హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా- దాద్రి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బస్సు అతి వేగంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందినది. విద్యార్థులతో వెళుతున్న ఈ బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది విద్యార్థులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి తరలించారు. ఈద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పలు ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. ఇదే కోవలో జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు కూడా సెలవు ఇవ్వలేదు.
డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం నుంచి ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment