తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలు బైపాస్ వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయిన వాహనం
పిఠాపురం/తణుకు/పాడేరు/మాకవరపాలెం (విశాఖజిల్లా): రాష్ట్రంలో రహదారులు రక్తపుటేరులయ్యాయి. శుభకార్యానికి వెళ్లి వస్తున్నవారు.. పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారు.. పనిపై పక్క ఊరికి వెళ్తున్న వారు రహదారుల భద్రతను ప్రశ్నిస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సోమవారం మూడు జిల్లాల్లోని రహదారులపై జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలానికి చెందిన వారు కాకినాడలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన కార్మికులు లారీలో బొబ్బిలి వెళుతుండగా తణుకు వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇక విశాఖ జిల్లా పాడేరు మండలంలో వైఎస్సార్ సీపీ నేత ఎస్వీ రమణమూర్తి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులు ఆటోలో వెళ్తుండగా అది బోల్తా పడి ముగ్గురు కన్నుమూశారు.
రక్తమోడిన ఎన్‌హెచ్ 216..
తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్‌హెచ్ 216పై జరిగిన ప్రమాదం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాకినాడలోని బంధువు గృహప్రవేశానికి మండలంలోని జి.వెంకటాపురం, భీముకోటపాలెం, జి.కోడూరు గ్రామాలకు చెందిన సుమారు 16 మంది టాటా మేజిక్ వ్యాన్‌లో ఆదివారం రాత్రి బయల్దేరి వెళ్లారు. కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ వద్దకు వచ్చేసరికి రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారి వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.ఇందులో ప్రయాణిస్తున్న ఆరుగురు.. గవిరెడ్డి రాము (40), సబ్బవరపు పైడితల్లి (42), సబ్బవరపు అచ్చియమ్మ (50), పైలా లక్ష్మి (45), సబ్బవరపు మహాలక్ష్మి (54), సబ్బవరపు పాప (30) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ఆళ్ల సంతోష్ (34), సబ్బవరపు వరహాలు (45)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశారు. చికిత్స పొందుతూ బీమిరెడ్డి నాగరాజు (42) తుదిశ్వాస విడిచారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఎస్సై శివకృష్ణ తన జీప్‌లో వారిని పిఠాపురం తరలించారు.
పనుల కోసం వెళ్తుంటే..
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన 11 మంది కార్మికులు విజయనగరం జిల్లా బొబ్బిలిలోని చెరువుల్లో చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో లారీలో బయల్దేరారు. అర్ధరాత్రి తణుకు మండలం తేతలి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళ్తున్న కాంక్రీట్ మిక్స్‌ర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మైనం లక్ష్మణరావు (33), పెరుమాళ్ల హుస్సేన్ అలియాస్ సురేష్ (35), నెక్కల కాశీవిశ్వనాథం (48) మృతి చెందారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
పాడేరు ఘాట్‌లో ఆటో బోల్తా
పాడేరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీపీ ఎస్.వి.రమణమూర్తి కుటుంబ సభ్యులు ఐదుగురు ఆటోలో పాడేరు నుంచి పెందుర్తి వెళుతుండగా బ్రేకులు ఫెయిలై కల్వర్టు గోడను ఆ ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణమూర్తి కుమార్తె సాయిలత (చిట్టి), కోడలు మరియమ్మ, మనవరాలు (2 నెలల చిన్నారి) మృతి చెందారు. రమణమూర్తి కుమారుడు అంబేడ్కర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు పాడేరు ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నం తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గణపతిని, రెండు మాసాల చిన్నారిని చోడవరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చిన్నారి కన్నుమూసింది. అరకులోయ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు రమణమూర్తిని, కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.
వైఎస్ జగన్ తీవ్ర విచారం
రాష్ట్రంలో సోమవారం జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందడం పట్ల ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment