'డెత్‌' స్పీడ్‌ | Bike Accidents Cases Files in Hyderabad | Sakshi
Sakshi News home page

డెత్‌ స్పీడ్‌

Published Fri, Oct 11 2019 1:27 PM | Last Updated on Fri, Oct 11 2019 1:27 PM

Bike Accidents Cases Files in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు 196 ఫాటల్‌ యాక్సిడెంట్స్‌ (మరణాలు సంభవించిన ప్రమాదాలు) జరిగాయి. వీటిలో అత్యధికంగా 119 (60.71 శాతం) అతివేగంతోనే (ఓవర్‌ స్పీడ్‌) చోటుచేసుకున్నాయి. ర్యాష్‌ అండ్‌ నెగ్లిజెంట్‌ డ్రైవింగ్‌తో 46 ప్రమాదాలు జరగ్గా... డ్రంకన్‌డ్రైవ్‌తో 12 మందిమృత్యువాతపడ్డారు. మైనర్లు డ్రైవింగ్‌ చేసిన కారణంగా ఆరుగురు మృతి చెందారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్‌ విభాగం చీఫ్‌ అనిల్‌కుమార్‌ గురువారం వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో ఫాటల్‌ యాక్సిడెంట్స్‌ గణనీయంగా తగ్గాయని చెప్పారు. యాక్సిడెంట్స్‌ చోటుచేసుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. రహదారి భద్రత నిపుణులు నిబంధనల ఉల్లంఘనలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహన చోదకుడికి ముప్పుగా మారేవి, ఎదుటి వ్యక్తికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పుగా మారేవి.

రెండు, మూడో తరహా ప్రమాదాలపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ ఉల్లంఘన అయితే వాహనం నడిపే వారితో పాటు ఏ పాపం ఎరుగని ఎదుటి వారికీ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందో వాటిపై వరుసపెట్టి స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపట్టారు. దీని ప్రభావం సైతం రోడ్డు ప్రమాదాలు తగ్గడంపై ఉందని ట్రాఫిక్‌ పోలీసులు వివరిస్తున్నారు. నగర ట్రాఫిక్‌ పోలీసులు కేవలం ప్రమాదాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు/ వాహన చోదకులకు ఎదురవుతున్న ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకున్నారు. వీటిని నిరోధించడానికి ఈ ఏడాది చర్యలు తీసుకున్నారు. ఆ తరహా ఉల్లంఘనలపైనా పలుమార్లు స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహించారు. ప్రధానంగా రహదారులపై నడిచే పాదచారుల కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఆక్రమణల తొలగింపు, మౌలిక వసతుల కల్పన తదిరాలతో ప్రమాదాల సంఖ్యను తగ్గించగలిగారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్‌ విభాగం అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఫలితంగానే గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 

ట్రాఫిక్‌ పోలీసులు తీసుకున్న చర్యలివీ...
నగరంలోని 174 విద్యాసంస్థల్ని సందర్శించిన అధికారులు 88,721 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు.  
సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా నగరంలో మొత్తం 60 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు.  
ఈ ప్రాంతాల్లో పదేపదే ప్రమాదాలు జరుగుతుండటంతో వాటిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకున్నారు.
ఆయా విభాగాల సహకారం, సమన్వయంతో కీలక ప్రాంతాల్లో పెలికాన్‌ సిగ్నల్స్, క్యారేజ్‌వేలు, కాజ్‌వేలు ఏర్పాటు చేయించారు.
బోయిన్‌పల్లి ఎంఎంఆర్‌ గార్డెన్స్‌ ప్రాంతంలో ఎన్‌హెచ్‌ నంబర్‌ 44పై గార్డ్‌ రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు.
టిప్పుఖానా–రామ్‌దేవ్‌గూడ మధ్య వీధి లైట్లు, మార్కింగ్స్‌ ఏర్పాటు చేయించారు.
రాజ్‌భవన్‌ రోడ్‌లో డివైడర్‌పై పాదచారుల కోసం పెడస్ట్రియన్‌ గార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు.
మిధానీ పరిధిలోని ధాతునగర్‌లో సెంట్రల్‌ మీడియన్‌ నిర్మించేలా చర్యలు తీసుకున్నారు.  
మెట్రో స్టేషన్ల వద్ద రోడ్డు దాటే వారు వాటికి సంబంధించిన మెట్లు, ఎలివేటర్స్, ఎస్కలేట ర్స్‌ వినియోగించేలా ప్రోత్సహించారు.
ఎన్టీఆర్‌ మార్గ్‌లో, టోలిచౌకి వద్ద రంబ్లర్‌ స్ట్రిప్స్, సైనేజెస్‌ ఏర్పాటు చేశారు. 

సమన్వయంతో పని చేస్తున్నాం  
నగరంలో ప్రమాదాలను తగ్గించడానికి అన్ని విభాగాలతో కలిసి పని చేస్తున్నాం. ట్రాఫిక్‌ విభాగంలోని అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేయడం ద్వారా సమస్యలు గుర్తించి ఆయా ప్రభుత్వ సంస్థల సాయంతో వాటిని పరిష్కరించడం ఫలితాలు ఇచ్చింది. బ్లాక్‌స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అవసరమైన చర్యలు తీసుకున్నాం. మైనర్‌ డ్రైవింగ్, డ్రంకన్‌డ్రైవ్‌లపై స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహించాం. రాంగ్‌ సైడ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, సీటు బెల్ట్‌ లేకుండా నడపటం, సిగ్నల్‌ జంపింగ్, ఓవర్‌ స్పీడింగ్‌... ఇవన్నీ అత్యంత ప్రమాదకరం. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠిన చర్యలు చేపట్టాం. ఫలితంగా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గించగలిగాం.  – అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement