అతివేగం.. ప్రాణాంతకం | Car And Bus Accidents In YSR Kadapa | Sakshi
Sakshi News home page

అతివేగం.. ప్రాణాంతకం

Published Fri, Aug 31 2018 1:23 PM | Last Updated on Fri, Aug 31 2018 1:23 PM

Car And Bus Accidents In YSR Kadapa - Sakshi

బద్వేలు సమీపంలో జరిగిన ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు : రోడ్డు ప్రమాదాలు చాలా వరకు చోదకుల నిర్లక్ష్యంతోనే చోటు చేసుకుంటున్నాయి. దీనికితోడు వారు నిబంధనలను పాటించడం లేదని రవాణా, పోలీసు అధికారులు చెబుతున్నారు.  ప్రతి మూడు ప్రమాదాల్లో ఒకదానికి అతివేగం, మరొక దానికి నిబంధనలు పాటించకపోవడమే కారణాలు. వాహ న వేగాన్ని ఐదు శాతం తగ్గించి నడిపితే ప్రమాదాల్లో 30 శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా యువత ఎక్కువ సంఖ్యలో ప్రమాదాల బారిన పడుతున్నారనేది గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరణించన వారిలోనూ 50 శాతం మంది 15–29 ఏళ్ల మధ్య ఉన్న వారే కావడం విషాదకరం.

అలసటతోనే అధికంగా ప్రమాదాలు
మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవర్లకు పని వేళలు ఉన్నాయి. కానీ చాలా మంది ఈ వేళల కంటే అధిక సమయం డ్రైవింగ్‌ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని అరికట్టేందు కు పలు నిబంధనలను రవాణా శాఖ తీసుకువచ్చిం ది. డ్రైవర్లు ఎనిమిది గంటలు వాహనం నడిపిన తరువాత కచ్చితంగా మూడు గంటలు విశ్రాంతి తీ సుకోవాలి. కానీ చాలా మంది రాత్రింబవళ్లు డ్రైవింగ్‌ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. తెల్లవారుజామున కునుకు తీసి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రాణరక్షణకు సీట్‌బెల్ట్, హెల్మెట్‌
చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి సీట్‌బెల్ట్‌ పెట్టుకోకపోవడం, హెల్మెట్‌ ధరించకపోవడమే కారణం. ప్రమాదాలు జరిగినప్పుడు సీట్‌బెల్ట్‌ పెట్టుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రమాద సమయంలో కారులో నుంచి రోడ్డు మీదకు విసిరేయకుండా సీట్‌బెల్ట్‌ ఉపయోగపడుతుంది. దీంతోపాటు సీట్‌బెల్ట్‌ పెట్టుకుంటే ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ అయి గాయాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు తలకు తీవ్ర గాయాలు అవడంతోనే చనిపోతున్నారు. హెల్మెట్‌ ధరిస్తే తలకు గాయాలు తగలవు. తగిలినా అవి స్వల్పంగా ఉంటాయి. తల నుంచి రక్త స్రావం కూడా జరగకుండా హెల్మెట్‌ కాపాడుతుంది.

నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు రక్ష
అధికారులు రూపొందించిన నిబంధనలను పాటించడం ద్వారా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. డ్రైవింగ్‌ చేసే సమయంలో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవడం ద్వారా కూడా ప్రమాదాలను తగ్గించవచ్చు.
కూడళ్ల వద్ద వాహనాల వేగం తగ్గించాలి. ఎడమ వైపు తిరగడానికి వలయంలోని బయట లైన్‌లో వెళ్లాలి. రౌండ్‌ సర్కిల్‌ నుంచి బయటకు రావడానికి ఎడమవైపు సిగ్నల్‌ చూడాలి. జంక్షన్‌ నుంచి వెళ్లే వాహనదారులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
వాహనదారులు ఎడమ వైపు ముందు భాగంలో గాని రివర్స్‌ వ్యూ మిర్రర్‌లో గానీ చూడలేని ప్రదేశాన్ని బ్లైండ్‌ స్పాట్‌ అంటారు. ఇతర వాహనాల బ్లైండ్‌ స్పాట్‌లోకి వాహనాలను తీసుకెళ్లకూడదు. ఇలాంటి ప్రదేశాల వద్ద మలుపు తిప్పాలనుకున్న సమయంలో, దాటాలను కున్న సమయంలో ఒక సారి తలతిప్పి చూసి ముందుకు సాగాలి.
వాహనాన్ని వెనుక నడవడానికి చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్డులోకి రివర్స్‌ చేయకూడదు. సాధ్యమైనంత వరకు డ్రైవర్‌ సీటు వైపు రివర్స్‌ చేయాలి. వెనుక ప్రదేశాన్ని మిర్రర్‌లో గమనించి రివర్స్‌ చేయాలి.

రాత్రివేళలో..
ఎదురుగా వాహనం వచ్చే సమయంలో లైట్లను డిమ్‌ అండ్‌ డిప్‌ వేయాలి. తెల్లవారుజామున ఒం టి గంట నుంచి ఐదు వరకు వాహనం నడపకుంటే మంచిది. ఓవర్‌టేక్‌ సమయంలో హెడ్‌లైట్‌ను డిమ్‌ అండ్‌ డిప్‌ చేసి ముందు వెళ్తున్న వాహనానికి సంకేతం ఇవ్వాలి. హైవేపై పార్కింగ్‌ చేయకూడదు.
చీకటి ప్రదేశాల్లో వాహనం నిలపాల్సి వస్తే వెనుక వైపు వచ్చే వాహనాలను గమనించాలి. ఒకే హెడ్‌ లైట్‌ ఉన్న నాలుగు చక్రాల వాహనాలతో జాగ్రత్తగా ఉండి గమనించుకోవాలి. వెనుక వచ్చే వాహనం ఓవర్‌టేక్‌ చేసేందుకు కుడివైపు ఉన్న ఇండికేటర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. రోడ్డుకు ఎడమవైపున వాహనం నిలిపినప్పుడు పార్కింగ్‌ లైట్లు వేసి ఉంచాలి.
డ్రైవరు ప్రతి నాలుగు గంటలకొకసారి వాహనం ఆపి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ముందు వెళుతున్న వాహనానికి తగినంత దూరంలో నడపాలి. ముందుకున్న వాహనం ఆగిన సమయంలో ప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్త ఉపయోగý పడుతుంది.  
వర్షం మొదలైన మొదటి గంట సమయంలో రోడ్డు మీద ఉన్న ఆయిల్, మట్టి నీటితో కలిసి జారుడుగా ఉంటుంది. ఈ సమయంలో వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. కల్వర్టు, వంతెనల వద్ద వర్షపు నీరు ప్రవహిస్తున్నపుడు వాహనాన్ని దూరంగా నిలిపాలి.

మృతి చెందిన ప్రముఖులు : రెండు రోజుల కిందట మాజీ ఎంపీ, సినీ నటులు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నల్గొండకు చెందిన మాజీ మంత్రి కోమటి రెడ్డి కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జిల్లాకు చెంది న మాజీ మంత్రి ఆహ్మదుల్లా కుమారుడు కడప సబ్‌జైలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించా డు. మాజీ ఎంపీ అజారుద్దీన్‌ కుమారుడు ద్విచక్ర వా హన ప్రమాదంలో మరణించాడు. సినీ నటులు కోట శ్రీనివాసరావు. బాబుమోహన్‌ కుమారులు కూడా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరందరూ కూ డా అతివేగం కారణంగా, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవ డం, హెల్మెట్‌ ధరించకపోవడంతోనే మరణించారు.

ప్రాణాలను ఫణంగా పెట్టే రిస్క్‌ వద్దు
చాలా మంది యువత రిస్క్‌ను ఎంజాయ్‌ చేయాలని భావిస్తున్నారు. కానీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి రిస్క్‌ చేయకూడదు. సినిమాలు, రేస్‌ల్లో విన్యాసాలను అనుకరిస్తున్నారు. దీంతో యువత ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు. నిర్లక్ష్యం, అతి ఆత్మవిశ్వాసం కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. కుటుంబానికి తామే దిక్కు.. నేను లేని లోటు వారికి తీర్చలేనిది అనే విషయాన్ని వారికి తెలియజేప్పాలి. ‘సురక్షిత డ్రైవింగ్‌కు ప్రాధాన్యత ఇస్తా’ అనే విషయాన్ని డ్రైవింగ్‌ సమయంలో గుర్తు చేసుకోవాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తన ఉండాలనే విషయాన్ని వారి మనసులోకి చొప్పించాలి. పాత ప్రమాద సంఘటనలు, వాటి వల్ల కలిగిన నష్టాలు, బాధితులతో కళాశాలలలో తరగతులు నిర్వహించాలి. పరిణితితో కూడిన డ్రైవింగ్‌ మేలనే విషయాన్ని గుర్తెరగాలి.    – ఓవీరెడ్డి, మానసిక వ్యా«ధి నిపుణులు

నిబంధనలు పాటించాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యం లేకుండా డ్రైవింగ్‌ చేయాలి. ఎన్ని చర్యలు తీసుకున్నా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. నిబంధనలు పాటిస్తే తాము క్షేమంగా ఉండటమే కాక ఇతరులకూ ఇబ్బంది కలగదు.– శ్రీనివాసులు,  డీఎస్పీ, మైదుకూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement