సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో యువత నెత్తురోడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం జరుగుతున్నప్రమాదాల్లో యువతే పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు.అదే సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. దీంతో వేలాది కుటుంబాలు సంపాదించే వాళ్లను కోల్పోయి రోడ్డునపడుతున్నాయి. రహదారి భద్రతా నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అపరిమితమైన వేగం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్ల చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 80 శాతం ప్రమాదాలు ఓవర్‌స్పీడ్ వల్లనే జరుగుతున్నట్లు అంచనా.
గత రెండేళ్లలో సుమారు 3536 మంది చనిపోయారు. రహదారి భద్రతా సంస్థ, రవాణా శాఖ అంచనాల మేరకు వారిలో 75 శాతం మంది 18 నుంచి45 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వాహనాలు నడిపే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను కబలిస్తోందని రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ‘యువశక్తిని ’లక్ష్యంగా చేసుకున్నాయి. రహదారి భద్రతకు యువశక్తి ఎంతో అవసరమని నినదిస్తున్నాయి. ఇటు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు, అటు దేశానికి ఎంతోకీలకమైన యువతలో రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
యూత్ సేఫ్టీయే రోడ్‌సేఫ్టీ...
ఒకవైపు ఓవర్‌స్పీడ్. మరోవైపు దానికి ఆజ్యం పోస్తున్న మద్యం. దీంతో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లవలసిన కార్లు 130 నుంచి 150 కిలోమీటర్ల వరకు పరుగులు తీస్తున్నాయి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మొదలుకొని ఔటర్ రింగ్‌రోడ్డు వరకు, నగరంలోని అనేక చోట్ల ఈ వేగమే యువత ప్రాణాలను కబలిస్తోంది. ఖరీదైన వాహనాలపైన అపరిమితమైన వేగంతో దూసుకుపోవడాన్ని ఎంతో క్రేజీగా భావిస్తున్నారు. కార్లు, బైక్‌లపైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి బంగారు భవిష్యత్తు రక్తసిక్తమవుతుంది. గతేడాది తెలంగాణలో 21,588 ప్రమాదాలు జరిగితే వాటిలో 6434 ప్రమాదాలు ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే చోటుచేసుకున్నాయి. 1863 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 8790 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 75 శాతం కుటుంబాన్ని పోషించే వాళ్లే. దీంతో అప్పటి వరకు ఎలాంటి బాధలు, కష్టాలు లేకుండా ప్రశాంతంగా గడిపిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కకావికలమవుతున్నాయి.
సికింద్రాబాద్ ఆర్టీఏ వద్ద వాహనదారులకు నిబంధనలు తెలియజేస్తున్న దైవజ్ఞశర్మ, ఆర్టీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు
ఓవర్‌స్పీడ్ వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి వర్గాలే ఉన్నారు.ద్విచక్రవాహనదారులు, పాదచారులే ఎక్కువగా చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్ధిక తోడ్పాటు ఎంతో ముఖ్యమేనని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్ల ప్రవర్తన వల్లనే జరుగుతున్నాయి. పరిమితికి మించిన వేగం, పరిమితికి మించిన బరువు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్లు మాత్రం పాదచారులు, సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులే.’ అని ప్రముఖ రోడ్డు భద్రతా నిపుణులు నరేష్ రాఘవన్ అన్నారు. ‘ఒకప్పటి ఉమ్మడి కుటుంబ సంస్కృతి ఇప్పుడు లేదు, న్యూక్లియర్ కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కష్టపడుతారు. ఎన్నో కలలు కంటారు. కానీ అలాంటి ఇంట్లో సంపాదించే ముఖ్యమైన వ్యక్తే చనిపోవడం వల్ల మొత్తం కుటుంబమే దిక్కులేనిదవుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
మర్యాదగా బండి నడపండి...
రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోన్న రవాణాశాఖ వాహనదారులు మర్యాదగా బండి నడపాలని సూచిస్తోంది. రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి వాహనదారుడు, తన తోటి వాహనదారుడికి అవకాశం ఇస్తూ ప్రయాణం చేయడం ఒక బాధ్యతగా భావించాలి.ఈ లక్ష్యంతోనే వాహనదారుల్లో స్ఫూర్తిని కలిగిస్తూ హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నగరంలో గత రెండేళ్లుగానమోదైన ప్రమాదాల వివరాలు
సంవత్సరం ప్రమాదాలు క్షతగాత్రులు మృతులు
2018 6434 8790 1863
2019 6523 8679 1673
Comments
Please login to add a commentAdd a comment