అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొన్న కారు
చాపాడు : చాపాడు మండలం పల్లవోలు గ్రామంలో పాము ఓ ఇంట్లో మాటు వేసి కాటు వేయడంతో సోమవారం మృత్యు ఒడికి చేరిన మిండ్యాల ధనలక్ష్మి పుట్టింట మంగళవారం మరో విషాదం చోటు చేసుకుంది. ధనలక్ష్మి అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటల్లోనే చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ధనలక్ష్మి పెదనాన్న, మేనమామలు మృతి చెందగా.. తండ్రి తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని పల్లవోలుకు చెందిన వర్క్ ఇన్‌స్పెక్టర్ మిండ్యాల వెంకటరమణ భార్య ధనలక్ష్మీ(33) సోమవారం ఉదయం పాముకాటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ధనలక్ష్మీ పుట్టింటి వారు హైదరాబాదు నుంచి కారులో పల్లవోలుకు చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు ముగిసిన అనంతరం కుటుంబీకులు కారులో తిరుగుప్రయాణమయ్యారు. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకోవాల్సిన ధనలక్ష్మీ పుట్టింటి వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వైఎస్సార్ జిల్లా దాటుకుని కర్నూలు జిల్లా చాగలమర్రి పరిధిలోని పెద్దబోధనం వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ధనలక్ష్మీ పెదనాన్న రంగయ్య(56), మేనమామ తిరుపతయ్య(58) మృతి చెందగా.. తండ్రి వెంకటయ్య(54) తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
మనుమడు.. మనుమరాలిని తామే చూసుకుంటామని చెప్పి.. కానరానిలోకాలకు..
పాము కాటుతో మృతి చెందిన ధనలక్ష్మి అంత్యక్రియలకు హాజరైన ఆమె తండ్రి, పెదనాన్న, మేనమామలు తలరాతను తప్పించుకోలేమని.. ధనలక్ష్మి ఎనిమిదేళ్ల కూతురు, మూడేళ్ల కొడుకును తామే చూసుకుంటామని చెప్పారు. అంతేగాకుండా పిల్లలిద్దరి పేర్లమీద చెరో రూ.5లక్షలు చొప్పన డిపాజిట్ చేసి.. తామే పోషించుకుంటామని ధనలక్ష్మీ తండ్రి వెంకటయ్య, పెద్దనాన్న రంగయ్య, మేనమామ తిరుపతయ్యలు ధనలక్ష్మీ భర్త, కుటుంబీకులతో చెప్పారు. అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ధనలక్ష్మి తండ్రి మినహా ఇరువురూ మృతి చెందారు. కాలం ధనలక్ష్మి కుటుంబంపై పగ బట్టిందో లేక దేవుడి తలరాతనో అనుకుంటూ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment