donkeys
-
The island of Hydra: ఇచట కార్లకు ప్రవేశం లేదు!
అక్కడ అడుగు పెడితే కాల స్పృహ కనుమరుగవుతుంది. అసలు కాలమే వెనక్కు వెళ్తుంది. కార్లన్నవి మచ్చుకు కూడా కానరాని కాలం కళ్ల ముందు కనిపిస్తుంది. గుర్రపు బగ్గీలే అక్కడ ప్రధాన ప్రయాణ సాధనాలు. కొండొకచో గాడిదలు, కంచర గాడిదలు బరువులు మోస్తూ కనిపిస్తుంటాయి. కనుచూపు మేరా ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం, దానికి దీటుగా పోటీ పడుతూ పరిశుభ్రత కనువిందు చేస్తాయి. ఎక్కడిదా ప్రాంతం? ఏమా కథ...?! గ్రీస్ దేశంలో అనగనగా అదో ద్వీపం. పేరు హైడ్రా. అక్కడి ఎజియన్ సముద్రంలోని ద్వీపాల్లో ఒకటి. వాటి మాదిరిగానే స్వచ్ఛమైన జలాలకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. కళ్లు చెదిరే అందాలకు, ఆహ్లాదకర వాతావరణానికి, పచ్చదనానికి కాణాచి. కాకపోతే వాటిల్లో దేనికీ లేని ప్రత్యేకత హైడ్రా దీవి సొంతం. ఆ కారణంగానే అది కొన్నేళ్లుగా అంతర్జాతీయ పర్యాటకుల నోళ్లలో తెగ నానుతోంది. అదేమిటంటే... అక్కడ కార్లు తదితర మోటారు వాహనాలు పూర్తిగా నిషేధం. గుర్రాలు, కంచర గాడిదలు మాత్రమే ప్రయాణ, రవాణా సాధనాలు. ఆ మేరకు కఠిన నిబంధనలు ఏర్పాటు చేసుకోవడమే గాక వాటిని తూచా తప్పకుండా పాటిస్తోంది కూడా. అంబులెన్సులు, అగి్నమాపక వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు. హైడ్రా దీవిలో అడుగు పెట్టగానే మనల్ని పలకరించేది గుర్రాలు, కంచర గాడిదలే. స్థానికుల్లో ఎవరిని చూసినా వాటి మీదే చకచకా సాగిపోతూ కనిపిస్తారు. దక్షిణాన అందాలకు ఆలవాలమైన కమీనియ అనే కుగ్రామం మొదలు పశి్చమాన అత్యంత పారదర్శకమూ, పరిశుభ్రమైన సముద్ర జలాలలో అలరారే మండ్రాకి దాకా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ కాలపు దీవి హైడ్రా మనల్ని పాత కాలానికి తీసుకెళ్లి కట్టి పడేస్తుందని అంటారు హారియట్ జర్మన్. స్థానికంగా హార్స్ ట్రెక్కింగ్ కంపెనీ నడుపుతున్న ఆమె 24 ఏళ్ల క్రితం అనుకోకుండా అమ్మతో పాటు అక్కడికి విహార యాత్రకు వచ్చారు. ఆ ప్రాంతం ఎంతగా నచి్చందంటే, అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయారు! తర్వాత పదేళ్ల క్రితం గ్రీస్‌ను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం కారణంగా తనకు ప్రాణప్రదమైన గుర్రం క్లోను అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో హార్స్ ట్రెక్కింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుందామే. ఇప్పుడు గుర్రాల సంఖ్య 12కు పెరిగింది. ‘కార్లు లేవు గనుక ఇక్కడ అందరి జీవితాలూ హడావుడికి దూరంగా, నింపాదిగా గడుస్తుంటాయి‘ అంటూ నవ్వుతారామె. చరిత్రే కారణం హైడ్రా దీవి 18, 19వ శతాబ్దం దాకా ప్రముఖ సముద్ర వర్తక కేంద్రంగా ఓ వెలుగు వెలిగింది. 20వ శతాబ్దంలో మోటార్ వాహనాల శకం రాకతో ఆ వైభవం వెనకపట్టు పట్టింది. ఇరుకు సందులు, రాళ్ల ప్రాంతం కావడంతో హైడ్రాలో మోటార్ వాహనాల రాకపోకలు ఎప్పుడూ కష్టతరంగానే ఉంటూ వచ్చాయి. దాంతో, వాటిని పూర్తిగా నిషేధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన స్థానిక యంత్రాంగానికి పుట్టుకొచ్చింది. అదే ఇప్పుడు ఆ దీవిని ప్రత్యేకంగా నిలిపింది. వీఐపీలకు విశ్రామ స్థలం హైడ్రా దీవి అందచందాలు, కార్ల జాడే లేని ప్రత్యేకత ఎందరెందరో వీఐపీలను ఆకర్షిస్తోంది. అప్పుడెప్పుడో 1950ల్లోనే ప్రముఖ ఇటాలియన్ నటి సోఫియా లారెన్ హైడ్రాలో షూటింగ్ చేసే క్రమంలో ఆ దీవితో ప్రేమలో పడ్డారు. అక్కడే స్థిరపడ్డారు. బ్రైస్ మార్డన్, అలెక్సిస్ వెరోకస్, పనగియోసిస్ టెట్సిస్, జాన్ క్రాక్స్టన్ వంటి ప్రఖ్యాత చిత్రకారుల నుంచి హెన్రీ మిల్లర్ వంటి ప్రముఖ రచయితల దాకా ఎందరెందరో హైడ్రాలో ఆరామ్‌గా జీవిస్తున్నారు. కెనేడియన్ గాయకుడు, పాటల రచయిత లియోనార్డ్ కోహెన్ రాసిన అజరామర గీతం ’బర్డ్ ఆన్ ద వైర్’కు హైడ్రా దీవే స్ఫూర్తి! ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా భూలోక స్వర్గమే అంటారాయన. నేషనల్ డెస్్క, సాక్షి -
ఖరముకదిలితేనే..రైతుల బతుకుబండి నడిచేది
‘‘ఎవరైనా ఎక్కువగా కష్టపడి పనిచేస్తే గాడిద చాకిరీ చేస్తున్నాడు’’ ‘‘వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు’’ ఇది ఉపమానం అయినా, సామెత అయినా..పని, అవసరం విశిష్టత చెప్పడమే. అవి కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు సంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామాలు. పొలాలకు వెళ్లేందుకు వీలుగా ఎడ్లబండ్లు తీసుకెళ్లడానికి మట్టిబాటలు కూడా లేవు. ఎరువులు, విత్తనాలు తీసుకెళ్లాలన్నా, పండిన పంట ఇంటికి చేరాలన్నా రైతులకు ఎన్నో వ్యయప్రయాసలే. అలాంటి వారి పాలిట గాడిదలే కార్గో విమానాలు, ట్రాక్టర్లు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి గాడిదల వినియోగం ఎక్కడంటే.. కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దులో ఉంటే సంగారెడ్డి జిల్లాలోని మారుమూల మండలాలైన సిర్గాపూర్, కంగి్ట, కల్హేర్, మనూరు మండలాల్లో రైతుల పంట రవాణాకు గాడిదల వినియోగం ఎక్కువ. ఆయా మండలాల్లోని చీమలపాడు, వాసర్, వంగ్దాల్, తడకల్, రాసోల్, జంగి, గాజుర్పాడు, దామరగిద్దలో ఆయా వ్యవసాయ సీజన్లకు అనుగుణంగా వీటి వినియోగం చూడొచ్చు. అంగడి.. శూన్య అమావాస్య రోజున గాడిదల అంగడి మహారాష్ట్రలోని మాలేగాంలో జరుగుతుంది. ఏడాదికోసారి వచ్చే శూన్య అమావాస్య రోజు (సంక్రాంతి పండుగకు ముందు) జరిగే ఈ అంగడిలో గాడిదల క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈ అంగట్లో తమకు అవసరమైన గాడిదలు కొనుగోలు చేస్తారు. ఒక్కో గాడిద ఖరీదు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. సీజన్లో మహారాష్ట్ర నుంచి.. ఆయా పంట సీజన్‌కు అనుగుణంగా మహారాష్ట్ర నుంచి గాడిదలు సంగారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాలకు తీసుకొచ్చి సరుకు రవాణా చేయిస్తారు. నెల, రెండు నెలలు ఇక్కడ ఉండి సీజన్ ముగిశాక వెళ్లిపోతారు. కిరాయి... వస్తు బదిలీ రూపంలోనే వ్యవసాయ ఉత్పత్తులు తరలించినందుకు గాడిదల యజమానులకు కిరాయి డబ్బురూపంలో కాకుండా, వస్తురూపంలో ఉంటుంది. ఇది పాత పద్ధతే అయినా ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో అమలులో ఉంది. 60 నుంచి 70 కిలోల వ్యవసాయ ఉత్పత్తుల బస్తా తరలిస్తే అడ్డెడు సరుకుల చొప్పున ఇస్తున్నారు. పెసర, మినుము, సోయా వంటి పంటలను తరలిస్తే రెండు, మూడు బస్తాలకు ఒక అడ్డ చొప్పున ఇస్తున్నారు. పంట చేను నుంచి తరలించే ఇంటి దూరాన్ని బట్టి కిరాయి పెరుగుతుంది. ఒకఅడ్డ అంటే ఐదు కిలోలతో సమానం. వడ్లు అయితే కాస్త తక్కువగా ఉంటుంది. సీజన్లో కొందరు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప మండల కేంద్రాలకు తెచ్చేందుకు కూడా గాడిదలను వినియోగిస్తారు. ఎరువులు, విత్తనాల బస్తాలను ఇంటి నుంచి పొలాలకు తరలిస్తే బస్తాకు రూ.30 నుంచి రూ.50 వరకు దూరాన్ని బట్టి తీసుకుంటారు. వేరే ప్రత్యామ్నాయం లేకనే... నాకున్న భూమిలో నాలుగు ఎకరాల వరకు సరిగ్గా దారి లేదు. దీంతో ఏటా నేను ఆ పొలం నుంచి వడ్లు, సోయా, కందులు, పెసర్లు ఇంటికి తెచ్చేందుకు గాడిదలనే కిరాయికి పెట్టుకుంటాను. తూము(16 అడ్డల)కు ఒక అడ్డెడు కిరాయి కింద గాడిదల యజమానికి చెల్లిస్తా. అంటే సుమారు 20 క్వింటాళ్ల సరుకు తరలిస్తే క్వింటాలు వరకు కిరాయి ఇస్తా. ఈ పొలాల నుంచి పంటను తరలించేందుకు ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. ఆ పొలం వరకు ట్రాక్టర్ వెళ్లదు. – దేవుకతే యాదవరావు, రైతు, సిర్గాపూర్ రెండు గాడిదలతో కనిపిస్తున్న ఈ వ్యక్తి కుమ్మరి పండరి. సిర్గాపూర్ మండలం చీమలపాడు గ్రామం. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలో పండరికి ఎనిమిది గాడిదలు ఉన్నాయి. రోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి చీకటిపడే వరకు గాడిదలను మేపేందుకు తీసుకెళ్లాడు. పంటలు వేసుకునే సమయంలో ఎరువులు, విత్తనాల బస్తాలు తరలించేందుకు సీజన్ మొత్తంలో రూ.8వేల నుంచి 10 వేల వరకు వస్తాయని, పంట ఇంటికి చేరే సీజన్లో తన కుటుంబం ఏడాదంతా తినేందుకు సరిపడా పప్పుదినుసులు, ఏడెనిమిది క్వింటాళ్ల వరకు సోయాలు వస్తాయని చెబుతున్నాడు. వీటిని అమ్ముకుంటే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చేతికందుతుందని పండరి చెప్పుకొచ్చాడు. -
గాడిదలకు సీమంతం
-
గాడిదలకు సీమంతం.. ఆశ్చర్యంగా ఉందే..! వీడియో వైరల్
గుజరాత్: గాడిదలకు సీమంతం ఏంటి.. ఆశ్చర్యంగా ఉందే అనుకుంటున్నారా?. ప్రత్యేక జాతి అయిన హలరీ గాడిదలు అంతరించిపోయే ప్రమాద జాబితాలో ఉండటంతో వాటికి కాపాడుకునేందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రజలు వినూత్నంగా ఆలోచించారు. అప్పుడే పుట్టిన గాడిద పిల్లలకు బారసాల నిర్వహించడంతో పాటు, గర్భం దాల్చిన వాటికి సీమంతం చేస్తున్నారు. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, వీటి సంఖ్యను పెంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. గుజరాత్లో ఈ జాతికి చెందిన గాడిదలు కేవలం 450 మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి పాలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో అంతరించిపోతున్న ఈ జాతి గాడిదల ధరలు ఒక్కొక్కటి సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంది. ఈవీ అంతరించిపోకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఈ జాతిని రక్షించడానికి, ప్రోత్సహించడానికి సింబయాసిస్ సంస్థ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇటీవల రాజ్‌కోట్ జిల్లా ఉప్లేటా తాలూకాలోని కోల్కి గ్రామంలో హలరీ జాతి గాడిద ఈనడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గర్భం దాల్చిన మరో 33 గాడిదలకు సీమంతం కూడా చేశారు. నుదుటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజలు చేసి, ఆహారం పెట్టారు. హలారి గదర్భ సంవర్ధన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆడ గాడిదలకు తిలకం, కుంకుమ, బియ్యం, గులాబీ చున్నీ (దుపట్టా), పూల దండలు సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా వచ్చారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్.. -
లాభాల గాడిద పాలు.. రోజూ లీటరున్నర వరకు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’.. అంటూ వేమన అప్పట్లో గాడిదపాలను విలువలేనివిగా భావించి అలా పద్యం రాశాడేమోగానీ వాటి పాల వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాల గురించి తెలిసుంటే రూ. కోట్లిచ్చును ఖరము పాలు అని రాసేవాడేమో.. ఎందుకిదంతా చెప్పడమంటే.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువరైతు రాష్ట్రంలోనే మొదటి గాడిద డెయిరీ ఫాంను ఏర్పాటు చేసుకొని భారీ లాభాలు ఆర్జిస్తున్నాడు మరి! ఆ యువరైతు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. లీటర్ రూ. 4– 5 వేలు రోజుకు ఒక గాడిద గరిష్టంగా లీటర్ వరకు పాలు ఇస్తుంది. ఉదయం, సాయంత్రం రెండుసార్లు పితికితే లీటరున్నర వరకు పాలు వస్తాయి. ఈ పాలను ఎక్కువగా ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ మేరకు కంపెనీలు పలు ఏజెన్సీల ద్వారా అంతర్జాతీయంగా కొనుగోలు చేస్తున్నాయి. లీటర్ గాడిద పాలకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ధర పలుకుతోంది. పాల ఉత్పత్తి, గాడిదల ఆరోగ్యంపై ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుండగా.. ఫామ్ నిర్వాహకులు స్థానిక పశు వైద్యాధికారి సాయంతో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో పాలు ఉత్పత్తి అయితే ఇంకా అధిక ధరతో నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన పులిదండ నగేష్ కుటుంబం వినూత్న వ్యాపార ఆలోచనను ఆచరణలోపెట్టి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సంప్రదాయ ఆవు, గేదె పాల డెయిరీలకు పూర్తి భిన్నంగా గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన నగే‹Ùకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు అఖిల్ డిగ్రీ చేయగా చిన్నకొడుకు వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నగేష్ తల్లిదండ్రులు నర్సోజీ, లలితమ్మ. వారి కులవృత్తి (మాంసం విక్రయించడం) కూడా చేసేవారు. పలు రకాల పంటల సాగుతోపాటు పలు వ్యాపారాలు చేసినా ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకోకపోవడంతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో అఖిల్ యూట్యూబ్‌లో అన్వేíÙస్తుండగా డాంకీ ఫామ్పట్ల ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్న క్రమంలో అఖిల్ రాజస్తాన్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్లో గుర్రాలు, గాడిదల పెంపకం, పాల ఉత్పత్తుల గురించి శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. నెలకు వారం చొప్పున మూడు నెలలు శిక్షణ తీసుకున్నాడు. అనంతరం గుజరాత్‌లోని ఖతియవాడి, హలరీతోపాటు ఫ్రాన్స్ (పోటియో రకం) నుంచి గాడిదలను దిగుమతి చేసుకున్నాడు. ఒక్కోదానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వెచ్చించి మొత్తం 60 గాడిదలు తెచ్చుకున్నాడు. ఇందులో 57 ఆడ.. మూడు మగవి. ఈ నెలలో మరో 20 గాడిదలను (ఆడ 16, మగ 4)ను తీసుకురావడంతో వాటి సంఖ్య 80కి చేరింది. ఫామ్‌తోపాటు గాడిదలకు దాణా కోసం వివిధ రకాల గడ్డి పెంచేందుకు బిజినేపల్లి మండల కేంద్రంలోని వృద్ధాశ్రమం సమీపంలో దాదాపు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. అందులో ఒక పెద్ద షెడ్ (ఐదు భాగాలు), మరో 3 చిన్న షెడ్లు ఏర్పాటు చేసి గాడిదలను వేర్వేరుగా పెట్టాడు. వాటికి కావాల్సిన దాణా కోసం దాదాపు 15 ఎకరాల్లో సీఎస్వీ 33 ఎంఎఫ్ (జొన్న రకం), దశరథ గడ్డి, 4జీ బులెట్ (సూపర్ నేపియర్ రకం), మొర్ర గడ్డి తీగ పెంచుతున్నాడు. వీటితోపాటు ఎండు వరి గడ్డి, మక్కసొప్ప, బుడ్డ (పల్లి) పొల్లు, మక్క, గోధుమ, బార్లీ, పిండిని గాడిదలకు ఆహారంగా ఇస్తున్నాడు. గాడిదలను చూసుకునేందుకు రెండు కుటుంబాలను తమిళనాడు నుంచి రప్పించి వారికి వసతి కల్పిస్తున్నాడు. మంచి బ్రీడ్, ఎజెన్సీ చూసుకోవాలి గతేడాది నవంబర్ 13న ఫామ్ అందుబాటులోకి వచి్చంది. ప్రస్తుతం 23 గాడిదలు పాలు ఇస్తున్నాయి. పోటియో (ఫ్రాన్స్) గాడిదలు రోజుకు 2 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. గాడిద పాలు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. అయితే వాటిని ఫ్రిజ్లోనే ఉంచాలి. ఏజెన్సీ వాళ్లు ప్రస్తుతం 15 రోజులకు లేదా నెలకోసారి వచ్చి పాలు తీసుకెళ్తున్నారు. గాడిద పాల వ్యాపారం లాభదాయకమే. అయితే మంచి బ్రీడ్, ఏజెన్సీని ఎంచుకోవాలి. – పులిదండ నగేష్, గాడిద ఫాం నిర్వాహకుడు -
ఆఫ్రికన్ గాడిదలను ఎత్తుకెళ్లి మరీ.. చైనా దుర్మార్గం
కరోనా టైంలో చైనా ఆహారపు అలవాట్ల గురించి ప్రధానంగా చర్చ నడిచింది. ఒకానొక టైంలో ఆ అలవాట్ల వల్లే కరోనా విజృంభించిందన్న వాదన సైతం చక్కర్లు కొట్టింది. అయితే.. చైనీస్ సంప్రదాయ మందుల తయారీ కోసం మూగజీవాలను పొట్టనబెట్టుకుంటుందని ఆ దేశం మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా.. ఆఫ్రికాలో సైతం గాడిదలను ఎత్తుకెళ్లి దేశాలు దాటించి మరీ చంపి.. సంప్రదాయ మందులు తయారు చేస్తున్న చైనా దుర్మార్గపు చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఇంప్రెసెస్ ఇన్ ది ప్యాలెస్ అనే చైనీస్ టీవీ షో కారణంగానే.. ఈ విషయం వెలుగు చూడడం గమనార్హం. పదులు, వందలు కాదు.. లక్షల్లో గాడిదలను సంప్రదాయ మందుల పేరిట బలిగొంటోంది చైనా. మూగజీవాలను ఎత్తుకెళ్లి మరీ సుత్తెలతో కొట్టి చంపి మరీ అమానుషంగా వ్యవహరిస్తోంది. గాడిదల చర్మం నుంచి తయారు చేసే ఎజియావో అనే సంప్రదాయ మందు కోసం ఆరాచకాలకు పాల్పడుతోందని యూకేకు చెందిన డాంకీ శాంక్చురీలో పని చేసే సైమన్ పోప్ ఆరోపిస్తున్నారు. ఎజియావో అనేది ‘డాంకీ గ్లూ’గా పిలుస్తారు చైనాలో. గాడిదల చర్మం నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ టానిక్ వల్ల ఆరోగ్యంతో పాటు అందంగా ఉంటారని చైనీయుల నమ్మకం. అందుకే.. గాడిదలను దుర్మార్గంగా చంపేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చైనాలో ఈ టానిక్ తయారీకి సరిపడా గాడిదలు లేవు. అందుకే.. విదేశాలపై దృష్టి సారించింది. ప్రధానంగా ఆఫ్రికాలో గాడిదల సంఖ్యపై ఆధారపడింది. ఈ మేరకు మాలి, జింబాంబ్వే, టాంజానియాలో అక్రమ దందాలకు చైనా తెర తీసిందని వాయిస్ ఆఫ్ అమెరికా కథనం ప్రచురించింది. అక్కడి ప్రజలకు గాడిదలు ప్రధాన జీవనాధారం. వాటిని అమ్ముకునేందుకు ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో.. వాటిని ఎత్తుకెళ్లే చేష్టలకు దిగింది చైనా మాఫియా. మొత్తం ఐదు మిలియన్ల గాడిదలకుగానూ.. సొంతగడ్డపై రెండు మిలియన్లు, విదేశాల నుంచి మరో మూడు మిలియన్ల గాడిదలను రప్పించుకుంటోంది. అయితే.. వాయిస్ ఆఫ్ అమెరికా కథనం ప్రకారం ఆ మూడు మిలియన్లలో 25 నుంచి 35 శాతం గాడిదలు ఎత్తుకొచ్చినవే అని తెలిపింది. తమ తమ దేశాల్లో గాడిదల సంఖ్య తగ్గిపోతుండడంపై ఆయా దేశాలు దృష్టిసారించాయి ఇప్పుడు. తమ దేశంలో గాడిదలు అంతరించిపోయే దశకు చేరుకోవడంతో.. టాంజానియా గత నెలలో గాడిదల వధ, చర్మం వర్తకాలపై నిషేధం విధించింది. నైజీరియా కూడా ఇదే బాటలో పయనిస్తూ నిషేధం ప్రకటించింది. తమ గాడిదలు తమ దేశాల సంపదని.. వాటిని అమ్మడం, చంపడం కుదరంటూ కొన్ని దేశాలు ఇప్పటికే డ్రాగన్ కంట్రీకి గట్టి సంకేతాలు పంపాయి. -
చెన్నై నుంచి గాడిదల రవాణా.. ఆందోళనలో ప్రజలు
సాక్షి, ఒంగోలు: చెన్నై నుంచి మండలానికి పశువుల రవాణా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో చెన్నై నుంచి వస్తున్న వారితో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఇక్కడి అధికారులు చెన్నై నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్లో ఉంచుతున్నారు. కానీ ఆదివారం చెన్నై నుంచి గాడిదలను లారీలో తీసుకుని కందుకూరు జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద కొంతమంది వ్యక్తులు వాటిని లారీ లోంచి దింపారు. అయితే వారు మాత్రం ఈ గాడిదలను ఆటోలో కనిగిరి ప్రాంతానికి తరలిస్తామని చెబుతుండగా, ఇది అవాస్తవమని ఇటీవల కాలంలో గాడిద మాంసం అమ్మకాలు మండల కేంద్రంలో జోరుగా జరుగుతున్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఇటువంటి పశువుల రవాణాను అడ్డుకుని, కరోనా వైరస్ ప్రబలకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: మాతృదేవతా మన్నించు! -
వారు గాడిదలతో సమానం: దర్శకుడు
తన సినిమాపై ఆరోపణలు చేసిన వారు గాడిదలతో సమానమని బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘షికారా’ ఈ నెల 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989-90 కాలంలో కశ్మీర్ నుంచి వలస వెళ్లిన కశ్మీర్ పండితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లు రాబట్టకపోవడంతో కొంతమంది సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తన్నారు. కశ్మీరీల జీవితాలను కమర్షియల్‌గా చూపించిన విధుకు సరైన శాస్తి జరింగిందంటూ విమర్శించారు. అలాగే ట్విటర్లో #BoycottShikara అంటూ హ్యష్‌ట్యాగ్‌తో సినిమాను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ‘ఇస్లాం తీవ్రవాదానికి మా కుటుంబాలు తుడిచిపెట్టుకుని పోయాయి. ఒక కశ్మీరీ పండిత్‌గా నేను నీ సినిమాను గుర్తించడం లేదు’ అని ఓ కశ్మీర్ మహిళ విధు చోప్రాపై విరుచుకుపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు’) తాజాగా ఈ విమర్శలపై స్పందించిన విధు చోప్రా.. గాడిదలుగా మాట్లాడకండి అంటూ విమర్శకులపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను నిర్మించిన 3 ఇడియట్స్ మొదటి రోజు రూ. 33 కోట్లు రాబట్టింది. అలాగే షికారా మొదటి రోజు రూ. 30 లక్షలు సాధించింది. అయినా ఈ సినిమా తీయడానికి మేము 11 సంవత్సరాల సమయం కేటాయించాం. నేను మొదటి రోజు రూ. 33 కోట్లు సాధించిన సినిమా చేశాను. కానీ నా తల్లి జ్ఞాపకార్థం కోసం చేసిన సినిమా మొదటి రోజు రూ. 30 లక్షలు వసూలు చేసింది. అయినా కశ్మీర్ ప్రజలు బాధను నేను వాణిజ్యపరంగా చేశానని ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ విధంగా భావించే వారు గాడిదలు అని నేను అనుకుంటున్నాను. నేను కేవలం వాస్తవాలనే మాత్రమే చిత్రీకరించాను. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. గాడిదలు కాకండి. ముందుగా సినిమా చూసి ఆ తరువాత ఓ అభిప్రాయానికి రండి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. (‘షికారా’ను నిలిపి వేయాలంటూ పిటిషన్) చదవండి : సినిమాను మా అమ్మకు అంకితం చేస్తున్నా: డైరెక్టర్ -
ఆ గాడిద నాదే.. కాదు నాదే!
సాక్షి, వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పోలీసులకు వింత పంచాయితీ వచ్చి పడింది. ఒక గాడిదను ఇద్దరు వ్యక్తులు.. నాదంటే.. నాదేనంటూ పట్టుబట్టడంతో పోలీసులు ఎటూ తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు. దీంతో గాడిదతోపాటు దాని పిల్ల, ఇద్దరు వ్యక్తులు పీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజులుగా తన గాడిదకు మేత సరిగ్గా అందకపోవడంతో చిక్కిపోయిందంటూ ఇరువురూ.. కన్నీరు పెట్టుకోవడంతో పోలీసులు జుత్తు పీక్కుంటున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ వద్ద నివాసం ఉండే బాణాల ప్రభు గాడిదలను మేపుతూ వాటి పాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని వద్ద మొత్తం 22 గాడిదలు ఉండగా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో తొమ్మిది గాడిదలు చనిపోయాయని, మరో నాలుగు తప్పిపోయాయని తెలిపాడు. ఈ విషయంపై గత సెప్టెంబర్‌లో వికారాబాద్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. అయితే గాడిదలను గుర్తుపట్టడం తమకు కష్టమని.. మీరే వాటిని వెతికి ఆచూకీ చెబితే పట్టకొచ్చి ఇస్తామని పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రభు తన గాడిదల కోసం కొన్ని రోజులుగా వెతుకుతుండగా.. ఐదు రోజుల క్రితం మోమిన్‌పేటలో ఓ వ్యక్తి వద్ద తన గాడిద ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాడిదలు ఉన్న చోటకు పోలీసులు వెళ్లేసరికి.. దాన్ని అప్పటికే డీసీఎంలో లింగంపల్లికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారుడు, ఇద్దరు పోలీసులు శనివారం లింగంపల్లికి వెళ్లి గాడిదను గుర్తించి ఆటోలో వికారాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు. దీంతో ఆ గాడిద తనదేనంటూ యజమానురాలు పద్మ తన తండ్రి సత్తయ్యతో కలిసి వికారాబాద్ పీఎస్‌కు చేరుకుంది. పోలీసులు తీసుకొచ్చిన గాడిద తనదేనని.. తనకు ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) ఉన్నారని, ఇటీవల తన భర్త గుండెపోటుతో మృతిచెందాడరని ఆమె పోలీసులకు తెలిపారు. బతకడానికి ఏ ఆధారం లేకపోవడంతో తన తల్లిదండ్రులు ఇటీవలే రెండు గాడిదలను కొనిచ్చారని చెప్పింది. ఈ గాడిదలే తనకు, తన పిల్లలకు బతుకుదెరువని ఆమె విలపించింది. ఇరువురూ గాడిద నాదంటే.. నాదే అనడంతో పోలీసులు ఎటూ తేల్చలేకపోయారు. ఫిర్యాదుదారు ప్రభు మాత్రం.. పద్మ తండ్రి సత్తయ్య 2014లో తన గాడిదలను దొగలించాడని తెలిపారు. ఈ విషయమై కులస్తుల వద్ద పంచాయతీ పెట్టి.. వారికి జరిమానా వేయించినట్లు చెప్పాడు. దీంతో ఏం చేయాలో తోచని పోలీసులు మంగళవారం మరోసారి గాడిదను తీసుకొని స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించారు. గాడిద ప్రస్తుతం ప్రభు వద్ద ఉంది. -
క్రమశిక్షణ లేకుండా పోతుంది... బొత్తిగా!
క్రిస్మస్ పండుగకు ముందటి ఒక జ్ఞాపకమిది: ఇంటికి సున్నాలు, ఒంటికి కొత్త బట్టలూ, పంటి కిందికి కేకులూ, రోజ్ కుకీలూ... అబ్బో సందడే సందడి. కొత్తబట్టలు కొనుక్కోవడానికి విజయనగరం ట్యాక్సీలో వెళ్లడం మరుపురాని అనుభూతైతే, ఆ బట్టలు వైజాగ్‌లో కుట్టించుకోవడం ఇంకో మరిచిపోలేని జ్ఞాపకం. కాని, ఒక్క తలకత్తిరింపు ప్రహసనమే మరచిపోలేని పీడకల మాకు. పండక్కి మూడురోజుల ముందు మా ఆస్థాన క్షురకుడు వెంకటేశ్వర్లు మా ఇంటికి వచ్చి నాన్నకీ, నాకూ, మా తమ్ముడికి వరసగా క్షౌరం చేసి వెళ్ళిపోవడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ఆ సంవత్సరం ఆ సంప్రదాయానికి చరమగీతం పాడి, షాపు కెళ్ళి తల కత్తిరించుకోవాలనేది మా తమ్ముడి ప్రయత్నం. ఎందుకంటే అక్కడ అమ్మ ఆజమాయిషీ ఉండదు గనుక వాడిష్టం వచ్చినట్లు కత్తిరించుకోవచ్చని వాడి ఆశ.అదెలా సాధించాలా అనే ఆలోచనలోనే వాడుండగానే ఇరవైరెండో తేదీ వచ్చేసింది. కత్తులూ కత్తెర్లూ చేత్తో పట్టుకొని వెంకటేశ్వర్లు మా ఇంటిముంగిట్లో వాలిపోయాడు మాకు కటింగ్ చేయడానికి. వెంకటేశర్లుని చూడగానే మా వాడి ముఖం బ్రహ్మరాక్షసిని చూసినట్లు భయంతో పాలిపోయింది. సరే, ముందుగా నాన్న కూర్చున్నాడు కత్తిరింపుకి. నాన్న తల కత్తిరిస్తున్నంత సేపూ అక్కడే కూర్చొని వెంకటేశ్వర్లుతో బేరాలాడుతూనే ఉన్నాడు మా తమ్ముడు జుత్తు ఎక్కువ తగ్గించేయవద్దని. వెంకటేశ్వర్లు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా తల కత్తిరించడంలో నిమగ్నమైనట్లు యమ యాక్షన్ చేస్తున్నాడు.నేను కొంచెం దూరంగా కూర్చొని పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ జరుగుతున్న ప్రహసనాన్ని గమనిస్తున్నాను.అమ్మకు అర్థమైపోయింది తమ్ముడేదో ప్లాన్ చేస్తున్నట్లు.అందుకే ఆ చుట్టుపక్కలే తచ్చాడుతోంది ఏదో పని ఉన్నట్లు.వాడేమో అమ్మ అక్కడకు వచ్చినప్పుడు నోరుమూసుకొని, కొంచెం అటువైపు వెళ్లగానే మళ్లీ బ్రతిమిలాడడం మొదలుపెడుతున్నాడు జాలిగా దీనంగా. నాన్నేమో ఇవేమీ అస్సలు పట్టించుకోకుండా తల అప్పచెప్సేసి కళ్లు మూసుకు కూర్చున్నారు అలవాటు ప్రకారం.అరగంట గడిచింది భారంగా.నాన్న జుత్తు కత్తిరింపు అయిపోయింది. తర్వాత వంతు మా తిప్పడిదే. తిప్పడు తెగించేవాడు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దపడిపోయాడు. అందరికీ... ముఖ్యంగా అమ్మకి వినిపించేలా గట్టిగా....‘‘వెంకటేశ్వర్లూ నా జుత్తు ఎక్కువ తగ్గించకు. కొంచెం పైపైన తీసేసి వదిలెయ్యి చాలు. చెవుల మీదకు అసలు తీయవద్దు’’ అన్నాడు. అంతే!అమ్మ రయ్యిమని దూసుకొచ్చేసింది స్పాట్‌లోకి.దూసుకొచ్చి భయంకరమైన హుకుం జారీ చేసింది...‘‘వెంకటేశ్వర్లూ వాడికి కటింగ్ ఎప్పుడూ చేస్తున్నట్టే చెయ్యి. ఏమీ మార్చకు. జుత్తు బాగా పెరిగింది. బాగా చెవుల మీదికి తీసెయ్యి’’ అని.అంతే..మా తిప్పడి ముఖం నల్లగా మాడిపోయింది. కళ్లలోకి సర్రన కోపం, చివ్వున కన్నీరూ ఎగదన్నుకొచ్చేసాయి. విసురుగా లేచిపోయాడు స్టూల్ మీద నుండి జుత్తు చెవుల మీదకి ఉంచుకోవడానికి కుదరకపోతే అసలు జుత్తే కత్తిరించుకోనంటూ. దాంతో అమ్మకు పూనకం వచ్చేసింది. ‘‘ఇంట్లో నా మాటకి విలువేమైనా ఉందా. అసలిదంతా ఆ పెద్దవెధవ వల్లే వచ్చింది. డిగ్రీ చదువుతున్న ఆ గాడిదకెలూగు చెప్పలేను. తొమ్మిదో క్లాసు చదువుతున్న ఆ చిన్నగాడిదకి కూడా...’’ ఇలా సాగిపోతుంది వాక్ప్రవాహం.నాన్న మాత్రం తమ్ముడి బాధ పడలేక...‘‘పోనిలేవే పాపం. క్రిస్మస్ కదా ఈ ఒక్కసారీ వాడి ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకోనివ్వకూడదూ. వాడూ పెద్దోడవుతున్నాడు కదా’’ అని అన్నారో లేదో దాడి మొత్తం ఆయన మీదికి మళ్లింది.‘‘నేను చెప్తూనే ఉన్నాను కదా...మీ వల్లే ఈ గాడిదలు ఇలా భయం, భక్తీ లేకుండా తయారవుతున్నారని. క్రమశిక్షణ లేకుండా పోతుంది బొత్తిగా! (ఇది మాఅమ్మ ఫెవరెట్ డైలాగ్). వీళ్లిలా తయారవడానికి కారణం మీరే. మీ వల్లే ఇదంతా’’ఇక తమాయించుకోవడం నా వల్ల కాలేదు.గట్టిగా నవ్వడం మొదలు పెట్టాను.నాతో పాటు నాన్న కూడా.అంతే మా తమ్ముడి సహనం చచ్చిపోయింది. అమ్మని ఎదిరించి ఇటువంటి విషయాల్లో వాడే కాదు నాన్న కూడా ఏమీ చేయలేరన్న విషయం చాలా స్పష్టంగా ఇంకొకసారి అవగతం అయ్యింది. క్రిస్మస్కి కనీసం చెవుల ఉప్పెనలా నిరాశ, నిస్పృహ ఆవహించి, తల విషయం తన తల రాతకి, భగవంతుడికీ వదిలేసి...‘‘వెంకటేశ్వర్లూ ఇంకా చెక్కేయ్. నీ ఇష్టం వచ్చినట్టు చెక్కేయ్. నేనేమైనా అంటే నీ చెప్పిచ్చుకు కొట్టు. కానీయ్’’ అని తల వంచుక్కూర్చున్నాడు.ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వెంకటేశ్వర్లు తన కత్తెరతో వాడి తల మీద విలయతాండవం చేయించాడు. వాడి జుట్టు గుప్పెటకందనంత పొట్టిగా, చెవులకి అంగులంమీదుగా గొరిగేసాడు. చూస్తుండగానే మా తిప్పడి బుర్ర పంపరపనసకాయలా గుండ్రంగా రూపాంతరం చెందింది. దాన్ని చూసిన అమ్మ ముఖం ఆనందంతో దీపావళి మతాబులా వెలిగితే మా తిప్పడిముఖం మాత్రం చీదేసిన చిచ్చుబుడ్డిలా మాడిపోయింది. వాడి క్రిస్మస్ సర్దా అంతా మా ఊరి ఉప్పుటేట్లో కలిసిపోయింది. – పి.కృపాకర్, హైదరాబాద్ -
గాడిద ‘గుడ్’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఆధునిక కాలంలోనూ గాడిదల పెంపకంతో ఉపాధి పొందుతున్న కుటుం బాలు నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నేటికీ కనిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న వీటిని మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాహనాలు వెళ్లలేని వ్యవసాయ క్షేత్రాల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. అయితే సీజన్లో మాత్రమే వీటి ద్వారా ఉపాధి లభిస్తుండగా, పోషణ భారంగా మారిందని పెంపకందారులు ఆవేదన చెందుతున్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో గాడిదల పెంపకంతో ఉపాధి పొందుతున్న తీరుపై ‘సాక్షి’ కథనం. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మనూరు, నాగల్గిద్ద, కంగ్టి తదితర మండలాల్లో గాడిదల పెంప కం ద్వారా కొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. గతంలో కుండలు చేయడం, బట్టలు ఉతకడం కుల వృత్తిగా ఉన్న వారు..ప్రస్తుతం తమ రూటు మార్చి గాడిదల పెంపకాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. కర్ణాటక సరిహద్దుగా ఉన్న మంజీర నదీ తీర ప్రాంత గ్రామాల్లో వీటి సేవలను వినియోగించుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది. తీర ప్రాంత వ్యవసాయ క్షేత్రాలు నల్లమట్టి నేలలు కావడంతో రైతులు అడుగు తీసి అడుగు వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు వ్యవసాయ క్షేత్రాలకు దారి లేకపోవడం, దారి ఉన్నా రేగడి నేలల మీదుగా విత్తనాలు, ఎరువులు మోసుకెళ్లడం అసాధ్యంగా మారింది. దీంతో ఎరువులు, విత్తనాలను వ్యవసాయ క్షేత్రాలకు చేరవేసేందుకు గాడిదలను వినియోగిస్తున్నారు. దీంతో పెంపకందారులు దూరం, బరువును బట్టి డబ్బులు వసూలు చేస్తారు. వ్యవసాయ సీజన్లో రోజుకు కనీసం రూ.200 నుంచి రూ.500వరకు గిట్టుబాటు అవుతుందని పెంపకందారులు వెల్లడించారు. ధాన్యం దిగుబడి సమయంలోనూ గాడిదలను రవాణాకు ఉపయోగిస్తున్నారు. అయితే ధాన్యం రవాణాలో డబ్బులు కాకుండా, ధాన్యాన్నే అద్దె రూపంలో వసూలు చేస్తారు. ఒక్కో మడికి తవ్వెడు (సుమారు 60కిలోల ధాన్యానికి సుమారు కిలో చొప్పున) వసూలు చేస్తామని పెంపకందారులు తెలిపారు. పెసలు, కందులు, మినుములు తదితరాల రవాణాతో అద్దె గిట్టుబాటవుతుందని చెప్తున్నారు. అయితే వ్యవసాయ పనులు లేని సందర్భంలో గాడిదల పెంపకం పెద్దగా లాభసాటిగా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మంజీర నుంచి ఇసుక అక్రమ రవాణాకు గాడిదలను ఉపయోగిస్తుండడం, అప్పుడప్పుడూ తమకు సమస్యలు తెచ్చి పెడుతోందని మోర్గి, కరస్‌గుత్తి గ్రామాలకు చెందిన పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో గాడిద ధర రూ.15వేలు పైనే.. ఒక్కో గాడిద ధర రూ.15వేలకు పైనే పలుకుతుండగా, వీటి కొనుగోలుకు సంబంధించి స్థానికంగా మార్కెట్ లేదు. అయితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఘోడే మాలేగావ్ నుంచి కొనుగోలు చేస్తారు. మాలేగావ్‌లో ప్రతీ ఏటా డిసెంబర్, జనవరి మాసాల్లో సుమారు 30 రోజుల పాటు అతిపెద్ద సంత నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి గాడిదలు, గుర్రాలు, ఒంటెల కొనుగోలుకు వ్యాపారులు, పెంపకందారులు వస్తారని స్థానికులు తెలిపారు. గతంలో మాలేగావ్‌లో కొనుగోలు చేసిన గాడిదలను కాలినడకనే తీసుకొచ్చేవారని, ఇటీవలి కాలంలో డీసీఎంల ద్వారా రవాణా చేస్తున్నట్లు పెంపకందారులు తెలిపారు. మేలు రకం గాడిదల ధర రూ.25వేల వరకు ఉంటుందని సమాచారం. గాడిదల పెంపకం ద్వారా ఉపాధి లభిస్తున్నా, తమ వృత్తిలోనూ పోటీ పెరిగి గిట్టుబాటు కావడం లేదని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు, మేకలు, పాడి పశువుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్న తరహాలో గాడిదల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్న తమకూ లబ్ధి చేకూరేలా చూడాలని కోరుతున్నారు. -
గాడిదలను చంపేసి చైనాకు పార్సిల్
నైరోబీ: మూగ జీవాలను అమానుషంగా చంపుతుండటంపై వన్యప్రాణి హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున్న నిరసనకు సిద్ధమైపోయాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి చైనా పెద్ద ఎత్తున గాడిదల చర్మాలను దిగుమతి చేయించు కోవడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. గాడిద చర్మంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు ఉంటాయని చైనీయులు నమ్ముతారు. వీటి చర్మాలను ఉడికించి ‘ఎజావో’ అనే ద్రావణాన్ని తయారు చేస్తారు. చైనాలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఎజావో కారణంగా చైనాలో గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గి ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గాడిదల కోసం డ్రాగన్ కంట్రీ కన్ను ఇతర దేశాలపై పండింది. ఆఫ్రికాలోని పలు దేశాల నుంచి గాడిద చర్మాలను అక్రమంగా రవాణా చేయించుకుంటోంది. గాడిదలు జాగ్రత్త..! కెన్యాకు చెందిన జోసెఫ్ కమాంజో కరియుకి గాడిదలపై నీటిని తరలిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఆయన గాడిదలను దొంగలు ఎత్తుకెళ్లారు. చైనా కారణంగా తమ దేశంలో వేళ్లూనుకున్న గాడిద చర్మాల బ్లాక్ మార్కెట్‌పై కరియుకి గళమెత్తాడు. తన లాగే మరెవరూ జీవనాధారం కోల్పోవద్దనీ, ‘మీ గాడిదలు జాగ్రత్త’అనే నినాదంతో అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడు. ఇప్పుడు గనుక ఈ బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోకపోతే.. వచ్చే తరాల వారికి గాడిదల చరిత్రను చెప్పాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘సాధారణంగా గాడిదలను అమ్మకానికి కాకుండా కుటుంబ అవసరాలకోసం, జీవనాధారం కోసం పెంచుతుంటారు. కెన్యాలో గాడిద చర్మాల రవాణాకు అనుమతి పొందిన మూడు కబేళాలు ఉన్నాయి. వీటి చర్మాలకు చైనాలో మంచి డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగా రోజూ వెయ్యి గాడిదలను చంపి వాటి చర్మాన్ని వలుస్తున్నాం. డిమాండ్‌కు తగ్గట్లు సప్లయ్ లేకపోవడంతో.. మధ్యవర్తులు, వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. మంచి ధర చెల్లిస్తుండటంతో వారు గాడిదలను అపహరించి సప్లయ్ చేస్తుస్తున్నార’ని ఓ అధికారి చెబుతున్నారు. కాగా, ఆఫ్రికా వ్యాప్తంగా చెలరేగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వాలు స్పందించాయి. 14 ఆఫ్రికా దేశాలు గాడిదల చర్మం రవాణాపై నిషేదం విధించాయి. గత 9 ఏళ్లుగా కెన్యాలో గాడిదల సంఖ్య మూడోవంతు తగ్గిపోయాయని ఒక సర్వే నివేదిక వెల్లడించింది. గాడిదల సంఖ్య 1.8 మిలియన్ నుంచి 1.2 మిలియన్‌కు పడిపోయింది. అధికారికంగా సగటున రోజుకు వెయ్యి గాడిదల చొప్పున చంపుతుండగా, అనధికారికంగా మరెన్నింటిని అంతమొందిస్తున్నారో ఊహించుకోవచ్చు..!! -
గాడిదలు కావాలండోయ్: చైనా
బీజింగ్ : ఇతర దేశాలకు తమ వస్తువులను ఎగుమతి చేస్తూ తమదైన ముద్ర వేసుకున్న చైనాకు.. ఓ విషయంలో మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది. అదేంటో కాదండోయ్.. గాడిద చర్మం. అవును గత కొన్నేళ్లుగా చైనాలో గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గిపోయిందంట. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన చైనా ప్రభుత్వం ఇతర దేశాల్లోని తోలు విక్రయదారులను ఆకర్షించే పనిలో పడింది. దీనిలో భాగంగానే గాడిదల దిగుమతులపై విధించే సుంకాన్ని ఏకంగా 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం చైనాలో గాడిద తోలుకు మంచి గిరాకీ ఉండటంతో భారీ రేటు పలుకుతోంది. ఒక్కో గాడిద తోలు మన కరెన్సీలో సుమారు రూ.30వేలు పలుకుతోంది. దీనికి కారణం గాడిద చర్మాన్ని కాచి తీసిన జిగురు పదార్థం జెలిటిన్కు ఫుల్ డిమాండ్ ఉండటమే. దీన్ని చర్మ సౌందర్యాన్ని పెంచే సంప్రదాయ జౌషదాల్లోనూ వాడుతారు. అంతేకాకుండా గాడిద మాంసాన్ని చైనీయులు ఇష్టంగా తింటారు. దీంతో చైనాలో గాడిదల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చైనా దెబ్బకు తమ దేశాల్లోని గాడిదలు తగ్గుతాయని పక్క దేశాలు గొల్లుమంటున్నాయి. -
అయ్యా! ఆ గాడిదల అరెస్ట్‌కు మాకు సంబంధం లేదు!
సాక్షి, న్యూఢిల్లీ : పాపం! ఉత్తర ప్రదేశ్ పోలీసులు అన్యాయంగా అభాసుపాలయ్యారు. వారిని వెర్రిబాగుల కింద జమకట్టి సోషల్ మీడియా గత రెండు రోజులుగా ఆడిపోసుకుంటోంది. వారిపై జోకులను కేకుల్లా కట్చేస్తోంది. ఇంతకు ఏం జరిగిదంటే...ఉత్తరప్రదేశ్‌లోని ఒరాయ్ జిల్లా జైలుకు చెందిన పోలీసులు ఎనిమిది గాడిదలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నాలుగు రోజుల అనంతరం సోమవారం నాడు వాటిని విడిచిపెట్టారు. జైలు బయట చాలా ఖరీదైన మొక్కలను తినేస్తున్నాయన్న కోపంతో వాటిని జైల్లో పెట్టినట్టు తెల్సింది అలా జైలు నుంచి బయటకకు వస్తున్న గాడిదలను ఏఎన్ఐ వార్తా సంస్థ వీడియో తీసి మీడియాకు విడుదల చేసింది. ఆ వీడియో ఆంగ్ల పత్రికల్లో, టీవీ ఛానళ్లలో విస్తతంగా ప్రచారం అవడంతో సోషల్ మీడియా యూపీ పోలీసులపై తనదైన శైలిలో దండయాత్రకు దిగింది. గాడిదలను అరెస్టు చేసిన యూపీ పోలీసులు వాటిని నాలుగు రోజుల అనంతరం బెయిల్‌పై విడుదల చేశారంటూ ట్వీట్లు పెట్టారు. ఆ గాడిదల అరెస్ట్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదు మొర్రో అంటూ యూపీ పోలీసులు ఎంత మొత్తుకున్నా సోషల్ మీడియా పట్టించుకోవడం లేదు. నిజంగా వారికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో సోషల్ మీడియాతోపాటు మెయిన్ మీడియా కూడా పొరపాటు పడింది. ఉత్తరప్రదేశ్ పోలీసు చట్టం ప్రకారం రాష్ట్ర హోం శాఖ ఆధ్వర్యంలో యూపీ పోలీసులు, జైలు పోలీసులు రెండు వేర్వేరు విభాగాలు. చివరకు ముచ్చటగా మూడోసారి అడిషనల్ ఎస్పీ–ప్రజా సంబంధాల అధికారి రాహుల్ శ్రీవాస్తవ కూడా ‘అయ్యా! ఆ గాడిదల అరెస్ట్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి!’ అని పత్రికా ప్రకటనతో పాటు ట్వీట్లు కూడా పెట్టారు. -
ఉత్తరప్రదేశ్‌లో గాడిదలను జైల్లో పెట్టారు
-
జైలుకి గాడిదలు, అవి చేసిన తప్పేమి?
లక్నో : సాధారణంగా జైళ్లకి తప్పు చేసిన వ్యక్తులు వెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని జలన్ జిల్లా ఉరై జైలులో ఓ విడూరం జరిగింది. గాడిదలు తప్పు చేశాయంటూ, ఆ జంతువులను జైలులో పెట్టారు అధికారులు. ఇంతకీ ఆ ఎనిమిది గాడిదలు చేసిన పెద్ద తప్పేమిటో తెలుసా? జైలు కాంపౌండ్‌లో ఉన్న ఖరీదైన మొక్కల్ని నాశనం చేయడమే. వీటి విలువ లక్షల్లో ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు. తమ సీనియర్ అధికారి జైలుకి లోపల ఏర్పాటుచేసిన ఖరీదైన మొక్కలను ఈ గాడిదలు నాశనం చేశాయంటూ హెడ్ కానిస్టేబుల్ ఆర్కే మిశ్రా చెప్పారు. గాడిదలను వదులుకోవాల్సి వస్తుందంటూ పలు మార్లు ఓనర్‌ను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందని, దీంతో వీటిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ గాడిదలను జైలు నుంచి బయటికి విడిపించడానికి ఓ స్థానిక రాజకీయ నాయకుడు బెయిల్ మొత్తాన్ని చెల్లించాడు. బెయిల్‌కు కావాల్సిన నగదు కట్టడంతో జైలు అధికారులు ఆ గాడిదలకు విముక్తి కల్పించారు. తమ గాడిదలు జైలు నుంచి విడుదలవుతున్నాయని ఇక్కడికి వచ్చానని, నాలుగు రోజుల పాటు తమ ఎనిమిది గాడిదలు జైలులోనే ఉన్నట్టు వాటి యజమాని కామ్లేష్ తెలిపారు. -
డాంకీస్ థియరీ
ఒక గాడిద తనను తాను గుర్రమని నమ్మసాగింది. మనల్ని మనం గుర్తు పట్టకపోవడం, మనల్ని ఇంకెవరో అనుకోవడం ప్రకృతి సహజం. అబద్ధాన్ని నిజంగా చలామణి చేయాలనుకుంటే తప్పులేదు గానీ, నోరు విప్పకుండా జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. స్వరం భాస్వరం లాంటిది. నిప్పుని ఎగదోస్తుంది. అలంకారం వల్ల రూపురేఖలు మారాయి కానీ గొంతు మారలేదు. గాండ్రింపునకు, ఓండ్రింపునకు అక్షరమే తేడా కానీ, అనాటమీ మారిపోతుంది. గాడిద వెళ్లి ఒక మిమిక్రీ ఆర్టిస్టును కలిసింది. ‘‘నా సకిలింపు ఎలా వుండాలంటే, వెయ్యి వాయులీనాలు ఒకేసారి మోగినట్టుండాలి.’’ అని అడిగింది గాడిద. ఆర్టిస్ట్ కప్పలా బెకబెకలాడి, కోతిలా కిచకిచమని, వూపిరిని దీర్ఘంగా కుక్కలా వదిలాడు. హైనాలా నవ్వి, తోడేలులా వూళవేసి, పరిషత్ నాటకాల పాత్రధారిలాగా ‘‘కుదరదు’’ అని అరిచాడు. ‘‘క్షణానికో ముఖంతో జీవించే మానవులకి, కుదరని పని అంటూ వుందా?’’ అని ప్రశ్నించింది గాడిద. ‘‘నిజమే కానీ, మనుషులు మాత్రమే రకరకాల కూతలు కూయగలరు. జంతువులకు అది చేతకాదు’’‘‘సాధనం వల్ల కానిది ధనం వల్ల అవుతుంది’’ అని గాడిద ఒక క్రెడిట్ కార్డు తీసి ఆర్టిస్ట్ వీపుపై గోకింది. ‘‘నువ్వు నన్ను కొనదలుచుకున్నావా?’’ అనుమానంగా అడిగాడు ఆర్టిస్ట్. ‘‘ఈ ప్రపంచంలో కొనలేని వాళ్లు వుండొచ్చు కానీ, అమ్ముడుపోని వాళ్లు మాత్రం లేరు. అమ్మకం ఒక కళ. కొనడం ఒక ప్రేతకళ.’’‘‘వాక్య నిర్మాణంలో ఏదో దోషముంది’’‘‘మానవ నిర్మాణంలోనే దోషమున్నపుడు, వాక్యాల గురించి ఎందుకు వ్యాఖ్యానం’’‘‘గాడిదలు కూడా వేదాంతం మాట్లాడతాయా?’’‘‘వేదాంతం పుట్టిందే గాడిదల వల్ల, దీన్ని డాంకీస్ థియరీ ంటారు’’‘‘ఇంత స్వీయజ్ఞానం వున్నప్పుడు, సకిలింపు కూడా నువ్వే నేర్చుకోవచ్చుగా, యూట్యూబ్‌లో బోలెడు వీడియోలున్నాయి.’’‘‘ప్రయత్నించాను కానీ సాధ్యంకాలేదు. గురువులేని విద్య గుడ్డి విద్యగా భావించి నీ దగ్గరికొచ్చాను’’‘‘ఏది నీ స్వరం వినిపించు’’ ‘క’ గుణింతం లాగా ‘కి కీ కె కే కై’ అంటూ అవరోహణ నుంచి ఆరోహణకి ఎత్తుకుంది. ఆర్టిస్ట్‌కి గుండెలు జారిపోయి, మోకాళ్లలోకి వచ్చి టకటక కొట్టుకున్నాయి. ఎందుకైనా మంచిదని గాడిద వెనుకవైపు లేకుండా జాగ్రత్తపడ్డాడు. సంగీతకచేరీ ముగిసిన తర్వాత గాడిదలు వెనుక కాళ్లు గాల్లోకి లేపి చప్పట్లు కొట్టి లేపమని తమని తాము అభినందించుకుంటాయి. ఆ సమయానికి ఖర్మగాలి అక్కడెవరైనా వుంటే వాళ్ల పళ్లు రాలగొట్టి డెంటిస్ట్ల దగ్గరకు పంపుతాయి. డెంటిస్ట్ల ప్రాక్టీస్ పెరగడానికి, గాడిదల సంగీత సాధన ఒక ముఖ్య కారకం. కుక్కర్లాగా విజిల్ వేసి, ఓండ్రింపుకి శుభం కార్డు వేసింది గాడిద. ఆర్టిస్ట్‌లో వణుకు తగ్గలేదు. సర్వీస్ ఆటోకి వేలాడుతున్నప్పుడు కూడా అతడు ఇంతలా భయపడలేదు. ఫ్యాన్ గాలికి ఆరుతున్న ఖద్దరు పంచెలా వణుకుతున్నాడు. ‘‘అంత మైమరుపా?’’ అని అడిగింది గాడిద.‘‘మైమరుపునకి, జలదరింపునకి తేడా తెలుసుకోలేకపోవడమే కళాకారుల లక్షణం. ప్రపంచంలో వున్న సౌండ్ ఇంజనీర్లంతా ఏకమైనా నీ ఓండ్రింపుని సకిలింపుగా మార్చలేదు. మనదగ్గర ఏముందో దాన్నే అద్భుతవిద్యగా చలామణి చేయాలి. అయినా గాడిదలు, గుర్రాలకి తేడా తెలియని కంపెనీలు చాలావున్నాయి. పైగా ఓండ్రింపు శబ్దం హెచ్ఆర్లో బాగా పనికొస్తుంది. వెళ్లి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో చేరు’’ అని ఉచిత సలహా ఇచ్చాడు ఆర్టిస్ట్. ‘‘సాఫ్ట్వేర్ కంపెనీ అంటేనే గాడిద చాకిరికి బ్రాండ్ అంబాసిడర్. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. నాకు అవసరం లేదు.’’ ‘‘నువ్వు తెలివైన అడ్డగాడిదలా మాట్లాడుతున్నావ్.. ఎవరూ మనల్ని పొగడనపుడు మనకి మనమే ఓ సభ పెట్టించుకొని పొగిడించుకోవాలి. ఎవరూ మనల్ని గుర్తించనపుడు మనమే ‘బిగ్ యాస్’ ప్రోగ్రామ్ పెట్టించుకోవాలి. ప్రమోట్ చేసుకోవడం నేర్చుకో. అప్పుడే లోకానికి ఓండ్రింపులో సౌండ్ ఆఫ్ ది మ్యూజిక్ వినిపిస్తుంది’’గాడిద వెళ్లి ఆ పనిలో దిగింది. సభలు, సన్మానాలు, ఇంటర్వ్యూలు అన్నీ జరిగిపోయాయి. జస్ట్ పెయిడ్ అంతే. ఓండ్రింపులో ఎన్ని డెసిబుల్స్ సంగీతముందో లెక్కలేసే పనిలో విద్వాంసులున్నారు. రాగయుక్త ఓండ్రింపు – ఒక తులనాత్మక పరిశీలన అనే అంశంపై ఒకరిద్దరు కుర్రాళ్లు పరిశోధనలోకి కూడా దిగినట్టున్నారు. నీ దగ్గర వున్న దాన్ని బ్రాండెడ్‌గా అమ్మగలిగితే నువ్వే జేమ్స్బ్రాండ్. -
బురదలో గార్దబాల పదక్షణ
-
గార్దబాలతో వచ్చి.. మొక్కులు తీర్చి
- చౌడేశ్వరీదేవి గుడిచుట్టూ బురదలో గార్దబాల పదక్షణ - తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చి జనం కల్లూరు : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కల్లూరు శ్రీచౌడేశ్వరిదేవి ఆలయం చుట్టూ బురదలో గురువారం గార్దబాల ప్రదక్షణ ఆనందోత్సాహాల మధ్య సాగింది. తరతరాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా గార్దబాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం వద్దకు తెచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ ఏర్పాటుచేసిన బురదనీటిలో దింపి మూడు ప్రదక్షణలు చేయించారు. నగరంలోని బుధవారపేట, వన్‌టౌన్, సాయిబాబానగర్, పెద్దపడఖానా, కల్లూరు, శరీన్‌నగర్, శ్రీరామనగర్తోపాటు శింగవరం, మునగాలపాడు, తాండ్రపాడు, పంచలింగాల తదితర గ్రామాల రజకులు తమ గార్దబాలతో ప్రదక్షణకు పోటీ పడ్డారు. ప్రదక్షణలు చేసి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. ఏటా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులమంతా పాల్గొంటామని రజక సంఘం నాయకులు ఎల్లప్ప తెలిపారు. ఈ ఏడాది బురదలో తగిన మేరకు నీరు లేకపోవడంతో ఒక ప్రదక్షణతోనే సరిపెట్టుకున్నామన్నారు. బురదలో నీళ్లు పలుచగా ఉంటే 3 నుంచి 5 ప్రదక్షణలు తీయించి సంతోషంగా ఇంటికి వెళ్లే వాళ్లమని తెలిపారు. -
గాడిదలకు అవార్డులు!
బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విభిన్న రంగాల్లో విశేష ప్రతిభా పాటవాలను కనబరిచిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే అవార్డులను సైతం రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అందజేస్తున్నారని వాటాళ్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ఆరోపిస్తూన్నారు. అవార్డుల ప్రకటన విషయంలో ప్రభుత్వ వైఖరికి ఆయన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వాటాళ్ నాగరాజ్ గాడిదలకు అవార్డులను అందజేసి తన నిరసనను తెలియజేశారు. -
గాడిదలకు పరుగు పందాలు