సాక్షి, సిటీబ్యూరో: మరో విద్యా సంవత్సరం మొదలైంది... పాఠశాలలు పునఃప్రారంభమ య్యాయి... నగరంలో స్కూలు బస్సులకు అనేక రెట్లు ఆటోల్లో విద్యార్థుల రవాణా జరుగుతోంది... వీటిలోనూ ఆరుగురి కంటే ఎక్కువ తరలించరాదంటూ మరి కొన్ని నిబంధనలు విధించిన సర్కారు చేతులు దులుపుకుంది... ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ కూడా చేస్తున్నారు... ఇక్కడి వరకు బాగానే ఉన్నా... కొన్ని కీలకమైన అంశాలను అన్ని విభాగాలు విస్మరిస్తుండటం సమస్యలకు తావిస్తోంది. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
3 వేల స్కూళ్లు..వెయ్యి స్కూల్ బస్సులు
నగరంలోని కొన్ని ‘ఖరీదైన’ స్కూళ్లు మినహా మిగిలిన వాటికి సొంత రవాణా వ్యవస్థ లేదు. ప్రముఖ పాఠశాలలు సైతం ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో సొంతంగా రవాణా సౌకర్యాన్ని కల్పించిన కొన్ని స్కూళ్లు ఇప్పుడు దానిని విస్మరించాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం నగరంలో 3 వేలకు పైగా స్కూళ్లు ఉండగా... ఆర్టీఏ లెక్కల ప్రకారం కేవలం వెయ్యి స్కూల్ బస్సులు మాత్రమే ఉన్నాయి. అంటే... స్కూలుకు ఒక బస్సు లెక్కన వేసుకున్నా రెండు వేల స్కూళ్లకు లేవన్నమాట. ఫలితంగా విద్యార్థులను ఆటోలు తదితర వాహనాల్లో స్కూళ్లకు పంపించాల్సి వస్తోంది. ప్రతి స్కూలు తమ విద్యార్థులకు ట్రాన్స్‌ఫోర్స్ ఫెసిలిటీ కల్పించాలన్నది కచ్చితం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. తల్లిదండ్రులు తదితరులు సొంతంగా తీసుకువచ్చి దింపే విద్యార్థులు మినహా మిగిలిన వారు స్కూలు బస్సుల్లోనే ప్రయాణించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని ఆరోపిస్తున్నారు.
ఆటోల వీర బాదుడు...
దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల చేతిలో మోసపోకూడదని భావిస్తున్న ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రీ పెయిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడో ఒకసారి నగరానికి వచ్చే వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న వారు అనునిత్యం ఆటోవాలాల చేత దోపిడీకి గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్కూలు పిల్లలను తరలించే ఆటోల డ్రైవర్లు దూరంతో నిమిత్తం లేకుండా భారీగా దండుకుంటున్నారు. సెలవులతో తమకు సంబంధం లేదని, మొత్తం 11 నెలలకూ చెల్లించాల్సిందేనంటూ వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూలు ఆటోలకు ఫేర్స్ (చార్జీలు) నిర్ణయించాల్సిన అవసరం కనిపిస్తోందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆటో సేఫ్టీ గాలిలోనే...
స్కూలు బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్లకు అర్హతలు అంటూ గొంతు చించుకుంటున్న ఆర్టీఏ, ఆటోల్లో ఆరుగురే అంటూ విరుచుకుపడుతున్న ట్రాఫిక్ అధికారులు ఆటోల ఫిట్‌నెస్ ను విస్మరిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తూ పసి వాళ్లకు తరలించే ఆటోలకు సైడ్ డోర్స్, సేఫ్టీ మెష్‌లు మచ్చుకైనా కనిపించవు. వీటిలో అనేక ఆటోలు ఫిట్‌నెస్‌కు ఆమడ దూరంలో ఉంటున్నాయి. వీటి డ్రైవర్లూ ఆర్టీఏ నిర్ధేశించిన ప్రకారం ఉండట్లేదు. మరోపక్క తమ స్కూలుకు విద్యార్థులను తరలిస్తున్న ఆటోల వివరాలు, వాటి డ్రైవర్ల వ్యవహారం యాజమాన్యాలకు అసలే పట్టదు. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల మాదిరి స్కూలు ఆటోలకూ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఆటోలకు నిబంధలు అవసరం లేదా?
స్కూలు బస్సుల విషయంలో నిబంధనలు వల్లెవేసే ఆర్టీఏ అధికారులు స్కూలు ఆటోల విషయంలో మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. సదరు ఆటోలు విద్యార్థులను తరలిస్తున్న సమయంలోనైనా దాన్ని సూచిస్తూ ముందు వెనుక చిన్న బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాల్సి ఉంది.
మాఫియాపై ఎవరిని ఆశ్రయించాలి?
ఎవరైనా ప్రయాణికుడు ఓ ఆటోను ఫలానా చోటుకు రమ్మని పిలిస్తే కచ్చితంగా వెళ్లాల్సిందే. అలా కాని పక్షంలో సదరు ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆటో రిఫ్యూజల్ కింద జరిమానా విధిస్తారు. అయితే స్కూలు ఆటోల డ్రైవర్లు సాగిస్తున్న ‘మాఫియా’ వ్యవహారాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై స్పష్టత లేదు. ఓ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్లు మాఫియాగా మారుతున్నారు. అక్కడున్న విద్యార్థిని ముందు ఓ ఆటోలో పంపించి... భద్రత నేపథ్యంలోనో, మరో కారణంగానో వేరే ఆటోకు మార్చాలని భావిస్తే అది గగనమే. దీనికి పాత ఆటో డ్రైవర్ అంగీకరించడు. కొత్తగా వస్తున్న వ్యక్తిని బెదిరించి మరీ తన కస్టమర్‌ను ‘కాపాడుకుంటాడు’. ఇది నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎదురవుతున్న పరిస్థితే అయినా... ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాల్లో ఎవరూ పట్టించుకోక... ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థకాక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. కేవలం రిఫ్యూజల్ పైనే కాకుండా ట్రాఫిక్ పోలీసులు దీనిపైనా దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment