సాక్షి, వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పోలీసులకు వింత పంచాయితీ వచ్చి పడింది. ఒక గాడిదను ఇద్దరు వ్యక్తులు.. నాదంటే.. నాదేనంటూ పట్టుబట్టడంతో పోలీసులు ఎటూ తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు. దీంతో గాడిదతోపాటు దాని పిల్ల, ఇద్దరు వ్యక్తులు పీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజులుగా తన గాడిదకు మేత సరిగ్గా అందకపోవడంతో చిక్కిపోయిందంటూ ఇరువురూ.. కన్నీరు పెట్టుకోవడంతో పోలీసులు జుత్తు పీక్కుంటున్నారు.
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ వద్ద నివాసం ఉండే బాణాల ప్రభు గాడిదలను మేపుతూ వాటి పాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని వద్ద మొత్తం 22 గాడిదలు ఉండగా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో తొమ్మిది గాడిదలు చనిపోయాయని, మరో నాలుగు తప్పిపోయాయని తెలిపాడు. ఈ విషయంపై గత సెప్టెంబర్‌లో వికారాబాద్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. అయితే గాడిదలను గుర్తుపట్టడం తమకు కష్టమని.. మీరే వాటిని వెతికి ఆచూకీ చెబితే పట్టకొచ్చి ఇస్తామని పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రభు తన గాడిదల కోసం కొన్ని రోజులుగా వెతుకుతుండగా.. ఐదు రోజుల క్రితం మోమిన్‌పేటలో ఓ వ్యక్తి వద్ద తన గాడిద ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాడిదలు ఉన్న చోటకు పోలీసులు వెళ్లేసరికి.. దాన్ని అప్పటికే డీసీఎంలో లింగంపల్లికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారుడు, ఇద్దరు పోలీసులు శనివారం లింగంపల్లికి వెళ్లి గాడిదను గుర్తించి ఆటోలో వికారాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు.
దీంతో ఆ గాడిద తనదేనంటూ యజమానురాలు పద్మ తన తండ్రి సత్తయ్యతో కలిసి వికారాబాద్ పీఎస్‌కు చేరుకుంది. పోలీసులు తీసుకొచ్చిన గాడిద తనదేనని.. తనకు ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) ఉన్నారని, ఇటీవల తన భర్త గుండెపోటుతో మృతిచెందాడరని ఆమె పోలీసులకు తెలిపారు. బతకడానికి ఏ ఆధారం లేకపోవడంతో తన తల్లిదండ్రులు ఇటీవలే రెండు గాడిదలను కొనిచ్చారని చెప్పింది. ఈ గాడిదలే తనకు, తన పిల్లలకు బతుకుదెరువని ఆమె విలపించింది. ఇరువురూ గాడిద నాదంటే.. నాదే అనడంతో పోలీసులు ఎటూ తేల్చలేకపోయారు. ఫిర్యాదుదారు ప్రభు మాత్రం.. పద్మ తండ్రి సత్తయ్య 2014లో తన గాడిదలను దొగలించాడని తెలిపారు. ఈ విషయమై కులస్తుల వద్ద పంచాయతీ పెట్టి.. వారికి జరిమానా వేయించినట్లు చెప్పాడు. దీంతో ఏం చేయాలో తోచని పోలీసులు మంగళవారం మరోసారి గాడిదను తీసుకొని స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించారు. గాడిద ప్రస్తుతం ప్రభు వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment