హైస్పీడ్‌కు ‘బ్రేక్‌’! | speed governer of vehicles | Sakshi
Sakshi News home page

హైస్పీడ్‌కు ‘బ్రేక్‌’!

Published Thu, May 11 2017 10:50 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

speed governer of vehicles

- వాహనాలకు స్పీడ్‌ గవర్నర్‌
- 3,500 కిలోల పైబడి బరువున్న వాటికి తప్పనిసరి
- రోడ్డు రవాణా శాఖ తాజా నిర్ణయం


అనంతపురం సెంట్రల్‌ : హైదరాబాద్‌లో  మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు 200 కిలోమీటర్ల వేగంతో మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. కొంతకాలం క్రితం​ జేఎన్‌టీయూసీ వైస్‌చాన్సలర్‌ సర్కారు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పామిడి వద్ద రాంగ్‌రూట్‌లోకి వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాలూ అతివేగం వల్ల జరిగినవే. ఇటీవలి కాలంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై తరచూ చోటుచేసుకుంటున్నాయి.

అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతో మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. ఎక్కువ ప్రమాదాలకు కారణం అతివేగమే. ఇకమీదట ఇలాంటి ఘటనలకు కళ్లెం వేయాలని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ(ఆర్టీఏ) అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం వాహనాలకు ‘స్పీడ్‌ గవర్నర్‌’ పరికరాలను అమర్చనున్నారు. 3,500 కిలోల పైబడి బరువు కల్గి, ఎనిమిది మంది ప్రయాణికులు కూర్చునే వీలున్న ప్రతి వాహనానికి స్పీడ్‌ గవర్నర్‌ తప్పనిసరన్న నిబంధన విధించారు. స్కూల్‌ బస్సులు 60 కిలోమీటర్లు, ఇతర వాహనాలు 80 కి.మీలకు మించి వేగంతో వెళ్లకూడదు. అలా వెళితే స్పీడ్‌గవర్నర్‌ నియంత్రిస్తుంది. అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు తదితర వాటికి ప్రజాప్రయోజనం దృష్ట్యా ఈ నిబంధనను మినహాయిస్తున్నారు.

స్పీడ్‌ గవర్నర్‌ ఉంటేనే అనుమతులు
 స్పీడ్‌ గవర్నర్‌ అమర్చిన వాహనాలకే పర్మిట్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌సీ) తదితర అనుమతులు మంజూరు చే యాలని నిర్ణయించారు. ఈ నెల 15తో స్కూల్‌ బస్సులకు ఎఫ్‌సీ గడువు పూర్తవుతుంది. జిల్లాలో 800 స్కూల్‌ బస్సులు ఉండగా.. వాడుకలో 650 వరకు ఉన్నాయి. ఇతర వాహనాలు 75 వేలు ఉండగా.. వాడుకలో 60 వేల దాకా ఉన్నాయి. వీటిలో ఆటోలు 15 వేలు మినహాయిస్తే మిగిలిన వాటికి స్పీడ్‌ గవర్నర్‌ అమర్చుకోవాల్సి ఉంటుంది.

నాణ్యతపై అనుమానాలు
    రోడ్డు రవాణాశాఖ స్పీడ్‌గవర్నర్‌ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పలు ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకే  పరికరాలను అందజేస్తామని ముందుకు వస్తున్నాయి. దాదాపు 25 సంస్థలు స్పీడ్‌ గవర్నర్‌ పరికరాల సరఫరాకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన ఓ సంస్థ రూ.5 వేలకే ఇస్తామని చెప్పగా, విజయవాడకు చెందిన సంస్థ రూ.7వేల చొప్పున ధర నిర్ణయించాయి. దీన్నిబట్టి చూస్తే నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.   

స్పీడ్‌ గవర్నర్‌ లేకపోతే జరిమానా :  శ్రీధర్, ఆర్టీఓ, అనంతపురం
    రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనానికి స్పీడ్‌ గవర్నర్‌ అమర్చాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. కావున తప్పనిసరిగా అమర్చుకోవాలి. లేదంటే రూ.2 వేల జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకుంటాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement