‘‘ఎవరైనా ఎక్కువగా కష్టపడి
పనిచేస్తే గాడిద చాకిరీ చేస్తున్నాడు’’
‘‘వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు’’
ఇది ఉపమానం అయినా, సామెత అయినా..పని, అవసరం విశిష్టత చెప్పడమే. అవి కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాలు. పొలాలకు వెళ్లేందుకు వీలుగా ఎడ్లబండ్లు తీసుకెళ్లడానికి మట్టిబాటలు కూడా లేవు. ఎరువులు, విత్తనాలు తీసుకెళ్లాలన్నా, పండిన పంట ఇంటికి చేరాలన్నా రైతులకు ఎన్నో వ్యయప్రయాసలే. అలాంటి వారి పాలిట గాడిదలే కార్గో విమానాలు, ట్రాక్టర్లు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
గాడిదల వినియోగం ఎక్కడంటే..
కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దులో ఉంటే సంగారెడ్డి జిల్లాలోని మారుమూల మండలాలైన సిర్గాపూర్, కంగి్ట, కల్హేర్, మనూరు మండలాల్లో రైతుల పంట రవాణాకు గాడిదల వినియోగం ఎక్కువ. ఆయా మండలాల్లోని చీమలపాడు, వాసర్, వంగ్‌దాల్, తడకల్, రాసోల్, జంగి, గాజుర్పాడు, దామరగిద్దలో ఆయా వ్యవసాయ సీజన్లకు అనుగుణంగా వీటి వినియోగం చూడొచ్చు.
అంగడి.. శూన్య అమావాస్య రోజున
గాడిదల అంగడి మహారాష్ట్రలోని మాలేగాంలో జరుగుతుంది. ఏడాదికోసారి వచ్చే శూన్య అమావాస్య రోజు (సంక్రాంతి పండుగకు ముందు) జరిగే ఈ అంగడిలో గాడిదల క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈ అంగట్లో తమకు అవసరమైన గాడిదలు కొనుగోలు చేస్తారు. ఒక్కో గాడిద ఖరీదు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది.
సీజన్‌లో మహారాష్ట్ర నుంచి..
ఆయా పంట సీజన్‌కు అనుగుణంగా మహారాష్ట్ర నుంచి గాడిదలు సంగారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాలకు తీసుకొచ్చి సరుకు రవాణా చేయిస్తారు. నెల, రెండు నెలలు ఇక్కడ ఉండి సీజన్ ముగిశాక వెళ్లిపోతారు.
కిరాయి... వస్తు బదిలీ రూపంలోనే
వ్యవసాయ ఉత్పత్తులు తరలించినందుకు గాడిదల యజమానులకు కిరాయి డబ్బురూపంలో కాకుండా, వస్తురూపంలో ఉంటుంది. ఇది పాత పద్ధతే అయినా ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో అమలులో ఉంది. 60 నుంచి 70 కిలోల వ్యవసాయ ఉత్పత్తుల బస్తా తరలిస్తే అడ్డెడు సరుకుల చొప్పున ఇస్తున్నారు. పెసర, మినుము, సోయా వంటి పంటలను తరలిస్తే రెండు, మూడు బస్తాలకు ఒక అడ్డ చొప్పున ఇస్తున్నారు.
పంట చేను నుంచి తరలించే ఇంటి దూరాన్ని బట్టి కిరాయి పెరుగుతుంది. ఒకఅడ్డ అంటే ఐదు కిలోలతో సమానం. వడ్లు అయితే కాస్త తక్కువగా ఉంటుంది. సీజన్‌లో కొందరు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప మండల కేంద్రాలకు తెచ్చేందుకు కూడా గాడిదలను వినియోగిస్తారు. ఎరువులు, విత్తనాల బస్తాలను ఇంటి నుంచి పొలాలకు తరలిస్తే బస్తాకు రూ.30 నుంచి రూ.50 వరకు దూరాన్ని బట్టి తీసుకుంటారు.
వేరే ప్రత్యామ్నాయం లేకనే...
నాకున్న భూమిలో నాలుగు ఎకరాల వరకు సరిగ్గా దారి లేదు. దీంతో ఏటా నేను ఆ పొలం నుంచి వడ్లు, సోయా, కందులు, పెసర్లు ఇంటికి తెచ్చేందుకు గాడిదలనే కిరాయికి పెట్టుకుంటాను. తూము(16 అడ్డల)కు ఒక అడ్డెడు కిరాయి కింద గాడిదల యజమానికి చెల్లిస్తా. అంటే సుమారు 20 క్వింటాళ్ల సరుకు తరలిస్తే క్వింటాలు వరకు కిరాయి ఇస్తా. ఈ పొలాల నుంచి పంటను తరలించేందుకు ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. ఆ పొలం వరకు ట్రాక్టర్ వెళ్లదు.
– దేవుకతే యాదవరావు, రైతు, సిర్గాపూర్
రెండు గాడిదలతో కనిపిస్తున్న ఈ వ్యక్తి కుమ్మరి పండరి. సిర్గాపూర్ మండలం చీమలపాడు గ్రామం. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలో పండరికి ఎనిమిది గాడిదలు ఉన్నాయి. రోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి చీకటిపడే వరకు గాడిదలను మేపేందుకు తీసుకెళ్లాడు. పంటలు వేసుకునే సమయంలో ఎరువులు, విత్తనాల బస్తాలు తరలించేందుకు సీజన్ మొత్తంలో రూ.8వేల నుంచి 10 వేల వరకు వస్తాయని, పంట ఇంటికి చేరే సీజన్‌లో తన కుటుంబం ఏడాదంతా తినేందుకు సరిపడా పప్పుదినుసులు, ఏడెనిమిది క్వింటాళ్ల వరకు సోయాలు వస్తాయని చెబుతున్నాడు. వీటిని అమ్ముకుంటే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చేతికందుతుందని పండరి చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment