వెల్దండలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు
నాగర్‌కర్నూల్ క్రైం: మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు నిబంధనలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు కొద్దిరోజులు మాత్రమే నిబంధనలు అనుసరిస్తూ మళ్లీ యథావిధిగా మారుతున్నారు. ఏ విషయంలోనైనా చట్టాలు కఠినంగా అమలు చేస్తే వచ్చే ఫలితాల కన్నా ప్రజలు స్వచ్ఛందంగా చట్టం పరిధిలో నడుచుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిఏటా దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
161 రోడ్డు ప్రమాదాలు
నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో గడిచిన ఏడాది 161 ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించగా అందులో 172 మంది మరణించారు. అలాగే సాధారణ రోడ్డు ప్రమాదాలు 193 నమోదు కాగా అందులో 478 మంది గాయపడ్డారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై మరణించిన వారిలో హెల్మెట్ లేకుండా, సీట్ బెల్టు లేకుండా, పరిమితికి మించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైన వారే అధికంగా ఉన్నారు.
జాగ్రత్తలు పాటిస్తే..
వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా తాగి వాహనాలను నడిపే వారి వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో భారీగా ప్రాణనష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తాగి వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతనే వాహనాలు నడపాలి. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉండటంతో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదు. వాహనడ్రైవర్లు ఎక్కువ గంటలు వాహనాలను నడపడం వల్ల అలసిపోయి నిద్రలోకి జారుకొని అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. డ్రైవర్లు అలసిపోయే వరకు ఎక్కువ గంటలు వాహనాలను నడపకూడదు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదు.
వినూత్నంగా ప్రచారం..
31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఎస్పీ సాయిశేఖర్ ఆదేశాలతో పోలీస్, రవాణా శాఖాధికారులు సంయుక్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లాలో శనివారం వరకు వాహనదారులకు, ఆటోడ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, ఆర్టీసి డ్రైవర్లతోపాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానాల రూపంలో నగదు వసూలు చేసే అధికారులు ప్రస్తుతం ప్రజల్లో మార్పు రావడం కోసం వినూత్నంగా జరిమానాలకు బదులుగా హెల్మెట్, సీటుబెల్టు ధరించని వాహనదారులకు పూలు అందిస్తూ మార్పును కోరుకుంటున్నారు.
స్వచ్ఛందంగా మార్పురావాలి
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకూడదంటే వాహనదారుల్లో స్వచ్ఛందంగా మార్పు రావాలి. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే కుటుంబ సభ్యులకు కలిగే ఆవేదనను ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకోవాలి. చట్టాలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎర్రిస్వామి, జిల్లా రవాణా శాఖాధికారి, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment