స్కూలు బస్సులోకి తాటిదుంగ | School buses tatidunga | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సులోకి తాటిదుంగ

Published Sat, Feb 14 2015 4:03 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

స్కూలు బస్సులోకి తాటిదుంగ - Sakshi

స్కూలు బస్సులోకి తాటిదుంగ

  • బాలిక దుర్మరణం
  • మరో 10 మందికి గాయాలు
  • దుగ్గిరాల/మంగళగిరి: స్కూలు బస్సులోకి మృత్యువు దూసుకొచ్చింది. ఆడుతూపాడుతూ బడికి బయలుదేరిన ఆ చిన్నారిని తాటిదుంగ రూపంలో చిదిమేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో పదిమంది పిల్లలు గాయపడ్డారు. మంగళగిరి మండలం నూతక్కి గ్రామ పరిధిలోని విజ్ఞాన్ విహార్ స్కూల్ బస్సు ఉదయం 7.30 గంటల సమయంలో బయలుదేరి దుగ్గిరాల మండలంలోని శృంగారపురం, మంగళగిరి మండలం నూతక్కి శివారు కొత్తపాలెం గ్రామాలకు చెందిన 32 మంది విద్యార్థులతో స్కూలుకు బయలుదేరింది.

    వేగంగా వెళ్తూ నూతక్కి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న తాటిదుంగలను ఢీకొట్టింది. దీంతో ఒక దుంగ బస్సు అడుగు భాగంలోంచి బస్సులోకి దూసుకెళ్లింది. వెనుక నుంచి రెండోసీట్లో కూర్చున్న 2వ తరగతి విద్యార్థిని నాగేశ్వరం లహరి (8) పొట్టలోంచి దూసుకెళ్లి వెనుక అద్దంలో నుంచి బయటకెళ్లింది. లహరి తల భాగం బస్సు వెలుపలకు వెళ్లింది. శృంగారపురం గ్రామానికి చెందిన నాగేశ్వరం రఘు, రమాదేవి దంపతుల కుమార్తెలు లహరి, ఆమె అక్క లలిత (3వ తరగతి) విజ్ఞాన్ విహార్ స్కూల్‌లో చదువుతున్నారు.

    మృతురాలి తాత హనుమంతరావు స్థానిక శివాలయంలోను, తండ్రి రఘు కృష్ణాజిల్లా నందమూరు ఆలయంలోను అర్చకులు. ప్రమాదం విషయం తెలియడంతో ఆ స్కూలులో చదివే 18 గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. నార్త్ జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ, ఎస్‌ఐలు అంకమరావు, వై.సత్యనారాయణ సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని అతికష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలానికి వచ్చిన డీఈవో శ్రీనివాసులురెడ్డి స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుని చిన్నారి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement