కరుణ్‌ నాయర్‌ను ఎలా సెలక్ట్‌ చేయగలం?: అగార్కర్‌ | Agarkar explains Karun Nair Snub from Champions Trophy 2025 Squad | Sakshi
Sakshi News home page

కరుణ్‌ నాయర్‌ను ఎలా సెలక్ట్‌ చేయగలం?: అగార్కర్‌

Published Sat, Jan 18 2025 5:58 PM | Last Updated on Sat, Jan 18 2025 6:11 PM

Agarkar explains Karun Nair Snub from Champions Trophy 2025 Squad

విజయ్‌ హజారే ట్రోఫీలో దుమ్ములేపుతున్న కరుణ్‌ నాయర్‌(Karun Nair)ను టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో సత్తా చాటుతున్నప్పటికీ అతడిని కనికరించలేదు. కాగా విదర్భ కెప్టెన్‌గా బరిలోకి దిగిన కరుణ్‌ నాయర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు శతకాల సాయంతో కరుణ్‌ నాయర్‌ ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇదొక అసాధారణ ప్రదర్శన అంటూ టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌(sachin Tendulkar) కూడా కరుణ్‌ నాయర్‌ను అభినందించాడు.

ఇక స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌  ఓ అడుగు ముందుకేసి అతడికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాటు... చాంపియన్స్‌ ట్రోఫీ జట్టు(Champions Trophy Squad)లోనూ చోటివ్వాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ అజిత్‌ అగార్కర్‌ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ప్రకటించిన జట్టులో కరుణ్‌ నాయర్‌కు మాత్రం చోటు దక్కలేదు.

కరుణ్‌ నాయర్‌ను ఎలా సెలక్ట్‌ చేయగలం?
ఈ విషయం గురించి అగార్కర్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. నిజంగానే అదొక ప్రత్యేకమైన, అద్భుతమైన ప్రదర్శన. దాని గురించి మా మధ్య చర్చ జరిగింది.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి జట్టులో చోటు ఇవ్వడం కష్టం. నలభైలకు దగ్గరపడుతున్న వాళ్లను మళ్లీ తీసుకోలేం. అయినా.. జట్టులో పదిహేను మంది సభ్యులకు మాత్రమే చోటు ఉంది. అలాంటపుడు ప్రతి ఒక్కరిని ఇందులో ఇరికించలేము.

అయితే, అలాంటి ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సదరు ఆటగాడి గురించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఫామ్‌లేమి, గాయాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారతారు’’ అని అజిత్‌ అగార్కర్‌ పేర్కొన్నాడు. 

కాగా 33 ఏళ్ల కరుణ్‌ నాయర్‌ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేశాడు. ఇంత వరకు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు.

ఇక రాజస్తాన్‌లో జన్మించిన కరుణ్‌ నాయర్‌.. దేశవాళీ క్రికెట్‌లో గతంలో కర్ణాటకకు ఆడాడు. గతేడాది నుంచి విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సారథిగా, బ్యాటర్‌గా ఆకట్టుకుంటూ విజయ్‌ హజారే ట్రోఫీలో విదర్భ తొలిసారి ఫైనల్‌కు చేరేలా చేశాడు.  

అందుకే వాళ్లకు వైస్‌ కెప్టెన్లుగా అవకాశం
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు అక్షర్‌ పటేల్‌, వన్డే సిరీస్‌కు శుబ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయంపై శనివారం అగార్కర్‌ స్పందిస్తూ.. ‘‘డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి మేము ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటాం. అయినా ప్రతి ఒక్కరూ కెప్టెన్‌ లేదంటే వైస్‌ కెప్టెన్‌ ఆప్షన్‌ కాబోరు. కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారిపైనే మేము దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు.

కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఐదు టీ20, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం.. చాంపియన్స్‌ ట్రోఫీతో టీమిండియా బిజీ కానుంది. పాకిస్తాన్‌- యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది.

చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ఇవే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement