speed governer
-
ఆగని ‘స్పీడ్’ దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో: వాహనాల వేగాన్ని నియంత్రించే పరికరాలు స్పీడ్ గవర్నర్ల అమ్మకాల్లో అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. మొదట్లో మూడు కంపెనీలకు మాత్రమే అనుమతినిచ్చిన రవాణా శాఖ.. ఆ తర్వాత ధరలపై వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో మరికొన్ని స్పీడ్ గవర్నర్స్ తయారీ విక్రయ సంస్థలకు అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఒక్కో స్పీడ్ గవర్నర్ డివైజ్ ధర రూ.7000కు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా దళారులు, ఆర్టీఏ ఏజెంట్లు వాహనదారుల నుంచి మరో రూ.2000 అదనంగా వసూలు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లో ప్రస్తుతం కేవలం రూ.3000కు లభిస్తున్న డివైజ్‌ను హైదరాబాద్‌లో రూ.7వేలకు విక్రయిస్తున్నట్లు లారీ యాజమాన్య సంఘాలు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రూ.3500కు ఒక డివైజ్ చొప్పున విక్రయించిన సంస్థలే ఇక్కడ అమాంతంగా ధరలను పెంచడం గమనార్హం. స్పీడ్ గవర్నర్ల ఏర్పాటులో కేవలం 3 సంస్థల గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ మరిన్ని సంస్థలకు రవాణా శాఖ అవకాశం కల్పించడం ఆహ్వానించదగిన పరిణామమే. ప్రస్తుతం 11 కంపెనీలు ఉన్నాయి. త్వరలో మరిన్ని కంపెనీలకు అనుమతులు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ ధరలపై నియంత్రణ కొరవడింది. ఇలా మొదలు.. రోడ్డు భద్రత దృష్ట్యా హైవేలపై రవాణా వాహనాల వేగాన్ని 80 కిలోమీటర్లకు పరిమితం చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం స్పీడ్గవర్నర్లను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. క్యాబ్‌లు, మ్యాక్సీక్యాబ్‌లు, లారీలు, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు తదితర (ఆటోలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు మినహా) అన్ని రకాల రవాణా వాహనాలు గ్రేటర్ పరిధిలో గంటకు 60 కిలోమీటర్లు, హైవేలపై 80 కిలోమీటర్లు దాటకుండా వేగాన్ని నియంత్రించే పరికరాలను ఏర్పాటు చేసుకోవడాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. దీంతో సుమారు 4 లక్షల వాహనాలు ఈ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైంది. ఇందులో లారీ సంఘాలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాత్కాలికంగా ఊరట పొందాయి. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, స్కూల్ బస్సులు, ఇతరత్రా వాహనాలకు ప్రస్తుతం ఈ నిబంధన కొనసాగుతోంది. స్పీడ్ గవర్నర్ ఉంటేనే వాహనాలకు ఫిట్నెస్ లభిస్తోంది. మొదట్లో కేవలం 3 కంపెనీలకు మాత్రం రవాణా అధికారులు అనుమతినిచ్చారు. ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) వంటి సంస్థలు 33 కంపెనీలను ప్రామాణికమైనవిగా గుర్తించినప్పటికీ హైదరాబాద్‌లో కేవలం మూడింటికి మాత్రం అవకాశం ఇవ్వడంతో ధరలను అమాంతంగా పెంచేసి గుత్తాధిపత్యానికి తెరలేపాయి. పొరుగు రాష్ట్రాల్లో విక్రయించిన ధరలను రెట్టింపు చేశాయి. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం మరి కొన్నింటికి అవకాశం కల్పించినప్పటికీ కొత్త కంపెనీలు కూడా పాత వాటినే అనుసరిస్తున్నాయి. ధరలను మాత్రం తగ్గించడం లేదు. దళారుల దందా.. స్పీడ్‌గవర్నర్‌లపై కంపెనీల నిలువు దోపిడీకి దళారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. నగరంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో తిష్ట వేసుకొని ఉన్న దళారులు, ఏజెంట్లు స్పీడ్గవర్నర్లను తెప్పించడంతో పాటు, ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసి ఇచ్చేందుకు మరో రూ.2000 అదనంగా వసూలు చేస్తున్నారని, దీంతో స్పీడ్ గవర్నర్ల ధరలు రూ.9000 నుంచి రూ.10,000 వరకు చేరుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆర్టీఏ ఫిట్నెస్ సెంటర్లలో ఇందుకోసం దళారులు మోహరించి ఉంటారు. అధికారులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ ఫిట్నెస్ కోసం వచ్చే వాహనదారులను మరింత దోచుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఫిర్యాదులను పట్టించుకొనే యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణమని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. -
వీళ్లింతే.. వాళ్లంతే! స్పీడ్‌కు లాక్ లేకపాయె!
సాక్షి,సిటీబ్యూరో: రహదారి భద్రత కోసం ప్రతిష్ఠాత్మకంగాప్రవేశపెట్టిన ‘స్పీడ్ గవర్నర్’ల వినియోగం ఆచరణలోఅపహాస్యం పాలవుతోంది. కొంతమంది తమవాహనాలను ఫిట్నెస్ పరీక్షలకు తెచ్చే ముందే ఆర్టీఏ ఏజెంట్లు, దళారుల సాయంతో తాము కోరుకున్న స్పీడ్కుఅనుగుణంగా స్పీడ్ గవర్నర్లను బిగించుకొని వస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పరీక్షల వరకు వేగాన్ని నియంత్రణలో ఉంచుకొని తర్వాత చెలరేగిపోతున్నారు. ఇందుకోసంటెక్నీషియన్ల సహాయంతో తమకు అనుకూలంగా స్పీడ్‌గవర్నర్ డివైజ్‌లో మార్పులు చేయించుకుంటున్నారు. మరోవైపు వేగనియంత్రణ డివైజ్‌లను ఏర్పాటు చేసిన తర్వాత వాహనాల వేగం ఎలా ఉందనే అంశాన్ని ఏ మాత్రంపరిశీలించకుండానే ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ఇచ్చేస్తున్నారు. దీంతో నగరంలో స్పీడ్ గవర్నర్ల ఏర్పాటుఒక ఫార్స్‌గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి దాకా సుమారు 50 వేలకు పైగా వాహనాలకు స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేస్తే..వాటిలో స్కూల్ బస్సులు మినహా మిగతా వాహనాల్లోసగానికి పైగా వేగనియంత్రణకు తిలోదకాలిచ్చేశాయి.వీటిలో ఎక్కువ శాతం క్యాబ్‌లు మ్యాక్సీ క్యాబ్‌లు, తదితర ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. రహదారి భద్రతకు తూట్లు అపరిమితమైన వేగం వల్లనే హైవేలపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనాల వేగానికి కళ్లెంవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను డ్రైవర్లు అదుపు చేయలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం తీవ్రంగా ఉంటోంది. ఏటా కొన్ని వందలమంది మృత్యువాత పడుతున్నారు. అంతే సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చనే ఉద్దేశంతో వేగనియంత్రణ పరికరాలను తప్పనిసరి చేశారు. 2015 తర్వాత వచ్చిన వాహనాలకు వాటి తయారీ సమయంలోనే వేగనియంత్రకాలను అమర్చగా, అంతకంటే ముందు మార్కెట్లోకి వచ్చిన వాహనాలకు మాత్రం నిబంధన మేరకు కొత్తగా నియంత్రికలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ లెక్కన గ్రేటర్లో సుమారు 4 లక్షల వాహనాలకు వేగనియంత్రకాలను అమర్చాలి. కానీ స్పీడ్ గవర్నర్లను బిగించిన తర్వాత నిబంధనల మేరకు వాహనాల వేగం 80 కిలోమీటర్లకు పరిమితమైందా, లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించకుండానే మోటారు వాహన తనిఖీ అధికారులు అనుమతులు ఇవ్వడం వల్ల వాహనదారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ వాహనాల వేగాన్ని 100 నుంచి 120 కి.మీ వరకు పెంచేస్తున్నారు. ఈ మేరకు స్పీడ్ గవర్నర్లను బిగించే సమయంలోనే డీలర్లు, వారి టెక్నీషియన్ల సహాయంతో తమకు కావాల్సిన వేగాన్ని సరి చేసుకుంటున్నారు. ఒక్క స్కూల్ బస్సుల్లో మినహా మిగతా రవాణా వాహనాల్లో కచ్చితమైన వేగనియంత్రణ అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, టాటాఏస్‌లు వంటి ప్రైవేట్ వాహనాల యజమానులు తమకు కావాల్సిన వేగానికి అనుగుణంగా స్పీడ్ గవర్నర్లను బిగించుకొనేందుకు దళారులు, ఆర్టీఏ ఏజెంట్లసహాయంతో ఈ మొత్తం ప్రక్రియ యధేచ్ఛగాసాగిపోతోంది. స్పీడ్ ఎలా పెంచేస్తారంటే.. వాహనాల ఇంజిన్‌కు పవర్ సరఫరా అయ్యే చోట స్పీడ్ గవర్నర్ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. ఒక మల్టిమీటర్ వంటి లాగర్ సహాయంతో వేగాన్ని 80 కి.మీకు నియంత్రిస్తారు. ఇలా లాగర్‌తో వేగాన్ని నియంత్రించే సమయంలోనే ఏజెంట్ల సహాయంతో వేగాన్ని 100 నుంచి 120 కి.మీ పెంచి సెట్ చేయించుకుంటున్నారు. ఎక్కువ శాతం వాహనాల్లో ఫిట్నెస్ పరీక్షలకు ముందే ఈ ఏర్పాటు జరుగుతుండగా, కొంతమంది మాత్రం ఫిట్నెస్ పరీక్షల వరకు 80 కి.మీ వేగ నియంత్రణకు కట్టుబడి ఉండి తర్వాత స్పీడ్ గవర్నర్‌కు, ఇంజిన్‌కు అనుసంధానమై ఉన్న సెన్సార్ వైర్‌ను తొలగించి వేగాన్ని పెంచుకుంటున్నారు. ఇదంతా ఆర్టీఏ ఏజెంట్ల సహాయ సహకారాలతోనే జరగడం గమనార్హం. ఏజెంట్ల ద్వారా వచ్చే వాహనాలకు ఎంవీఐలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఫిట్నెస్సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. డివైజ్ ధరలోనూ మోసం.. పొరుగు రాష్ట్రాల్లో రూ.3500 స్పీడ్ గవర్నర్లను విక్రయిస్తుండగా నగరంలో మాత్రం రూ.7 వేల చొప్పున తీసుకుంటున్నారు. చాలామంది ఆర్టీఏ నిబంధనల మేరకు రూ.వేలకు వేలు వెచ్చించి స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, స్పీడ్ నియంత్రణకు మాత్రం కట్టుబడి ఉండడం లేదు. ‘హై వేలపై గంటకు 80 కి.మీ మాత్రమే పరిమితమై బండి నడిపితే రోజుకు 4 ట్రిప్పులు తిరగాల్సిన చోట 3 ట్రిప్పులు కూడా పూర్తి చేయడం సాధ్యం కాదని’ వాహనదారులు చెబుతున్నారు. ఆటోమెబైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలు 37 స్పీడ్ గవర్నర్స్ తయారీ కంపెనీలను గుర్తించాయి. కానీ నగరంలో మాత్రం ఇప్పటి దాకా కొన్ని సంస్థలకు చెందిన స్పీడ్ గవర్నర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ‘‘వాహనాల వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ ప్రభుత్వం స్పీడ్ గవర్నర్ నిబంధనలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క ఒటో రిక్షాలు మినహా మిగతా అన్ని రవాణా వాహనాలకు వేగ నియంత్రణ తప్పనిసరి. నగరంలో మాత్రమే తిరిగే వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవిధంగా, హేవేపై గంటకు 80 కి.మీతో వెళ్లేలా కేంద్రం స్పీడ్ గవర్నర్లను తప్పనిసరి చేసింది. 2015కు ముందు తయారుచేసిన (వేగ నియంత్రణ పరికరాలు లేని) అన్ని రవాణా వాహనాలు వీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, రవాణాశాఖ వీటి వినియోగంపై దృష్టి పెట్టకపోవడంతో వాహనదారులు నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ చెలరేగిపోతున్నారు. వాహనాలకు డివైజ్ ఉందో లేదో చూస్తున్నారు తప్ప.. అది ఎంత స్పీడ్‌కు లాక్ అయిందో ఆర్టీఏఅధికారులు పట్టించుకోవడం లేదు.’’ -
వేగానికి కళ్లెం
సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై రవాణా వాహనాలు యమదూతల్లా దూసుకొస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి వాహనాలతో నిత్యం ఎక్కడో ఒక చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. అపరిమితమైన వేగంతో పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసే రవాణా వాహనాలు తరచూ అదుపు తప్పి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎంతోమంది అమాయకులు మృత్యువాతపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని రవాణా శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు జరిగిన అనేక రోడ్డు ప్రమాదాల్లో అపరిమితమైన వేగం కారణంగా డ్రైవర్లు వాటిని అదుపు చేయలేకపోతున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు, 8 సీట్ల మ్యాక్సీ క్యాబ్‌లు, పగటిపూట తిరిగే స్కూల్, కాలేజీ బస్సులు, చెత్త తరలింపు వాహనాలు, ట్యాంకర్లు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వేగనియంత్రణ పరికరాలు ఉండాల్సిందేనని కేంద్రం గతంలోనే చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు వాహన యజమానులు ఈ చట్టాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయడంతో కొంతకాలం పాటు స్టే విధించారు. ప్రస్తుతం రహదారి భద్రత నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంపై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల రవాణా వాహనాలకు ఇక నుంచి స్పీడ్ గవర్నర్స్‌ను తప్పనిసరి చేయనున్నారు. స్పీడ్‌కు బ్రేక్.. వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు ఆగస్ట్ 1 నాటికి స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఆ లోగా స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోలేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణా శాఖ ఐటీ విభాగం జేటీసీ రమేష్ పేర్కొన్నారు. మొదట స్కూల్ బస్సులు, వ్యాన్లు, చెత్త తరలింపు వాహనాలు (డంపర్స్), ట్యాంకర్లు, మ్యాక్సీ క్యాబ్‌లపై చర్యలు తీసుకుంటారు. ఆయా వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏఆర్ఏఐ (ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆమోదం పొందిన స్పీడ్ గవర్నర్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిస ఉంటుంది. స్పీడ్ గవర్నర్స్ లేని వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిలిపివేస్తారు. బైక్‌లు, ఆటోరిక్షాలు, క్వాడ్రా సైకిల్, పోలీస్ వాహనాలు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు మినహాయించి ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు ఈ నిబంధన క్రమంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 10 లక్షలకుపైగా వాహనాల వేగానికి కళ్లెం పడనుంది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు తప్పనిసరిగా స్పీడ్ నియంత్రణ పరికరాలు ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. హై ఎండ్ కేటగిరీకి చెందిన కొన్ని రకాల రవాణా వాహనాలకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను వాటి తయారీ సమయంలోనే అమర్చిపెడుతున్నారు. ఇలాంటి వాటికి గంటకు 80 కి.మీ వేగం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. తొలిదశలో అవగాహన.. స్పీడ్ గవర్నర్స్‌పై మొదట అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఏఆర్ఏఐ నుంచి ఆమోదం పొందిన స్పీడ్ గవర్నర్స్ విక్రేతల నుంచి మాత్రమే ఈ పరికరాలను కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొంతమంది వెండార్స్ స్పీడ్ గవర్నర్స్‌ను విక్రయించేందుకు అనుమతిని కోరుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని. ఏఆర్ఏఐ గుర్తింపు పొందిన విక్రయ సంస్థలకు త్వరలోనే అనుమతినివ్వనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డీలర్లదే బాధ్యత రహదారి భద్రత ప్రమాణాల మేరకు అన్ని రకాల రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నర్స్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2015 అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చే విధంగా జీఓ వెల్లడించింది. ఆ తేదీ నాటికి తయారైన వాహనాలన్నింటికీ వాహన తయారీదారులు లేదా డీలర్లే స్పీడ్ గవర్నర్స్‌ను బిగించి ఇవ్వాల్సి ఉంటుంది. 2015 అక్టోబర్ 1వ తేదీ కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకు వాటి యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే స్పీడ్ గవర్నర్స్ బిగించి ఉంటే వాహనాల ఫిట్నెస్ సమయంలో మోటారు వాహన తనిఖీ అధికారులకు ఆ వివరాలను అందజేయాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు తప్పనిసరిగా ఇంజిన్ నంబర్, చాసీస్ నంబర్లతో పాటు స్పీడ్‌గవర్నర్స్ నంబర్ల వివరాలను అధికారులకు సమర్పించాలి. -
హైస్పీడ్‌కు ‘బ్రేక్’!
- వాహనాలకు స్పీడ్ గవర్నర్ - 3,500 కిలోల పైబడి బరువున్న వాటికి తప్పనిసరి - రోడ్డు రవాణా శాఖ తాజా నిర్ణయం అనంతపురం సెంట్రల్ : హైదరాబాద్‌లో మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు 200 కిలోమీటర్ల వేగంతో మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. కొంతకాలం క్రితం జేఎన్‌టీయూసీ వైస్‌చాన్సలర్ సర్కారు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పామిడి వద్ద రాంగ్‌రూట్‌లోకి వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాలూ అతివేగం వల్ల జరిగినవే. ఇటీవలి కాలంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై తరచూ చోటుచేసుకుంటున్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతో మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. ఎక్కువ ప్రమాదాలకు కారణం అతివేగమే. ఇకమీదట ఇలాంటి ఘటనలకు కళ్లెం వేయాలని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ(ఆర్టీఏ) అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం వాహనాలకు ‘స్పీడ్ గవర్నర్’ పరికరాలను అమర్చనున్నారు. 3,500 కిలోల పైబడి బరువు కల్గి, ఎనిమిది మంది ప్రయాణికులు కూర్చునే వీలున్న ప్రతి వాహనానికి స్పీడ్ గవర్నర్ తప్పనిసరన్న నిబంధన విధించారు. స్కూల్ బస్సులు 60 కిలోమీటర్లు, ఇతర వాహనాలు 80 కి.మీలకు మించి వేగంతో వెళ్లకూడదు. అలా వెళితే స్పీడ్‌గవర్నర్ నియంత్రిస్తుంది. అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు తదితర వాటికి ప్రజాప్రయోజనం దృష్ట్యా ఈ నిబంధనను మినహాయిస్తున్నారు. స్పీడ్ గవర్నర్ ఉంటేనే అనుమతులు స్పీడ్ గవర్నర్ అమర్చిన వాహనాలకే పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) తదితర అనుమతులు మంజూరు చే యాలని నిర్ణయించారు. ఈ నెల 15తో స్కూల్ బస్సులకు ఎఫ్‌సీ గడువు పూర్తవుతుంది. జిల్లాలో 800 స్కూల్ బస్సులు ఉండగా.. వాడుకలో 650 వరకు ఉన్నాయి. ఇతర వాహనాలు 75 వేలు ఉండగా.. వాడుకలో 60 వేల దాకా ఉన్నాయి. వీటిలో ఆటోలు 15 వేలు మినహాయిస్తే మిగిలిన వాటికి స్పీడ్ గవర్నర్ అమర్చుకోవాల్సి ఉంటుంది. నాణ్యతపై అనుమానాలు రోడ్డు రవాణాశాఖ స్పీడ్‌గవర్నర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పలు ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకే పరికరాలను అందజేస్తామని ముందుకు వస్తున్నాయి. దాదాపు 25 సంస్థలు స్పీడ్ గవర్నర్ పరికరాల సరఫరాకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన ఓ సంస్థ రూ.5 వేలకే ఇస్తామని చెప్పగా, విజయవాడకు చెందిన సంస్థ రూ.7వేల చొప్పున ధర నిర్ణయించాయి. దీన్నిబట్టి చూస్తే నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. స్పీడ్ గవర్నర్ లేకపోతే జరిమానా : శ్రీధర్, ఆర్టీఓ, అనంతపురం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనానికి స్పీడ్ గవర్నర్ అమర్చాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. కావున తప్పనిసరిగా అమర్చుకోవాలి. లేదంటే రూ.2 వేల జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకుంటాం.