good samaritan
-
ప్రాణదాతలకు గుర్తింపు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఎంత వీలయితే అంత వేగంగా ఆస్పత్రిలో చేర్చితే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అయితే మనకెందుకులే అనే ధోరణి, పోలీసులతో ఇబ్బందులు ఉంటాయేమో అనే భయాలతో పౌరులు చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటారు. దీన్ని నివారించి, రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా సాధారణ ప్రజల్లో స్ఫూర్తిని కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాణ దాతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వనుంది. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో (గోల్డెన్ అవర్–గంటలోగా) ఆస్పత్రికి చేర్చినా లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడిన వారిని గుడ్ సమారిటన్గా గుర్తించి రూ. 5,000లు నగదుతో పాటు జాతీయ స్థాయి ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సాధారణ ప్రజలపై కేసులు, వేధింపులు ఉండకుండా ఈ పథకాన్ని రూపొందించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పథకం అమలు ఇలా.. ► ప్రాణాంతక రోడ్డు ప్రమాదంలో మెదడు గాయాలు, వెన్నుపూస గాయాలకు సంబంధించిన బాధితులను లేదా శస్త్ర చికిత్స, చికిత్స కోసం కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి కలిగిన క్షతగాత్రులను గంటలోగా ఆస్పత్రికి చేర్చిన వారిని గుడ్ సమారిటన్గా గుర్తించి మొదటగా రూ. 5 వేల నగదుతోపాటు ప్రశంసా పత్రం అందిస్తారు. ► పలు ప్రమాదాల్లో క్షతగాత్రులను కాపాడిన ఒక్కో వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా ఐదు సార్లు గుడ్ సమారిటన్గా గుర్తించి అవార్డులను ఇస్తారు. ► మొత్తం ఏడాదిలో గుడ్ సమారిటన్ల నుంచి జాతీయ స్థాయిలో పది మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున నగదు అవార్డును కేంద్రం ఇవ్వనుంది. ► ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలైనంత త్వరగా రాష్ట్రాలు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి వివరాలను పంపిస్తే ముందస్తుగా ఐదు లక్షల రూపాయల గ్రాంటును మంజూరు చేస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. -
‘ఆపన్న హస్తం అందించడం విశేషం’
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమీషనరేట్ ఆధ్వర్యంలో గుడ్ సమారిటన్ అవార్డు వేడుక నాగోలు శుభం కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో పోలీసులకు సహకరించి పలువురికి సేవలు చేసిన వారికి అవార్డులను బహుకరించారు. పనులు లేక అవస్థలు పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను అందజేసిన చిలుకనగర్ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్‌కు రాచకొండ సీపీ మహేష్ భగవత్ గుడ్ సమారిటన్ అవార్డును అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ఆపన్న హస్తం అందించడం విశేషమని బన్నాల ప్రవీణ్‌ను కొనియాడారు. అవార్డు అందుకున్న ప్రవీణ్ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో వికలాంగులు, ఒంటరి మహిళలతో పాటు ఇతరులకు నిత్యావసర వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ఇక తాను చేసిన సేవలకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. కోవిడ్-19 సమయంలో ఈ సేవా కర్యక్రమాలు చేయడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. -
సూదిగాడి కలకలం వట్టిదే
►మానవత్వం చూపబోతే అపార్థం చేసుకున్న స్థానికులు ►పాపకు వైద్యపరీక్షల్లో సూది గుచ్చిన అనవాళ్లు లేవని వెల్లడి బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్‌రోడ్ నెం. 2 లోని ఇందిరానగర్‌లో సూది కలకలం అంతా వట్టిదేనని తేలింది. సూదితో ఆడుకుంటున్న పాపకు అది పొరపాటున గుచ్చుకుంటుందోనని స్థానిక యువకుడు సురేశ్ మానవత్వం చూపితే, అది తప్పుగా అర్థం చేసుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తర్వాత పాపకు వైద్య పరీక్షలు చేస్తే సూదిగుచ్చిన అనవాళ్లు లేవని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. పాపకు సూది గుచ్చుకుంటే ఏమైనా జరుగుతుందని సాయం చేయబోయిన నా స్నేహితుడినే సూది అనుమానితుడిగా చిత్రీకరిచడం బాధాకరమని అతడి రూమ్మేట్ అన్నారు. సురేశ్‌తో పాటు తనను ఈ కేసులో విచారించేందుకు తీసుకుపోతే, ఇంకా పాపకు సూది గుచ్చిందన్న విషయం రూఢి కాకముందే ఫొటోలు తీసి మీడియాలో చూపించడం వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగింది ఇదీ... ఇందిరానగర్ పోచమ్మ దేవాలయం సమీపంలో ఉదయం 11.15 నుంచి 11.30 గంటల మధ్య పాండురంగరావు, శ్రావణి దంపతుల కుమార్తె గ్రేసీ కావ్య (9) ఆడుకుంటోంది. అదే సమయంలో ఆ పాప సూదితో ఆడుకోవడాన్ని గమనించిన సురేశ్.. ఆ సూది గుచ్చుకుంటుందని తీసి పారేశాడు. తర్వాత వారి తల్లికి చెప్పగా, పాపకు సూది ఏమైనా గుచ్చుకుందన్న భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఇంతలో చుట్టుపక్కలవాళ్లు సూది సైకో అనుకుని చుట్టుముట్టారు. విషయం ఎంత చెప్పినా వినిపించుకోకుండా సురేశ్‌పై చెయ్యి చేసుకున్నారు. ఇంతలోనే సురేశ్ తన రూమ్మేట్కు కాల్ చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న అతను వారందరినీ విడదీశాడు. గత నాలుగేళ్ల నుంచి ఇందిరానగర్‌లోనే అద్దెకు ఉంటున్నామని, అవసరమైతే యజమానిని వివరాలు అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఇంతలోనే పోలీసులు వచ్చి సురేశ్‌తో పాటు అతడి స్నేహితుడిని తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత పోలీసులు వారిని విచారించగా... ల్యాప్‌టాప్ మాత్రమే లభ్యమైంది. మరే ఇతర అనుమానిత సామగ్రి వారి గదిలో దొరకలేదు. దీంతో సురేశ్ స్నేహితుడిని పోలీసులు వదిలేశారు. కాగా, పాపకు నీలోఫర్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయగా, ఎటువంటి సూది గుచ్చిన ఆనవాళ్లు లేవని తేలింది. అందుకే ఇంతవరకు కేసు నమోదు చేయలేదని, కేవలం అదుపులోకి తీసుకొని విచారించామని చెబుతున్నారు. ఫొటో పొరపాటు సాక్షి దినపత్రిక మెయిన్ ఐదో పేజీలో సోమవారం ప్రచురించిన బంజారాహిల్స్ సూదిగాడి కలకలం కథనంలో ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని సురేశ్ స్నేహితుడి ఫొటో ప్రచురితమైంది. సురేశ్‌తో పాటు అతడి రూమ్మేట్ను పోలీసు వాహనంలో తరలిస్తుండగా తీసిన ఫొటోలో...సురేశ్ ఫొటోకు బదులుగా అతడి స్నేహితుడి ఫొటో పొరపాటున ప్రచురితమైంది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం.