ప్రాణం విలువ తెలియాలనే.. | Perni Nani Comments On Traffic‌ violations and Penalties | Sakshi
Sakshi News home page

ప్రాణం విలువ తెలియాలనే..

Published Sat, Oct 24 2020 4:20 AM | Last Updated on Sat, Oct 24 2020 10:05 AM

Perni Nani Comments On Traffic‌ violations and Penalties - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాణం విలువ తెలుసుకోవాలనే ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు జరిమానాలు భారీగా పెంచామని, దీన్ని సామాజిక బాధ్యతగా భావించామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. కఠిన నిర్ణయాలు, జరిమానాలు విధిస్తే రహదారి నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారిలో మార్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. భారీ జరిమానాలతో కట్టడి చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ముఖ్య విధి అని, ఆ దిశగా ఆలోచించే జరిమానాలు పెంచామని, ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. ‘దీనిపై రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మోటారు వాహనాల నిబంధనలు పాటించని వారిని సమర్థిస్తున్నాయా? ఈ అంశంపై హేళనగా మాట్లాడేవారు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?’ అని ప్రశ్నించారు. మంత్రి పేర్ని నాని ఈ అంశంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలివీ..

నామమాత్రపు జరిమానాలతో పదేపదే ఉల్లంఘనలు
నామమాత్రపు జరిమానాల వల్ల కొందరు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపితే అతనొక్కడే కాదు.. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్‌ ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తే వందే కదా అని నిర్లక్ష్యం వీడట్లేదు. అదే రూ.వెయ్యి విధిస్తే కొంత జాగ్రత్త ఉంటుంది. వాహన చోదకులు చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రాకూడదనే జరిమానాలు పెంచాం.

ఆదాయంకోసం కానే కాదు
ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కాంపౌండింగ్‌ ఫీజులు పెంచడం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటానికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫీజుల పెంపు వల్ల ఏడాదికి రూ.150 కోట్లు ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రజాసంక్షేమం కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ జరిమానాలతో వచ్చే ఆదాయం లెక్క కాదు. కేవలం ప్రజలు బాధ్యత విస్మరించకూడదనే ఈ పెంపుదల చేపట్టాం. 

వర్షాకాలం ముగియగానే గుంతలు పూడుస్తాం
గత 77 రోజుల నుంచీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల రోడ్లపై గుంతలు ఏర్పడటం సహజం. వీటిపై సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తూ.. జరిమానాలు తర్వాత విధించండి.. ముందు రోడ్లు బాగు చేయండని వెటకారంగా మాట్లాడుతున్న వారిని ఏమనాలో అర్థం కావట్లేదు. వర్షాకాలం ముగిసిన వెంటనే గుంతలన్నీ పూడ్చేలా రూ.2,500 కోట్లతో మరమ్మతులు చేసేందుకు సీఎం జగన్‌ ఇప్పటికే ఆదేశించారన్న సంగతి గుర్తుంచుకోవాలి. 

ప్రాణం విలువ తెలుసు కాబట్టే..
నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝళిపిస్తుంటే ప్రతిపక్షాలు యాగీ చేస్తాయా? ప్రతిపక్ష నేతలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపే వారికి దన్నుగా నిలుస్తారా? రోడ్డు ప్రమాదాలకు కారకులయ్యే వారికి జరిమానాలు వద్దా? ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకుని సహకరించాలి కానీ ఇలా హేళనగా మాట్లాడి స్థాయి దిగజార్చుకోవద్దు. ప్రాణాల విలువ తెలిసిన సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాణాలు విలువ తెలియని వారి గురించి ఏమీ మాట్లాడలేం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement