ఏజియన్ సముద్రంలో మరో విషాదం
ఇస్తాంబుల్: వలసదారుల విషాదం కొనసాగుతోంది. కిక్కిరిసిన పడవల్లో పొట్టచేతబట్టుకొని దేశాలు దాటడానికి ప్రయత్నిస్తున్న ఆశాజీవులు సముద్ర ప్రయాణం మధ్యలోనే సమిధలౌతున్నారు. సిరియా, అఫ్ఘాగనిస్థాన్, మయన్మార్ల నుంచి 53మంది వలసదారులతో గ్రీస్ ద్వీపాలకు వెళ్తున్న పడవ శనివారం ఉదయం ఏజియన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 43 మందిని టర్కీ తీరప్రాంత రక్షణ సిబ్బంది రక్షించగా.. ఐదుగురు చిన్నారులతో సహా 10 మంది మృతి చెందారు.
ఏజియన్ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదాల్లో ఒక్క 2015లోనే 3000 మంది వలసదారులు మృతి చెందగా, మరో 80 వేల మందిని టర్కీ తీరప్రాంత రక్షణ సిబ్బంది రక్షించారంటే ప్రమాదాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. గురువారం గ్రీస్ ద్వీపం సామోస్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 10 మంది చిన్నారులతో సహా 24 మంది వలసదారులు మృతి చెందిన విషయం తెలిసిందే.