సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఎంత వీలయితే అంత వేగంగా ఆస్పత్రిలో చేర్చితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అయితే మనకెందుకులే అనే ధోరణి, పోలీసులతో ఇబ్బందులు ఉంటాయేమో అనే భయాలతో పౌరులు చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటారు. దీన్ని నివారించి, రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా సాధారణ ప్రజల్లో స్ఫూర్తిని కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాణ దాతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వనుంది. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో (గోల్డెన్ అవర్–గంటలోగా) ఆస్పత్రికి చేర్చినా లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడిన వారిని గుడ్ సమారిటన్‌గా గుర్తించి రూ. 5,000లు నగదుతో పాటు జాతీయ స్థాయి ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సాధారణ ప్రజలపై కేసులు, వేధింపులు ఉండకుండా ఈ పథకాన్ని రూపొందించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
పథకం అమలు ఇలా..
► ప్రాణాంతక రోడ్డు ప్రమాదంలో మెదడు గాయాలు, వెన్నుపూస గాయాలకు సంబంధించిన బాధితులను లేదా శస్త్ర చికిత్స, చికిత్స కోసం కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి కలిగిన క్షతగాత్రులను గంటలోగా ఆస్పత్రికి చేర్చిన వారిని గుడ్ సమారిటన్‌గా గుర్తించి మొదటగా రూ. 5 వేల నగదుతోపాటు ప్రశంసా పత్రం అందిస్తారు.
► పలు ప్రమాదాల్లో క్షతగాత్రులను కాపాడిన ఒక్కో వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు గుడ్ సమారిటన్‌గా గుర్తించి అవార్డులను ఇస్తారు.
► మొత్తం ఏడాదిలో గుడ్ సమారిటన్‌ల నుంచి జాతీయ స్థాయిలో పది మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున నగదు అవార్డును కేంద్రం ఇవ్వనుంది.
► ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలైనంత త్వరగా రాష్ట్రాలు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి వివరాలను పంపిస్తే ముందస్తుగా ఐదు లక్షల రూపాయల గ్రాంటును మంజూరు చేస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment