
న్యూఢిల్లీ: వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఈ ఏడాది దీపావళి నాటికి పది నగరాలకు కార్యకలాపాలను విస్తరించనుంది. గురువారం తమ అయిదో స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణియం ఈ విషయం తెలిపారు.
ఇటీవలే 1,000 వాహనాల డెలివరీలను పూర్తి చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 4,000 బైక్‌ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ఎఫ్77 మాక్ 2 మోడల్ ధర రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.99 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉందని, ఒకసారి చార్జి చేస్తే 323 పైచిలుకు కిలోమీటర్ల రేంజి, గంటకు 165 కి.మీ. గరిష్ట వేగం ఉంటుందని నారాయణ్ వివరించారు. బ్యాటరీపై అత్యధికంగా 8,00,000 కి.మీ. వారంటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ బైక్‌ల సెగ్మెంట్‌కి సంబంధించి 4 విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయంగా జర్మనీ తదితర దేశాల్లో 50 పైచిలుకు సెంటర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు నారాయణ్ చెప్పారు. టీవీఎస్ మోటర్స్, శ్రీధర్ వెంబు (జోహో) తదితర ఇన్వెస్టర్లు సంస్థలో 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 400 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. సుమారు 3,500 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టోర్‌లో సేల్స్, సర్వీస్, స్పేర్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment