సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రమాదకర మలుపుల వద్ద రహదారి భద్రత చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర రహదారి భద్రత కమిటీ సర్వే నిర్వహించింది. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు ఎక్కువమంది దుర్మరణం చెందుతున్న బ్లాక్‌స్పాట్లను గుర్తించింది. అటువంటి బ్లాక్‌స్పాట్లు రాష్ట్రంలో 300 ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైంది. గత మూడేళ్లలో ఆ బ్లాక్‌స్పాట్లలో ఏకంగా 5,708 మంది దుర్మరణం చెందారని గుర్తించింది. దీంతో ఆ బ్లాక్‌స్పాట్ల వద్ద ఏటా రూ.400 కోట్లతో భద్రతాపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది.
గుంటూరు జిల్లాలో ఎక్కువ బ్లాక్‌స్పాట్‌లు
రాష్ట్రంలో రహదారి భద్రత కోసం ప్రభుత్వం పోలీసు, రవాణా, వైద్య–ఆరోగ్య శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న రహదారులపై ఈ కమిటీ సర్వే చేసింది. రాష్ట్రంలో 26 జిల్లాలకుగాను 23 జిల్లాల పరిధిలో ఉన్న ఈ 300 బ్లాక్‌స్పాట్లలో మూడేళ్లలో 5,708 మంది ప్రాణాలు కోల్పోయారు.
వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలోని 15 బ్లాక్‌స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1,383 మంది దుర్మరణం చెందారు. ఆ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో బాపట్ల, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. బాపట్లలో 15 బ్లాక్‌స్పాట్ల వద్ద 328 మంది మృతిచెందగా, తిరుపతి జిల్లాలో 15 బ్లాక్‌స్పాట్లలో 282 మంది మృత్యువాత పడ్డారు.
బ్లాక్‌స్పాట్ల వివరాలు డీఆర్‌సీలకు..
బ్లాక్‌స్పాట్ల వద్ద రూ.400 కోట్లతో అమలు చేయనున్న రహదారి భద్రత చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, స్పీడ్‌గన్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక అధికారులు బృందాలతో వాహనాల తనిఖీ చేపట్టడం, అంబులెన్స్‌ల ఏర్పాటు, ఆ సమీపంలోని ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరచడం వంటివి చేపడతారు. రహదారి భద్రత కమిటీ బ్లాక్ స్పాట్ల వివరాలను ఆయా జిల్లా అభివృద్ధి మండళ్లకు(డీఆర్‌సీలకు) సమర్పించింది.
ఈ ప్రదేశాల్లో చేపట్టాల్సిన పనులను జిల్లా భద్రత కమిటీల ఆధ్వర్యంలో చేపడతారు. బ్లాక్‌స్పాట్ల వద్ద భద్రత చర్యలను మెరుగుపరిచిన ఏడాది తరువాత పరిస్థితి సమీక్షిస్తారు. రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గిందీ లేనిదీ పరిశీలిస్తారు. తదనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారు. ఈ విధంగా ఐదేళ్లపాటు బ్లాక్‌స్పాట్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment