వీళ్లింతే.. వాళ్లంతే! స్పీడ్‌కు లాక్‌ లేకపాయె! | Speed Governers Not Working Properly in Hyderabad | Sakshi
Sakshi News home page

వీళ్లింతే.. వాళ్లంతే!

Published Wed, Nov 6 2019 8:30 AM | Last Updated on Sat, Nov 9 2019 1:13 PM

Speed Governers Not Working Properly in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: రహదారి భద్రత కోసం ప్రతిష్ఠాత్మకంగాప్రవేశపెట్టిన ‘స్పీడ్‌ గవర్నర్‌’ల వినియోగం ఆచరణలోఅపహాస్యం పాలవుతోంది. కొంతమంది తమవాహనాలను ఫిట్‌నెస్‌ పరీక్షలకు తెచ్చే ముందే ఆర్టీఏ ఏజెంట్లు, దళారుల సాయంతో తాము కోరుకున్న స్పీడ్‌కుఅనుగుణంగా స్పీడ్‌ గవర్నర్‌లను బిగించుకొని వస్తున్నారు. మరికొందరు ఫిట్‌నెస్‌ పరీక్షల వరకు వేగాన్ని నియంత్రణలో ఉంచుకొని తర్వాత చెలరేగిపోతున్నారు. ఇందుకోసంటెక్నీషియన్ల సహాయంతో తమకు అనుకూలంగా స్పీడ్‌గవర్నర్‌ డివైజ్‌లో మార్పులు చేయించుకుంటున్నారు. మరోవైపు వేగనియంత్రణ డివైజ్‌లను ఏర్పాటు చేసిన తర్వాత వాహనాల వేగం ఎలా ఉందనే అంశాన్ని ఏ మాత్రంపరిశీలించకుండానే ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ఇచ్చేస్తున్నారు. దీంతో నగరంలో స్పీడ్‌ గవర్నర్‌ల ఏర్పాటుఒక ఫార్స్‌గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటి దాకా సుమారు 50 వేలకు పైగా వాహనాలకు స్పీడ్‌ గవర్నర్‌లను ఏర్పాటు చేస్తే..వాటిలో స్కూల్‌ బస్సులు మినహా మిగతా వాహనాల్లోసగానికి పైగా వేగనియంత్రణకు తిలోదకాలిచ్చేశాయి.వీటిలో ఎక్కువ శాతం క్యాబ్‌లు  మ్యాక్సీ క్యాబ్‌లు, తదితర ప్రైవేట్‌ వాహనాలు ఉన్నాయి. 

రహదారి భద్రతకు తూట్లు
అపరిమితమైన వేగం వల్లనే హైవేలపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనాల వేగానికి కళ్లెంవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను డ్రైవర్లు అదుపు చేయలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం తీవ్రంగా ఉంటోంది. ఏటా కొన్ని వందలమంది మృత్యువాత పడుతున్నారు. అంతే సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చనే ఉద్దేశంతో వేగనియంత్రణ పరికరాలను  తప్పనిసరి చేశారు. 2015 తర్వాత వచ్చిన వాహనాలకు వాటి తయారీ సమయంలోనే వేగనియంత్రకాలను అమర్చగా, అంతకంటే ముందు మార్కెట్‌లోకి వచ్చిన వాహనాలకు మాత్రం నిబంధన మేరకు కొత్తగా నియంత్రికలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఈ లెక్కన గ్రేటర్‌లో సుమారు 4 లక్షల వాహనాలకు వేగనియంత్రకాలను అమర్చాలి. కానీ స్పీడ్‌ గవర్నర్‌లను బిగించిన తర్వాత నిబంధనల మేరకు వాహనాల వేగం 80 కిలోమీటర్లకు పరిమితమైందా, లేదా అనే విషయాన్ని  స్వయంగా పరిశీలించకుండానే మోటారు వాహన తనిఖీ అధికారులు అనుమతులు ఇవ్వడం వల్ల వాహనదారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ వాహనాల వేగాన్ని 100 నుంచి 120 కి.మీ వరకు పెంచేస్తున్నారు. ఈ మేరకు స్పీడ్‌ గవర్నర్‌లను బిగించే సమయంలోనే డీలర్లు, వారి టెక్నీషియన్ల సహాయంతో తమకు కావాల్సిన వేగాన్ని సరి చేసుకుంటున్నారు. ఒక్క స్కూల్‌ బస్సుల్లో మినహా మిగతా రవాణా వాహనాల్లో కచ్చితమైన వేగనియంత్రణ అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, టాటాఏస్‌లు వంటి ప్రైవేట్‌ వాహనాల యజమానులు తమకు కావాల్సిన వేగానికి అనుగుణంగా స్పీడ్‌ గవర్నర్‌లను బిగించుకొనేందుకు దళారులు, ఆర్టీఏ ఏజెంట్లసహాయంతో ఈ మొత్తం ప్రక్రియ యధేచ్ఛగాసాగిపోతోంది. 

స్పీడ్‌ ఎలా పెంచేస్తారంటే..
వాహనాల ఇంజిన్‌కు పవర్‌ సరఫరా అయ్యే చోట స్పీడ్‌ గవర్నర్‌ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. ఒక మల్టిమీటర్‌ వంటి లాగర్‌ సహాయంతో వేగాన్ని 80 కి.మీకు నియంత్రిస్తారు. ఇలా లాగర్‌తో వేగాన్ని నియంత్రించే సమయంలోనే ఏజెంట్ల సహాయంతో వేగాన్ని 100 నుంచి 120 కి.మీ పెంచి సెట్‌ చేయించుకుంటున్నారు. ఎక్కువ శాతం వాహనాల్లో ఫిట్‌నెస్‌ పరీక్షలకు ముందే ఈ ఏర్పాటు జరుగుతుండగా, కొంతమంది మాత్రం ఫిట్‌నెస్‌ పరీక్షల వరకు 80 కి.మీ వేగ నియంత్రణకు కట్టుబడి ఉండి తర్వాత స్పీడ్‌ గవర్నర్‌కు, ఇంజిన్‌కు అనుసంధానమై ఉన్న సెన్సార్‌ వైర్‌ను తొలగించి వేగాన్ని పెంచుకుంటున్నారు. ఇదంతా ఆర్టీఏ ఏజెంట్ల సహాయ సహకారాలతోనే జరగడం గమనార్హం. ఏజెంట్ల ద్వారా వచ్చే వాహనాలకు ఎంవీఐలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఫిట్‌నెస్‌సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు.

డివైజ్‌ ధరలోనూ మోసం..
పొరుగు రాష్ట్రాల్లో రూ.3500 స్పీడ్‌ గవర్నర్‌లను  విక్రయిస్తుండగా నగరంలో మాత్రం రూ.7 వేల చొప్పున తీసుకుంటున్నారు. చాలామంది ఆర్టీఏ నిబంధనల మేరకు  రూ.వేలకు వేలు వెచ్చించి స్పీడ్‌ గవర్నర్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, స్పీడ్‌ నియంత్రణకు మాత్రం కట్టుబడి ఉండడం లేదు. ‘హై వేలపై గంటకు 80 కి.మీ మాత్రమే పరిమితమై బండి నడిపితే రోజుకు 4 ట్రిప్పులు తిరగాల్సిన చోట 3 ట్రిప్పులు కూడా పూర్తి చేయడం సాధ్యం కాదని’ వాహనదారులు చెబుతున్నారు. ఆటోమెబైల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ), ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ వంటి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలు 37 స్పీడ్‌ గవర్నర్స్‌ తయారీ కంపెనీలను గుర్తించాయి. కానీ నగరంలో మాత్రం ఇప్పటి దాకా కొన్ని సంస్థలకు చెందిన స్పీడ్‌ గవర్నర్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  

‘‘వాహనాల వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ ప్రభుత్వం స్పీడ్‌ గవర్నర్‌ నిబంధనలను అమల్లోకి తెచ్చిన సంగతి  తెలిసిందే. ఒక్క ఒటో రిక్షాలు మినహా మిగతా అన్ని రవాణా వాహనాలకు వేగ నియంత్రణ తప్పనిసరి. నగరంలో మాత్రమే తిరిగే వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవిధంగా, హేవేపై గంటకు 80 కి.మీతో వెళ్లేలా కేంద్రం స్పీడ్‌ గవర్నర్‌లను తప్పనిసరి చేసింది. 2015కు ముందు తయారుచేసిన (వేగ నియంత్రణ పరికరాలు లేని) అన్ని రవాణా వాహనాలు వీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, రవాణాశాఖ వీటి వినియోగంపై దృష్టి పెట్టకపోవడంతో వాహనదారులు నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ చెలరేగిపోతున్నారు. వాహనాలకు డివైజ్‌ ఉందో లేదో చూస్తున్నారు తప్ప.. అది ఎంత స్పీడ్‌కు లాక్‌ అయిందో ఆర్టీఏఅధికారులు పట్టించుకోవడం లేదు.’’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement