నిబంధనలు తెలుసుకో.. ప్రాణం విలువ తెలుసుకో.. | Road Safety Weeks in YSR Kadapa | Sakshi
Sakshi News home page

నిబంధనలు తెలుసుకో.. ప్రాణం విలువ తెలుసుకో..

Published Thu, Jan 23 2020 12:44 PM | Last Updated on Thu, Jan 23 2020 12:44 PM

Road Safety Weeks in YSR Kadapa - Sakshi

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, వాహన చోదకుల్లో అవగాహన పెంచేందుకు రవాణాశాఖ ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్ని నిర్వహిస్తోంది. కరపత్రాలు, ప్రచార రథాలు, యాక్సిడెంట్‌ వాహనాల ప్రదర్శన, అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. రవాణాశాఖ నిబంధనలు వాటిని అతిక్రమిస్తే తీసుకునే చర్యలపై ప్రత్యేక కథనం.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌:బడి బస్సులకు..ఏపీ మోటారు వాహన నియమావళి ప్రకారం 1989లో 185(జి) ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోకూడదు. 60 ఏళ్ల వయస్సు దాటిన వారు డ్రైవింగ్‌ చేయరాదు. పర్మిట్‌ నిబంధనల్ని ఉల్లఘించరాదు. నిబంధనలు అతిక్రమిస్తే మోటారు వాహన చట్టం సెక్షన్‌ 85 కింద జరిమానా, పర్మిట్‌పై చర్య తీసుకుంటారు. 

డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌ వద్దు  
సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడిపితే మోటారు వాహన చట్టం 184 ప్రకారం రూ. వెయ్యి జరిమానా లేదా సీఎంవీ రూల్‌ 21 ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏడాది పాటు రద్దు చేస్తారు. సెల్‌లో మాట్లాడుతూ ఏ వాహనాన్ని డ్రైవ్‌ చేసినా ఇవే చర్యలు ఉంటాయి.

హెల్మెట్‌ ప్రాణానికి రక్ష....
హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాల్లో ప్రాణానికి రక్షణగా ఉంటుంది. మోటారు వాహనాల చట్టం సెక్షన్‌ 129 ప్రకారం ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. లేకుంటే మోటారు వాహనాల చట్టం సెక్షన్‌ 194డీ ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. మూడు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు చేస్తారు. 

అతివేగం ప్రమాదకరం: అతివేగం అత్యంత ప్రమాదకరం. శ్రుతిమించిన వేగం వల్ల వాహన చోదకుడితో పాటు ఎందరో అభాగ్యులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 112,183(1) ప్రకారం అతివేగంగా వాహనాలు నడిపిన వారికి రూ.2 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు. 

సిగ్నల్‌ జంప్‌ చేస్తే: రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ సిగ్నల్‌ జంపింగ్‌ చేస్తే నేరం. వాహన చట్టం సెక్షన్‌ 184 ప్రకారం ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు. తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు.

వాహనం నడపాలంటే ఇవి తప్పనిసరి
వాహనం నడిపేందుకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, డ్రైవింగ్‌ లైసెన్స్, పొల్యూషన్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పని సరిగా ఉండాలి. రిజిస్ట్రేషన్‌ లేకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్లు 39,192 ప్రకారం జరిమానా ఉంటుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోతే మోటారు సెక్షన్‌ 3,4, 180,181 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే సెక్షన్‌ 190(2) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్‌ లేకపోతే సెక్షన్‌ 196(ఏ) ప్రకారం మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా ఉంటుంది. 

సీటు బెల్ట్‌ ధరించకుంటే :  సీఎంవీ రూల్‌ 138(3) ప్రకారం విధిగా సీటు బెల్ట్‌ ధరించాల్సిందే. సీటు బెల్ట్‌ ధరించకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్‌ 194(బి) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.  

ప్రమాదాల్నినివారించడమే లక్ష్యం
రోడ్డు ప్రమాదాలను నివారించడమే రోడ్డు భద్రత వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. లారీ, బస్సు, ఆటో డ్రైవర్లతో పాటు విద్యార్థులకు కూడా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. డ్రైవర్ల ఆరోగ్య స్థితులపై వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.–శాంతకుమారి, ఆర్టీఓ, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement