మనదేశంలో రోడ్డు ప్రమాదాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. రహదారి దుర్ఘటనల్లో అసువులు బాసిన వారి సంఖ్య ఏటేటా భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో 15.3 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. భువనేశ్వర్ నగర జనాభాకు దాదాపు సమానం. దీన్నిబట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎంత ఎక్కువ స్థాయిలో ప్రజలను బలిగొంటున్నాయో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపడుతున్నా, అఖరికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు.
50 లక్షల మంది క్షతగాత్రులు
కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. మనదేశంలో 10 వేల కిలోమీటర్లకు సగటు మరణాల సంఖ్య 250. చైనాలో పది వేల కిలోమీటర్లకు 117, అమెరికాలో 57, ఆస్ట్రేలియాలో 11 మరణాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలం (2014-23)లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో 15.3 లక్షల మంది దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు దశాబ్దం (2004-13)లో 12.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2014-23 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు 45.1 లక్షలు కాగా, 2004-13లో ఏకంగా 50.2 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.
రెండింతలైన వాహనాలు
జనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు రహదారులు విస్తరించడం కూడా ఎక్కువ మరణాలకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు సరైన చర్యలు చేపట్టలేదని వారు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో రిజిస్టర్డ్ వాహనాలు 15.9 కోట్లు కాగా, 2024 నాటికి రెండింతలు పైగా పెరిగి 38.3 కోట్లకు చేరుకున్నాయి. 2012 నాటికి 48.6 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్న రహదారులు.. 2019 నాటికి 63.3 లక్షల కిలోమీటర్లకు చేరాయి.
యాక్సిడెంట్ కేసులపై శీతకన్ను
అయితే రోడ్డు ప్రమాదాలకు వాహనాలు, రహదారులు పెరగడం ఒక్కటే కారణం కాదని.. రహదారి భద్రత అనేది చాలా అంశాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విభాగాలు, వాహనదారులు, లాభాపేక్షలేని సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు. యాక్సిడెంట్ కేసులను పోలీసులు సరిగా విచారణ జరపడం లేదని ఆరోపిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, అన్ని దర్యాప్తు సంస్థలు యాక్సిడెంట్ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఢిల్లీ మాజీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
ఘోర ప్రమాదం.. ట్రక్కు, ఇన్నోవా కారు ఢీ; ఆరుగురి మృతి
హత్య కేసులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. రోడ్డు ప్రమాదాలు, మరణాల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని ఐపీఎస్ మాజీ అధికారి, ఎంపీ టి కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. రహదారి భద్రతపై పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టాలని భావిస్తున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. మనదేశంలో సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య.. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కంటే చాలా ఎక్కువని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment