ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇరుకు సందు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదుచేసుకుంది. ఈ రెండు భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలం ఉత్త సందు మాత్రమే కాదు, ఇది ఒక వీథి. జర్మనీలోని రియూల్టిన్‌జెన్ పట్టణంలో ఉంది. ఈ వీథి పేరు ‘స్ప్రోయూర్‌హోఫ్ స్ట్రాసే’. సుమారు రెండు శతాబ్దాల నాటి ఈ వీథి ప్రపంచంలోనే అత్యంత ఇరుకైంది.
1726లో నిర్మించిన ఈ వీథి వెడల్పు కేవలం 31 సెం.మీ (1.1 అడుగు) మాత్రమే! జర్మనీ భూభాగ లెక్కల ప్రకారం ఈ వీథికి రెండు వైపులా ఉన్న భవనాలు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. పైగా దీనిని చేతితో నిర్మించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే, ఈ వీథిని 1820లో అధికారికంగా పబ్లిక్ స్ట్రీట్ 77గా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇదొక పర్యాటక స్థలంగా మారింది. చాలామంది దీనిని చూడటానికి, దీని లోపలి నుంచి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. 2017 ఫిబ్రవరిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు దీనిని పరిశీలించి, ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీథిగా ప్రకటించారు.
దురదృష్టవశాత్తు వీథికి ఎడమవైపు ఉన్న భవనం ఈ మధ్యనే శిథిలావస్థకు చేరింది. గోడలను కూల్చి, కొత్త భవంతి నిర్మిస్తే.. ఈ వీథి ప్రాముఖ్యత కోల్పోతుందని అలాగే ఉంచారు. అంతేకాదు, ఇప్పుడు ఆ వీథి నుంచి ప్రయాణించేందుకు ప్రజలకు అనుమతి లేదు. అలా ఆ గోడలు ఉన్నంత వరకు ఇదే అత్యంత ఇరుకైన వీథి. చూడాలి మరి, ఇంకా ఎన్ని రోజులు తన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో నిలుపుకుంటుందో!
Comments
Please login to add a commentAdd a comment