దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మృతులు..
గతేడాది ప్రమాదాల్లో 1.73 లక్షల మంది కన్నుమూత
తెలంగాణలో పెరిగిన ప్రమాద మృతుల సంఖ్య.. హెల్మెట్ ధరించని కారణంగా 70% మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగటున రోజుకు 474 మంది చనిపోయారని, ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం డేటా సేకరణలో ఆందోళనకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. కాగా, గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తెలంగాణలో బాగా పెరిగిపోయింది.
ఇదిలా ఉండగా..2023 ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షలకు పైగా మరణించారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించకపోవడం వల్ల 70% మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రాలు ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వానికి అందించాయి. రోడ్డు ప్రమాదాల కారణాలు, తీవ్రతను అర్థం చేసుకోవడానికి కేంద్రం డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాదే అత్యధిక మరణాలు సంభవించాయి.
గతేడాది క్షతగాత్రులు 4.63 లక్షలు
గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4.63 లక్షల మంది గాయపడ్డారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇది 2022 కంటే 4% ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది చనిపోయారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.71 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రెండు ఏజెన్సీలు 2023కి సంబంధించిన గణాంకాలను విడుదల చేయలేదు.
ప్రమాద మరణాల్లో తొలిస్థానంలో ఉత్తరప్రదేశ్..
యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్, పంజాబ్, అస్సాం, తెలంగాణ సహా 21 రాష్ట్రాల్లో 2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, కేరళ, చండీగఢ్ వంటి రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కాగా గతేడాది రోడ్డు ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 23,652 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 18,347మంది, మహారాష్ట్రలో 15,366 మంది మరణించారు.
క్షతగాత్రుల్లో తమిళనాడు తొలిస్థానం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో 72,292 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 55,769 మంది, కేరళలో 54,320 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. కాగా, గతేడాది మరణించిన వారిలో 44% మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. అలాగే గతేడాది మరణించిన ద్విచక్ర వాహనదారుల్లో 70% మంది హెల్మెట్ ధరించని కారణంగా మృత్యువాతపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment