స్కూల్ బస్...ఫిట్‌లెస్ | no fitness for school bus drivers | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్...ఫిట్‌లెస్

Published Sun, Jun 14 2015 12:50 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

స్కూల్ బస్...ఫిట్‌లెస్ - Sakshi

స్కూల్ బస్...ఫిట్‌లెస్

- ఫిట్‌నెస్ లేకుండానే పిల్లల తరలింపు
- ఇదీ 2000కు పైగా బస్సుల పరిస్థితి
- డ్రైవర్ల అనుభవంపైనా ఆందోళన
- ఇప్పటి వరకు 27 బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ
సాక్షి, సిటీబ్యూరో:
నగరంలోని అధిక శాతం స్కూల్ బస్సులు సరైన ఫిట్‌నెస్ లేకుండా రోడ్డెక్కుతున్నాయి. విద్యా సంస్థల బాధ్యతారాహిత్యం, రవాణా శాఖ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఎప్పటికప్పుడు వీటి ఫిట్‌నెస్‌ను పరిశీలించాల్సిన అధికారులు ఆ బాధ్యత తమది కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు.

వేసవి సెలవులు ముగిసి బడులు తిరిగి ప్రారంభమైనప్పటికీ వేలాది స్కూల్ బస్సులు సరైన కండిషన్‌లో లేకుండానే తిరుగుతున్నాయి. 2000కు పైగా ఇలాంటివే పిల్లలను తరలిస్తున్నట్లు అంచనా. మెదక్ జిల్లా మాసాయిపేట్ ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అన్ని స్కూల్ బస్సుల వివరాలను రవాణా శాఖ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. బస్సులతో పాటు విద్యార్థుల వివరాలు, చిరునామాలు, ఫొటోలు, డ్రైవర్లు, పిల్లల సహాయకులు, విద్యా సంస్థల యాజమాన్యాల గుర్తింపు వంటి అంశాలన్నింటినీ రవాణా శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చే స్తున్నారు. ప్రమాదాలను అరిక ట్టడంతో ఠమొదటిపేజీ తరువాయి పాటు, ఈ బస్సుల కదలికలపై నిరంతర నిఘా, పర్యవేక్షణ కొనసాగించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రక్రియకు విద్యా సంస్థల స్పందన అంతంతమాత్రంగానే ఉంది.  

ఉత్తుత్తి తనిఖీలే...
ఓ వైపు ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్  కళాశాలల బస్సుల తో పాటు, రెండు వేలకు పైగా స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్నాయి. పరీక్షలకు వచ్చిన వాటిలోనూ లోపాలను గుర్తించకుండానే రవాణా శాఖ అధికారులు ధ్రువపత్రాలను ఇచ్చి పంపేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తనిఖీ సమయంలో ఎంవీఐలు తప్పనిసరిగా బస్సును నడపాలి. ఏ చిన్న లోపం కనిపించినా ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైనట్టు నిర్ధారించాలి. కానీ శాస్త్రీయమైన పరీక్షలు లేకుండానే ఉత్తుత్తి తనిఖీలతో ఫిట్‌నెస్ నిర్ధారణ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 10,052 స్కూల్ బస్సులు ఉన్నాయి. వాటిలో సగానికిపైగా దొడ్డిదారిలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఇవీ నిబంధనలు...
- బస్సు పసుపు రంగులో ఉండాలి. ఆ రంగు స్పష్టంగా కనిపించాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించేలా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి.
- బస్సు ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రం, అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి.
- పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ముందు భాగంలో ఎడమ వైపున స్పష్టంగా రాయాలి.
- నాలుగు వైపులా పైభాగం మూల ల్లో గాఢ పసుపు పచ్చని రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎక్కి, దిగేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.
- స్కూల్ బస్సు అని తెలిసేవిధంగా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250 ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్థుల చిత్రాలు ఉండాలి. దానికింద ‘స్కూల్ బస్సు’ అని నల్లరంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11 ఎం.ఎం. ఉండాలి.
- బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్‌తో ఉండాలి.
- ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి.
- లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకొనేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్ ఉండాలి.
- బస్సులో ప్రయాణించే విద్యార్థుల పేర్లు, తరగతులు, ఇళ్ల చిరునామాలు, ఎక్కవలసిన, దిగవలసిన ప్రదేశాల వివరాలు బస్సులో ఉండాలి.

డ్రైవర్ల అర్హతలివీ...
- డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్య పట్టికను విధిగా నిర్వహించాలి.
- యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తపోటు, షుగరు, కంటిచూపు వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
- డ్రైవర్‌ను నియమించే ముందు అతని అర్హతలు, డ్రైవింగ్ లెసైన్స్ తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి.
- డ్రైవర్‌కు బస్సు డ్రైవింగ్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- డ్రైవర్,అటెండర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి.

పేరెంట్స్ కమిటీ బాధ్యతలివీ...
- బస్సుకు సంబంధించిన బాహ్య పరికరాలు విండ్‌స్క్రీన్, వైపర్స్, లైటింగ్స్ వంటి వాటి మెకానికల్ కండీషన్స్, పనితీరు తెలుసుకొనేందుకు ప్రిన్సిపాల్‌తో కలిసి పేరెంట్స్ కమిటీ ప్రతి నెలా తనిఖీలు చేయాలి.
- ఫస్ట్ ఎయిడ్ బాక్సులోని మందులు, ఇతర వస్తువులు కూడా తనిఖీ చేయాలి.
 
 
డీఈవోలు ఎలా తనిఖీ చేస్తారు?
చంద్రబాబు ఆలోచన  మార్చుకోవాలి
ఏపీ బాలల హక్కుల సంఘం డిమాండ్
సాక్షి,సిటీబ్యూరో: 
స్కూల్ బస్సులను జిల్లా విద్యాశాఖాధికారులు తనిఖీ చేసి ఫిట్‌నెస్ నిర్ధారిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంలో అర్ధం లేదని బాలల హక్కుల సంఘం చైర్మన్ అనురాధారావు ఒక ప్రకటనలో ఖండించారు. రవాణా శాఖకు చెందిన టెక్నికల్ అధికారులు మాత్రమే ఫిట్‌నెస్ నిర్ధారించి సర్టిఫికెట్లు అందజేస్తారని గుర్తించాలన్నారు. అలాంటి పనిని విద్యాశాఖ అధికారులకు అప్పగించడమంటే అవినీతి, లంచాలను ప్రోత్సహించడమేనని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి రవాణా రంగాన్ని ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలను డీఈఓలకు అప్పగించాలనే తప్పుడు ఆలోచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement