17నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాలు
హైదరాబాద్: ప్రమాద రహిత తెలంగాణ కోసం నడుం బిగించాలని ప్రజలకు మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 17నుంచి 23వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరగనున్న సందర్భంగా ఈ వారోత్సవాల లోగోను ఆయన ఆవిష‍్కరించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాద ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నామని, తమ ప్రభుత్వం రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానం మంచి ఫలితం ఇచ్చిందన్నారు. ప్రమాదాల నివారణకు మూడు నెలలకోసారి సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న మద్యం దుకాణాలను తొలగిస్తామన్నారు.