వేగానికి కళ్లెం | RTA Fitness Certificate For Transport Vehicles | Sakshi
Sakshi News home page

వేగానికి కళ్లెం

Published Wed, Jun 19 2019 7:34 AM | Last Updated on Mon, Jun 24 2019 11:46 AM

RTA Fitness Certificate For Transport Vehicles - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై రవాణా వాహనాలు యమదూతల్లా దూసుకొస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి వాహనాలతో నిత్యం ఎక్కడో ఒక చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. అపరిమితమైన వేగంతో పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసే రవాణా వాహనాలు తరచూ అదుపు తప్పి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎంతోమంది అమాయకులు మృత్యువాతపడుతున్నారు.

రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని రవాణా శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు జరిగిన అనేక రోడ్డు  ప్రమాదాల్లో అపరిమితమైన వేగం కారణంగా డ్రైవర్లు వాటిని అదుపు చేయలేకపోతున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే ప్రైవేట్‌ బస్సులు, సరుకు రవాణా వాహనాలు, 8 సీట్ల మ్యాక్సీ క్యాబ్‌లు, పగటిపూట తిరిగే స్కూల్, కాలేజీ బస్సులు, చెత్త తరలింపు వాహనాలు, ట్యాంకర్లు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వేగనియంత్రణ పరికరాలు ఉండాల్సిందేనని కేంద్రం గతంలోనే  చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు వాహన యజమానులు ఈ చట్టాన్ని న్యాయస్థానాల్లో  సవాల్‌ చేయడంతో కొంతకాలం పాటు స్టే విధించారు. ప్రస్తుతం రహదారి భద్రత నిబంధనలను  పటిష్టంగా అమలు చేయడంపై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల రవాణా వాహనాలకు ఇక నుంచి స్పీడ్‌ గవర్నర్స్‌ను తప్పనిసరి  చేయనున్నారు.

స్పీడ్‌కు బ్రేక్‌..  
వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు ఆగస్ట్‌ 1 నాటికి స్పీడ్‌ గవర్నర్స్‌ ఏర్పాటు చేసుకోవాల్సిందేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఆ లోగా స్పీడ్‌ గవర్నర్స్‌  ఏర్పాటు చేసుకోలేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణా శాఖ ఐటీ విభాగం జేటీసీ రమేష్‌ పేర్కొన్నారు. మొదట స్కూల్‌ బస్సులు, వ్యాన్‌లు, చెత్త తరలింపు వాహనాలు (డంపర్స్‌), ట్యాంకర్లు, మ్యాక్సీ క్యాబ్‌లపై చర్యలు తీసుకుంటారు. ఆయా వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే  వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏఆర్‌ఏఐ (ఆటోమొబైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఆమోదం పొందిన  స్పీడ్‌ గవర్నర్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిస  ఉంటుంది.

స్పీడ్‌ గవర్నర్స్‌ లేని వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిలిపివేస్తారు. బైక్‌లు, ఆటోరిక్షాలు, క్వాడ్రా సైకిల్, పోలీస్‌ వాహనాలు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు మినహాయించి ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు ఈ నిబంధన క్రమంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 10 లక్షలకుపైగా వాహనాల  వేగానికి కళ్లెం పడనుంది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు తప్పనిసరిగా స్పీడ్‌ నియంత్రణ పరికరాలు ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. హై ఎండ్‌ కేటగిరీకి చెందిన కొన్ని రకాల రవాణా వాహనాలకు ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌లను వాటి తయారీ సమయంలోనే అమర్చిపెడుతున్నారు. ఇలాంటి వాటికి గంటకు 80 కి.మీ వేగం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. 

తొలిదశలో అవగాహన..
స్పీడ్‌ గవర్నర్స్‌పై మొదట అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఏఆర్‌ఏఐ నుంచి ఆమోదం పొందిన స్పీడ్‌ గవర్నర్స్‌ విక్రేతల నుంచి మాత్రమే ఈ పరికరాలను కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొంతమంది వెండార్స్‌  స్పీడ్‌ గవర్నర్స్‌ను విక్రయించేందుకు అనుమతిని కోరుతూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని. ఏఆర్‌ఏఐ గుర్తింపు పొందిన విక్రయ సంస్థలకు త్వరలోనే అనుమతినివ్వనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

డీలర్లదే బాధ్యత
రహదారి భద్రత ప్రమాణాల మేరకు అన్ని రకాల రవాణా వాహనాలకు స్పీడ్‌ గవర్నర్స్‌ తప్పనిసరి చేస్తూ  కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2015 అక్టోబర్‌ 1 నుంచే  ఇది అమల్లోకి వచ్చే విధంగా జీఓ వెల్లడించింది. ఆ తేదీ నాటికి తయారైన వాహనాలన్నింటికీ  వాహన తయారీదారులు లేదా  డీలర్లే  స్పీడ్‌ గవర్నర్స్‌ను బిగించి ఇవ్వాల్సి ఉంటుంది. 2015 అక్టోబర్‌  1వ తేదీ కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకు వాటి యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే స్పీడ్‌ గవర్నర్స్‌ బిగించి ఉంటే వాహనాల ఫిట్‌నెస్‌ సమయంలో మోటారు వాహన తనిఖీ అధికారులకు ఆ  వివరాలను అందజేయాలి. కొత్తగా  రిజిస్ట్రేషన్‌ చేసే వాహనాలకు తప్పనిసరిగా ఇంజిన్‌ నంబర్, చాసీస్‌ నంబర్‌లతో పాటు  స్పీడ్‌గవర్నర్స్‌ నంబర్ల వివరాలను అధికారులకు సమర్పించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement