aegean sea
-
The island of Hydra: ఇచట కార్లకు ప్రవేశం లేదు!
అక్కడ అడుగు పెడితే కాల స్పృహ కనుమరుగవుతుంది. అసలు కాలమే వెనక్కు వెళ్తుంది. కార్లన్నవి మచ్చుకు కూడా కానరాని కాలం కళ్ల ముందు కనిపిస్తుంది. గుర్రపు బగ్గీలే అక్కడ ప్రధాన ప్రయాణ సాధనాలు. కొండొకచో గాడిదలు, కంచర గాడిదలు బరువులు మోస్తూ కనిపిస్తుంటాయి. కనుచూపు మేరా ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం, దానికి దీటుగా పోటీ పడుతూ పరిశుభ్రత కనువిందు చేస్తాయి. ఎక్కడిదా ప్రాంతం? ఏమా కథ...?! గ్రీస్ దేశంలో అనగనగా అదో ద్వీపం. పేరు హైడ్రా. అక్కడి ఎజియన్ సముద్రంలోని ద్వీపాల్లో ఒకటి. వాటి మాదిరిగానే స్వచ్ఛమైన జలాలకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. కళ్లు చెదిరే అందాలకు, ఆహ్లాదకర వాతావరణానికి, పచ్చదనానికి కాణాచి. కాకపోతే వాటిల్లో దేనికీ లేని ప్రత్యేకత హైడ్రా దీవి సొంతం. ఆ కారణంగానే అది కొన్నేళ్లుగా అంతర్జాతీయ పర్యాటకుల నోళ్లలో తెగ నానుతోంది. అదేమిటంటే... అక్కడ కార్లు తదితర మోటారు వాహనాలు పూర్తిగా నిషేధం. గుర్రాలు, కంచర గాడిదలు మాత్రమే ప్రయాణ, రవాణా సాధనాలు. ఆ మేరకు కఠిన నిబంధనలు ఏర్పాటు చేసుకోవడమే గాక వాటిని తూచా తప్పకుండా పాటిస్తోంది కూడా. అంబులెన్సులు, అగి్నమాపక వాహనాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు. హైడ్రా దీవిలో అడుగు పెట్టగానే మనల్ని పలకరించేది గుర్రాలు, కంచర గాడిదలే. స్థానికుల్లో ఎవరిని చూసినా వాటి మీదే చకచకా సాగిపోతూ కనిపిస్తారు. దక్షిణాన అందాలకు ఆలవాలమైన కమీనియ అనే కుగ్రామం మొదలు పశి్చమాన అత్యంత పారదర్శకమూ, పరిశుభ్రమైన సముద్ర జలాలలో అలరారే మండ్రాకి దాకా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ కాలపు దీవి హైడ్రా మనల్ని పాత కాలానికి తీసుకెళ్లి కట్టి పడేస్తుందని అంటారు హారియట్ జర్మన్. స్థానికంగా హార్స్ ట్రెక్కింగ్ కంపెనీ నడుపుతున్న ఆమె 24 ఏళ్ల క్రితం అనుకోకుండా అమ్మతో పాటు అక్కడికి విహార యాత్రకు వచ్చారు. ఆ ప్రాంతం ఎంతగా నచి్చందంటే, అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయారు! తర్వాత పదేళ్ల క్రితం గ్రీస్‌ను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం కారణంగా తనకు ప్రాణప్రదమైన గుర్రం క్లోను అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో హార్స్ ట్రెక్కింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుందామే. ఇప్పుడు గుర్రాల సంఖ్య 12కు పెరిగింది. ‘కార్లు లేవు గనుక ఇక్కడ అందరి జీవితాలూ హడావుడికి దూరంగా, నింపాదిగా గడుస్తుంటాయి‘ అంటూ నవ్వుతారామె. చరిత్రే కారణం హైడ్రా దీవి 18, 19వ శతాబ్దం దాకా ప్రముఖ సముద్ర వర్తక కేంద్రంగా ఓ వెలుగు వెలిగింది. 20వ శతాబ్దంలో మోటార్ వాహనాల శకం రాకతో ఆ వైభవం వెనకపట్టు పట్టింది. ఇరుకు సందులు, రాళ్ల ప్రాంతం కావడంతో హైడ్రాలో మోటార్ వాహనాల రాకపోకలు ఎప్పుడూ కష్టతరంగానే ఉంటూ వచ్చాయి. దాంతో, వాటిని పూర్తిగా నిషేధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన స్థానిక యంత్రాంగానికి పుట్టుకొచ్చింది. అదే ఇప్పుడు ఆ దీవిని ప్రత్యేకంగా నిలిపింది. వీఐపీలకు విశ్రామ స్థలం హైడ్రా దీవి అందచందాలు, కార్ల జాడే లేని ప్రత్యేకత ఎందరెందరో వీఐపీలను ఆకర్షిస్తోంది. అప్పుడెప్పుడో 1950ల్లోనే ప్రముఖ ఇటాలియన్ నటి సోఫియా లారెన్ హైడ్రాలో షూటింగ్ చేసే క్రమంలో ఆ దీవితో ప్రేమలో పడ్డారు. అక్కడే స్థిరపడ్డారు. బ్రైస్ మార్డన్, అలెక్సిస్ వెరోకస్, పనగియోసిస్ టెట్సిస్, జాన్ క్రాక్స్టన్ వంటి ప్రఖ్యాత చిత్రకారుల నుంచి హెన్రీ మిల్లర్ వంటి ప్రముఖ రచయితల దాకా ఎందరెందరో హైడ్రాలో ఆరామ్‌గా జీవిస్తున్నారు. కెనేడియన్ గాయకుడు, పాటల రచయిత లియోనార్డ్ కోహెన్ రాసిన అజరామర గీతం ’బర్డ్ ఆన్ ద వైర్’కు హైడ్రా దీవే స్ఫూర్తి! ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా భూలోక స్వర్గమే అంటారాయన. నేషనల్ డెస్్క, సాక్షి -
భారీ భూకంపం
-
టర్కీ, గ్రీస్‌ల్లో భారీ భూకంపం
ఇస్తాంబుల్: భారీ భూకంపం టర్కీ, గ్రీస్ దేశాల్లో విధ్వంసం సృష్టించింది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. ఈ భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. టర్కీలో 12 మంది చనిపోయారని, అందులో ఒకరు నీళ్లలో మునిగి చనిపోయారని, 419 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సామోస్ ద్వీపంలో గోడ కూలి ఒక యువతి, ఒక యువకుడు చనిపోయారని అధికారులు వెల్లడించారు. భూకంపం ప్రభావం పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్ పట్టణంపై భారీగా పడింది. అక్కడ పలు భవనాలు నేల కూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించాయి. మృతుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. భవన శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కుప్పకూలిన భవనాల శిధిలాల నుంచి 70 మందిని రక్షించామన్నారు. భూమి 25 నుంచి 30 సెకన్ల పాటు కంపించిందని స్థానికుడొకరు తెలిపారు. 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా టర్కీలోని సెఫారిసర్‌లో స్వల్ప స్థాయిలో సునామీ వచ్చింది. గ్రీస్ ద్వీపం సామోస్‌లో సునామీ హెచ్చరిక జారీ చేశారు. సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి. భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. భారీ విధ్వంసం టర్కీలోని మూడో అతిపెద్ద నగరం ఇజ్మిర్. ఇక్కడే భూకంపం ఎక్కువ విధ్వంసం సృష్టించింది. ఇక్కడ 10కి పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయని, చాలా భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని ఇజ్మిర్ గవర్నర్ యువుజ్ సెలిమ్ కోస్గర్ తెలిపారు. సుమారు 12 భవనాల వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 38 అంబులెన్స్‌లు, రెండు హెలీకాప్టర్లు, 35 మెడికల్ టీమ్స్ సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. సెఫారిసర్‌లో వరదలు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామోస్ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూరోపియన్–మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. భూకంప తీవ్రతను భూకంప లేఖినిపై ప్రాథమికంగా 6.9 గా నిర్ధారించింది. అయితే, అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రతను 7.0 గా పేర్కొంది. 10 కిమీల లోతున మాత్రమే భూకంపం సంభవించినందున ప్రధాన భూకంపం అనంతర ప్రకంపనలు మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని గ్రీక్‌కు చెందిన భూకంప నిపుణుడు ఎకిస్ సెలెంటిస్ హెచ్చరించారు. వాటిలో కొన్ని శక్తిమంతమైన భూకంపాలు కూడా ఉండవచ్చని అంచనా వేశారు. భూకంప ప్రకంపనలు గ్రీస్ రాజధాని ఏథెన్స్‌తో పాటు బల్గేరియా వరకు విస్తరించాయి. టర్కీలో ఇస్తాంబుల్, మర్మరా, ఏజియన్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. -
ఏజియన్ సముద్రంలో మరో విషాదం
ఇస్తాంబుల్: వలసదారుల విషాదం కొనసాగుతోంది. కిక్కిరిసిన పడవల్లో పొట్టచేతబట్టుకొని దేశాలు దాటడానికి ప్రయత్నిస్తున్న ఆశాజీవులు సముద్ర ప్రయాణం మధ్యలోనే సమిధలౌతున్నారు. సిరియా, అఫ్ఘాగనిస్థాన్, మయన్మార్ల నుంచి 53మంది వలసదారులతో గ్రీస్ ద్వీపాలకు వెళ్తున్న పడవ శనివారం ఉదయం ఏజియన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 43 మందిని టర్కీ తీరప్రాంత రక్షణ సిబ్బంది రక్షించగా.. ఐదుగురు చిన్నారులతో సహా 10 మంది మృతి చెందారు. ఏజియన్ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదాల్లో ఒక్క 2015లోనే 3000 మంది వలసదారులు మృతి చెందగా, మరో 80 వేల మందిని టర్కీ తీరప్రాంత రక్షణ సిబ్బంది రక్షించారంటే ప్రమాదాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. గురువారం గ్రీస్ ద్వీపం సామోస్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 10 మంది చిన్నారులతో సహా 24 మంది వలసదారులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
గ్రీసులో మరో వలస విషాదం
ఏథెన్స్: ఏజియన్ సముద్రంలో రెండు పడవలు మునిగిపోయిన ఘటనలో 42 మంది వలసదారులు మృతి చెందారు. టర్కీ నుండి గ్రీసుకు సామర్థ్యానికి మించి వలసదారులతో పడవలు వెళ్తుండగా.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. గ్రీసు ద్వీపం కలోలిమ్నస్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 34 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఫార్మకోనిసి ద్వీపం సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. గల్లంతైన వారికోసం గ్రీసు తీరప్రాంత భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇరాక్, సిరియా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది కాలంగా పది లక్షల మందికి పైగా ప్రజలు యూరప్‌కు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఏజియన్ సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 700 మంది వలసదారులు మృతి చెందారు. గతంలో టర్కీకి చెందిన అలాన్ కుర్థి అనే బాలుడు విగత జీవిగా గ్రీసు తీరానికి కొట్టుకురావడం ప్రపంచవ్యాప్తంగా కలచివేసిన విషయం తెలిసిందే.