంకు సిబ్బంది పాత్ర లేకుండా ఇన్ని వేల కోట్లు దేశం దాటి వెళ్ళడం అసాధ్యమని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ విదేశీ విద్యార్థుల జాడ తెలియడం లేదు. అసలు కేవైసీ నిబంధనలు పాటించకుండా బ్యాంకు ఖాతాలను ప్రారంభించి అన్ని వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్‌లుగా ఎలా పంపించగలిగారన్నది తెలియాల్సి ఉంది. ఇలా అనుమానాస్పద స్థాయిలో జరుగుతున్న లావాదేవీలను బ్యాంకు సిబ్బంది ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు (ఎఫ్ఐయూ) తెలియచేయాలి. అదీ చేయలేదు. దీంతో బ్యాంకు సిబ్బంది సహకారంతోనే ఈ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇరాన్ విద్యార్థులు.. ఇరాన్‌కే ఎందుకు? ఈ కుంభకోణంలో ఆసక్తికరమైన మరో విషయం దాగి ఉంది. అదేమంటే... 2012లో యూకో బ్యాంకు ఇరాన్‌కు రూపీ ఖాతాలను ప్రారంభించింది. పలు ఇరానియన్ బ్యాంకులు ఈ ఖాతాలను తెరిచాయి. ఈ ఖాతాల ద్వారా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకున్న కంపెనీలు ఇరాన్‌కు రూపాయల్లోనే చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఇరాన్‌కు ఎగుమతి చేసే వ్యాపారులు రూపాయల్లోనే నగదు స్వీకరించవచ్చు. దీంతో విదేశీ కరెన్సీ ఇబ్బందులు లేకుండా వేల కోట్ల రూపాయల్ని ఇరాన్‌కు తరలించడానికి ఈ బ్యాంకును వినియోగించుకున్నారు హవాలా రాయుళ్లు. ప్రైవేటు బ్యాంకులూ ఆ తానులోనివే!! హవాలా రాకెట్లో ప్రైవేటు బ్యాంకుల పాత్ర తక్కువేమీ కాదు. రెమిటెన్స్‌ల పేరుతో దేశంలోని అగ్రశ్రేణి ప్రైవేటు బ్యాంకులు కొన్ని ఏకంగా రూ.15,000 కోట్ల కుంభకోణానికి తెరలేపాయి. 2011 నుంచి 2014 మే వరకు జరిగిన ఈ కుంభకోణం సామాన్యమైంది కాదు. గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న పలు కంపెనీలు ప్రైవేటు బ్యాంకులైన ఐఎన్జీ వైశ్యా, కోటక్ మహీంద్రా, (ఇవి రెండూ విలీనం కాకముందు) ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, యస్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఈ కుంభకోణంలో చేర్చాయి. ఎలా జరిగింది? వ్యాపారస్తులు వస్తువుల్ని దిగుమతి చేసుకుని, వారికి డబ్బులు చెల్లించాలి కాబట్టి రెమిటెన్సుల రూపంలో బ్యాంకుల ద్వారా పంపిస్తారు. ఇలా రెమిటెన్సులు చేసేటపుడు ఎందుకు చేస్తున్నారన్నది చెప్పాలి కనక దిగుమతి బిల్లులు చూపించాలి. అయితే ఈ హవాలా రాయుళ్లు దొంగ బిల్లులు చూపించారు. ఒకే బిల్లును నంబర్లు ఫోర్జరీ చేసి పలు బ్యాంకులకు సమర్పించారు. ఇలా ఏకంగా నాలుగేళ్ల పాటు ఆరు బ్యాంకుల్ని మోసం చేసి... రూ.15 వేల కోట్లను విదేశాలకు తరలించారు. తరలిస్తే ఏంటట? నిజానికి ఇలా తరలించిన సొమ్ము మొత్తం ఖాతాల్లో లేనిదే. అంటే బ్లాక్ మనీయే. పన్నులు ఎగ్గొట్టి సంపాదించిన బ్లాక్ మనీని విదేశాలకు ఇలా అక్రమంగా తరలించటం, మళ్లీ అక్కడి నుంచి ఏ షేర్ మార్కెట్లోకో, బంగారం దిగుమతి ద్వారానో రాజమార్గంలో తీసుకుని రావటం చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. అయితే ఈ నల్లధనాన్ని పన్ను స్వర్గాల్లాంటి మారిషస్, లక్సెంబర్గ్, కేమన్ ఐలాండ్స్ వంటి దేశాలకు తరలిస్తున్నట్లు కూడా దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై కూడా ఫెమా యాక్ట్ ప్రకారం ఈడీ దర్యాప్తు చేస్తోంది. జీడిపప్పు పేరుతో రూ. 6,000 కోట్ల తరలింపు... బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీఓబీ) జరిగింది మరీ విచి త్రం. పంటలు పండని, అసలు పండటానికి భూములే లేని దేశం నుంచి ఏకంగా రూ.6,200 కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, ధాన్యాలు దిగుమతి చేసుకున్నారట!!. అలా దొంగ బిల్లులు చూపించి.. ఏకంగా రూ.6,200 కోట్లను సరిహద్దులు దాటించేశారు. న్యూఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన అశోక్ విహార్ బ్రాంచ్ ఈ కుంభకోణానికి వేదికగా నిలిచింది. ఈ బ్యాంకు శాఖ నుంచి హాం కాంగ్‌లోని 59 అకౌంట్లకు ఈ నగదు బదిలీ అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే బీవోబీ ఏజీఎంతో పాటు మరో ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కొన్ని ప్రైవేటు బ్యాంకుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఎలా జరిగిందంటే...! ఢిల్లీలో హెచ్డీఎఫ్సీ ఫారెక్స్ అధికారి కమల్ కల్రా. అతనితో కుమ్మక్కయిన వ్యాపారవేత్త గురుచరణ్‌సింగ్ ధావన్... ఆ బ్యాంకులో 2015 జన వరిలో 13 ఖాతాలు తెరిచాడు. ఆ ఖాతాల ద్వారా దుబాయ్, హాంకాంగ్‌లకు వస్తువుల దిగుమతి కోసమంటూ డబ్బు పంపారు. అన్నీ లక్ష డాలర్లలోపు లావాదేవీలే. లావాదేవీల సంఖ్య పెరగటంతో... మరిన్ని లావాదేవీలు జరిగితే అనుమానం వస్తుందని భావించిన కల్రా... ధావన్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా అశోక్ విహార్ బ్రాంచికి తీసుకెళ్లాడు. అక్కడి ఏజీఎం ఎస్.కె.గార్గ్‌కు పరిచయం చేశాడు. అక్కడ మార్చిలోగా పలు కంపెనీల పేరిట ధావన్, అతని స్నేహితులు ఏకంగా 59 ఖాతాలు తె రిచారు. ఈ కంపెనీలన్నిటికీ హాకర్లు, రిక్షా పుల్లర్లు, డ్రైవర్లు వంటి వారిని రాత్రికి రాత్రి డెరైక్టర్లుగా చే సి... వారికి కొంత మొత్తం ముట్టజెప్పారు. వ్యవహారం గురించి తెలియని వాళ్లంతా... ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టి... ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు. అదే మాదిరి హాంకాంగ్‌లోనూ నకిలీ కంపెనీలు సృష్టించారు. ఇండియా ఖాతాల నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకోవటానికంటూ హాంకాంగ్, దుబాయ్‌లకు భారీ డబ్బు పంపారు. ఆయా కంపెనీలు వస్తువుల్ని పంపినట్లుగా ఇచ్చిన నకిలీ బిల్లులు చూపించి... సుంకాల రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలా... దాదాపు రూ.300 కోట్లను వెనక్కి తీసుకున్నారు. హాంకాంగ్‌లో జీడిపప్పు పండకపోయినా... దాన్నే దిగుమతి చేసుకుంటున్నట్లుగా చూపించి వేల కోట్లు బదలాయించటం గమనార్హం. బయటపడిందిలా..? బ్యాంక్ ఆఫ్ బరోడా అశోక్ విహార్ బ్రాంచికి... విదేశీ కరెన్సీ (ఫారెక్స్) కార్యకలాపాల నిర్వహణకు 2013లో అనుమతి వచ్చింది. అయితే ఏడాది తిరిగేలోపే ఈ బ్రాంచి ఫారెక్స్ వ్యాపారం ఏకంగా రూ.21,529 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల స్థాయి అనుమానాస్పదంగా ఉండటంతో బ్యాంకు అధికారులే దర్యాప్తు సంస్థలకు సమాచారమిచ్చారు. 2015 ఆగస్టు 12న దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయి. ఫిక్స్డ్ డిపాజిట్లకూ కాళ్లొచ్చాయ్... మీరొక బ్యాంకులో రూ.10 కోట్లు డిపాజిట్ చేశారు. వడ్డీ 8 శాతం వస్తోంది. మరో ప్రభుత్వ రంగ బ్యాంకులోనే 9 శాతం వడ్డీ వస్తోందంటే మీరేం చేస్తారు? ఠక్కున ఇక్కడి డిపాజిట్లు వెనక్కి తీసుకుని 9శాతం ఇచ్చే బ్యాంకులో పెడతారా? ఎవ్వరైనా చేసేదిదే!!. ఇదిగో ఈ బలహీనతనే ఆసరా చేసుకుని ఏకంగా ఒక ముఠా రూ.100 కోట్లకు పైగా కొట్టేసింది. అదీ... మన హైదరాబాద్‌లోనే. ఎలా జరిగిందంటే... వివిధ బ్యాంకుల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు ఒక జట్టుగా ఏర్పడ్డారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న లొసుగులన్నీ తెలుసు కనక... వీళ్లంతా కలసి కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులపై కన్నేశారు. సహజంగా ఇలాంటి ఆస్తుల తాలూకు పత్రాలన్నీ కోర్టు నియమించిన అఫీషియల్ లిక్విడేటర్ వద్ద ఉంటాయి. ఒక ఉదాహరణ చూస్తే... ఆల్విన్‌కు చెందిన రూ.36 కోట్ల డిపాజిట్లు అఫీషియల్ లిక్విడేటర్ వద్ద ఉన్నాయి. వాటిని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉంచారు. అయితే ఈ మాజీ ఉద్యోగుల బృందం సదరు అఫీషియల్ లిక్విడేటర్‌ను సంప్రదించింది. వేరే బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించింది. తన చేత... ఆ డిపాజిట్లను ఎస్‌బీహెచ్‌కు చెందిన రెండు శాఖలు, ఒక సహకార బ్యాంకు శాఖలోకి మార్పించింది. మోసం జరిగిందిలా... డిపాజిట్లను బ్యాంకులో డిపాజిట్ చేశాక బ్యాంకు డిపాజిట్ పత్రాలను ఇస్తుంది. ఆ పత్రాలను ఈ మోసగాళ్లు మొదట తీసుకున్నారు. వాటిని కలర్ జిరాక్సులు తీసి... ఆ జిరాక్సు పత్రాలనే ఒరిజినల్‌గా నమ్మించి అఫీషియల్ లిక్విడేటర్‌కు అందజేశారు. కొన్ని రోజుల తరవాత తమ దగ్గరున్న పత్రాలను బ్యాంకుకు తీసుకెళ్లారు. డిపాజిట్ రద్దు చేస్తున్నట్లుగా చెప్పి... డబ్బులు వెనక్కి తీసుకున్నారు. తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీనికి బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది కూడా సహకరించటం విశేషం. ఎలా బయటపడిందంటే... మోసం జరిగిన కొద్ది రోజులకు తమ డి పాజిట్లకు చెందిన కొంత డబ్బు వేరే ఖాతాల్లోకి బదిలీ అయినట్లు అఫీషియల్ లిక్విడేటర్ గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డొంకంతా కదిలింది. ఈ విధంగా ఈ ముఠా ఎస్‌బీహెచ్‌తో పాటు అనేక బ్యాంకుల్లో రూ.100 కోట్లు మాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.