గ్రీసులో మరో వలస విషాదం
ఏథెన్స్: ఏజియన్ సముద్రంలో రెండు పడవలు మునిగిపోయిన ఘటనలో 42 మంది వలసదారులు మృతి చెందారు. టర్కీ నుండి గ్రీసుకు సామర్థ్యానికి మించి వలసదారులతో పడవలు వెళ్తుండగా.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఈ ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. గ్రీసు ద్వీపం కలోలిమ్నస్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 34 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది చిన్నారులు ఉన్నారు.
ఫార్మకోనిసి ద్వీపం సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. గల్లంతైన వారికోసం గ్రీసు తీరప్రాంత భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇరాక్, సిరియా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది కాలంగా పది లక్షల మందికి పైగా ప్రజలు యూరప్కు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఏజియన్ సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 700 మంది వలసదారులు మృతి చెందారు. గతంలో టర్కీకి చెందిన అలాన్ కుర్థి అనే బాలుడు విగత జీవిగా గ్రీసు తీరానికి కొట్టుకురావడం ప్రపంచవ్యాప్తంగా కలచివేసిన విషయం తెలిసిందే.