
సాక్షి, న్యూఢిల్లీ : పాపం! ఉత్తర ప్రదేశ్ పోలీసులు అన్యాయంగా అభాసుపాలయ్యారు. వారిని వెర్రిబాగుల కింద జమకట్టి సోషల్ మీడియా గత రెండు రోజులుగా ఆడిపోసుకుంటోంది. వారిపై జోకులను కేకుల్లా కట్‌చేస్తోంది. ఇంతకు ఏం జరిగిదంటే...ఉత్తరప్రదేశ్‌లోని ఒరాయ్ జిల్లా జైలుకు చెందిన పోలీసులు ఎనిమిది గాడిదలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నాలుగు రోజుల అనంతరం సోమవారం నాడు వాటిని విడిచిపెట్టారు. జైలు బయట చాలా ఖరీదైన మొక్కలను తినేస్తున్నాయన్న కోపంతో వాటిని జైల్లో పెట్టినట్టు తెల్సింది అలా జైలు నుంచి బయటకకు వస్తున్న గాడిదలను ఏఎన్‌ఐ వార్తా సంస్థ వీడియో తీసి మీడియాకు విడుదల చేసింది.
ఆ వీడియో ఆంగ్ల పత్రికల్లో, టీవీ ఛానళ్లలో విస్తతంగా ప్రచారం అవడంతో సోషల్ మీడియా యూపీ పోలీసులపై తనదైన శైలిలో దండయాత్రకు దిగింది. గాడిదలను అరెస్టు చేసిన యూపీ పోలీసులు వాటిని నాలుగు రోజుల అనంతరం బెయిల్‌పై విడుదల చేశారంటూ ట్వీట్లు పెట్టారు. ఆ గాడిదల అరెస్ట్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదు మొర్రో అంటూ యూపీ పోలీసులు ఎంత మొత్తుకున్నా సోషల్ మీడియా పట్టించుకోవడం లేదు. నిజంగా వారికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో సోషల్ మీడియాతోపాటు మెయిన్ మీడియా కూడా పొరపాటు పడింది. ఉత్తరప్రదేశ్ పోలీసు చట్టం ప్రకారం రాష్ట్ర హోం శాఖ ఆధ్వర్యంలో యూపీ పోలీసులు, జైలు పోలీసులు రెండు వేర్వేరు విభాగాలు. చివరకు ముచ్చటగా మూడోసారి అడిషనల్ ఎస్పీ–ప్రజా సంబంధాల అధికారి రాహుల్ శ్రీవాస్తవ కూడా ‘అయ్యా! ఆ గాడిదల అరెస్ట్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి!’ అని పత్రికా ప్రకటనతో పాటు ట్వీట్లు కూడా పెట్టారు.