బెంగళూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లతో సహా ఆరుగురు దుర్మరణం పాలవడంతో రహదారి భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. రోడ్ టెర్రర్‌పై భయాందోళన వ్యక్తం చేస్తూ నెటిజనులు ఆన్‌లైన్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. యాక్సిడెంట్లకు గల కారణాలను ఏకరువు పెడుతున్నారు. బెంగళూరు– తుమకూరు ఎన్‌హెచ్ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు నుంచి మహారాష్ట్రకు వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో అంతమవడం తీవ్రంగా కలిచివేసింది. మృతులను బెంగళూరులోని ఐఏఎస్‌టీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ యజమాని చంద్రం యోగప్ప (48), ఆయన భార్య గౌరాబాయి(42), వారి పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు.
అసలేం జరిగింది?
బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో నివాసం ఉంటున్న చంద్రం యోగప్ప తన సొంతూరిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వోల్వో కారులో మహారాష్ట్రలోని విజయపురకు బయలుదేరారు. హైవేపై వెళుతుండగా నెలమంగళ వద్ద భారీ కంటైనర్ లారీ హఠాత్తుగా వీరి కారుపై పడిపోయింది. ప్రమాదం ధాటికి కారులోని వారు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే స్పందించి క్రేన్ సహాయంతో కంటైనర్‌ను తొలగించినా ఫలితం లేకపోయింది. కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.
ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ మీడియాతో చెప్పాడు. తన ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టకుండా తప్పించుకునే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో కంటైనర్ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కారుపై పడిందని వివరించాడు. అయితే ఈ ప్రమాదంలో ఆరిఫ్‌కు కాలిరిగింది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదం దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, కంటైనర్ లారీలో 26 టన్నుల అల్యూమినియం స్తంభాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
సోషల్ మీడియాలో చర్చ
బెంగళూరు రోడ్డు ప్రమాదంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. మనం ప్రయాణించే వాహనం ఎంత సురక్షితమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించలేవని చాలా మంది అభిపప్రాయపడ్డారు. సురక్షితమైన రోడ్లు, సుశిక్షితుడైన డ్రైవర్, రక్షణ ప్రమాణాలు కలిగిన వాహనం.. ఈ మూడింటితో ప్రమాదాలు నివారించవచ్చని ‘డ్రైవ్ స్మార్ట్’ పేర్కొంది. దీనిపై పలువురు నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెత్త రోడ్లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని పలువురు పేర్కొన్నారు. కంటైనర్లు, లారీల్లో ఓవర్‌లోడ్ తీసుకెళ్లకుండా ప్రభుత్వం నియంత్రించాలని సూచించారు.
చదవండి: తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ఊహించని విధంగా మరణం..
‘ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా వోల్వో XC90 ప్రసిద్ధి చెందింది. 2002లో మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి యూకేలో ఒక్క ప్రాణాంతక ప్రమాదానికి గురికాలేదు. అలాంటి సురక్షితమైన కారులో ప్రయాణిస్తూ ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. కంటైనర్ ట్రక్ అదుపు తప్పి, డివైడర్‌ను దాటి కారుపై పడి యజమానితో పాటు అతడి కుటుంబ సభ్యులను బలితీసుకోవడాన్ని ఎవరూ ఊహించరు. ఎంత మంచి ప్రమాణాలు కలిగిన కారు అయిన ఇంత భారీ బరువు మీద పడితే కచ్చితంగా నలిగిపోతుంది. సురక్షితంగా ప్రయాణించేందుకు మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఎవరూ ఊహించని విధంగా మరణం మన దరికి చేరడం విషాదమ’ని స్కిన్ డాక్టర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
చదవండి: చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
ప్రతిగంటకు 19 మంది బలి
‘మీరు సురక్షితమైన కార్లను తయారు చేయవచ్చు, కానీ భారతదేశం అత్యంత అసురక్షిత రహదారులను నిర్మిస్తుంది. జాతీయ రహదారులు గందరగోళంగా ఉంటాయి. కొన్ని వందల రూపాయలు ఖర్చు చేస్తే చాలు డ్రైవింగ్ లైసెన్స్‌లు వచ్చేస్తాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, చెత్త రోడ్ల కారణంగా మనదేశంలో ప్రతిగంటకు 19 మంది బలైపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ రహదారులు దేశ భవిష్యత్తును చంపేస్తున్నాయ’ని మరో నెటిజన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment