Central Govt Principled Decision On Driving Score - Sakshi
Sakshi News home page

సిబిల్‌ స్కోర్‌ తరహాలోనే.. డ్రైవింగ్‌కూ స్కోర్‌! కేంద్రం కీలక నిర్ణయం?

Published Mon, Feb 20 2023 4:16 AM | Last Updated on Mon, Feb 20 2023 1:05 PM

Central Govt principled decision on Driving Score - Sakshi

సిబిల్‌ స్కోర్‌ తరహాలోనే డ్రైవింగ్‌కూ స్కోరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సిబిల్‌ స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే బ్యాంకులు అంత సులువుగా రుణాలు ఇస్తాయి. అలాగే డ్రైవింగ్‌ స్కోర్‌ ఎక్కువ ఉంటే వాహనాల బీమా, కొత్త వాహనాల కొనుగోలులో  రాయితీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. రహదారి భద్రతలో భాగంగా కేంద్రం ఈ వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది.      
– సాక్షి, అమరావతి

ప్రమాదాలను తగ్గించేలా.. 
దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 3.84 లక్షల మంది గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 70 శాతం ప్రమాదాలు జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రహదారి భద్ర­త లక్ష్యాలు సాధించాలంటే డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం.. వారిని నియంత్రించడం ప్రధానమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ క్రమశిక్షణను ఎప్పటికప్పుడు అంచనా వేసే వ్యవస్థను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘రహ­దారి భద్రతా ప్రణాళిక 2.0’ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

దేశంలో డ్రై­వింగ్‌ లైసెన్సు ఉన్న వారంతా దీని పరిధిలోకి వ­స్తా­రు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర భారీ వా­హనాల డ్రైవర్ల క్రమశిక్షణను ఎప్పటికప్పుడు ప­ర్యవేక్షిస్తారు. ట్రాఫిక్‌ పోలీసులు విధించిన చలా­నా­లు, రోడ్డు ప్రమాదాలకు కారణమైన సందర్భా­లు, పోలీసులు నమోదు చేసిన కేసులు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా డ్రైవింగ్‌ క్రమశిక్షణకు స్కోర్‌ ఇస్తారు. 

స్కోర్‌ ఆధారంగా ప్రోత్సాహకాలు
డ్రైవింగ్‌ క్రమశిక్షణ స్కోర్‌ బాగున్నవారికి వాహన బీమాలో రాయితీలిస్తారు. స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే బీమా ప్రీమియం అంత తక్కువగా ఉంటుం­ది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ధరలో రాయితీ ఇస్తారు. వీటిపై కేంద్ర రవాణా శాఖ వాహనాల తయారీ కంపెనీ­లు, బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. దీని­పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అనంతరం పైలట్‌ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ఢిల్లీలో అమలు చేయాలని భావిస్తున్నారు. లోటు­పాట్లను సరిదిద్దుకుని 2025 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.  

ఏడీఏఎస్‌ ఏర్పాటు.. 
రెండో దశలో కార్లు, ఎస్‌యూవీలు, ఇతర భారీ వాహనాల్లో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టం(ఏడీఏఎస్‌)ను ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడే ఏడీఏఎస్‌ వ్యవస్థ కోసం కాస్త అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాల యజమానులు కూడా ఏడీఏఎస్‌ను తమ వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలి.

ఇది డ్రైవర్‌ నావిగేషన్‌కు సహకరిస్తుంది. అలాగే డ్రైవింగ్‌ సీటులో ఎవరు ఉన్నారో రికార్డు చేస్తుంది. తద్వారా క్రమశిక్షణారహితంగా వాహనం నడిపినప్పుడు,  ప్రమాదానికి గురైనప్పుడు ఎవరు డ్రైవింగ్‌ చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది.

ఏడీఏఎస్‌ను ఇప్పటికే విద్యుత్‌ వాహనాల్లో ప్రవేశపెట్టారు. త్వర­లో పెట్రోల్, డీజీల్‌ వాహనాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడీఏఎస్‌ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని డ్రైవింగ్‌ క్రమశిక్షణ స్కోర్‌ను నిర్ణయిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement