అక్కడ అడుగు పెడితే కాల స్పృహ కనుమరుగవుతుంది. అసలు కాలమే వెనక్కు వెళ్తుంది. కార్లన్నవి మచ్చుకు కూడా కానరాని కాలం కళ్ల ముందు కనిపిస్తుంది. గుర్రపు బగ్గీలే అక్కడ ప్రధాన ప్రయాణ సాధనాలు. కొండొకచో గాడిదలు, కంచర గాడిదలు బరువులు మోస్తూ కనిపిస్తుంటాయి. కనుచూపు మేరా ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం, దానికి దీటుగా పోటీ పడుతూ పరిశుభ్రత కనువిందు చేస్తాయి.
ఎక్కడిదా ప్రాంతం? ఏమా కథ...?!
గ్రీస్ దేశంలో అనగనగా అదో ద్వీపం. పేరు హైడ్రా. అక్కడి ఎజియన్ సముద్రంలోని ద్వీపాల్లో ఒకటి. వాటి మాదిరిగానే స్వచ్ఛమైన జలాలకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. కళ్లు చెదిరే అందాలకు, ఆహ్లాదకర వాతావరణానికి, పచ్చదనానికి కాణాచి. కాకపోతే వాటిల్లో దేనికీ లేని ప్రత్యేకత హైడ్రా దీవి సొంతం. ఆ కారణంగానే అది కొన్నేళ్లుగా అంతర్జాతీయ పర్యాటకుల నోళ్లలో తెగ నానుతోంది. అదేమిటంటే... అక్కడ కార్లు తదితర మోటారు వాహనాలు పూర్తిగా నిషేధం. గుర్రాలు, కంచర గాడిదలు మాత్రమే ప్రయాణ, రవాణా సాధనాలు. ఆ మేరకు కఠిన నిబంధనలు ఏర్పాటు చేసుకోవడమే గాక వాటిని తూచా తప్పకుండా పాటిస్తోంది కూడా. అంబులెన్సులు, అగి్నమాపక వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు.
హైడ్రా దీవిలో అడుగు పెట్టగానే మనల్ని పలకరించేది గుర్రాలు, కంచర గాడిదలే. స్థానికుల్లో ఎవరిని చూసినా వాటి మీదే చకచకా సాగిపోతూ కనిపిస్తారు. దక్షిణాన అందాలకు ఆలవాలమైన కమీనియ అనే కుగ్రామం మొదలు పశి్చమాన అత్యంత పారదర్శకమూ, పరిశుభ్రమైన సముద్ర జలాలలో అలరారే మండ్రాకి దాకా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి.
ఆ కాలపు దీవి
హైడ్రా మనల్ని పాత కాలానికి తీసుకెళ్లి కట్టి పడేస్తుందని అంటారు హారియట్ జర్మన్. స్థానికంగా హార్స్ ట్రెక్కింగ్ కంపెనీ నడుపుతున్న ఆమె 24 ఏళ్ల క్రితం అనుకోకుండా అమ్మతో పాటు అక్కడికి విహార యాత్రకు వచ్చారు. ఆ ప్రాంతం ఎంతగా నచి్చందంటే, అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయారు! తర్వాత పదేళ్ల క్రితం గ్రీస్‌ను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం కారణంగా తనకు ప్రాణప్రదమైన గుర్రం క్లోను అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో హార్స్ ట్రెక్కింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుందామే. ఇప్పుడు గుర్రాల సంఖ్య 12కు పెరిగింది. ‘కార్లు లేవు గనుక ఇక్కడ అందరి జీవితాలూ హడావుడికి దూరంగా, నింపాదిగా గడుస్తుంటాయి‘ అంటూ నవ్వుతారామె.
చరిత్రే కారణం
హైడ్రా దీవి 18, 19వ శతాబ్దం దాకా ప్రముఖ సముద్ర వర్తక కేంద్రంగా ఓ వెలుగు వెలిగింది. 20వ శతాబ్దంలో మోటార్ వాహనాల శకం రాకతో ఆ వైభవం వెనకపట్టు పట్టింది. ఇరుకు సందులు, రాళ్ల ప్రాంతం కావడంతో హైడ్రాలో మోటార్ వాహనాల రాకపోకలు ఎప్పుడూ కష్టతరంగానే ఉంటూ వచ్చాయి. దాంతో, వాటిని పూర్తిగా నిషేధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన స్థానిక యంత్రాంగానికి పుట్టుకొచ్చింది. అదే ఇప్పుడు ఆ దీవిని ప్రత్యేకంగా నిలిపింది.
వీఐపీలకు విశ్రామ స్థలం
హైడ్రా దీవి అందచందాలు, కార్ల జాడే లేని ప్రత్యేకత ఎందరెందరో వీఐపీలను ఆకర్షిస్తోంది. అప్పుడెప్పుడో 1950ల్లోనే ప్రముఖ ఇటాలియన్ నటి సోఫియా లారెన్ హైడ్రాలో షూటింగ్ చేసే క్రమంలో ఆ దీవితో ప్రేమలో పడ్డారు. అక్కడే స్థిరపడ్డారు. బ్రైస్ మార్డన్, అలెక్సిస్ వెరోకస్, పనగియోసిస్ టెట్సిస్, జాన్ క్రాక్స్టన్ వంటి ప్రఖ్యాత చిత్రకారుల నుంచి హెన్రీ మిల్లర్ వంటి ప్రముఖ రచయితల దాకా ఎందరెందరో హైడ్రాలో ఆరామ్‌గా జీవిస్తున్నారు. కెనేడియన్ గాయకుడు, పాటల రచయిత లియోనార్డ్ కోహెన్ రాసిన అజరామర గీతం ’బర్డ్ ఆన్ ద వైర్’కు హైడ్రా దీవే స్ఫూర్తి! ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా భూలోక స్వర్గమే అంటారాయన.
నేషనల్ డెస్‌్క, సాక్షి
The island of Hydra: ఇచట కార్లకు ప్రవేశం లేదు!
Published Fri, Sep 1 2023 5:06 AM | Last Updated on Fri, Sep 1 2023 7:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment