చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. స్పిన్, పేస్ బౌలర్ల విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఏళ్లకు ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నవారిని.. ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నాడు.
లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయిందన్న ఆకాశ్ చోప్రా.. ‘స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఖేల్ కూడా ఖతమైందని అభిప్రాయపడ్డాడు. కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన పాకిస్తాన్(India vs Pakistan).. తాజాగా నిర్వహించబోతున్న మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.
కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గు
అయితే, భద్రతా కారణాల వల్ల టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే టీమ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.
మరోవైపు.. పేస్ దళంలో నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు.. మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్‌లకు అన్యాయం జరిగిందంటూ వారి అభిమానులు సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘యుజీ చహల్ విషయం కాస్త ప్రత్యేకమైనదే.
అతడి కథ ముగిసిపోయింది
2023 జనవరిలో అతడు చివరగా ఆడాడు. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ.. 10 మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అయితే, యువీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీశాడు కూడా. కాకపోతే.. ఈ టోర్నీ రేసులో అతడు వెనుకబడిపోయాడు.
ఇక్కడితో అతడి కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. అతడి ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ సెలక్టర్లు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితమే అతడి పనైపోయింది. అందుకే సెలక్టర్లు బహుశా మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ అతడిని ఎంపిక చేసి ఉంటే.. అది తిరోగమనానికి సూచిక అయ్యేది.
భువీని ఎలా సెలక్ట్ చేస్తారు?
ఇక భువీ మూడేళ్ల క్రితం చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అసలు వన్డే ఫార్మాట్‌లో చాలాకాలంగా జట్టులోనే లేడు. మరి అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మెగా టోర్నీ కోసం పిలిపిస్తే.. ఇప్పుడు సెలక్టర్లను తిడుతున్న వారే.. అతడిని ఎంపిక చేసినా.. ఇదేం తీరు అని ప్రశ్నించేవారు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా యుజీ, భువీలు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(ఫిట్‌నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment