ఫిట్‌నెస్‌పై కేర్‌లెస్ | Careless fitness | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌పై కేర్‌లెస్

Published Mon, May 26 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

ఫిట్‌నెస్‌పై కేర్‌లెస్

ఫిట్‌నెస్‌పై కేర్‌లెస్

  •  పత్తా లేని స్కూల్ బస్సుల తనిఖీలు
  •  మే ముగుస్తున్నా ఉలుకూపలుకు లేని ఆర్టీఏ
  •  నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్‌బస్సులు
  •  మనం వచ్చేవారం కారులో ఊరికెళ్దామనుకుంటాం. ముందుగానే కారు కండీషన్ బాగుందా..? లేదా..? అని చూసుకుంటాం. అలా చూసుకుంటేనే తిరిగి క్షేమంగా గమ్యం చేరుకుంటాం. కానీ ప్రతిరోజు పిల్లలను తీసుకెళ్లే స్కూల్‌కెళ్లే బస్సుల విషయంలో మాత్రం అలాంటి జాగ్రత్తలు కనిపించడం లేదు. మే ముగుస్తున్నా ఘనత వహించిన ఆర్టీఏ ఇప్పటివరకు స్కూల్‌బస్సుల ఫిట్‌నెస్ గురించి పట్టించుకోవడం లేదు.
     
    ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే నానా హడావుడి చేసే ఆర్టీఏ స్కూల్‌బస్సుల విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రతియేటా జూన్‌లో స్కూళ్లు తెరుస్తారన్నది జగమెరిగిన సత్యం. ఇంతకుముందుగానే మేలో విధిగా స్కూల్ బస్సులు బాగున్నాయా..? లేదా..అని ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాల్సిన అధికారులు ఇంకా మొద్దు నిద్రవీడడం లేదు. గ్రేటర్‌లో 6527 స్కూల్ బస్సులున్నాయి. వీటన్నింటికీ పరీక్షలు నిర్వహించి వాటి సామర్ధ్యాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. మరో నాలుగైదు రోజుల్లో మే ముగుస్తుంది.

    కొన్నిస్కూళ్లు జూన్ రెండోవారంలో తెరుచుకునే అవకాశమున్నప్పటికీ అధికశాతం జూన్ మొదటి వారంలోనే తెరుచుకోనున్నాయి. ఈ కొద్దిపాటి గడువులో వేలకొద్దీ స్కూల్‌బస్సులకు సామర్ధ్యపరీక్షలు నిర్వహించడం అసాధ్యం. చిన్నారుల భద్రతపట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన రవాణా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

    స్కూళ్లు తెరుచుకొనే సమయానికి హడావిడిగా పరీక్షలు చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం ఒక ప్రహసనంగా మారుతోంది. నిజానికి మోటారువాహన తనిఖీ అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారులు తమ పరిధిలోని ప్రతిస్కూల్ యాజమాన్యాన్ని ఫిట్‌నెస్ పరీక్షలకు ప్రోత్సహించాలి. గడువులోపే ఆ పనిపూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు అలాంటి కార్యక్రమం నగరంలో ప్రారంభం కాలేదు.
     
     దర్జాగా ఉల్లంఘన


     రవాణా అధికారుల నిర్లక్ష్యం ఇలాఉంటే స్కూళ్లు,కళాశాలలు తదితర విద్యాసంస్థల యాజమాన్యాలు మరో అడుగు ముందుకేసి దర్జాగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. కేవలం పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేం దుకు మాత్రమే వినియోగించాల్సిన బస్సులను ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు.పెళ్లిళ్లు, తీర్ధయాత్ర, పార్టీ కార్యక్రమాల కోసం తిప్పుతున్నారు.
     
      పిల్లల భద్రత ఎలా..?
     
     ప్రతియేటా ఎక్కడోచోట స్కూల్ బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. అభంశుభం ఎరుగని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. ఇటు ఆర్టీఏ, అటు స్కూల్ యాజమాన్యాలు,మరోవైపు డ్రైవర్ల అజాగ్రత్త వంటి అంశాలే ప్రధానకారణం. కొన్నిసార్లు అటెండర్లు లేకపోవడం వల్ల  కూడా చిన్నారులు ప్రమాదాలబారిన పడుతున్నారు.  
     
     డ్రైవర్ల అర్హతలు

     డ్రైవర్ వయస్సు
         
     60 ఏళ్లకు మించకుండా ఉం డాలి. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించాలి.
     
     యాజమాన్యం తమ సొంతఖర్చుతో డ్రైవర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తపోటు,షుగరు,కంటిచూపు వంటి పరీక్షలు చేయించాలి. అతని అర్హ
     
     తలు, డ్రైవింగ్ లెసైన్స్,తదితరాంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి.
     
     బస్సు డ్రైవింగ్‌లో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.
     
     డ్యూటీలో డ్రైవర్,అటెండర్ తప్పనిసరిగా యూనిఫారం ధరించాలి.
     
     పేరెంట్స్ కమిటీ బాధ్యత

     బస్సుకు సంబంధించిన బాహ్య పరికరాలు విండ్‌స్క్రీన్,వైపర్స్, లైటింగ్స్ వంటి వాటి మెకానికల్ కండీషన్స్, పనితీరు తెలుసుకొనేందుకు ప్రిన్సిపాల్‌తో కలిసి పేరెంట్స్ కమిటీ ప్రతినెలా తనిఖీలు చేయాలి.
     
     ఫస్ట్ ఎయిడ్ బాక్సులో మందులు,ఇతర పరికరాలు ఉన్నాయా.. లేవా.. అని తనిఖీ చేయాలి.
     
     స్కూల్ బస్సులు ఇలా ఉండాలి..

     బస్సు పసుపురంగులో ఉండాలి. రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించేలా అద్దాలు అమర్చాలి.  
     
     బస్సు ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్),పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం కూడా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ ఏర్పాటు తప్పనిసరి.
     
    సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నెంబర్,మొబైల్ నెంబర్,పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి.

    సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకొనేందుకు వీలుగా అక్కడక్కడా లోహపు స్తంభాలను బస్సులో అమర్చాలి.
     
     వాహనానికి నాలుగువైపులా పైభాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబర్ (గాఢ పసుపుపచ్చని) రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు దిగేప్పుడు,ఎక్కేప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.
     
     సదరు వాహనం స్కూల్‌బస్సు అని తెలిసేలా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్థులు (ఒక అమ్మాయి,ఒక అబ్బాయి) నల్లరంగులో చిత్రించి ఉండాలి. ఆ చిత్రంకింద ‘స్కూల్ బస్సు’ లేదా ‘కళాశాల బస్సు’ అని నల్లరంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి.
         
     బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్‌తో ఉండాలి. సైడ్‌విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు.
         
     ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి.
         
     లోపలికి ఎక్కేప్పుడు,దిగేప్పుడు పట్టుకునేలా తలుపు మెట్లకు సమాంతరంగా రేలింగ్ ఉండాలి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement