వంకలో పడి నుజ్జునుజ్జయిన కారు గాయపడిన మహిళ రోడ్డుపై వాహనం కోసం వేచి చూస్తున్న దృశ్యం
రహదారులు రక్తమోడాయి. జిల్లాలోని ఖాజీపేట, రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాల్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా మరో పది మంది గాయపడ్డారు. కడప– తిరుపతి జాతీయ రహదారిపై రైల్వేకోడూరు సమీపంలో నిత్యం రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నా బైపాస్ రోడ్డు నిర్మించాలనే ఆలోచన అధికారులకు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరు అప్రమత్తంగా ఉన్నా ఎదుటివారు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వైఎస్‌ఆర్ జిల్లా, ఖాజీపేట : తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకుని మొక్కుబడి తీర్చుకుందామని భావించిన మహరాష్ట్రకు చెందిన భక్తుల వాహనం టైర్ పగిలి పోవడంతో అదుపు తప్పి కాలువలో పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మహరాష్ట్ర రాష్ట్రం నాందేడ్‌జిల్లా, ముక్కేడ్ తాలూకా, వసూర్ గ్రామానికి చెందిన సుమారు 21మంది అందులో 13 మంది పెద్దలు 8 మంది పిల్లలు కలసి ఒక తుఫాన్ వాహనం అద్దెకు తీసుకుని 5వతేది సాయంత్రం 5గంటలకు తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు బయలు దేరారు. 6వ తేది ఉదయం 8.30 గంటలకు ఖాజీపేట మండలం భూమాయ పల్లె గ్రామం సమీపంలోని జాతీయ రహదారి పైకి రాగానే వాహనం టైర్ పగిలి పోయింది. దీంతో వాహనం అదుపు తప్పింది. చివరకు కల్వర్టును ఢీ కొని భూమాయపల్లె వంక కాలువలో సుమారు 20 అడుగుల కింద పడింది. వాహనం ఒక వైపు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్కుపక్కల పొలంలోని వారు అంతా అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ లోగా అక్కడి వారు వాహనంలోని వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. లక్ష్మణ్ గణపతి చవాన్, గణేష్, డ్రైవర్ సుజన్‌లాల్ అలియాస్ ధన్‌రాజ్ (30) అలాగే శ్రీపతి తేజారావులకు తీవ్ర గాయాలయ్యాయి. అర్చన, రంజిత, గంగారామ్, సీతల్, మనోజ్, గజనా, తేజేశ్వర్‌రావు. రాజు,భగవత్, వైష్ణవి, గిరివాయ్, ఆర్తి, గీతాంజలి, రేఖాబాయ్, సంధ్య, సీమాలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందని కడప రిమ్స్‌కు తరలించారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల ప్రాంతంలో లక్ష్మణ్ గణపతి చవాన్ (70) గణేష్ (30) లు మృతి చెందారు, డ్రైవర్ సజన్‌లాల్ అలియాస్ ధన్‌రాజ్ (30) ఐసీయులో అత్యవసర చిక్సిత పొందుతూ రాత్రి 7గంటల సమయంలో మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీపతితేజారావు పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారంతా ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు తెలస్తోంది. వీరికి రిమ్స్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మైదుకూరు రూరల్ సీఐ హనుమంతునాయక్, ఖాజీపేట ఎస్‌ఐ హాజీవలి తమ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment